Previous Page Next Page 
మన్నుతిన్న మనిషి పేజి 3


    "మసిబూసి మారేడ్ని చేసెడన్నారు. ఈలేం పెద్దల"న్నాడు. ఉప్పాల రాముడు. బోడమ్మ విని చర్రున లేచింది. "ఓరే తోక తెగిన నక్కలాంటో డివిరా! నివ్వా నీతులు చెప్తావ్? మాదగ్గర తేరసొమ్ము లేదు బీరపీచులా జల్లేడానికి! నాయేపు అలా కాకిలా చూస్తావేం? పోరా....జబ్బులోడా- సూసి సూసి అది నీతి తప్ప గలదు. ఆడది నీతి తప్పాక అంతేమిటి? ఇంతేమిటి?' రాముడు తలొంచుక వెళ్ళిపోయాడు.
    అందరూ కదలిపోయారు. వీరన్న ఒక్కడే ఆ మర్రిచెట్టుక్రింద కూర్చున్నాడు. చెట్టుమీదకు చీమల గుంపులు ప్రాకిపోతున్నాయ్. చెట్టుమీద రక రకాల పక్షులు వాలుతున్నాయ్. మర్రి పండ్లను తింటూ అరుస్తున్నాయ్. మీద కాకిరెట్ట పడింది. తుడిచి చుట్టూ చూసాడు. కొడుకు గురించి తల్చుకుంటుంటే బాధగా వుంది. చదువుతో పాలుగా తయారయి వస్తాడు. తన లాంటి పూర్వకాలపు మనిషి నీరులా వుంటే యిద్దరూ కలసి యీ గుంపును మరింత వృద్ధిలోనికి తెస్తామనుకున్నాడు. ఇప్పుడు వాడు జిడ్డునూనెలా వున్నాడు. నీరూ-న్నూనే కలుస్తాయా? వీడికి బుద్దులు యిప్పుడు చెప్తే వినేటట్టులేడు. బండ కొయ్యలా వున్నాడు. బుద్ధి చెప్తే విన్పించదే! పెద్దలంటారు గుణంతప్పిన కళ్ళు కనిపించవని! కానీ గుణంతో అన్నమాటలు యీ రోజుల్లో వినే దెవరు? మనుషులంతా మంచోల్లానే కనిపిస్తున్నారు. కానీ గుణాలు సూస్తుంటే గుడిసేట్లలా తయారవుతున్నాయ్. గుర్రంలా పరుగెత్తాలంటే కావటంలేదు. అందరూ అడ్డుపెట్టెవాళ్ళే. రంగులుమార్చే తొండయితే యెవరి కంటా పడకుండా పరుగెత్తేదే. అలాంటి పరుగేం పరుగు? తొండ కంపవరకే పరుగెత్తుతాది. గుఱ్ఱంలాగే పరుగెత్తుతాననుకున్నాడు వీరన్న.
    కొడుకు మీద ప్రేముంది- ఆ ప్రేమతో ఆడికి ఒక మార్గానికి తెస్తా ననుకున్నాడు. చెప్పగా చెప్పగా ఒకమంచి గుణమేనా అలవడదా? ఆడు నాకంటే మించిపోడా అని తమాయించుకున్నాడు. ఇంత అనుకున్నా యింకా అక్కడ నించి లేవ బుద్ధిపుట్టడం లేదు. చుట్టూ చూస్తుంటే ఒళ్ళు పులకరిస్తోంది. ఇన్ని ప్రదేశాలు తిరిగాడు. ఇన్ని సంవత్సరాలు తిరుగుడులో కళ్ళతో ఎన్నెన్నో అందమైన ప్రదేశాలు చూశాడు. అదేంటో యిప్పుడు వీళ్ళున్న యీ జాగా అంత సుందరంగా, ప్రశాంతంగా, హాయిగా యింకో జాగా అనిపించలేదు. చుట్టూ పచ్చిక బయళ్ళు. తూర్పువైపు చిన్న యేరు పారుతోంది. నీటికి కొదవలేదు. అక్కడక్కడా రకరకాల చెట్లు. చెట్లపై గుంపులు గుంపులుగా పిట్టలు. ఎటు వేపు వెళ్ళినా యేదో ఒక వూరు తగులుతూనే వుంది. ఊర్లన్నీ బంగారాలే, చేతికి యెముకల్లేని యీవి. ఆడాళ్ళు తేలుమందు, పాములమందు, కడుపు నొప్పికి, శిరోవాతానికి, గంటునొప్పికి మందులు అమ్ముకోగలుగుతున్నారు. ఇక్కడ పగడభస్మం, పంగం, తిరుపంగం, ఆభ్రకం, కాంతం, కటక లోహం అన్నీ పుటాలు పెట్టి సుళువుగా చెయ్యగానే యిట్టే అమ్ముడైపోతోంది. గొడ్డూ గోదా మేతకు కావలసినంత జాగా, తగవులూ, జగడాలూ పందులనించీ, మేకల నించీ, గాడిదల నించీ, రైతు లతో రాలేదు. అల్లంత దూరంలో ఎత్తైన రైలు రోడ్డు. దాన్ని కిందనించి దాటుకుని పోయే బస్సుల రోడ్డు. తిండికి గింజలు చౌక, తినడానికి కావలసినంత.
    "నాడే డబ్బుంటే యీ సుట్టుపట్ల జాగా కొనేసి యిక్కడే గుంపంతా కలకాలం వుండిపోదుం" అనుకున్నాడు వీరన్న. అలా అనుకుంటూ పడమటి వేపు చూశాడు. పదిమంది ఆడంగులు పల్లె వేపు పోతున్నారు. వాళ్ళ వెనకే కొడుకు. మరి నలుగురు యువకులు పడ్డారు. ఆ ఆడళ్ళలో అతని అపురూపమైన పెళ్ళం చుక్కమ్మ వుంది. ముందుకు నడుస్తూ వెను తిరిగి చిట్టిరాజు వేపు చూస్తోంది. నవ్వుతోంది. వీరన్న లేచిపోయాడు. భరించలేక యిటూ అటూ తిరిగాడు. ఆ దగ్గరలో పందులు బురదను మెచ్చుకుంటూ కదులుతున్నాయ్.
    "ఛీ...యీ లోకమంతా బురదే - మనుషులు పందులైపోతున్నారు." అనుకున్నాడు. అలా అనుకునే అవమానింపబడి ప్రతీకారం తీర్చుకోలేని వానిలా అయిపోతున్నాడు.

    ఇంతలో అతని ప్రక్కనించే ఒక గాడిద పరుగెత్తుతోంది. చప్పున చూసాడు. గాడిద మీద వుప్పాలరాముడు.
    "కొంపదీసి యీ జబ్బులోడ్ని గాడిదమీద బలవంతాన యెక్కించి ఎవరైనా వదిలేసారా?"
    గాడిద పరుగెత్తిపోతోంది. రాముడు తూగి పోతూనే గాడిద చెవులను గట్టిగా పట్టుకుంటున్నాడు. వీరన్న దానితో పరుగెత్తలేడు. రాముడ్ని రక్షించాలి. ఇంకో గాడిద యెక్కి దౌడు తీశాడు. వెనుక గాడిద ను పసికట్టి, ముందు గాడిద మరీ దౌడు తీసింది. చివరకు ఒక పొలంగట్టులో రాముడు జారిపోయాడు. గాడిద వెనుదిరిగి అరచి అక్కడే నిల్చుంది. రాముడు లేచి ఒళ్ళు దులుపుకుంటుంటే వీరన్న గాడిద దిగాడు.
    "ఎవరెక్కించారు నిన్ను?"
    "నానే..."
    "జబ్బు మనిషిని కదా...?"
    "నానూ ఒక మనిషి ననిపించుకోవద్దయ్యా ఉంటే బాగుంటాను లేకపోతే సస్తాను."
    "ఇలాగ గాడిదెక్కితే జబ్బు బాగవుతాదా?"
    "జబ్బు - యెదవ జబ్బు - కడుపు జబ్బు - ఒళ్ళు అలిస్తే అన్ని జబ్బులు పోతాయి. ఈ బద్ధకంపోతాది. కష్టపడి గడిస్తాను. గడించి అప్పు తీరుస్తాను. ఆ కడుపే కైలాసం. యెదవ - పొట్టిగాడు నా పెళ్ళం మీద అప్పుడు సూపువెయ్యడు."
    "నడుద్దామా?" అన్నాడు వీరన్న.
    "నడకా? ఈనాటితో శనీశ్వరుడు ఒదిల్నాడు.." అంటూ యింటివేపు పరుగెత్తాడు. త్రోవలో రెండు దగ్గరల్లో పడినా యిల్లు చేరుకున్నాడు. విల్లు బాణాలు తీశాడు. మీద పిట్టలనుపట్టే వల వేసుకున్నాడు. ఆడదాని దగ్గర అమృతం తాగి బయలు దేరాడు. సాయంత్రం సరికి రెండు పావురా పిట్టలు తీసుకు వచ్చాడు. పది పిట్టలు అమ్మిన డబ్బు కోటమ్మ చేత పెట్టి "బద్రంగా వుంచు. ఇలాగ యెల్లి నెలరోజుల్లో ఆడి అప్పు తీర్చేనా?" అన్నాడు.
    ఉస్సు గిస్సు మనకుండా కోటమ్మ దరిచేరాడు.
    చీకటిలో ఆమె వాడ్ని కౌగలించుకొని ముద్దెట్టుకుంది. ఇన్నాళ్ళకి ఆడదాని దగ్గర మొగాడిగా నిల్చున్నా ననుకున్నాడు.
    
                             *    *    *

                                                        4

    మరుసటి రోజు ఉదయం ఒళ్ళు నొప్పులతో రాముడు లేవలేక పోయాడు. కోటమ్మ కూడా వాడ్ని లేపకుండా యింటిపనులు చూసుకుని వూర్లోకి నలుగురి ఆడమ్మలతో వెళ్ళడానికి తయారవుతోంది. రాముడు మూలుగుతూ మంచంమీదనించి లేచాడు. పళ్ళు తోమాడు.
    "సల్దికూడెట్టు" అన్నాడు.
    "ఒళ్ళు నొప్పులు ఎల్లక."
    "అవే పోతాయి. ఈపాళాన ఆడప్పు తీర్చకపోతే గాడిదో, నువ్వో నా దగ్గరనించి పోతారు".
    "అలాగని ఒళ్ళు పాడుచేసుకుంటావా?"
    "అలాగని ఏటిదరి మానులా గండంతో యీల్ల దగ్గర బతక మంటావా? నేను సాతకానోడ్నని పేరుపడ్డాను."
    "బలేవాడివే. నీరున్నసోట బురదుండదా?
    మనిసున్న సోట మాటుండదా? నిన్నొదిలి యేటూ ఎలిపోనులే."
    "ఆ బోడమ్మ అన్నాది నీతి తప్పగలవని..."
    "నోరున్నాది. అనుకోని.. చెట్టునంట పిట్టల కోసరం తిరిగే బదులు - వైద్ధిగం సెయ్యరాధా?"
    "నాకు సేతి నాడెం తెలేదు."
    "పొట్టయ్యకి తెలిసిందేంటి? వైదిగం తోనే బంగారం గడించి సింగారం సేస్తన్నాడు. మనం జాతికి మందలోలం. కుదిరిందే మందు. రోగిని సూసి రాగిలేనిది రోగం కుదరదను. ధాతుపుష్టి లేదు. ఉత్తి చెడురక్తం వున్నాదను బాదపోతే బవుమానం యిమ్మని అడుగు..."
    "మందెక్కడ?"
    "నా నిస్తాను...ఇద.... ఇది గాడిదపాలు మాత్రలు- పిల్లలయిలేయియ్యి. పెద్దలకి యీ వనమూలిక లియ్యి. ఇదిగో అబ్బరకం -అన్ని రోగాలకీ మందు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS