Previous Page Next Page 
సాఫల్యం -1 పేజి 3


    బీకామ్ ఆనర్స్ పరీక్షలు రాశాను. యాంత్రికంగా ఇంటికి చేరాను. ఆ వేసంగుల్లో నే నా పెళ్లి ప్రయత్నాలు విపరీతంగా ప్రారంభమయ్యాయి. అమ్మతో నా కోర్కె చెప్పాను. అమ్మ కంట తడి పెట్టుకుంది. "అనుకున్నంతా అయ్యింది రా. ఇది ఇంతతో తేలదు. ఎలా" అంది.
    "ఎలాగేవిటమ్మా. నాన్నగారితో చెప్తే సరి. లేకపోతె నే చెప్పనా" అన్నాను మొండి ధైర్యంతో.
    "నువ్వొద్దు నేనే చెప్తాను" అంది అమ్మ.
    ఆ రాత్రి చెప్పింది.
    తెల్లవార్లూ పరిణామం ఎలా ఉంటుందో నని నేను భయపడుతూనే ఉన్నాను. తెల్లవారింది. కాఫీలయ్యాక నాన్నగారి వద్ద నుంచి కబురు వచ్చింది. రూముకు వెళ్లాను.
    "కూర్చో" అన్నారు.
    కూర్చున్నాను. ప్రారంభించారు.
    "నీ నిర్ణయం నాకు చాలా ఆనందం కలుగ జేసింది. పదహారేళ్ళు దాటిన కొడుకును స్నేహితుడిలా చూడాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే నా నిర్ణయం నాది ఎవరిది ఎవరూ మార్చుకొనవసరం లేదు. ఇవిగో ఈ ఆరువందలూ తీసుకో. ఒక గంట వ్యవధి ఇస్తున్నాను. నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళొచ్చు. ఇక నా కొడుకుగా నువ్వు బాధపడ నవసరం లేదు. మా కోర్కెలకు వప్పుకుని ఉంటె ఉండు. లేకపోతె వెళ్ళిపో. మహారాజు లాగా వెళ్ళు" అన్నారు.
    నాలో రక్తం వేడెక్కింది.
    టేబులు మీద డబ్బు తీసుకుని, వెంటనే బయటకు వచ్చేశాను. అమ్మ వారించ పొతే, నాన్నగారు బయటికి వచ్చి, "వాడితో వెళ్ళాలను కుంటే వాడితో వెళ్ళు. నీకు అభ్యంతరం చెప్పను. ఇక్కడ ఉండాలంటే వాడితో ఒక్క అక్షరం కూడా మాట్లాడ కూడదు." అన్నారు శాసనం చదివినట్టు.
    అమ్మ మౌనంగా కన్నీరు వత్తుకుంది.
    నాకు కోపం పెట్రేగి పోయింది. నా బట్టలు ఒక పెట్టిలో సర్ది బెడ్డింగ్ చుట్టి, అవి రెండూ పాలేరు నెత్తి మీద పెట్టి, అరగంట లో బస్టాండు కు చేరాను. వెంటనే బెజవాడ వెళ్ళే కారెక్కి బెజవాడ వెళ్లి, స్టేషను లో కూర్చున్నాను. నాన్నగారి మీద ఏదో కసి పుట్టింది నాలో. నాలోని అహంకారం దెబ్బతింది. హైదరాబాదు బండెక్కి హైదరాబాద్ చేరాను. తిన్నగా హోటల్లో రూము తీసుకుని, స్నానం చేసి, చక్కగా ముస్తాబయి మామయ్య ఆఫీసుకు వెళ్లి, ఫ్యూను చేతిలో ఒక రూపాయి పెట్టి మామయ్య ఎడ్రసడిగి అతనింటికి చేరాను.
    గడప లోనే రమ ఎదురయ్యింది.
    నా తనువూ పులకరించింది.
    "ఒహూ! రా బావా! ఇదేనా రావడం" అంది.
    నేను కొయ్యబారి పోయాను.
    రమ నన్ను "బావా' అని ఎప్పుడూ సంభిదించ లేదు. అందులో విశాఖ పట్టణం లో ఉండగా "మీరు' అని సంబోధించేదల్లా ఒక్కసారి ఉన్నట్టుండి "బావ నువ్వు' అనేసరికి ఏదోలా అనిపించింది.
    'అలా నిలబడి పోయావెం? అమ్మ అలా బజారు వెళ్ళింది. కూర్చో" అంది. యాంత్రికంగా కూర్చున్నాను.
    "ఏం? ఏదైనా పని మీద వచ్చానా? లేక వూర్కునే వచ్చావా? లేక లా చదువుదామని వచ్చావా" అంది.
    "పని మీదే వచ్చాను. నీతో మాట్లాడాలి." అన్నాను. నా గుండె దడదడ లాడింది. రమ కళ్ళు విప్పార్చి నాకేసి చూసి, "చూశావా? నే మర్చిపోయాను నిన్ను చూసిన ఆనందంలో.అసలు నీతో నాకు పని వచ్చింది. మీ వూరుకే ధైర్యం చేసి ఉత్తరం రాద్దామా అని ఆలోచిస్తున్నాను. అంతలోనే నువ్వు వచ్చావు. ఆ అన్నట్టు నీకు పనన్నావు? ఏమిటి? అయితే ఒక పని చేయి. సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్ కి రా. అయిదున్నర కి వచ్చి అక్కడ క్యాంటీను దగ్గర ఉండు. నేను వచ్చేస్తాను." అంది. నేను అలాగే అనబోయి, గొంతు పెగలక తల వూపాను.
    ఇంతలో అత్తయ్య వచ్చింది. వస్తూనే నన్ను చూసి పరమానంద పడింది. కుశల ప్రశ్నలు వేసి, "ఏమే బావకి కాఫీ ఐనా ఇచ్చావా" అంది.
    "లేదమ్మా. తాగేవచ్చుంటాడనుకున్నాను" అంది రమ నాకేసి చూస్తూ. 'ఛ వూర్కో . వెధవ కూతలూ నువ్వూ" అంటూ అత్తయ్య లోపలకు వెళ్లి పోయింది. నేను తలఎత్తి రమకేసి చూశాను.
    రమలో మార్పు చాలా ఎక్కువగా ఉంది.
    బుట్ట లోలక్కులు తీసేసి, చెవులకు రింగులు పెట్టుకుంది. రెండు జడలు వేసుకుంది.  గోళ్ళు కత్తిరింఛి రంగు వేసుకుంది. అలంకరణ లోనూ, మాట తీరులోనూ ఇదివరకు రమకు, ఇప్పటి రమకు పోలిక లేదు. లేనేలేదు.
    నిట్టుర్చాను.
    అత్తయ్య కాఫీ ఇచ్చింది. తాగి, రూముకు చేరాను. నా మనస్సులో ఏదో ఆందోళన బయల్దేరింది. తమ ప్రవర్తన నన్ను నిరుత్సాహ పరచింది. నన్ను చూసి చూడడంతో సిగ్గు పడుతుందనుకున్నాను. నేల చూపులు చూస్తూ "మీరు" అని మెత్తగా మాట్లాడు తుందనుకున్నాను. పైట కొంగు వెలికి చుట్టుకుంటూ కళ్ళ చివరల నుంచి నన్ను చూస్తుందనుకున్నాను. బుట్ట లోలక్కులు వూగేలా సున్నితంగా నవ్వుతుందనుకున్నాను. నా హృదయ వీణను మీటుతుందనుకున్నాను.
    అంతా వూహ గానమే అయ్యింది.
    మనస్సంతా పొడిగా అయ్యింది.
    ఆలోచన తెమిలే లోగానే నిద్ర పట్టి, మెలకువ వచ్చేసింది. టైము నాలుగయ్యింది. చకచక స్నానం చేసి, మంచి బట్టలు వేసుకుని పబ్లిక్ గార్డెన్స్ లో క్యాంటిన్ ముందు చేరాను.
    నిముషాలు గంటలయ్యాయి.
    చివరకి అయిదున్నరయ్యింది.
    రమ మరో పావుగంట కి వచ్చింది. చక్కని నీలం రంగు బట్టలు వేసుకుంది. నీలం ఎంత బాగున్నా నాకు నచ్చే రంగు ఆకుపచ్చ అవడం వల్ల కాస్త నిరుత్సాహ పడ్డాను. రమ వస్తూనే "ఆలస్యం అయింది కదూ" అంది.
    "ఎబ్బే లేదు" అన్నాను.
    ఇద్దరం పచ్చటి గడ్డిలో కూర్చున్నాము.  నేను చెప్పదలుచుకున్న విషయం ఎలా ప్రారంభించాలో వూహించు కుంటూ రమ కేసి చూశాను. రమ ఎవరి కోసమో చూస్తున్నట్టనిపించింది. "ఎవరైనా వస్తారా"అన్నాను.
    "అవును" అంది. మళ్ళీ నేను మాట్లాడే లోగా "బావా నీతో అతి ముఖ్యమయిన , నా జీవితానికి సంబంధించిన విషయం మాట్లాడాలని అసలు నీకు ఉత్తరం రాద్దామను కున్నాను. అదృష్టం కొద్దీ నువ్వే వచ్చావు" అంటూ ప్రారంభించింది.
    "ఈ వూరు వచ్చ్ఘిన నాలుగు నెలలకు నాకు ఒకతనితో పరిచయం అయ్యింది. అతని పేరు జాఫర్. మనిషి చాలా మంచివాడు. మా పరిచయం అభివృద్ధి అయ్యింది. ఇద్దరం ప్రేమించుకున్నాము. రేపు జూన్ లో పెళ్లి చేసుకోవాలను కుంటున్నాము...."అని గాలి పీల్చుకోడానికి ఆగింది.
    నా క్రింద భూమి కదిలి నట్టయింది. కళ్ళు బైర్లు కమ్మాయి.
    రమ నాకేసి చూడలేదు. గడ్డిని చేత్తో తడుముతూ చెప్పుకు పోతోంది.
    "రేపు జూన్ లో ఇద్దరం బొంబాయి వెళ్లి పోతున్నాం. గిట్టని వాళ్ళు దీన్నే లేచిపోవడం అంటారను కో. ఎవళ్ళేవనుకున్నా నాకు భయపడే అలవాటు లేదు, అవసరమూ లేదు. అమ్మకి, నాన్నకి చెప్తే వాళ్ళు ఈ పెళ్ళికి ఎలాగూ ఒప్పుకోరు. వాళ్ళు వప్పుకోనందు వల్ల ఆగదు. అకాడికి వాళ్ళతో చెప్పి, రభస చేయించడం ఎందుకు? ఒక ఉత్తరం రాసి, పెట్లో లేపోతే పోస్ట్ లో వేసో వెళ్ళిపోతే సరిపోతుంది....' అసలు మనకి జ్ఞానం రాకముందే అయితే మన జీవితపు బాట మన పెద్ద వాళ్ళు వెయ్యొచ్చు. కానీ మనకి జ్ఞానం వచ్చాక, మనలో కోర్కెలు పుట్టాక, మన బాట నిర్మించుకునే శక్తి మనలోనే పుట్టాక ఆ కోర్కె, ఆశ, వూహ , వయస్సు అన్నీవచ్చాక మన బాట మనమే నిర్ణయించు కుంటే ఆనందం, తృప్తీ ఉంటాయి. ఏమంటావు?"అంటూ తలెత్తి నాకేసి చూసింది.
    నేనేమన గలను?
    "ఏం? అలా ఉన్నావెం? చేయరాని పని చేస్తున్నాననా? ఏం చెయ్యను? అన్నిటికి భగవంతుడే దిక్కు. దొంగతనం చేసేవాడు తన పని నిర్విఘ్నంగా జరగాలని దేముడికి మ్రొక్కు కుంటే ధనవంతుడు తన డబ్బు ఎవరూ దోచుకు పోకూడదని దండం పెట్టుకుంటాడు. అలాంటపుడు భగవంతుడు తనకెలా తోస్తే అలా చేస్తాడు. అంతకన్నా ఏం చేస్తాడు? ఏదైనా అంతే...ఇలా జరుగుతుందని నేను అతనితో నాకు పరిచయం అయ్యేవరకు అనుకోలేదు." అంది.
    నేను ముఖం రుమాలుతో తుడుచుకున్నాను.
    రమే మళ్ళీ ప్రారంభించింది.
    "ప్రేమ అనేది కేవలం దివ్యానుభూతి. నువ్వు విశాఖపట్టణం వచ్చిన రోజుల్లో నువ్వంటే నాకు అభిమానం, అపేక్ష ఉండేవి. అప్పటికి, ప్రేమ అనేపదానికి అన్వయం తెలియని వయస్సేమో! అమ్మా, నాన్న దోహదం ఇస్తే అది ప్రేమగా మారునేమో తెలియదు గాని నాన్నగారు నాలో అలాటి వూహలు రానిచ్చేవారు కాదు. ఎప్పుడూ నిన్ను గురించి చాలా హీనంగా మాట్లాడేవారు. నా బంగారు తల్లికి వాడేం ఖర్మ ఛ! వాడేందుకు పనికి రానివాడు, అనేవారు. నిన్ను చేతకాని వాడికింద సూచించేవారు. దాంతో నీమీద నాకు ఒక రకమైన సానుభూతి, జాలి కలిగాయి కానీ, ప్రేమ కలగలేదు. ఏదో పుస్తకం లో నీ కధ ఒకటి చదివాను. కాలేజీ మ్యాగజైన్ అనుకుంటా......అవును. మా స్నేహితులు వైజాగ్ లో చదివి ఈ ఊరొచ్చింది. వాళ్ళింట్లో చూశాను. ఆ కధలో కేవలం నన్నే రాశావు. ఆ కధ ఎన్నిసార్లు చదివానో నాకే తెలియదు. అయితే ఏం? అందుకనే పెళ్ళిళ్ళు దైవ నిర్ణయాలు అంటారు పెద్దలు" అంటూ ఆగింది.
    ఈసారి గడ్డిని వేలుతో అటూ ఇటూ వూపుతూ తలవంచుకుని కూర్చోడం నా వంతయ్యింది. ఇద్దరం అలాగే ఓ అయిదు నిముషాలు కూర్చున్నాము.  
    "ఆ! వస్తున్నాడు." అంటూ రమ లేచింది. నేను గమ్మున లేచి అటు చూశాను. ఒక సన్నటి పొడుగాటి అతను వచ్చాడు. రమ అతన్ని నాకు పరిచయం చేసి, "ఇతనే, పేరు జాఫర్" అంది. అతను రెండు చేతులు జోడించి నాకు నమస్కరించాడు. యాంత్రికంగా నేనూ నమస్కరించాను.
    "ఇతనే మా బావా" అంది రమ.
    అనక ముగ్గురం కూర్చున్నాము. మళ్ళీ రమ ప్రారంభించింది.
    "ఎవళ్ళతో నయినా ఒక్కళ్ళతో మేము ఇలా వెళ్ళిపోతున్న సంగతి చెప్పకుండా వెళితే కేవలం లేచి పోయినట్టవుతుందని నీతో చెప్పాలను కున్నాం. చెప్పి వెళితే లేచిపోనట్టు కాదని కాదనుకో----- ఏమిటో కోంత సంతృప్తి" అంది.
    నా మనస్సు మొద్దుబారిపోయింది.
    అతని కేసి చూశాను. అతను నాకేసి చూసి, సిగ్గుపడినట్టు నవ్వి, "మిమ్మల్ని గురించి రమ రోజూ చెప్తుంది. మీతో చెప్పి, మీ సలహా తీసుకునే చెయ్యాలని నిర్ణయించు కున్నాం." అన్నాడు . ఇక నా వంతు వచ్చింది.
    గొంతు సరి చేసుకున్నాను.
    "చేసే పనులు మంచి వైనా, చెడ్డ వైనా ఆత్మ ధైర్యంతో , నమ్మకంతో చేస్తే దాని వల్ల వచ్చే కష్ట నష్టాలకు మనం బాధ్యులమవుతాం. దాని వల్ల మనస్సు కి ఒక సంతృప్తి ఉంటుంది." అన్నాను. వాళ్ళిద్దరూ అవునని తలావూపారు. మళ్ళీ నేను ప్రారంభించాను.
    "మీ ఇద్దరికి ఘనమైన పార్టీ ఇస్తాను. మీ కోర్కెలు సఫలమవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటాను. రండి ఇక పోదాం' అన్నాను లేచి నిలబడుతూ. వాళ్ళూ లేచారు. ముగ్గురం దగ్గరగా ఉన్న హోటలు కు వెళ్లి ఫలహారాలు తీసుకున్నాము. అక్కడ నుంచి తిన్నగా ఒక షాపు కు వెళ్లి రెండు ఉంగరాలు కొని "మీ ఇద్దరికీ నా కానుక" అంటూ ఇద్దరికీ చేరోటీ ఇచ్చాను.
    "మీరే తోడగండి" అన్నాడతను. వెంటనే రమ తన కుడి చేయి జాపింది. నేను ఆమె కుడి చేతి మధ్య వెలికి తొడిగాను. ఆమె స్పర్శ నాలో యేవిధమైనా మార్పు తేలేదు. అతను కూడా తన కుడి చేయి ముందుకు జాపాడు. అతని వెలికి కూడా తొడిగాను. నా హృదయం ఝల్లు మంది. అతని చేతిని నా చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కుతూ, "విష్ యూ ఏ హేపీ ఫ్యూచర్" అన్నాను.
    ఆ సమయంలో యాభై ఏళ్ళ వాడినేమో అనిపించింది. నా హృదయం విచిత్రానుభూతి పొందింది.
    "థాంక్యూ" అన్నాడతను.
    తరవాత టాక్సీ లో ఇద్దరూ ఎక్కారు.
    "వస్తాం బావా! మళ్ళీ నిన్ను చూసే అదృష్టం కలగాలని భగవంతుణ్ణి ప్ర్రార్ధిస్తున్నాను." అంది రమ. అతను కూడా చేతులు జోడించి , నమస్కరిస్తూ "శలవండి" అన్నాడు.
    టాక్సీ కదిలిపోయింది. నా హృదయం ఎండి పోయింది.
    యాంత్రికంగా నా రూముకు చేరాను. ఏ నిధి కోసం, పెన్నిధి కోసం తల్లిదండ్రులతో వేరుపడి వచ్చానో అది కరువయి పోయింది. నా గాలి మేడలు భగ్గున తగలబడి పోయాయి. ఇక తిరిగి ఇంటికి వెళ్లడమనేది జరగని పని. నాన్నగారి పద్దతి, నాకు తెలుసు. మనిషితో కసి వస్తే మళ్ళీ ఆ శవాన్ని కూడా చూడరు. ఇక నాకు గతి ఏమిటో! ఉభయ భ్రష్టుత్వం వచ్చింది.
    ఉపరి....ఏమిటో!!
    భవిష్యత్తు ఎలా నిర్ణయం చేసుకోవాలో అర్ధం కాలేదు.
    రాత్రంతా కన్నీటితో గడిచింది.

                            *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS