'ఏమిటది?' అన్నట్లు కళ్ళు ఎత్తి చూసింది కళ్యాణి. 'తను స్కూలుకి ఒక్కతీ వెళ్ళలేదు-- రోజూ తనతో కూడా బంట్రోతు రావాల్సిందే -- తనని స్కూల్లో దిగవిడిచాక వాడు ఇంటికి తిరిగి వచ్చి మళ్లీ స్కూలు విడిచి పెట్టె వెల్టి కి స్కూలు కి వస్తాడో , లేకపోతె తను స్కూల్లో ఉన్నంత సేపూ వాడు అకాంపౌండు లోనే ఏ చెట్టు క్రిందో కూర్చుంటాడో అదంతా తనకి అనవసరం. తను క్లాసు లోంచి బయటికి రాగానే మాత్రం వాడు వరండా లో హాజరుగా వుండి తనని వెంట పెట్టుకుని యింటికి తీసుకు రావాలి, అందిట. ఆ సంగతి నువ్వు వేరే అడగాలా? నిన్ను ఒక్కదాన్ని మేం మాత్రం పంపిస్తామా? అప్పల స్వామి రోజూ నిన్ను స్కూలు కి తీసుకు వెళ్లి మళ్లీ తీసుకు వస్తాడు-- అన్నారుట అమ్మమ్మా, తాతగారూ -- సరే-- వో మంచి రోజున , వో గుమాస్తా , వో బంట్రోతూ పిన్నిని తీసుకు వెళ్లి స్కూల్లో జేర్పించటం, అవాల్టి కి పుస్తకాలేమీ లేవనే కారణంతో మళ్లీ వెంటనే యింటికి వచ్చేయ టంతో ఆవిడ స్కూలు జీవితంలో మొదటి రోజు గడిచి పోయింది.--ఆ సాయంకాలం సరికి పుస్తకాలు వచ్చాయి -- ముచ్చటయిన బొమ్మలతో చక్కగా వున్న ఆ కొత్త పుస్తకాలకి అంతకన్నా ముచ్చటయిన రంగు రంగుల అట్టలు వేసి పెట్టారు జవాన్లు-- వాటి మీద గుండ్రటి అక్షరాలతో పొందిక గా పిన్ని పేరు వ్రాసి పెట్టారు తాతగారు -- ఆ మర్నాడు బాగా త్వరగా తయారయి స్కూలు కి ప్రయాణం అయింది పిన్ని. "ఫరవాలేదు అమ్మాయి దారిలో పడుతోంది అని మురిసి పోయారు తాతగారూ వాళ్ళూ-- పిన్నీ, ఆవిడ ప్రక్కన పుస్తకాల సంచీ పట్టుకుని అప్పలస్వామి ఇద్దరూ బయలుదేరారు . పది బారల దూరంలో వున్న స్కూలుకి వీళ్ళు చేరుకునేసరికి అక్కడ ఒక్క పిట్ట కూడా కనిపించలేదు-- లోపల ఎక్కడో స్కూలు జవాను గదులూ అవీ తుడుచి శుభ్రం చేస్తున్న అలికిడి వినిపిస్తోంది. 'మేమంతా చెప్పాం కదండమ్మాయి గారూ. ఇంకా చాలా వేళ వుంది.' అన్నాడు అప్పల స్వామి చేతులు నలుపుకుంటూ. 'ఫరవాలేదు , కూర్చుంటాను.' అని గర్సు వెయిటింగు రూమ్ లో వో బల్ల మీద కూర్చుంది. క్రమంగా అబ్బాయిలూ, అమ్మాయిలూ రావటం మొదలు పెట్టారు. స్కూలు బెల్లు మ్రోగింది. పిన్ని వరండాలో కి వచ్చి అప్పల స్వామికి పుస్తకాల సంచీ అందించి 'ఇంటికి వెళ్ళిపోదాం అంది......'
రాబోతున్న నవ్వుని ఆపుకుని, 'బాగుంది . నేను వెళ్ళిపోతాను అని చెప్పిన దానికి ఎంత కధ చెప్పారు?' అంది కళ్యాణి.
'నయమే ఇది కధ అనుకుంటున్నారా? కధ కాదు నిజంగా జరిగింది -- నాలుగో క్లాసులో స్కూల్లో జేరిన మా పిన్ని ఆ పద్దతి లో నాలుగు రోజులు స్కూలుకి వెళ్లి వచ్చింది. తరవాత మరి స్కూలు మొహం చూడలేదు. ఇంట్లోనే ఏదో చెప్పించారను కొండి. తరవాత పెళ్లి అయిపొయింది -- ఆవిడ పిల్లలు ఇప్పుడు బియ్యేలు, ఎమ్మే లు చదువుతున్నారు-- సందర్భం వచ్చినప్పుడు మాత్రం మేమంతా ఆనాటి సంగతులు చెప్పుకుని నవ్వుకుంటాం -- అంటే అసలు ఈ విషయం మాకు మా అమ్మ చెప్పింది, మేమంతా నమ్మాం మరి, మీకు నమ్మ బుద్ది కావటం లేదా ?' ఇంతసేపు కబుర్లు చెప్పటం లో కొత్తదనం పోయి చనువుగా అడిగాడు.
'మీరు చెప్తున్నారు కాబట్టి నమ్ముతాను.' అంది కళ్యాణి.
'అంటే? నేను అబద్దం చెప్పానని మీకు నమ్మకమా? ఏమిటి నాలో ఆ ప్రత్యేకత?' కళ్యాణి కళ్ళల్లో ఏవేవో భావాల కోసం వెతుక్కుంటున్న వాడిలా ఆశగా, మృదువుగా ఆమె మొహంలోకి చూశాడు.
తను యధాలాపం గానే అన్న మాటలో తనకి తెలియకుండానే ఏదో ఆత్మీయత ఇమిడి వుందా, ఏదో దగ్గరితనం వ్యక్తం అయిందా, అనే ఆలోచన వచ్చి కలవర పడిపోయినట్లయింది కళ్యాణి. అయితే అదేమీ పైకి వ్యక్తం కానివ్వకుండా --
'మీ ఇల్లెక్కడ?' అంది మాట మారుస్తూ.
'ఇల్లా? బ్రహ్మచారి గాడు వుండేదాన్ని ఇల్లని ఏమంటారు లెండి.' ఉంది , ఏదో వో గది, ఉండటానికి సౌకర్యంగానే వుంది గాని, ఆఫీసుకి బోలెడు దూరం -- విద్యానగర్ లో వుంటున్నాను.'
'అయితే ఇక్కడికి దూరమే.'
'దూరమే మరి-- మీరు వుండేదెక్కడ?'
'రవీంద్ర భారతి కి అటు ప్రక్కగా వున్న వీధిలో.'
'అరె-- చాలా దగ్గర. రోజూ ఈవినింగ్ వాక్ లా రావచ్చు మీరీ గార్డెన్ కి.'
'ఆ, రోజూ ఎక్కడ కుదురుతుంది -- ఎప్పుడైనా వస్తుంటాను ...మరి ఇంక వెళ్తాను.' అంటూ లేచింది కళ్యాణి.'
'నేనూ వెళ్ళిపోతాను. ఏమీ తోచక ఇలా వచ్చాను. అనుకోకుండా మీరు కనిపించారు. ఏవేవో మాట్లాడుతుంటే టైం తెలియకుండానే గడిచిపోయింది.' అంటూ మురళీ కూడా లేచాడు.
2
ఒకరోజు -- లంచ్ అవర్ లో , కాఫీ త్రాగటానికి వెయిటింగ్ రూమ్ వేపు వెళ్ళబోతోంది కళ్యాణి.
ఉద్యోగంలో చేరిన మరునాటి నుంచీ కళ్యాణి గూడా ఫ్లాస్కు నిండా ఏదో తెచ్చుకోటం మొదలు పెట్టింది.
కేంటీన్ వేపు వెళ్ళబోయిన మురళీ మళ్లీ వెనక్కి వచ్చాడు. అప్పటికి మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోయారు . కమల ఆవాల ఆఫీసుకు రాలేదు. తార భోజనం చేస్తోంది గదిలో.
'ఇవాళ మీరు, నాకో చిన్న సహాయం చెయ్యాలి?' అన్నాడు మురళి.
'నేనా?' తెల్లబోయిన కళ్యాణి గుమ్మం దగ్గరే ఆగిపోయింది.
'మరేం లేదు...రేపు దసరా కి మా చెల్లాయిల కిద్దరికీ చీరలు కొని పంపించాలని సరదాగా వుంది-- నాకేమో ఈ చీరాల అందాలూ, నాణ్యాలు అస్సలు తెలియవు-- ఎప్పుడూ డబ్బు పంపించటమే కాని ఏదీ కొనటం అలవాటు లేదు -- ఇన్నాళ్ళ తరువాత ఇవాళ గొప్పగా వాళ్ళకి చీరలు పంపించబోయి ఏ వెర్రి మొర్రి రకాలో కొన్నానంటే వాళ్ళు వాటిని జాగ్రత్తగా అట్టే పెట్టి ఈసారి నేను వెళ్ళినప్పుడు నా మొహాన్న పారేస్తారేమో నని భయం వేస్తోంది.......'
'చీరలు సెలక్టు చేసి పెట్టమని నన్నే అడగటం బలే చిత్రంగా వుంది-- చీరల్లో కొత్త ఫ్యాషన్లూ , ఈరోజుల్లో వస్తున్నా రకరకాల డిజైన్లూ వాటి పేర్లూ కూడా నాకు తెలియవు. ఏదో వో షాపులోకి వెళ్ళటం అక్కడ ఎదురుగా కనిపించిన చీరేదో కొనుక్కు తెచ్చుకోటం తప్ప పది షాపులు తిరగటం పది రకాలు తీయించి గంటల కొద్దీ బేరం చెయ్యటం నాకు చేతకానూ కాదు...ఇష్టమూ వుండదూ!'
'మరేం ఫర్వాలేదు. మీరు ఏది బాగుంది అంటే అదే తీసుకుంటాను.' అని, అంతలో మరేదో ఆలోచన వచ్చి 'లేకపోతె మీ చేతికి డబ్బు ఇస్తాను . మీరే తెచ్చి పెట్టండి.' అన్నాడు.
'ఆహా , అలా ఎందుకూ? సాయంకాలం ఆఫీసు అయిపోగానే వెళ్దాం -- సుల్తాన్ బజారు లో , నేనెప్పుడూ కొనుక్కునే షాపుకి వెళ్దాం.'
'వో- థాంక్సు -- వస్తాను మరి .' అనేసి హాలు దాటి కేంటీన్ వేపు వెళ్ళిపోయాడు.
సాయంకాలం ఇద్దరూ షాపింగ్ ముగించుకుని బస్సు స్టాపు లో నిలబడ్డారు.
'వో , మురళీ!' అన్న పలకరింపుతో మురళీ తలతిప్పి చూశాడు. కాస్త దూరంలో వాసు, పాప చెయ్యి పట్టుకుని నిలబడి వున్నాడు. ఆ ప్రక్కనే అతని భార్య శారద వుంది. ఇద్దరి మొహాలల్లో తొణికిసలాడుతోంది. వాళ్ళని చూస్తుంటే, వాళ్లు చాలాసేపటి నుండి తనని గమనిస్తున్నారేమో ననిపించింది మురళీకి -- ఇంతసేపూ తను మరో ద్యాస లేనట్లు కళ్యాణి తో అఖబురూ ఈ ఖబురూ చెప్పటం వాళ్ళు గ్రహించారేమో అన్న వూహ వచ్చి ఒక్కసారి సిగ్గుపడి పోయాడు. అయినా తన మనస్సు లోని ఉలికి పాటుని తొట్రు పాటుని పైకి కనబడ నీయకుండా మామూలుగా మాట్లాడేస్తూ 'ఈవిడ మిస్. కళ్యాణి-- మా ఆఫీసులోనే పని చేస్తున్నారు.' అని వాళ్ళకీ,
మిస్టర్ అండ్ మిసెస్ వాసుదేవరావు .' అని కళ్యాణి కి చెప్పి పరిచయం చేశాడు.
