మరునాటికంతా సత్య జ్వరం తగ్గింది. కాని, నీరసంగా ఉండడంచేత రెండు రోజులు సెలవు పెట్టింది. పాడు జ్వరం మూలంగా ఉన్న ఒక్క 'ఆటవిడుపు దినం' వ్యర్ధమయింది.
మర్నాడు హెడ్ మిస్ట్రెస్ గారు టేబుల్ మీది సెలవు చీటీ చూచి అగ్గిమీద గుగ్గిలం అయింది. ఆవిడకు టీచర్లెవరన్నా సెలవు పెడితే చిరాకు! పారిజాతం ప్రాణస్నేహితురాలు సత్యవతి పెడితే మహాచిరాకు! అందులోనూ ఆవిడ లేనప్పుడు పెడితే, ఇక చెప్పనక్కరలేదు!
ఆఫీస్ రూమ్ నుండి బయటికి వచ్చి వరండాలో నిలబడి గట్టిగా కేకలు వేయసాగింది. "ఇంత అధ్వాన్నం టీచర్లను నేను ఎక్కడా చూడలేదమ్మా! లీవ్ లెటర్ దర్జాగా టేబుల్ మీద పారేసి పోతారా? వాళ్ళు స్వయంగా, ఒక రోజు ముందుగా, సెలవుకు అప్లై చెయ్యాలని తెలియదూ? ఎల్. టి. లేక్ తెలియక పోతే, ఇంక సెకండరీ గ్రేడ్ ల కెట్లా తెలుస్తాయటా రూల్స్? నా మంచితనాన్ని ఆధారంగా చేసుకొని అంతా ఆటలాడుతున్నారా? ఎందుకెందుకని ఊరుకొంటున్నా! కాన్ఫిడెన్షియల్ లో ఒక్క ముక్క రాస్తే, అంతా గజిబిజి అవుతుంది!"
అనంతలక్ష్మి, నెమ్మదిగా- "గుడ్ మార్నింగ్, మేడమ్!" అంటూ, ఆవిడను దాటి, ఆఫీస్ లోకి పోబోయింది.
"ఏమిటి, అనంతలక్ష్మమ్మా! సత్యవతమ్మకు జ్వరమా?" అని అడిగింది హెడ్ మిస్ట్రెస్.
"అవునటండీ! నిన్న పారిజాతంగారూ, సత్యవతి గారూ డాక్టరింటివైపు, నడిచిపోతున్నారు. కూరలు కొనుక్కుని వస్తుంటే కనిపించారండీ!" అని అంది అనంతలక్ష్మి.
హెడ్ మిస్ట్రెస్ భగ్గున మండిపడింది.
"డాక్టర్ దగ్గరకు నడిచి పోవడానికి ఏ రోగమూ లేదు! బడి పేరు చెబితే చాలు ఎక్కడలేని జబ్బూ, నీరసమూ, పోజులూనూ! ఊహుఁ! ఇట్లాకాదు. డిసిప్లినరీ ఏక్షన్ తీసుకొంటేగాని, ఇక అంతా దారికి రారు!" అంటూ అరిచింది.
అగ్గిపుల్ల గీచి, అంటించి అనంతలక్ష్మి చల్లగా స్టాఫ్ రూమ్ లోకి నడిచింది. కుట్టు టీచర్ కాంతమ్మ- "ఎవరిని, అనంతా, మేడమ్ గారు అరుస్తున్నారు?" అని అడిగింది కాంతమ్మ క్రిస్టియన్ మతాభిమానం చాలా హెచ్చు. క్రీస్తు మాత్రమే దేవుడనీ, క్రిస్టియన్ మతమే గొప్పదనీ, ఆ మతంలో చేరినందువలన, ఇక పునర్జన్మ ఉండదనీ, ఆవిడ యధాశక్తి క్లాసుల్లో పిల్లలకు, కుట్టుకు మారుగా బోధిస్తూ ఉంటుంది. సర్వమత సహనము బోధింపవలసిన పాఠశాలలో మత ప్రచారం తప్పని అందరికీ తెలిసినా, హెడ్ మిస్ట్రెస్ కూడా క్రిస్టియనే కాబట్టి, కాంతమ్మను వారించ డానికి టీచర్ల కెవరికీ సాహసం లేదు. ఒక్క పారిజాతం మాత్రమే దైర్యంగా ఈ మత ప్రచారాన్ని ఖండిస్తుంది. అసలు కాంతమ్మకు హిందువులంటే, అందులో అగ్రవర్ణులంటే, ఒళ్ళు తెలియని కోపం. తనను వ్యతిరేకించి ధైర్యంగా మాట్లాడగల పారిజాతం అంటే, ఆమెకు ఒళ్ళుమంట! యధాశక్తి పారిజాతం మీద తంటాలు మోసి, కచ్చ తీర్చుకొంటూ ఉంటుంది.
అట్లాంటి కాంతమ్మకు, బ్రాహ్మణ కులంలో పుట్టిన అనంతలక్ష్మి అంటే మాత్రం చాలా ఇష్టం. చాలా తియ్యగా మాట్లాడుతుంది. అనంతలక్ష్మి కూడా అందరితో ముభావంగా ఉన్నట్లు నటించినా, కాంతమ్మతో మాత్రం చాలా కలుపుగోలుగా ఉంటుంది.
"ఏమోనండీ! నిన్న సత్యవతిగారూ, పారిజాతం గారూ డాక్టరింటికి పోతూ ఉంటే చూశానని చెప్పాను. అదీ మేడమ్ గారు అడిగితే! దానిమీద, మేడమ్ గారికి కోపం వచ్చినట్లుంది. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కదండీ! టీచర్లు సెలవు పెడితే, పాఠాలు బాగా జరగవనీ! మన మేడమ్ గారు చాలా సిన్సియర్ అండీ!" అని అనంతలక్ష్మి భజన చేసింది. స్టాఫ్ రూమ్ లో ఉన్న మిగతా టీచర్లు నవ్వుకున్నారు.
ఒక్కొక్క టీచరే నెమ్మదిగా 'గూడు' (స్టాఫ్ రూమ్ కు పెట్టుకున్న ముద్దుపేరు) చేరుకుంటున్నారు.
మళ్ళీ హెడ్ మిస్ట్రెస్ గొంతు గట్టిగా వినిపిస్తున్నది "ఏమిటమ్మా! పారిజాతమ్మా! ఫస్ట్ అసిస్టెంటుని మీకు బాద్యత కొంచెంకూడా తెలియదే! సెలవంటే జన్మహక్కనుకొన్నావే! నీకు తెలియదా రూలు! స్నేహితురాలని సెలవివ్వడమేనా? దీనికి సంజాయిషీ ఏం జెబుతావు?"
అప్పుడే ఆఫీస్ రూమ్ లోకి వచ్చి, "నమస్తే! మేడమ్ గారూ!" అని నమస్కారం చేస్తున్న ప్రాణేశ్వరరావుగారికి- "సంజాయిషీ ఏమిటి, మేడమ్?" అని అడుగుతున్న పారిజాతం కనుపించింది. ఆయనను చూస్తూనే పారిజాతం- "నమస్కారం, మాస్టర్ గారూ!" అని అంటూ, "ఇదుగోనండీ, కొత్తగా చేరిన మన లెక్కలు మాస్టర్ గారు" అని హెడ్ మిస్ట్రెస్ తో అనింది.
"మాట దాటించకమ్మా! ఆయనెవరో మళ్ళా చెబుదువుగాని, ఒక్కమాటన్నా ముందు చెప్పకుండా సెలవెట్లా పెట్టిందట, సత్యవతమ్మ?" కోపంతో కీచుగొంతుతో అడిగింది.
పారిజాతానికి ఒళ్ళు మండింది. నిజంగా కొందరికి అధికార దర్పం మనస్సు మీద పార వేస్తుంది. ఈవిడకి మరీను. స్టాఫ్ ఆర్డర్ బుక్ ఒక చేత్తో, కలం ఒక చేత్తో పట్టుకొని పుట్టి ఉంటుంది బహుశా!
జవాబుగా- "దీని దుంప తెగ, ఆ ఫ్లూ రోగం ముందు చెప్పకుండా వచ్చిందండీ!" అని పలుకుతూ, సంతకం చేసి, క్లాస్ వైపు పోయింది పారిజాతం.
ఎక్కడో కిసుక్కుమన్న సవ్వడి సన్నగా వినిపించి, హెడ్ మిస్ట్రెస్ కోపాగ్నిలో మరికాస్త ఆజ్యం పోసింది. ఎదురుగా ఉన్న ప్రాణేశ్వరరావు గారితోటీ, స్టాఫ్ రూమ్ లో ఉన్న మిగతా టీచర్ల తోటీ, రేపు పొద్దున మొగుడి ద్వారా జిల్లా పరిషత్ లోని ప్రముఖుల తోటీ-తన ఈ 'అక్రమ ప్రవర్తన, అవిధేయత'ను గూర్చి చాటు తుందని పారిజాతానికి స్పష్టంగా తెలుసు. ఇది చిలవలు పలవలుగా మారి, 'రాజుగారి నోట్లో పుల్లకథ'లాగా అల్లుకుపోతుందని అంతకుముందే తెలుసు!
హెడ్ మిస్ట్రెస్ గారి కోపతాపాలకు కారణం ఇదొక్కటే కాదనీ, అనుంగుపుత్రి ఏమిలీ క్లాసులో 'అభిసారిక' చదువుతూ ఉంటే తిట్టడంవలన, ఆ పిల్ల ఆ సంఘటనను కొద్దిగా మార్చి, పారిజాతం టీచర్ తనను అందరిముందు తిట్టి, ఎగతాళి చేసిందని చెప్పడం కూడానని పారిజాతానికి గట్టిగా తెలుసు.
ఏం తెలిసినా ఏమీ చెయ్యలేదు తాను. చాలామంది వ్యక్తిత్వం లేని వాళ్ళు. అట్లాంటి వాళ్ళకు అలవాటు పడ్డ ఇటువంటి హెడ్ మిస్ట్రెస్ లు వ్యక్తిత్వాన్ని సహించలేరు. ఏదో ఒక విధంగా దెబ్బతీస్తారు. ఏదీ లేకపోతే మాటలతో హింసిస్తారు!
ఆలోచనలు ఈగల్లాగా ముసురుతూ ఉంటే, క్లాసులో అయిదు నిమిషాల వరకూ పారిజాతం నిశ్శబ్దంగా ఆలోచిస్తూ ఉండిపోయింది.
పారిజాతం అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం. నవ్విస్తూ పాఠాలు చెబుతుంది. పిల్లల్లో పిల్లగా ఉండి, వాళ్ళకు చదువుతోపాటు ఆటలుకూడా నేర్పుతుంది. చదువులో నిర్లక్ష్యాన్ని సహించదు. అందుకే, పిల్లలకు పారిజాతం క్లాసంటే ఎంత ఇష్టమో, ఆమె కోప మంటే అంత భయం!
అందుకనే, ఇంకా పాఠం మొదలు పెట్టకుండా, నిశ్శబ్దంగా ఆలోచిస్తూ కూర్చున్న టీచర్ ను చూచి కొంత కారణం గ్రహించుకొని, పిల్లలు నెమ్మదిగా స్పెల్లింగులు నేర్చుకొంటున్నారు.
గోడపక్కగా పొంచి ఉన్న హెడ్ మిస్ట్రెస్ హఠాత్తుగా క్లాసులోకి రావడంతో పిల్లలు కంగారుగా నిలబడ్డారు.
కోపంతో మండిపడుతూ, "ఇట్లా క్లాసులో పాఠాలు చెప్పకుండా నిద్రపోవటానికేనా మీ కంతా గవర్నమెంట్ డబ్బు లిస్తున్నది? ఊరికే కూర్చుని ఏం చేస్తున్నారు మీరు?" అని గర్జించింది.
పారిజాతం నిశ్శబ్దంగా నిలబడింది. తను జవాబు చెప్పి లాభం లేదు. "నాది తప్పయింది, క్షమించండి" అని ఆవిడను ప్రాధేయపడితే, ఆవిడ పులిని లొంగ తీసుకొన్నంత సంతోషంగా పోతుంది. కాని, పారిజాతానికి తప్పు చెయ్యనిదే - "క్షమించ"మని అడగటం అవమానం! ఏది జరిగితే అదే జరుగుతుంది.
పీరియడ్ పూర్తి కాగానే, అటు పోతున్న పారిజాతానికి "సుందరమ్మా! ఈ డి. ఒ లెటర్ అర్జెంట్ గా పోవాలి. శేషన్నను పంపు" అని హెడ్ మిస్ట్రెస్ అనడం వినపడింది. సుందరమ్మ క్లరికల్ అటెండర్. శేషన్న ఫ్యూన్.
చిన్నగా నవ్వుకొని, పారిజాతం ఫిప్త్ ఫారంలోకి పోయింది. మనస్సులో చికాకుగానే ఉన్నా, పైకి ఏమీ కనుపించనివ్వలేదు. మామూలుగా పాఠం మొదలు పెట్టింది.
స్వరాజ్యలక్ష్మి పక్కపిల్లలతో గుసగుస లాడుతూ పాఠం వినటం లేదు.
పారిజాతం- "ఇదిగో జయప్రదా! స్వరాజ్యలక్ష్మి కెట్లాగూ చదువూ, సాములూ లేవు, రావుకూడా! నీకుకూడా సున్నా మార్కులు తెచ్చుకోవాలని సరదాగా ఉందా? ముచ్చట్లకు స్కూలెందుకు? హాయిగా ఇండ్ల దగ్గరే ఉండిపోకూడదూ?" అని అంది.
