Previous Page Next Page 
మౌనవిపంచి పేజి 39

 

    అతను ముఖం ముడుచుకున్నాడు.
    
    తనలో తను నవ్వుకుంది నంద.
    
    బస్టాపు చేరుకునేసరికి కొండవీటి చేంతాడులా వుంది క్యూ. ఇప్పుడైతే క్యూలో వున్నారు. కానీ బస్సుని చూసే సరికి అంతా సినిమా వదిలిన జనంలా గుంపులు గుంపులై పోతారు అనుకుంది నంద.
    
    "రెండు బస్సులు వస్తే కానీ ఈ జనం వెళ్ళలేరు!" అంది స్టెల్లా.
    
    "అవీ రెండూ ఖాళీవే రావాలి!" అంది నంద.
    
    "అలా వెళ్ళి కాఫీ తాగి వచ్చేద్దామా?" అడిగింది స్టెల్లా.
    
    ఇద్దరూ టేబిల్ ముందు కూర్చోగానే బేరర్ వచ్చారు.
    
    "ఏం కావాలి?" అడిగాడతను వినయంగా.
    
    నందవైపు చూసింది.
    
    "సింపుల్ గా టీ" అందామె.
    
    బేరర్ అదే ఆర్డర్ గా వెళ్ళిపోయాడు.
    
    టీ తాగి బయటికి వచ్చారిద్దరూ.
    
    బస్టాపు వచ్చేసరికి రష్ చాలామటుకు తగ్గిపోయింది.
    
    అంతలో స్టెల్లా వెళ్ళే బస్సు వచ్చింది. స్టెల్లా వెళ్ళి పోయింది.
    
    బస్సుకోసం ఎదురుచూస్తున్న నంద ప్రక్కగా మోటార్ సైకిల్ ని ఆపాడు అనీల్. అతన్నిచూసి పలకరింపుగా నవ్వింది నంద.
    
    "దేవిగారి కోసం!" నవ్వాడు అనీల్.
    
    అటూ యిటూ చూసి అతని వెనుక సీటులో కూర్చుంది నంద. సైకిల్ కదిలింది.
    
    "ఇలా రోజూ రారాదూ!"
    
    "తమరి ఆజ్ఞ!"
    
    "అనీల్!"
    
    ప్రాంక్ లీ టెల్ మీ! నేనో నిర్ణయానికొచ్చాను.    
    
    "మా మేనత్తని రమ్మని రాస్తాను. ఆమె వచ్చేస్తే మా యిక్కట్లు అన్నీ తీరిపోతాయి. నెలనెలా సరుకులు తెచ్చేస్తూ వుంటే ఆమె సంసారాన్ని లాగించేస్తుంది."    
    
    "మనం పెళ్ళి చేసుకోవచ్చా?"
    
    "ఊ మీ అమ్మగారిని అత్తా అని పిలవ్వచ్చు!"
    
    "హాయ్!" అని బ్రేక్ వేశాడు. వెనక్కి తిరిగి నిజమా అని అడిగాడు.
    
    సిగ్గుతో తలూపింది నంద.
    
    "థాంక్యూ!" అన్నాడు హుషారుగా.
    
    "యస్!" అంది నంద హుందాగా.
    
    "నందా! ఈ హాపీ న్యూస్ చెప్పినందుకు మనం సెలబ్రేట్ చేసుకుందామా?"
    
    "ఎలా?"
    
    "ఎలా ఏమిటి? ఇలాగే ఇంటికి వెళ్ళిపోదాం! మీ యింట్లో చెప్పి పిక్చర్ కి వెళదాం! తర్వాత కామత్ లో భోజనం సీమాలో రూం, తర్వాత తర్వాత అతను నవ్వుతూ వుండిపోయాడు.
    
    "మైడియర్ ప్రిన్స్! మూడు ముళ్ళు పడ్డాకే-"
    
    "ముందు ముహూర్తాలు ఎప్పుడున్నాయో చూసుకోండి!" అంది తను హుషారుగా. ఉదయం నుంచి పడిన శ్రమ అంతా మరిచిపోయింది ఆమె.
    
    "చప్పున మంట చల్లారిపోయినట్టుగా చల్లబడిపోయాడు అనీల్.  

 

    "ఆల్ రైట్!" అన్నాడు నవ్వుతూ.
    
    వెహికల్ కదిలింది. నంద ఇంటిముందు ఆగింది.
    
    "టాటా!" చెప్పగానే గేర్ క్లిక్ తో ముద్దు విసిరేసి వెళ్ళిపోయాడు.

 

    హుషారుగా ఇంట్లోకి అడుగు పెట్టింది నంద.
    
    "కాఫీ పెట్టనా?"
    
    "ఆ నవ్వు ముఖం కడుక్కునిరా! ఫ్లాస్కులో వుంది!" అంది.
    
    మరో అయిదు నిమిషాలకి ముఖం కడుక్కుని వచ్చిన నందకి కప్పు అందించి రెండు ఉత్తరాలు అందించింది విమల.
    
    విప్పి వున్న ఆ ఉత్తరాలని చదివింది నంద.
    
    "తీసి ఉంచు" శాంతంగా అంది చెల్లెలితో.    
    
    "వెళ్ళొద్దంటావా?"
    
    "ఊహుఁ!"
    
    "ఏం?"
    
    "నువ్వు బాగా చదువుకునే అవకాశాలున్నాయి. ఉద్యోగం ఎందుకు?" 

   

    "ఉద్యోగంలో చేరి చదువుకోవచ్చు కదా?"    

 

    "అవుననుకో! అయినా విమ్మీ! నేను ఉద్యోగంలో ఉన్న సాదక బాదకాలని అనుభవిస్తున్నాను. ఇంకా నువ్వెందుకు బాధపడాలి."
    
    "అక్కా! నువ్వు కష్టపడుతున్నావు కళ్ళతో చూస్తూ నీ కష్టాన్ని పంచుకోలేకుండా వున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది!"    

 

    "వదిలెయ్! మరో మంచి కాలం వస్తుంది. అప్పుడు సుఖపడ్తాను!" నవ్వుతూ అంది నంద.
        
    ఇంకేమీ అనలేదు ఆమె.
    
    తల్లి వద్దకు వెళ్ళింది నంద.
    
    "కూర్చో!" బలహీనంగా అంది సుందరమ్మ.
    
    "అమ్మా! మనుషులని మనుషులే క్షమించాలి అనే దానివి నువ్వు! అవకాశం వస్తే క్షమించటంలో వున్న ఆనందం మరెక్కడా లేదనే దానివి నువ్వు. నీ మాటలపై విశ్వాసం వుంది నాకు."
    
    "ఏంటమ్మా?"
    
    "అత్తయ్య ఉత్తరం రాసిందమ్మా!" క్లుప్తంగా అంది.
    
    "ఎవరు? ఎవరు? పద్మావతి రాసిందా?" ఆత్రంగా లేవబోయింది సుందరమ్మ.
    
    "అవునమ్మా!"
    
    "బావుందా? ఏం రాసింది?"
    
    తల్లి ఆరాటం గమనించి నిట్టూర్చింది నంద ఆవేశంతో. "ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఏ ఆడదీ సుఖపల్లేదమ్మా!" కానయితే అతనన్యాయం చేయకపోయినా భగవంతుడు అన్యాయం చేశాడామెకి! అతను హఠాత్తుగా పోయాడట!
    
    కొంత డబ్బు మాత్రం మిగిల్చాడు. ఆ అయిదువేల తోటి మనం రమ్మంటే వస్తానని అత్తయ్య నాకు రాసింది! ఆమె మనం ఇంకా మనూళ్ళో మనింట్లో వుంటున్నామనీ అనుకుని అక్కడికి రాసింది!"
    
    నిట్టూర్చింది సుందరమ్మ. ఆమెకి పాతరోజులు గుర్తుకు వచ్చాయి.
    
    "అత్తయ్యని రమ్మని రాయనా?"
    
    "మీ నాన్నని అడుగమ్మా!"
    
    "అలాగే!" అని లేచి వెళ్ళింది నంద.
    
    నారాయణ కూతుర్ని చూడగానే కళ్ళు విశాలం చేశాడు.  

 

    "అత్తయ్య ఉత్తరం రాసింది! వస్తానంటూ ప్రార్థిస్తూ రాసింది ఆమె గురించి ఇక్కడ ఎవరికీ తెలియదు. భర్తపోయి అత్తారిల్లు వదలి వస్తోందని చెబుదాం! ఇప్పట్లో ఆమె అండ మనకి ఎంతో ఆసరాగా వుంటుంది!"
    
    నిదానంగా చూశాడతను. కొద్దిక్షణాలాగి తలూపాడు.
    
    అతని ఆంతర్యంలో ఏముందో గ్రహించలేకపోయింది నంద.
    
    కానీ తండ్రి అంగీకారం తెలిసేసరికి ఆమెకెంతో ఆనందమైంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS