Previous Page Next Page 
మేఘమాల పేజి 3

 

                                      2

    నిద్రలో కదిలింపు!
    ఎవరో త్యాగరాజును తట్టి లేపుతున్నారు.
    కళ్ళు తెరిచాడు త్యాగరాజు.
    అపరిచితుడు!
    కళ్ళు చిట్లించాడు.
    'మీ మిత్రుడు పడిపోయాడు....త్వరగా లేవండి!'
    'ఎవరు?!'
    ఎదురుగ్గా ప్రకాశం పడుకున్న బెర్త్ మీద దుప్పటి నలిగిపోయి, ముడతలు పడి జాలిగా కనబడుతోంది.
    'ఎక్కడ?' - క్రిందకు దిగుతున్నట్లుగా దూకాడు.
    లావటరీ తలుపు తీసివున్నది. మనిషి నడుమువరకూ ఇవతల పడివున్నాడు. కాళ్ళు లోపలకు వున్నాయి.
    'ప్రకాశంగారూ!' ఆత్రంగా ముందుకు వంగి కళ్ళు మూసుకుపోయి వున్న అతడి మొఖంలోకి చూస్తూ చేయి అప్రయత్నంగా అతడిగుండెలమీద వేశాడు.
    'గుండెల్లో నెప్పిగా వున్నది గురూ గారూ!' బాధతో మూలిగాడు. మెడ విరుస్తున్నట్లుగా పెటపెట లాడిస్తూ పక్కకు తిప్పాడు, 'అబ్బా' అంటూ బాధగా మూలిగాడు.
    'మైగాడ్! హార్ట్ ఎటాక్ కాదుగదా?' త్యాగరాజు గొంతు నీరసంగా గొణిగింది.
    ఇద్దరు సాయంపట్టి సీటుమీద పడుకోబెట్టారు.
    ఎవరో అంటున్నారు : 'గొలుసు లాగి తేనో?'
    మరొకరు 'ఆపి ఏం లాభం?' ఈ చిమ్మచీకటిలో పట్టాల పక్కన డాక్టరు కూర్చొనివుంటాడా? స్టేషన్ ఏదైనా వస్తనే డాక్టరు దొరికేది!....అదైనా అదృష్టం బాగుంటేనే!'
    త్యాగరాజు ప్రకాశం పక్కగా అతడి గుండెమీద రాస్తూ కూర్చున్నాడు.
    రెండు క్షణాలకోసారి ఆదుర్దాగా, 'ఎలా వున్నది...ఎలా వున్నది?' అంటున్నాడు.
    'మంచినీళ్ళు కావాలా?' ఒకరు ముందుకువంగి అడిగారు.
    'పాపం ఎక్కడినుండి వస్తున్నారండీ?...'
    అర్ధంలేని ప్రశ్నల పరంపర...
    రెండుమూడు ప్రశ్నలకు వోపిగ్గా సమాధానం చెప్పాడు త్యాగరాజు.
    తరువాత విసుగనిపించింది.
    త్యాగరాజు ముభావంగా వుండిపోవటం చూచి, ప్రశ్న లడిగేవాళ్ళే ఒకళ్ళ కొకళ్ళు సమాదానాలు సృష్టించుకోసాగారు.
    ఎవరో సంతోషంగా అరిచాడు కిటికీ లోంచి చూస్తూ : 'అదుగో ఏదో వూరువస్తోంది....లైట్లు కనిపిస్తున్నయి!'
    మళ్ళా అలజడి.
    రైలు-ఛుక్ ఛుక్ ...
    కొద్ధిగా స్పీడు తగ్గింది... ఇంకాస్త ..... ఇంకాస్త....పట్టాలు మారుతున్నప్పుడుపెట్టి కొద్దిగా అటూ యిటూ ఊగింది.
    ఫ్లాట్ ఫారం...కేకలు.....రణగొణధ్వని..
    త్యాగరాజు చిన్నగా నిట్టూర్పు విడిచాడు.
    మధ్యలో కూర్చున్న ఓ పెద్ధమనిషి తలుపుదగ్గర వున్నాయనతో పెద్దగా అంటున్నాడు: 'త్వరగావెళ్ళి డాక్టర్ ని పిలుచుకురండి!'
    ప్రకాశం పెద్దగా మూలిగాడు: 'అబ్బా!'-మెలికలు తిరిగి పోసాగాడు.
    జనం మళ్ళా చుట్టూ మూగేశారు!
    ఒక్కక్షణం కాళ్ళు గిలగిలా కొట్టుకున్నాడు.
    మెడ పక్కకు వాలిపోయింది.
    ప్రకాశం చచ్చిపోయాడు!
    రెండుగంటల క్రితం అతడు ఊహించి నట్లుగా అయితే రైలు పడిపోలేదు - అందరూ చచ్చిపోలేదు - కాని, అతడు చచ్చిపోయాడు!

                              *    *    *

    ఉదయం ఆరుగంటలప్పుడు-
    అప్పుడే బద్ధకంగా కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుంటున్న హైద్రాబాద్ మహా నగరంలో-
    ఓ టాక్సీ రెండుమూడు మైళ్ళ దూరం సందులూ, గొందులూ తిరిగి ఓ చిన్న పెంకుటింటిముందు ఆగింది!
    అప్పటివరకూ దిగులుగా ముందు సీట్లో కూర్చున్న త్యాగరాజు - కొన్ని గంటల పరిచయంద్వారా తనలో సుడులు లేపిన ప్రకాశంమీద, ఆ పెట్టిలోని ప్రయాణీకులంతా తన ప్రకాశంకి ఎన్ని సంవత్సరాల ఆత్మీయుడిలానో మానసికంగా నెత్తినపెట్టిన ఈ భారమ్మీద ఆలోచనలతో-టాక్సీ తలుపు తీసుకొని ముందుగా దిగాడు.
    ఒకసారి ప్రకాశం జేబులో దొరికిన కార్డుమీద ఉన్న ఇంటి నెంబరునూ-తరువాత ఇంటిమీద ఉన్న నెంబరునూ చూచాడు.
    చిన్నగా మెట్లెక్కి నీరసంగా తలుపు తట్టాడు.
    గుండె భయంతో గజ గజ లాడుతోంది.
    ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలి?
    ఆ నిజం వాళ్ళకెలా చెప్పాలి?
    భగవాన్!
    సమాధానం రాలేదు.
    మళ్ళీ తట్టాడు.
    అడుగుల సవ్వడి.....తలుపు తీస్తున్న శబ్దం...
    ఎక్కిన మెట్టు దిగి ఒక్క అడుగు వెనక్కు వేశాడు.
    తలుపుతీసింది నో స్త్రీ!- ప్రకాశం చెల్లెలు కాబోలు అనుకున్నాడు త్యాగరాజు.
    అప్పుడే నిద్రలేచిందల్లే వున్నది చికాగ్గా వున్నది. మొఖాన పడుతున్న జుట్టును చేత్తో పైకి నెట్టుకుంటోంది,
    ఎదురుగ్గా నిలబడివున్న ఎప్పుడూ చూడని త్యాగరాజును చూచి కించిత్ మొఖం చిట్లించింది 'ఎవరు కావాలి?' అన్నట్లుగా.
    'ఇది ప్రకాశంగారి ఇల్లేగదూ?' తడబడుతూ చిన్నగా అడిగాడు.
    గొంతు జీరబోయింది.
    'అవును!'    
    'క్షమించాలి!... ప్రకాశంగారు..." ఇక చెప్పలేకపోయాడు. గొంతు పూడుకు పోయింది!
    ఎలా చెప్పటం!
    ఆమె వింతగా అతడి మొఖంలోని కలవరపాటును చూస్తూ, 'లేరు.....ఊరెళ్ళారు!' అన్నది.
    మళ్ళా గొంతు పెగల్చుకున్నాడు. 'అదిగాదు! క్షమించాలి .... ప్రకాశంగారు... పోయారు!'
    'ఏఁవిటి మీరంటున్నది?.....' ఆమెకేం అర్ధంకాలేదు. నుదురు ముడివేసి భయం భయంగా చూచింది అతడి ముఖంలోకి.
    త్యాగరాజు అపరాధం చేసినవాడిలా తలవంచుకు నిలబడ్డాడు.
    'ప్రకాశంగారు చచ్చిపోయారు!'
    ఆమె చటుక్కున తలెత్తింది.
    ఎదురుగా టాక్సీ-డ్రైవర్ వెనుక తలుపు తీసి నిలబడి వున్నాడు.....వెనుక సీట్లో...
    ఆమెకు సర్వం అర్ధమయింది!
    .....ప్రపంచం సర్వనాశన మయింది!
    
                                   *    *    *

    ఐదారు రోజులతరువాత వో రోజు ఉదయం తొమ్మిది గంటలప్పుడు-
    ముందు గదిలో వాలుకుర్చీలో తల వంచుకు కూర్చున్నాడు త్యాగరాజు.
    దూరంగా వాకిటిపక్కగా పెట్టే, బెడ్డింగ్ పెట్టివున్నాయి.
    వంగిన తలను చేత్తో రుద్దుకో సాగాడు.
    మనస్సంతా గజిబిజిగా వున్నది.
    తనేం చేయాలి?
    తలుపు అవతలగా-దీనంగా చూస్తూ-తన సర్వస్వాన్నీ కోల్పోయిన ప్రకాశం తల్లి-ఆమె వెనుకగా నిర్లిప్తంగా నిలబడివున్న అతడి చెల్లెలు శకుంతల!    -తనెలా కాదనగలడు?
    ఒక్కక్షణం నిశ్శబ్దం తరువాత శకుంతల నోరు తెరిచింది. ఈ విషయంలో కలుగజేసుకొని ఆమె మాట్లాడటం ఇదే మొదటిసారి: 'పోనీయ్ అమ్మ, ఒకళ్ళ సహాయంమీద మనకొన్నాళ్ళు బ్రతుకుతాం?...అసలు అంతకంటే హీనమయింది గూడా మరోటి లేదు.....అంతేగాదు ఇంకొకరి సహాయం లేకుండా బ్రతకలేం అనుకోవటంగూడ మన హీనత్వాన్ని చాటుకోవటమే!... నేను చదువుకున్నాను....అదే మన ఆస్థి, మన తిండి.....నేను నాలుగురాళ్ళు సంపాదించుకు రాగలను......నన్ను నేను పోషించు కోవటమేగాకుండా నిన్నుగూడా పోషించ గలవనే ధీమా నాకున్నది!...నీవేం దిగులు పడబోకు......మరొకరిని చేయిజాపి ఆశించవల్సినంత హీనస్థితిలో మనం లేం!' ఆమె గిరుక్కున వెనక్కు తిరగబోయింది. అలా తిరుగుతున్నప్పుడు చెవికున్న బంగారురింగు తళుక్కున త్యాగ రాజు హృదయంలో గుచ్చుకునేలా మెరిసింది.
    త్యాగరాజు లేచి నిలబడ్డాడు. క్షమించాలి! మీరు నన్ను అపార్ధం చేసుకున్నారు......నేను ఇక్కడవుండి మీకు ఇబ్బంది కలిగిస్తానేమోననే ఉద్దేశ్యంతో వెళ్ళిపోతున్నానేగాని.....' అతడు ఒక్కక్షణం ఆగాడు. గొణుగుతున్న ట్లుగా, 'మీరు నన్ను ఇలా అర్ధం చేసుకుంటా రనుకోలేదు!' అన్నాడు.
    శకుంతల అతడి సమాధానం విననట్లుగానే తల ఎగరవేసింది.
    ప్రకాశం తల్లి-ముందు జీవితపు చీకటి కోణాన్ని ఊహించుకుంటూ-భయంభయంగా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నది.
    త్యాగరాజు రోడ్డుమీదకు నడిచాడు!

                               *    *    *

    గమ్యం లేకుండా రోడ్లన్నీ తిరిగాడు.
    తనకు ఉద్యోగం కావాలి!
    తనని తాను పోషించుకోవటమే గాకుండా ఎవరూలేని, ఏఁవీ లేని ప్రకాశం తల్లిని, ప్రకాశం చెల్లెల్ని గూడా తను పోషించాలి!    
    ఒకవిధంగా తనవిధి అది!
    చిరునవ్వు లీలగా అతడి పెదాలమీద ఒక్కక్షణం మెరిసింది.
    ప్రకాశం కుటుంబంతో ఎంత అకస్మాత్తుగా తన జీవితం ముడిబడిపోయింది?
    -అంతా అనుకోకుండా జరిగిపోయింది.!
    ఇంటికి వచ్చేటప్పటికి సరిగ్గా పన్నెండు గంటలయింది.'
    దగ్గరకు వేసివున్న తలుపులను నెట్టుకొని లోపలికి వెళ్ళాడు.
    త్యాగరాజును చూస్తూనే ప్రకాశం తల్లి, పడుకున్నదల్లా లేచి నిలబడి, 'రా నాయినా! భోంచేద్దువుగాని!' అన్నది. ఆ కంఠంలో ఎంతో ప్రేమ వున్నదని అతడికి ఆ క్షణంలో అనిపించింది.
    ఆ పిలుపు, ఆప్యాయత, ఆత్మీయత అతడిని కదిలించి వేసినయ్.
    గది నలువైపులా చూచాడు.
    అది పొద్దుటిలా లేదు.
    వంకెన వున్న పాత గుడ్డలు లేవు. పక్కగా వున్న రెండు విరిగిపోయిన పాత చెక్కపెట్టెలూ లేవు. గోడవారగా వుండే సైకిల్ లేదు అలమర్లో చిందర వందరగా పడివున్న తుక్కూ ధూళీ లేదు.
    ఇప్పుడు ఆ గదిలో వో మంచం, దాని మీద తన బెడ్డింగ్ ఆ పైన తెల్లని దుప్పటి......వో పక్కగా టేబుల్, దాని ముందు వో కుర్చీ, పక్కగా రెండు మోడాలు-అలమర్లో ఏవో పుస్తకాలు-మంచం క్రిందగా తన పెట్టె!
    'ఇవాళ్టినుంచి ఈ గది మీది!' అన్నది శకుంతల తలుపు ఆనుకొని నిలబడి చిన్నగా నవ్వి- తలుపు పై చివరను చేయెత్తి పట్టుకున్నది.
    అతడు అనుకుంటున్నదే నిజమైంది.
    'మీకు శ్రమ కలిగించాను......కృతజ్ఞున్ని!'
    ఒక్కక్షణం తరువాత తగ్గుస్వరంతో శకుంతల అన్నది: 'ఇంత చిన్న విషయానికే మీరు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.....ఆ లెక్కన మేము కృతజ్ఞతా కృతజ్ఞతలు చెప్పుకోవలసిందేనా?' హేలగా నవ్వింది-అలా నవ్వుతూంటే ఆమె అందమైన పలువరుస తళుక్కుమంది.
    చటుక్కున చురకత్తిలా చూచాడు ఆమె మొఖంలోకి త్యాగరాజు.
    ఇంకా నవ్వుతున్నట్లే వున్న శకుంతల మొఖంలో అతడికి తెలియని భావాలేవో దొర్లినయి-ఆమెను ఇంకా చిలిపితనం వీడనట్లే అనిపించింది!
    -మరుక్షణంలోనే, ప్రకాశం కళ్ళముందు కదిలాడు.
    మనిషిని జాలి ఆవరించింది.
    'నిజమే.....మనం ఒకళ్ళకొకళ్ళు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరమే మున్నది?' అంటూ తేలిగ్గా తీసుకుంటున్నట్లుగా గూడలెగరేశాడు.
    'లేవండి! అన్నం వడ్డించమంటారా?'
    త్యాగరాజు దొడ్లోకి వెళ్ళాడు.
    కాళ్ళూ చేతులూ కడుక్క్జున్నాడు.
    తడి కాళ్ళూ, చేతులూ తుడుచుకుంటూ వచ్చేటప్పటికి శకుంతల అన్నీ వడ్డించి, పీటవేసి సిద్ధంగా వుంచింది.
    రోజూ ప్రకాశం తల్లి వడ్డించేది.
    ఈ రోజున శకుంతల వడ్డిస్తోంది. అంతేగాదు ఏదో చొరవ తీసుకొని మాట్లాడుతోంది-విచిత్రంగా అనిపించింది త్యాగరాజుకు!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS