Previous Page Next Page 
స్రీ పేజి 3

 

    "అదేమిటి నాన్నా? మొట్టమొదట అందరూ సమానమెగా? ఏ ఆధారం చూసి అలా మనుష్యులను విడదీశారు?"
    "పెద్దలు ఎందుకు చేశారో మనకేం తెలుస్తుంది తల్లీ? వంశపారంపర్యంగా వస్తున్న విధులను ఆచరించటమే మన ధర్మం."
    "ఊహు!' పద్మజ కేమీ నచ్చలేదు. "ఇందులో ఏదో అన్యాయం ఉందనిపిస్తోంది నాన్నా! ఎవళ్ళో , ఎప్పుడో విధించారని దాన్నే నమ్మమంటే బాగులేదు."
    కూతురు అంత పెద్ద పెద్ద ఆలోచనలతో మనస్సు పాడు చేసుకోవటం సోమయాజి కి నచ్చలేదు. "ఇవ్వాళ పాఠాలూ అవీ చదువుకున్నావా, అమ్మా?" అన్నాడు ప్రసంగం మార్చటానికి.
    "లేదు, నాన్నా! చదువు కుంటాను" అంటూ లేచింది పద్మజ. పద్మజ లోపలికి వెళ్ళగానే సోమయాజి భార్యను ఉద్దేశిస్తూ అన్నాడు. "విన్నావుటే , కాముడూ, దాని మాటలు?"
    "అది పెంకి ఘటమని నే నేనాడో నిర్ధారణ చేసుకున్నాను" అంది కామేశ్వరమ్మ, ఆవలించి మంచం మీదికి ఒరుగుతూ.
    సోమయాజి నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు.
    ఒకరోజు - మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట దాటినా నకనకలాడే కడుపుతో ఉస్సురని నిట్టురుస్తూ లోతుకు పోయిన కళ్ళతో వీధి పాడుగుకూ పరికిస్తూ గడప లో చెంగు పరుచుకుని నడుం వాల్చింది కామేశ్వరమ్మ. సోమయాజి భోజనానికి రాని కారణంగా ఆవిడ నోరు అన్నం తినటానికి ససేమిరా ఒప్పుకోవటం లేదు.
    అప్పుడే స్కూలు నుంచి వచ్చిన పద్మజకు అన్నం వడ్డించి నీరసంగా చదికిలపడింది గడపలో.
    "అమ్మా! అలా ఉన్నావెం?"
    కస్సుమంది కామేశ్వరమ్మ. "ఇంకెలా  ఉంటానే? ఈయనా ఈయన గారి పెత్తనాలూను! ఎంత కోర్టు వ్యవహారలైతే మాత్రం తిండి తిప్పలూ గుర్తు రావద్దూ? ఇంటి దగ్గర కట్టుకున్న పెళ్ళాం ఉస్సూరు మంటూ పడిగాపులు కాస్తుందన్న ఇంగితమైన ఉండద్దూ మనిషికి? రోజులా ఇవాళ  పొద్దుట అ పాల చుక్కలూ తాగలేదు. రాత్రి ఉపోషం అవనే అయింది. కళ్ళు తిరిగి చీకట్లు కమ్ముతుంటే, కాళ్ళు పీక్కుపోతుంటే-- ఎక్కడ విరుచుకు పడతావో అని భయంతో చస్తున్నాను."
    విషయమంతా అర్ధమైంది పద్మజ కు. నాన్న తిని ఇవ్వాల్సిన ఎంగిలి కంచం కోసం అమ్మ అన్నం తినకుండా కూర్చుంది. అలా ఎంత సేపైనా కూర్చుంటుంది. నాన్న ఏ కేసు పరిష్కారం లో నిమగ్నమై ఉన్నారో, ఏమో!
    "తిండి తినక ఏమిటే అలా ఆలోచిస్తావు?"
    "నీకు చెప్పాలనుకుంటూనే మరిచి పోయానే,  అమ్మా! నాన్న ఓ గంటకిందట జట్కాతో వెళ్తూ స్కూలు దగ్గర నాకు కనిపించారు."
    "ఏమిటీ? జట్కా లో వెళ్తూనా?"
    "నేను డబ్బులడగటానికి దగ్గరికి పరుగెత్తుకు వెళ్ళాను. ఊరేళ్తున్నానని నీకు చెప్పమన్నారే!"
    "నిజంగానే!" కామేశ్వరమ్మ ముఖం వికసించింది.
    "నిజంగానే , అమ్మా! నేను చెప్పటం మరిచేపోయానే!"
    "పోనీలే, తల్లీ! బతికించావు. సాయంత్రం వరకూ ఎదురు తెన్నులు చూసి కళ్ళు తిరిగి పడి చచ్చేదాన్ని" అంటూ లేచి, గబగబా కంచం పెట్టుకుని నిండుగా అన్నం, కూరలూ , నేతిగిన్నే పెరుగు తపాలా-- అన్నీ చేరవేసుకు కూర్చుంది.
    పద్మజ వస్తున్న నవ్వు ఆపుకుంటూ, "పప్పు మరి కాస్త వడ్డించుకో , అమ్మా! చాలా బాగుంది" అంది.
    జవాబు కూడా చెప్పకుండా ఆవురావురు మంటూ తినటం ప్రారంభించింది కామేశ్వరమ్మ. నాన్నగారు సరిగ్గా ఎప్పుడు కన్పించారో, ఏ ఊరు వెళ్తానన్నారో , ఎటువంటి జట్కా లో ప్రయాణం చేస్తున్నారో, మళ్ళీ ఎప్పుడు వస్తా నన్నారో-- ఇత్యాదు లన్నీ వివరాలతో సహా చేబుతూ కూర్చుంది పద్మజ.
    కామేశ్వరమ్మ పెరుగు వంపుకుని జుర్రుతుంటే వీధి గుమ్మం లో పిలుపు వినిపించింది!" కాముడూ!"
    తుళ్ళి పడింది. కా....ము,,,,డు.
    చెంగున లేచి వీధిలోకి పరిగెత్తింది పద్మజ.
    ఈశ్వర సోమయాజి లోపలికి వస్తూ, తన కన్నా ముందు భార్య భోజనం చేస్తున్న సంఘటన చూసి కాస్త విసుపోయినా, తమాయించుకున్నాడు. "మంచిపని చేశావే, కాముడూ! నువ్వు కనిపెట్టుకు కూర్చుంటావని కంగారు పడుతూ వచ్చాను."
    సిగ్గుతో చితికి పోయింది కామేశ్వరమ్మ. నోరు పెగల్చుకుని అడిగింది. "మీరు....ఊరు వెళ్ళలేదుటండీ?"
    "నీకు ఆకలి వేస్తె తిండి తినద్దని నేనన్నానా? నన్నే ఊరు పోమ్మంటావు?"
    "జట్కా లో వెళ్తూ.... పద్మకి కనిపించి చెప్పారని...."
    ఫెళ్ళుమంటూ నవ్వాడు, సోమయాజి. 'అయితే ఇది పద్మ చేసిన పనన్న మాట! పోనీలే ఇప్పుడెం మించిపోయింది? రోజూ నా ఎంగిలి కంచంలో నువ్వు తినటం లేదూ? ఈ పూట నీ ఎంగిలి కంచంలో నాకు వడ్డించు."    
    కామేశ్వరమ్మ కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. "పాపిష్టిదాన్ని! ఆకలి గొట్టుదాన్ని! చస్తానో ఏమిటో అనుకుని కంచేడు కూడూ మింగి కూర్చున్నాను. నా తిండి మాసిపోనూ! నా కడుపు విచ్చిపోనూ!" అని తిట్టి పోసుకుంటూ కూర్చుంది.
    "ఆ రామాయణమంతా తర్వాత, ముందు నాకు వడ్డించు. సోమయాజి నూతి దగ్గర కాళ్ళు కడుక్కుని సంధ్య వార్చుకోవటానికి కూర్చున్నాడు.
    తండ్రి భోజనం చేస్తుంటే పిల్ల పిల్లలా దగ్గర చేరింది పద్మజ. తల్లి ఫెళఫెళా తిడుతుంటే పకపకా నవ్వుతూ కూర్చుంది. "చూడు నాన్నా! ఇంతసేపు అన్నం తినకుండా ఉంటె జబ్బు చెయ్యదు? అమ్మ తినకుండా కూర్చుంటే నాకు మాత్రం అన్నం ఎలా సహిస్తుంది? నేనలా అబద్ధం ఆడితే తప్పా ఏమిటి?"
    "ఏమీ తప్పులేదమ్మా! మంచి పని చేశావు."
    "ఏమిటా మంచిపని? ఇన్నేళ్ళ కి నా నియమం నాశనం చేసింది. తలుచుకొంటుంటే నా కడుపంతా దేవుతోంది" అంటూ గోల పెట్టింది  కామేశ్వరమ్మ.
    "ఆడవాళ్ళు తినకుండా కూర్చుంటే మగవాళ్ళు వేళపట్టుకు ఇంటికి వస్తారనే ఈ నియమం పెట్టారు నాన్నా! అంతే కదూ?"
    చిరునవ్వు నవ్వాడు సోమయాజి. "అఖండు రాలివమ్మా నువ్వు! నీ ఆలోచనలన్నీ చిత్రంగానే సాగుతోంటాయి."
    'అమ్మ మీద నీకు అంత ప్రేమే ఉంటె వేళకి భోజనం చేసి ఆరోగ్యం కాపాడుకోమని చెప్పరాదూ? ఎప్పుడూ పడితే అప్పుడు ఆహారం తీసుకోకూడదని మా సైన్సు మాష్టారు చెప్పారు."
    విస్మయంగా చూశాడు సోమయాజి. పద్మజ కన్నా తనెంత మూర్కుడు! నీరసాలతో , అనారోగ్యాలతో సతమత మవుతున్న భార్య విషయంలో కనీసపు బాధ్యత గానీ, సానుభూతి గానీ ప్రకటించలేక పోయాడేన్నడూ , తను తిని విడిచిన ఎంగిలి కంచం లో వడ్డించుకుంటున్న భార్యను మహా పతివ్రతగా తలుచుకుని గర్వపడ్డాడు. పవిత్ర బ్రాహ్మణ జాతికీ, పరువు ప్రతిష్టలతో అలరారే తమ కుటుంబానికీ, తన భార్య మణిపూసలా మెరిసి పోవాలని దురాశ పడ్డాడు . ఇంతకాలం ఒక్క సారి కూడా భార్య కష్ట సుఖాలు.....
    "నాన్నా! నీకూ కోపం వచ్చిందా?" పద్మజ చిన్న బుచ్చుకోంది. సోమయాజి కూతురిని సముదాయించాడు. "లేదమ్మా! లేదు. నీ మాటలే ఆలోచిస్తున్నాను. ఆ-- చూడు, కాముడూ! రేపటి నుంచి నీ తిండికి , నా తిండికి ఏమీ లంకె ఉండకూడదు. ఎవరి ఆకలి వారిదే! వేళ పట్టున నువ్వు భోజనం చేస్తూ ఉండాలి. నేను ఇంట్లో ఉన్న వాడైనా నా ఎంగిలి కంచంలో నువ్వు వడ్డించుకోకూడదు. తెలిసిందా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS