గడప దాటుతూవుండగా టంగ్ టంగ్ న గంట కొట్టింది.
ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు విని నాలుగు అడుగులు వేసి "విమలా!" అని పిలిచింది నంద.
"ఇక్కడున్నాను!" వంటింట్లోంచి పిలిచింది విమల.
లోపలికి వెళ్ళేసరికి వంట ప్రయత్నంలో వుంది.
"నువ్వు చేస్తున్నావా? వెళ్ళు! చదువుకో పో!"
నవ్వింది విమల.
"అక్కా! ఎంత చదువుకున్నా ఆడవాళ్ళకి వంటరావాలి! నాకు తెలియదు కానీ ఐ.ఏ.ఎస్. పాసైనా ఆడవాళ్ళు వంట చేయాలేమో! ఎందుకంటే లెక్చరర్స్, డాక్టర్స్, లాయర్స్ వంట చేస్తూనే వున్నారు!" మృదువుగా నవ్వుతూ అంది.
ఫక్కున నవ్వింది నంద.
"అక్కా! స్టూడెంట్స్ వచ్చారు!" పిలిచాడు శశికాంత్.
"వస్తున్నా!" హాల్లోకి వచ్చింది నంద.
ఆ వీధిలో నలుగురైదుగురు అమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు నందతో ఇంగ్లీషు, తెలుగు చెప్పించుకుంటారు. తలా పదిహేనేసి ఇస్తారు. ఆ వందా ఇంటి ఖర్చులకి వస్తాయని ఒప్పుకుంది నంద.
తమ్ముడికి చెబుతూ వుంటే చూసి అతని క్లాస్ మేట్స్ అడిగితే చెప్పడానికి అంగీకరించింది ఆమె.
నంద వచ్చి కూర్చోగానే అందరూ టెస్ట్ బుక్స్ తెరిచారు.
"ఏం పాఠం చెప్పారివాళ?"
"కుచేలో పాఖ్యానం మొదలెట్టారు!" అన్నాడు శశికాంత.
"మన పాటమే!" అనుకుంది నంద.
నంద కుచేలుడి కథ పద పదం విరిచి చదువుతోంది. పిల్లలంతా శ్రద్దగా వింటున్నారు.
"మేడమ్!" ఓ అబ్బాయి పిలిచాడు.
"యస్!"
"ఆ రోజుల్లో ఫామిలీ ప్లానింగ్ లేదా?"
నవ్వింది నంద "ఏం?"
"మొన్నా మధ్య అష్టావధానంలో అడిగారులే!"
"ప్రేమ్! ఈ రోజుల్లో ప్రభుత్వం ఇంతగా గొడవపెడుతున్నాకూడా కొందరిళ్లల్లో అయిదారుగురు సంతానం ఉండటం చూల్లేదా? అదంతే!? కృష్ణుడూ, శివుడూ, రాముడూ రావణుడూ ఫామిలీ ప్లానింగ్ పాటించినట్లే వున్నారు వాళ్ళ సంతానం."
"వెధవ బుద్దులు వెధవ చేష్టలు. ఒళ్ళు కొవ్వెక్కి చస్తుంటే పెళ్ళి చేసుకోవాలి. పిల్లలకి బుద్దుల్లేకపోతే పెద్దలైనా గ్రహించుకోవాలి. మరీ ఇంత పోయే కాలమా?"
నంద మృదుమధురమైన గొంతుని డామినేట్ చేస్తూ వినిపించిన మాటలు అందరి చెవుల్లోనూ పడ్డాయి.
అది పక్కింటి ఆమె గొంతు. ఆమె గొంతుక లౌడ్ స్పీకర్ లాగా వినిపిస్తుంది. ఆ మాటలు వినగానే నంద ముఖం మాడిపోయింది. క్షణకాలం ఆమె మనస్సులో కించపడింది. ఆమె అన్నది తననేమో అనుకుంది.
"ఇది మర్యాదస్తుల కొంపా? లేక సాని కొంప అనుకున్నారా? అంత బరితెగించి ఉంటే? పాడు కొంపల పైనో పడాలి! ఇలా ఇళ్ళిళ్ళు చుట్టూ తిరిగితే కాళ్ళు విరగ్గొడతారు."
చాలా కఠోరంగా ఉన్నాయి ఆమె మాటలు.
వింటూ సహించలేకపోయింది నంద. తనకంటే చిన్న పిల్లల ముందు అలా న్యూనత పడటం వోర్చుకోలేకపోయింది.
లేచి బయటికి వెళ్ళింది.
ప్రియంవద చేతులు చాచి రవి కాంత్ వైపు చూపుతూ విసురుగా అంటుంది. ఆ తిట్టడం తననేనా అన్నట్టుగా చూస్తూ నిర్వికారంగా నుంచున్నాడు రవికాంత్.
"రవీ?" కఠినంగా పిలిచింది నంద.
వాడు బిక్కమొహం వేసుకుని చూశాడామెవైపు.
"ఏం చేశావు?" వాడు సమాధానం ఇవ్వలేదని తెలిసే పక్కింటి ఆవిడపై కోపంతో అడిగింది నంద.
వెర్రిగా చూస్తూ వుండటం తప్ప వాడింకేమీ అనలేదు.
ఎన్నడూ రాని కోపం వచ్చింది నందకి. "పద లోపలికి!" కసురుకుంది.
బేలగా చూశాడు రవికాంత్.
"ఏమండీ?" మెల్లిగా పిలిచింది నంద. మా రవి ఏం తప్పు చేశాడో మాకు చెప్పలేదు. చెప్పే శక్తి వాడినుంచి తీసేసుకున్నాడు భగవంతుడు. మీరు వూరకే కేకలు పెడుతున్నారు!"
వెను తిరిగింది నంద.
"నందా! మీ రవికి పెళ్ళి చేయండి! వాడికి మదపిచ్చి పట్టుకుంది! మీరు మతి చలించిన దనుకుని భ్రమపడుతున్నారు."
ప్రియంవద ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్ధమైంది.
ఆమెపై జాలి వేసింది.
సమాధానం యివ్వలేదు. యింట్లోకి వచ్చేస్తోంది.
"మర్యాదగా వుంటే సరే లేదా రేపు ఆయన రాగానే వాడి కీళ్ళు విరగ్గొట్టిస్తాను. ఇంటాయనతో చెప్పి మీతో ఇల్లు ఖాళీ చేయిస్తాను. జాగ్రత్తగా పరువుగా బ్రతకండి." వార్నింగ్ యిచ్చిందామె.
24
"ఆకాశవాణి! తెలుగులో వార్తలు చదువుతున్నది.
ఇంటి యజమాని సరిగ్గా ఆ సమయానికి రాత్రి భోజనం ముగించుకుని రేడియో పట్టుకుని బయటికి వస్తాడు.
వార్తలు చెవిని పడగానే తిరిగి ఈ లోకంలో పడ్డది నంద!
నంద లేచి తల్లి వద్దకి వెళ్ళింది.
"భోం చేస్తావా?"
"ఇక్కడికే పట్రామ్మా?" అందామె. ఆ పూట నెమ్మదిగా లేదామెకి. ఒళ్ళంతా నిస్సత్తువగా వుంది.
"నీవూ భోజనం చేస్తావా నాన్నా?"
తలూపేడు నారాయణ.
వంటింటి వేపు కదిలింది నంద.
"తల్లికి, తండ్రికి అన్నం కలుపుకుని గడప దాటుతూ వుండగా దీపాలు ఆరిపోయాయి. ఇల్లంతా గాడాంధకారం అలుముకుంది.
చేసేది లేక హిరణ్య కస్యపుడిలా అలాగే నిలుచుంది. చప్పున లైట్లు వెలిగాయి. వంటింట్లో బల్బు వెలిగి ఆరిపోయింది.
బల్బు మాడిపోయింది! అనుకుంది నంద. "ఈ మధ్య పవర్ లో హెచ్చుతగ్గులు వస్తున్నాయి- పవర్ పోయి తిరిగొస్తే బల్బులు ఆ వోల్టేజీకి మాడిపోతున్నాయి. బల్బుల లోపమా? ప్రభుత్వం లోపమా? ఎవర్ననాలి? తమ కర్మని అనుకోవాలి!"
నాలుగడుగులు ముందుకువేసి "విమ్మా! ఆ గూట్లో స్పేర్ బల్బు వుంటుంది. తీసి వంటింట్లో వెయ్యి!" అంది.
"మనకి ఈ స్పేర్ బల్బు సిస్టమ్ అచ్చిరాలేదక్కా?"
"అదేం?"
