Previous Page Next Page 
మరుపులో మెరుపులు పేజి 3

 

                                     5    

    "రేపు మీరొకసారి ఆఫీసుకు రావాలి." అన్నాడు ప్రభాకర్ కుసుమతో. సంతకం చేసిన వుత్తరాలు తిరిగి యిచ్చేస్తూ.
    మౌనంగా తలఎత్తి చూచింది.
    "నాకు ఆదివారం ఎవరినీ ఆఫీసుకు రమ్మనమనడం యిష్టం లేదు. అందులో అమ్మాయిలను. కాని రేపు తప్పదు, అవసరంగా యీ వుత్తరాలు పూర్తీ చేసి ఎల్లుండి వుదయం పంపేయాలి." అన్నాడు తిరిగి.
    "మీరుండేది యిక్కడకు దగ్గరేనా-- లేకపోతె కారు పంపిస్తాను. బస్సులు అవి వుండవేమో?"
    "అవసరం లేదు. నేనుండేది దగ్గరే!"
    "సరే నీ యిష్టం తొమ్మిదింటి కల్లా వచ్చేయండి." తలూగించి బయటకు వెళ్ళిపోయింది కుసుమ.
    మర్నాడు పొద్దున్నే మంచం మీంచి లేవకుండానే , బద్దకంగా కిటికీ లోంచి బయటకు చూస్తూ పడుకుంది. ఎనిమిది గంటలయినా వెలుగే రాకుండా కప్పేసింది మబ్బు. మబ్బుగా వున్న రోజంటే మహా చిరాకుగా వుంటుంది కుసుమకు. మలమల మాడ్చే ఎండయినా భరించ గలదు గాని, వెలుగు వెలుతురూ ఏమీ లేకుండా కురిసే వానను చూస్తె తగని విసుగేస్తుంది. ఆ మబ్బులు తన్ని మింగేస్తాయేమో అన్నట్లు, వాటితో వచ్చే వానకు ప్రపంచమంతా మునిగిపోతున్నట్లు అనిపిస్తుంది.
    పొద్దున్నే చిరాకు పడుతూ లేస్తే రోజంతా చిరాగ్గా నే వుంటుంది అనుకుంటూంటే -- అంతలోనే ఆరోజు తను ఆఫీసు కు వెళ్ళాలన్న సంగతి గుర్తుకు వచ్చి గబగబా మంచం మీంచి లేచి కూర్చుంది.
    "ఇవాళే రావాలీ ఈ వాన, అతను అవసరంగా రమ్మనమన్నాడు కాబట్టి గాని, లేకపోతె చస్తే ఈ గదిలోంచి కదిలేదాన్ని కాదు" విసుక్కుంటూనే ఆఫీసు చేరింది.
    అప్పటికే ఎంతసేపయిందో వచ్చి తల వంచుకుని ఏదో రాసుకుంటున్నాడు ప్రభాకర్.
    "వచ్చారా? ఇదిగో చూడండి. ఇవి ముందుగా టైప్ చేసేస్తే నేను మళ్ళీ డిక్టేట్ చేస్తాను." అన్నాడు చేతికి రాసి వున్న కాగితాలు అందిస్తూ.
    కాగితాలు అందుకుని మెల్లిగా గది బయటకు వెళ్ళబోయింది.
    "ఆ టైప్ రైటర్ వాడుకోండి ఫరవాలేదు." అన్నాడు. అతనిచ్చిన కాగితాలు టైపు చేస్తూ మధ్య మధ్య అతని వంక చూడకుండా వుండలేక పోయింది కుసుమ. చుట్టూ వున్న దానితో తనకేం సంబంధం లేనట్లు, టకటక మనే టైపు చప్పుడు కూడా గమనించకుండా గబగబా రాసుకు పోతున్నాడు.
    "టక్....టక్...టక్ " తలుపు మీద ఎవరో కొట్టినట్లవంగానే వులిక్కి పడి తల ఎత్తింది కుసుమ. టైపు రైటర్ మీద వున్న వేళ్ళు బిగుసుకు పోయాయి.
    "కాఫీ పంపమని హోటల్ కు ఫోన్ చేశాను. హోటల్ బోయ్ అయి వుంటాడు. చూడండి." అన్నాడు ప్రభాకర్ తలఎత్తి.
    తన మాటలే వినిపించుకోనట్లు- కొయ్యబారి నుంచున్న కుసుమ వైపు ఆశ్చర్యంగాచూచి తలుపు తీసి కాఫీ అందుకుని డబ్బిచ్చి పంపేశాడు.
    "అలా వున్నారేం? కాఫీ తీసుకోండి"అన్నాడు ఓ కప్పు అందిస్తూ.
    ఒక్క క్షణం అతని వంక వెర్రిగా చూచింది. ఆ వ్యక్తిని గదిలో ప్రప్రధమంగా చూస్తున్నట్టు. అంతలోనే సర్దుకుని "థాంక్స్" అంటూ కాఫీ అందుకుని కొద్దిగా తాగి మెల్లిగా నిట్టూర్చింది.
    ఆమె వంక ఆశ్చర్యంగా, నిశితంగా చూస్తూ నిశ్శబ్దంగా తన కుర్చీ దగ్గరకు వెళ్ళాడు. బయట గాలి ఎక్కువవుతున్నట్టు చెట్ల చప్పుడు వినిపించ సాగింది. వాన మొదలవుతుంది కాబోలు టప్ టప్ మని చినుకుల శబ్దం వినిపిస్తోంది. గాలికి కొట్టుకుంటూ వూగుతున్న కిటికీ తలుపులు చప్పుడు చేయసాగాయి. పరిసరాలు గమనించి ఒక్కసారి తలఎత్తి చూట్టూ చూశాడు. కిటికీలు మూద్డామనుకుని కుర్చీ లోంచి లేస్తూ కుసుమ వైపు చూశాడు. కళ్ళు రెండూ పెద్దవిగా వెడల్పుగా చేసుకొని రెప్పయినా వాల్చకుండా కిటికీ లోంచి బయటకు చూస్తోంది. మొహమంతా ఎర్రగా కందిపోయింది. ముడుచుకున్న పెదిమలు మెల్లిగా అదురుతున్నాయి.
    మూడు నెలల నుంచి రోజూ చూస్తూ వున్నా ఆరోజు ఎందుకో కుసుమ చాలా కొత్తగా వున్నట్లనిపించింది ప్రభాకర్ కు. ఆమెను గురించి ఏమనుకోవాలో అర్ధంగాక కిటికీ వైపు నడిచాడు. తలుపులు మూసేందుకు.
    ఎక్కడో పిడుగు పడింది.
    వురుములు , భూమి దద్దరిల్లేలా వినవచ్చాయి.
    కుసుమ కెవ్వుమంది. ఆమె కేకతో గదంతా మారు మోగిపోయింది.
    "కుసుమా?' ఆత్రుతగా అంటూ ఆమె వైపు ఒక్క అంగలో వెళ్ళాడు. అప్పటికే గోడ వైపు తిరిగి రెండు చేతులు గోడ మీద వుంచి గజగజా వణికి పోతోంది. ఆమె వెనక వేపు భుజాలు రెండు చేతుల్తో పట్టుకుని బలంగా తన వైపు తిప్పుకుని దగ్గరకు తీసుకున్నాడు. ఆమె అరచేతుల్తో అతని గుండెల దగ్గర షర్టు గట్టిగా పట్టుకుంది.
    "కుసుమా?.... ఏమయింది.....మామూలు వానకే.....అడుగుతున్న అతని మాటలు ఒక్కటే ఆమె మనసుకు చేరలేదు.
    గాలి విసురుకు తలుపులు టపటపా కొట్టుకోసాగాయి. టేబుల్ మీద వున్న కాగితాలు గదంతా ఎగరసాగాయి. ఒక్క క్షణం వురుముతో కలిసిన మెరుపు గదంతా వెలుతురు నింపి చీకటయిపోయింది. అంతలోనే ధన్ మని ఏదో క్రింద పడి పగిలిన చప్పుడయింది.
    ప్రభాకర్ భుజాల మీద తలానించుకుని కిటికీ వైపు చూస్తూ వున్న కుసుమ మళ్ళీ కెవ్వుమంది. అతని గుండెల్లో ముఖం దాచుకుని వణికి పోసాగింది. చల్లని గాలి వీస్తున్న ఆ గదిలో కూడా ఆమె వళ్ళంతా చమట తో తడిసిపోయింది. ఏమయిందా అని వెనక్కి తిరిగి చూశాడు. కిటికీ తలుపు తగిలి క్రిందపడి వొలికిన ఎర్ర సిరా కారిన రక్తంలా అసహ్యంగా కనిపిస్తోంది.
    పసిపాపలా తనలో అతుక్కు పోయిన ఆమెను చూస్తూ ఏం చెయ్యాలో తోచని ప్రభాకర్ ఆప్యాయంగా హృదయానికి హత్తుకుని, ఆమె జుట్టు మీద చెయ్యి వేసి నిమరసాగాడు. అతనికి తెలియకుండానే అతని పెదిమలు ఆమె నుదుటిని మృదువుగా స్ప్రుశించసాగాయి.
    తన చేతుల మధ్య మంచు ముద్దలా బిగుసుకుని పోయి నిస్సహాయంగా నిల్చున్న కుసుమను చూస్తుంటే మనసులో రకరకాల భావాలు చెదురుమదురుగా తిరగసాగాయి. "ఏమయి వుంటుంది?ఎందుకంత భయం, వురుములకు, మెరుపులకు భయపడెంత సున్నితమా యీమె మనసు? అతని హృదయం తరచి, తరచి చూడబోయింది. అంతం లేని ఆలోచనలు తప్ప, సమాధానం దొరకని ప్రశ్నలు ప్రశ్నలుగానే వుండి పోయాయి.
    చేతుల్లోవున్న కుసుమ కొద్దిగా కదులుతున్నట్లనిపించి , ఆమె ముఖంలోకి చూశాడు. మూసుకుని వున్న కళ్ళలోంచి నీటి చుక్కలు ఒకటొకటి గా రాలి బుగ్గల మీంచి జారిపోతున్నాయి. మెల్లిగా ఆమె వెన్ను వెనక వున్న తన చేతులు తీసి భుజాలు పట్టుకుని నడిపించి తీసుకు వెళ్లి కుర్చీలో కూర్చోపెట్టాడు.
    గాలికి కొట్టుకుంటున్న తలుపులన్నీ వేసి, గ్లాసుతో మంచి నీళ్ళు తెచ్చి కుసుమ చేత తాగించాడు. గ్లాసు మీద వున్న దృష్టి మెల్లిగా ప్రభాకర్ మీదకు సారించింది. అమెవంకే చూస్తున్న ప్రభాకర్ ఆమె చూపుల్లో చూపు కలిపి మృదువుగా నవ్వాడు. ఎర్రగా కందిపోయి బరువెక్కిన కళ్ళు వెంటనే దించుకుంది.
    "యింటికి వెడతారా?"
    తల వూగించింది వెళ్ళనన్నట్లు.
    మూసిన కిటికీ లోంచి పడుతున్న వాన చప్పుడు వినపడుతూనే వుంది. అది వింటూ తనడిగినది ఎంత తెలివి తక్కువ ప్రశ్నో అనుకున్నాడు.
    "ఆ పక్క గదిలో పడక కుర్చీ వుంది, వెళ్ళి కాసేపు పడుకోండి."
    "వద్దు యిక్కడ బాగానే వుంది. థాంక్స్" అంది తల వంచుకునే.
    ఆమెతో మరేమీ మాట్లాడేందుకు మనసంగీరించలేదు, కొంతసేపు అలాగే ఆమె దగ్గరగా కూర్చుని , లేచి తన టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా కూర్చుని పెన్ను కాగితాలు ముందుకు లాక్కున్నాడు. ఏదో రాయడానికి ప్రయత్నించి విసుగ్గా పెన్ను టేబుల్ మీద పడేసి లేచి నుంచున్నాడు. జేబులో చేతులుంచుకుని అటూ యిటూ పచార్లు చేయసాగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS