Previous Page Next Page 
ఒప్పందం పేజి 39

 

                            హ్యాపీ యానివర్శరీ

    "భాను.... గుడ్ మార్నింగ్.... హ్యాపీ యానివర్శరీ .." ఎవరో నా చెవుల్లో అమృతం కురిపిస్తున్నట్టు వినిపించింది. చటుక్కున కళ్ళు తెరిచాను. ఎదురుగా లేత నీలం రంగు బల్బు వెలుగుతున్న ప్రిన్సేన్స్ బొమ్మ కనిపించింది. నా చూపులు చకచకా చుట్టూ తిరిగాయి. నేనక్కడ ఉన్నాను.... లేత చేతులు నా మెడ చుట్టూ పెనవేసి నా గుండెల్లో గువ్వలా ఒదిగి పడుకున్న నా బంగారు మెత్తని స్పర్శ ....ఒక్కసారిగా దిగులు కమ్మేసింది. ఆ పిలుపు, ఆ కమ్మటి స్వరం నిజం కాదు... నా భ్రాంతి... ఇప్పుడు నా పక్కన ఉన్నది నా చిట్టి తల్లే... నా ప్రాణానికి ప్రాణమే.... కానీ, ఈరోజు.... ఈరోజు.... నాకు అయన స్పర్శ కావాలి...అయన సాన్నిహిత్యం కావాలి.... ఇవాళ మా పెళ్ళి రోజు.. మా పెళ్ళి అయి ఇవాల్టి కి ముప్పై ఏళ్ళు. ఇండియా లో ఉండి ఉంటె సరదాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం.
    నా బంగారు వైపు చూశాను. చిరు వెలుగులో పచ్చని అందమైన మోహంలో ఎంతో తృప్తి.... మరెంతో నిశ్చింత.... అమ్మమ్మ దగ్గర పడుకున్నానన్న ధైర్యం... వాత్సల్యం వెల్లువలా వచ్చింది.ఎడం చేత్తో తన నుదుటి మీద చిందర వందరగా పడిన ముంగురులు సవరించి తనకి నిద్రా భంగం కలక్కుండా నెమ్మదిగా చేతులు తొలగించి పక్కకి జరిపి నామీదకు పడిన కంఫర్టర్ తీసి తనకిపూర్తిగా కప్పాను. కంఫర్టర్ తొలగించగానే చలి తీవ్రత అర్ధమైంది. అదే అక్కడ అయన పక్కన అయితే ఈ చలిలో  మంచం మించి దిగేదాన్నా....అయన కౌగలి వదిలేదాన్నా అందులోనూ ఇవాళ... నిట్టూర్చి నెమ్మదిగా మంచం దిగాను.
    మంచం దిగ్గానే మెత్తటి కార్పెట్ అడుగు దూరంలో వదిలిన స్లిప్పర్స్ తొడుక్కుని రెస్ట్ రూమ్ కి వెళ్లాను. చలి... చలి ఎముకుల్ని కోరికే చాలు అంటే ఏమిటో ఈ అమెరికా వచ్చాకే అర్ధమవుతోంది. రెస్ట్ రూమ్ కి అనుకోని ఉన్న క్లోసేట్ హంగర్ కి తగిలించి ఉన్న కోటు తీసి తోడుక్కున్నాను. టైం ఎంత అయిందో.... పొడుగాటి కిటికీ దగ్గరగా నడిచి కిటికీ కర్టెన్ పక్కకి జరిపి అద్దాల్లోంచి  బైటకి చూశాను.
    స్ప్రింక్లర్స్ అన్ అయినట్టున్నాయి... లాన్ లో జల్లు కురుసుతున్నట్టుగా అనిపిస్తోంది. ... ఇప్పుడు సమయం ఐదున్నర.... నేను లేవడం స్ప్రింక్లర్స్ అన్ అవడం నిత్యకృత్యమే... నాకు అటు సూర్యుడు ఎటు పొడిచినా టంచనుగా మెలకువ వస్తుంది. ఇవాళ శనివారం... వీకెండ్... పిల్లలు ఎలాగా త్వరగా లెవరు.... పాపం! ఉరుకులు, పరుగుల జీవితం.... యాంత్రికమైన దినచర్య... ప్రతిరోజూ వాళ్ళ జీవన విధానం ఒకలా ఉంటుంది. వీకెండ్ అయితే మాత్రమే నిశ్చింతగా కాస్సేపు నిద్రపోతారు. రోజూ నేను ముందు లేచి వాళ్ళకి కావాల్సిన బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసి, ముగ్గురికీ క్యారియర్లు సర్దుతాను.... వాళ్ళు లేచి వాళ్ళ పనులు, స్నానాలు అన్నీ పూర్తీ చేసుకొని వచ్చి ఎవరిక్యారేజీ వాళ్ళు తీసుకుని పరుగులు పెడతారు. నేనూ, ఈ నాలుగు గోడలు మిగులుతాము.
    చలి చెవుల్లోంచి ప్రవహిస్తున్నట్టు అనిపిస్తోంది. స్కార్ఫ్ కట్టుకోవాలి. కిందకు వెళ్ళనా? బైటకి చూశాను.... ఇంకా చీకటిగానే ఉంది. స్ట్రీట్ లైట్ వెలుగులో నిశ్శబ్దంగా ఉన్న ఇళ్ళు అందంగా, కళాత్మకంగా కనిపిస్తున్నాయి. నిర్మలమైన ఆకాశంలోపూర్ణ చంద్రుడు.... వెన్నెల ప్రకాశవంతంగా చూపిస్తోంది. పరిసరాలను వెన్నెల ఎంతో అందంగా చూపిస్తోంది. పచ్చని పచ్చికను, ఎంత బాగుందో... నేను గమనించలేదు. కానీ, ఎంత వెన్నెల.... పున్నమి కదా.... పచ్చని లాన్ మీద పూల మొక్కల మీద, ఓకే చెట్లమీద , ఇంటి కప్పుల మీదా, లాన్ లో క్రిస్ మస్ సందర్భంగా అమెరికన్ లేడీస్  అలంకరించుకున్న రకరకాల బొమ్మల మీదా.... ఎక్కడా చూసిన వెన్నెల.
    రాధ కొన్న ఈ కొత్టింటి కి వచ్చాక కాస్త   బైట వాతావరణం కనిపిస్తోంది. అడపా దడపా తిరిగే  మనుషులు, కార్లు , ఎడురిల్లు, పక్కిల్లు , ఆపక్కిల్లు, ప్రతి ఇంటి ముందూ క్రమపద్దతిలో పెంచిన లాన్, పూల మొక్కలు. ఓక్ చెట్లూ, సోలార్ లైట్లు..... ఆ ఇళ్ళల్లోంచి మధ్యమధ్య బైటకి వచ్చి ఎండలో తిరుగుతూ టాన్ అవడానికి ప్రయత్నించే అమెరికన్ అమ్మాయిలూ.... ఇవన్నీ అద్దాల కిటికీ లోంచి చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను. లేకపోతె పిచ్చెక్కి పోయేది.
    మొదటిసారి ఇక్కడికి వచ్చినపుడు కొన్ని రోజులు బాగానే ఉంది. పాపాయి పుట్టడం, దాని ఆలనా, పాలనా టైం ఎలా గడిచిందోకూడా అర్ధం కాలేదు. మధ్యమధ్య వీకెండ్స్ అమెరికా అందాలు, చూడడం, నాలుగు నెలలు గడవగానే ఇండియా మీద, అయన మీదా నా ఇంటి మీదా బెంగ ముంచుకొచ్చేసింది. మరో రెండు నెలలు అతి కష్టం మీద గడిపి అయన దగ్గరకు ఎగిరి వెళ్లాను. వెళ్ళగానే ఎయిర్ పోర్టు లోనే ఆయన చేయి గట్టిగా పట్టుకుని "ఇంకెప్పుడూ అమెరికా వెళ్ళను. నా వల్ల కాదు, మీకు దూరంగా ఉండడం" అన్నాను. అయన మనోహరంగా నవ్వారు. 'అలాగే నేను వెళ్ళమననులే" అన్నారు. ఆయనలా ఎందుకన్నారో తర్వాత తెలిసింది. మరో ఆరు నెలలు కాగానే "ఏవండీ నా బంగారు ఎలా ఉందొ.... దిక్కుమాలిన క్రచ్ లో వేశారు. అమ్మమ్మ ఒడిలా ఉంటుందా క్రచ్...."అన్నాను. బెంగగా.... మరునాడే రాధ నుంచి ఫోన్... 'అమ్మా ....పాపాయిని కేర్ లో వేస్తె తరచూ జలుబు, జ్వరం వస్తున్నాయి. డాక్టర్ల కి బోలేడవుతోంది. నువ్వేం చేస్తావక్కడ? వచ్చేసేయ్. టికెట్ కొంటాను" అని. అంతే నా మనసుకి మళ్ళీ రెక్కలోచ్చాయి.
    ఏమిటో అమెరికా అనగానే  భూలోక స్వర్గం లా ఎందుకు భావిస్తారో అర్ధం కాదు. వీసా వచ్చిందాకా దిగులే.... చిన్నప్పుడు చూసిన జానపద సినిమాల్లో పాతాళలోకం వెళ్ళడానికి రాజకుమారుడు పడే పాట్లన్నీ అమెరికా వెళ్ళడానికి పడుతున్నట్టుగా అనిపించింది. వీసా వస్తుందా? లేదా? స్టాంపింగ్ అవుతుందా, లేదా? అని ఒకటే దిగులు.... 'అమ్మా వాళ్ళు ఇలా అడుగుతారు. అలా చెప్పు అంటూ ఫోన్ లో రాధ కౌన్సిలింగ్. వీసా కోసం వెళ్ళినపుడు జరిగే ఇంటర్వ్యూ తతంగం మొత్తం నోట్స్లా రాసి పంపించింది. అదంతా బట్టీ పట్టడం, దేవుడా, నాకు స్టాంపింగ్ అవాలి... నీకు 108 ప్రదక్షణలు చేస్తాను.... అని దేవుణ్ణి మొక్కుకోడం, ఇప్పుడు తల్చుకుంటే నవ్వొస్తోంది. ఈ సెంట్రల్ జైలుకి రావడానికి ఎంత ఫార్సు జరిగింది. తీరా వచ్చాక ఇక్కడ జీవితం విజిటర్స్ గా వచ్చే పేరెంట్స్ కి జైలు జీవితం అని పూర్తిగా అర్ధమైంది.
    పిల్లలు బైటకి వెళ్ళిపోయాక వాళ్ళోచ్చిందాకా నోరు టేపు వేసి అతికించినట్టే. మాటలు మరిచి పోయినట్టే... మొదట్లో భయమేసింది. ఇండియా వెళ్ళాక మళ్ళీ పెద్ద బాలశిక్ష చాడువుకోవాలేమో అని. ఆ అవసరం లేకుండా అయన బోలేడుకబుర్లు చెప్పారు. చెప్పించారు. ఆరు నెలలు కడుపులో దాచుకున్న అనురాగం... ప్రేమా, మాటల రూపంలో ప్రవాహం లా నన్ను ముంచెత్తింది.... ఇప్పుడు మళ్ళీ అన్నాను. ఆయన గుండెల్లో ఒదిగిపోతూ... "ఇంకెప్పుడూ వెళ్ళనండి... మీరు లేకుండా నేనుండలేను" అదే నవ్వు నవ్వారు. "ఎందుకలా నవ్వుతారు? ఈసారి వెళ్ళడం అంటూ జరిగితే మీతో కలిసి....మీరు వాలంటరీ తీసేసుకోండి. నావల్ల కాదు. ఏడాదికి ఆరునెలలు మిమ్మల్ని వదిలి ఎలా ఉండగలననుకున్నారు?" ఉక్రోషంగా అన్నాను.
    "నేను మాత్రం ఉండగలనా నిన్నోదిలి ....కానీ , ఏం చేస్తాం? పిల్లలు అక్కడ ఇబ్బంది పడుతోంటే మనం ఇక్కడ ఎంజాయ్ చేయగలమా?' చెళ్ళున తగిలింది....అవును నిజమే చేయగలమా?
    నిజం చెప్పాలంటే ఆ దాంపత్య జీవితం మూడు పూలు ఆరు కాయలుగానే సాగింది... సాగుతోంది. అనుకూలమైన , అన్యోన్యమైన జీవితం.... సరదాకి కూడా పోట్లాడు కోలేదు. ఇద్దరి అభిరుచులు ఒకటే.... ఇద్దరి రుచులు ఒకటే, ఇద్దరి అభిప్రాయాలు ఒకటే, ఆలోచనలు ఒకటే.... ఆశయాలూ ఒకటే. అందుకే ఎన్నడూ చిన్నచిన్న అభిప్రాయ భేదాలు కూడా లేని జీవితం నాది.
    సాధారణంగా పిల్లలు పుట్టగానే దాంపత్య జీవితం చాలామందికి రిటీన్ అవుతుంది. కానీ రాధకి పదేళ్ళు వచ్చిందాకా మా దాంపత్య జీవితం మాకు ప్రతి రాత్రి మొదటి రాత్రి లాగే గడిచేది. రాధ పెద్దదవుతోందని మా అంతట మేమే నిశ్చయించుకుని కొంచెం ఆవేశాలను, కోరికలను అణచుకున్నాం. అలాగని మామధ్య శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఎలాంటి గ్యాప్ లేదు. రాధ పెళ్ళి అయాక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దాం అంటూ అయన చిలిపిగా కన్ను గీటుతుంటే ఆ చర్య లోని అల్లరితో మైకం కమ్మినట్టు అయి పులకించి పోయేదాన్ని.
    ఒక్కతే కూతురు ...మా ఆశలకీ, అభిరుచులకీ అనుగుణంగా పెంచి, పెద్ద చేసి మంచి చదువు చెప్పించి, మంచి ఉద్యోగం చూపించి, మంచి కుటుంబానికి కోడలిగా , మంచి వ్యక్తికీ భార్యగా చేసి మా బాధ్యత పూర్తిగా నేరవేర్చుకున్నాం... రాధ అమెరికా వెళ్ళాలన్న ఆలోచన, ఆశ మాకెప్పుడూ లేదు. అత్తగారు, మావగారి దగ్గర హాయిగా ఉంటూ వాళ్ళల్లో కలిసిపోయి చక్కటి కుటుంబ జీవితం గడపాలనుకున్నాను. పుట్టే పిల్లలకి నానమ్మ, తాతయ్యల ప్రేమ అక్కడ, అమ్మమ్మ,తాతయ్య ల ప్రేమ ఇక్కడ లభించాలని నేటి సోకాల్డ్ సొసైటీ ప్రభావం తన పిల్లల మీద పడకుండా కమ్మని కధలతో పిల్లలు నిద్రపోవాలని ఎన్నో అనుకున్నాను. కానీ, హటాత్తుగా రాధా "అమ్మ మేము అమెరికా వెళ్తున్నాం. నాకు హెచ్ వన్ వీసా వచ్చింది' అనగానే నిశ్చేష్టురాల్ని అయాను. అంతదూరం మాకు దూరంగా ఎందుకు వెళ్తుందో అర్ధం కాలేదు. ఏం తక్కువైందని తనకి.... మంచి ఉద్యోగం, అల్లుడికి అంతకన్నా మంచి ఉద్యోగం , మా నుంది తనకి లభించే ఆస్తి, అత్తగారింట్లో ఆస్తిపాస్తులు ఇంకా ఏం కావాలి? దేనికి ఈ పరుగు అనిపించింది. కానీ, వాళ్ళ స్వతంత్ర్త్యాన్ని ఆపే హక్కు మనకి లేదు. అని ఆయననన్ను అపడంతో నేను ఎదురు చెప్పలేదు. కన్నీళ్ళ తోటే పంపించాను. గుండె బరువైంది. ఒకే ఒక్క కూతురు ....దానికి పుట్టే పిల్లలతో ఆడుకుంటూ ఆ ముద్దు మురిపాలు అనుభవించి పరిపూర్ణమైన జీవితం అనుభవించిన ఆనందంతో  హాయిగా కళ్ళు మూయవచ్చు అనుకున్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS