"ఇటురా, రామూ!" సాయంత్రం అందరూ ఉండగా హాల్లోకి పిలిచాడు వేణుగోపాల్.
భయంభయంగా పిల్లలిద్దరూ హాల్లోకి వచ్చారు. "పిల్లని ఆడించడం తప్ప చదవ నవసరం లేదనుకొంటున్నారా?" వేణుగోపాల్ స్వరం అతనికే కొత్తగా వినిపిస్తూంది.
బిక్కమొహాలతో ఒకళ్ళ నొకళ్ళు చూసుకొన్నారు.
రాధ కలగజేసుకుంది. "మా ఇంట్లో దాన్ని ఎత్తుకోవడానికి 'స్పెషల్'గా ఓ నౌకరున్నా డన్నయ్యా." ఎంతమాత్రం తొట్రుపడలేదు. నిర్భయంగా అంది.
వేణుగోపాల్ అర్ధం చేసుకొన్నాడు. "పోనీ, వచ్చేటప్పుడు ఆ నౌకర్ని కూడా వెంటబెట్టుకు రాకూడదా, రాధా! మా ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకొంటాం. నౌకర్లని స్పెషల్ గా ఉంచుకోవడం మాకు అలవాటు లేదు."
విష్ణును రెండుచేతుల్లోకి తీసుకొనిరుసరుసలాడుతూ, "తేరగా తిండి పెడుతున్నావు కదా! ఆ కాస్త పనీ చెబితే ఏం అనుకొన్నాను" అంది.
"రాధా!" వేణుగోపాల్ గర్జించాడు. "వాళ్ళకి ఆ భేదాలు తెలియవు. అనవసరంగా చిన్న పిల్లల మనసులో విషం పోయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళిద్దరూ భారతికి అక్క పిల్లలు. వాళ్ళని నే నెప్పుడూ నౌకర్లని అనుకోలేదు." రాధ నవ్వును అభినయించింది. "నువ్వు పెంచుకొంటానని మాత్రంగా అంటే నేను తెచ్చి ఇచ్చేదాన్ని కాదన్నయ్యా! పోనీ, వదిన అంతగా పట్టుపడితే నేను నచ్చచెప్పేదాన్ని. ఏమి టన్నయ్యా? అందమా, ధనమా, ఆకారమా?"
"రాధా!" తీక్షణంగా మారిపోయింది వేణుగోపాల్ స్వరం.
"నిజం మాట్లాడితే నిష్ఠూరాలే. నీకు ఉన్న లక్ష రూపాయల ఆస్తికోసం కాచుక్కూర్చోలేదు నేను. ఈ బికారి వెధవలు నిన్ను పున్నామ నరకం నుంచి తప్పిస్తారని నేను అనుకోను." రధ గొంతులో మాటలు ఆగిపోయాయి. వేణుగోపాల్ చూపులు నిప్పులు కురిపిస్తున్నాయి. ఒక్కొక్క చూపు బాణంలా హృదయం లోకి సూటిగా గుచ్చుకుపోతూంది.
"రాధా! చెల్లెలిననే మమకారంతో నిన్ను ఏమీ అనలేక పోతున్నాను. వదిన వింటే ఎంత బాధపడుతుందో ఆలోచించావా?"
"ఎందుకు ఆలోచించాలీ? తనకి పిల్లలు పుట్ట్రరనీ గొడ్రాలనీ బాగా తెలిసే ఈ పని చేసింది. నీ ఆస్తికి అక్క పిల్లల్ని వారసులు చెయ్యాలని..."
"మన మధ్య బంధం విడరానిది. ఆ బంధాన్ని తెంపుకోవాలని ప్రయత్నిస్తే మంచిదే. పిల్లలన్న తరవాత అందరూ ఒకటే. పసిపిల్లల మీద మన ప్రయోగాలు అంత బాగుండవు. అన్నయ్య కొడుకులుగా వారి కిచ్చే గౌరవాన్ని ఇవ్వకపోయినా పసిపిల్లలనే భావాన్ని నీ హృదయం గ్రహించలేకపోతుందని విచారంగా ఉంది."
"అంటే?"
"ఇక వాళ్ళ గొడవ ఎత్తవద్దు. నా ఇష్టం. నా పిల్లలు. ఎవరికీ వాళ్ళమీద హక్కులేదు." కోర్టులో కన్నా ఎక్కువగా వాదించి గెలిచాడు వేణుగోపాల్.
కంట తడితో వద్నగారు బ్రతిమిలాడుతున్నా నిర్లక్ష్యంగా బంధాలన్నీ తెంచుకొని వెనుతిరిగింది రాధ.
"నాన్నగారూ, అత్త వెళ్ళిపోయిందేం?" పెద్ద వాడు వేణుగోపాల్ని సూటిగా అడిగాడు.
"అన్నయ్యా, నాన్నగారు అత్తని తిట్టారట. అత్త కోసంవచ్చి వెళ్ళిపోయింది." రాము పక్కనే నిలబడి విడమరచి చెప్పసాగాడు రవి.
మాట మార్పిస్తూ భారతి పిల్లల్ని టిఫిన్ పేరుతో లోపలికి తీసుకు వెళ్ళిపోయింది.
"అమ్మా, ఇవాళ అన్నం పెట్టమ్మా!" డైనింగ్ టేబిల్ మీద కూర్చుంటూ అడిగాడు రాము.
"నా క్కూడానమ్మా!"
భారతి పరీక్షగా చూసింది. ఇద్దరూ తల్లివైపే కన్నార్పకుండా చూస్తున్నారు.
"ఎటూ కానివేళ తింటే ఆరోగ్యం పాడౌతుంది. నాన్న తిడతారు. ఇప్పుడు ఫలహారం చెయ్యండి." భారతి పిల్లల్ని బుజ్జగించాలని ప్రయత్నంలో ఉండిపోయింది.
"ఆకలేస్తూందమ్మా!" రాము కంఠం ఆగిపోయింది.
పిల్లల్ని ఉసికొల్పాలంటే భారతికి ఒక విధమైన భయం. ఎదురు తిరిగి తను కట్టుకున్న ఆశాసౌధాల్ని కూల్చేస్తే-
భోజనాలు పూర్తిచేసి ఆటల్లో పడిపోయారు.
* * *
వేణుగోపాల్ మేడ నానుకొని రెండిళ్ళ అవతల సూపరింటెండెంటుగారి ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ముద్దుల గుమ్మ జయలక్ష్మిని భారతి చిన్నప్పటినుంచి చేరదీసింది. భారతి అక్క పోయినప్పుడు వెళ్ళిన తరవాత కొన్నాళ్ళకే జయలక్ష్మీ వాళ్ళూ కూడా వెళ్ళారు. అటు తరవాత చాలా రోజులకు కానీ రాలేదు. ఈ మధ్య భారతీ వేణుగోపాలే కాక అందమైన మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారనగానే జయలక్ష్మి చూడాలనే కుతూహలాన్ని చంపలేకపోయింది. ఎప్పుడు తెల్లవారుతుందా? ఎప్పుడెప్పుడు ఆ బంగళాలో ఉన్న ఇద్దరు పిల్లలతో పరిచయం చేసుకొందామా? అని ఒకవిధంగా రాత్రంతా కలలు కంటూ ఊహాగానంతో జాగారం చేసిందనే చెప్పాలి.
తూరుపు రేఖలు పూర్తిగా తెల్లబడినాయో లేదో చెంగున పరిగెత్తుతూ వచ్చింది. "అత్తయ్యా" అంటూ.
పిలుపు విని పెరట్లో చెట్లకు నీళ్ళు పోస్తున్న భారతి తలఎత్తి చూసి జయలక్ష్మిని కళ్ళతోనే ఆహ్వానించింది.
చెట్లకు చెంబుతో నీళ్ళు పోయడం భారతిని చూసి జయలక్ష్మి మూడో ఏటే నేర్చుకుంది.
నీళ్ళు పోస్తున్నదల్లా చటుక్కున ఆగి భారతి కొంగు పట్టుకుని లాగింది.
"ఏమిటి, జయా?" వెనుదిరిగి చూసింది బారతి.
మేడమీద అటుపక్క గదిలోంచి రామూ, రవీ కిటికీగుండా చూడటం జయలక్ష్మి కళ్ళు ఎప్పుడో పసిగట్టాయి. అసలు జయలక్ష్మి మనసూ, శరీరమూ ఏకమై కొత్త నేస్తాలకోసం ఎదురుచూస్తూనే ఉంది.
వేలెత్తి చూపిస్తూ, "వాళ్ళెవరత్తా?" అని అడిగింది.
భారతికూడా అటువైపు తిరిగి చూసి "మా అబ్బాయిలు" అన్నది.
"ఇన్నాళ్ళు మరి లేరుగా?" జయలక్ష్మి సమస్య పరిష్కారం కాలేదు.
"ఊరినుంచి తీసుకువచ్చాను. నువ్వు ఆడుకొంటావా?"
"ఓ!"
కాఫీ తాగుతూ "మామయ్యా, మీ అబ్బాయిలు నాతో ఆడుకొంటారా?" అని ఇద్దరి వైపూ చూసింది జయ.
రాము కొద్దిగా సిగ్గుపడ్డాడు. రవి స్నేహపూర్వకంగా చూస్తూ నవ్వాడు.
"మామయ్యా, మీ అబ్బాయికి ఆడపిల్లమల్లే సిగ్గు!"
రెండు జడలూ పట్టుకొని మెల్లగా లాగి వదిలింది భారతి. "సిగ్గు లేకపోతే ఎలాగే! నీలాగే తయారవాలి."
జయ మాట్లాడలేదు. ఏమిటేమిటో ఆలోచిస్త్జూనే ఉంది.
"వెళ్ళి ఆడుకోండిరా." వేణుగోపాల్ అనుమతి ఇవ్వడంతో ముగ్గురూ కదిలివెళ్ళి తోటవైపు పరిగెత్తారు.
జయలక్ష్మే అధికంగా మాట్లాడేస్తూ ఇద్దర్నీ తనవైపు తిప్పుకొంది.
* * *
రోజూ సాయంత్రం కాగానే ఇంటికి రావడం, తోటవైపు పరిగెత్తడం మామూలు అయిపోయింది. సూపరింటెండెంట్ గారికి ఒకతే కూతురు కావడం వల్ల అతి గారాబంతో జయలక్ష్మిని నెత్తిని కూర్చోపెట్టుకొన్నారు. జయలక్ష్మికి ఆ ఇంట్లో తిరుగులేదు. జయలక్ష్మి తల్లికీ, భారతికీ ఉన్న స్నేహం వల్ల రాకపోకలు బాగానే ఉన్నాయి. "భారతీ, నీ పిల్లలు వచ్చాక బొత్తిగా అమ్మాయి ఇంట్లో క్షణం ఉండటం లేదు." రమాదేవి ఫిర్యాదు చేసింది.
"పిల్లలు కూడా జయలేనిదే క్షణం ఉండలేరు, రమా. రాత్రి నిద్రలో కూడా అదే కలవరిస్తూంటారు" అంటూ నవ్వింది భారతి.
వేణుగోపాల్ కోర్టునుంచి రాగానే ఇద్దరూ చీలిపోయారు. తండ్రితోబాటు పిల్లలూ జయా కూడా టిఫిన్ పూర్తిచేసి బీచ్ వైపో, పార్ధసారథికోవెలవైపో వెడుతూ ఉంటారు ప్రతిసాయంత్రం వేణుగోపాల్ కూ బారతికీ ఇప్పుడు ఆలోచించుకొనే శక్తి లేదు. అసలా అవకాశం కూడా లేకుండా పిల్లలే ఇల్లంతా కలియ తిరుగుతూ ఉంటే భారతికి కావలసినంత మనశ్శాంతి.
