Previous Page Next Page 
స్వాతి జల్లు పేజి 3

 

    వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత కూడా పరధ్యానంగా అలాగే కూర్చున్న అరుంధతితో ఏదో చెప్పబోయి ప్రకాశరావు "డార్లింగ్!" అంటూ సంభోధించాడు. అతనెప్పుడు అరుంధతిని అలానే పిలుస్తాడు. కానీ, ఇన్నాళ్ళూ అరుంధతి ఆ పిలుపును ప్రత్యేకంగా పట్టించుకోలేదు. ఇవాళ ప్రకాశరావలా పిలవగానే ఆమెకు జుగుప్స లాంటి ఒక భావనతో ఒళ్ళు జలదరించింది.
    "మీకు పుణ్యముంటుంది . నన్నలా పిలవకండి" అంది విసుగ్గా.
    ప్రకాశరావు ఆశ్చర్యపోయాడు.
    "అదేం?'
    "ఇవాళ బావ తన భార్య నలా పిలుస్తుంటే విన్నాను. ఆ మాట కెంత విలువో తెలిసిపోయింది. నన్నలా పిలుస్తే భరించలేను."
    ప్రకాశరావు గట్టిగా నవ్వాడు.
    "మనోరంజని సంగతేనా? ఆవిడంత బాగుండని మాట నిజమేగాని, ఆవిడ మెడలో నెక్లెస్ ఎంత బాగుందీ? కనీసం వెయ్యి రూపాయల పైన ఉంటుంది. నీకు కూడా చేయించమంటావా?'
    'నా అందాన్ని రాణింపచేయడానికి నాకు నెక్లెస్ లక్కర్లేదు."
    అరుంధతి గర్వంగా నవ్వింది.
    ప్రకాశరావు భుజాలేగరేశాడు.
    "సరే! నేను చాలా అదృష్టవంతుడిని!" అరుంధతి అతని వంక చురుక్కున చూసింది.
    అరుంధతికి మొదట్నించి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ప్రకాశరావు జాగ్రత్త. అరుంధతికి మధ్యలో ఐశ్వర్యం కలిగినా, ఆమె మొదటి నుంచీ సామాన్య సంసారుల పిల్లే! కానీ, ఇలా పైస పైస, జాగ్రత్త చెయ్యటం ఆమె కసలు తెలియదు. ఒక్క పైస వృధాగా ఖర్చు కానీయడు ప్రకాశరావు.  పైగా ఖర్చు చేసిన ప్రతి దానికీ లేక్కలుండాలి. అతడు ప్రతి రోజూ రెండణాల పువ్వులు అరుంధతికి తేవడం, అరుంధతి పై అతనికి గల అపార ప్రేమకు నిదర్శనం. ఈ విషయంలో ఎవరెన్ని వేళాకోళాలు చేసినా అతడు లక్ష్య పెట్టడు.
    పై మాటల్లోని వ్యంగ్యానికి అరుంధతికి కోపమొచ్చింది.
    "నేను చచ్చిపోతే , మీరింకా అదృష్ట వంతులవుతారు. నాకు తిండి పెట్టక్కర్లేదు" కసిగా అంది.
    ప్రకాశరావు బాధపడలేదు. ఎంతటి గంబీర మైన విషయాన్నయినా నవ్వుతాలుగా మార్చెయ్యగల సామర్ధ్య మతని కుంది.
    'నువ్వు చచ్చిపోతే , నాకు భార్య లేకుండా పోతుంది. అప్పుడు నేను నీకు తిండికి పెట్టె ఖర్చు కంటే, పదింతలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అదేం లాభం లేదు. నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు."
    తన హాస్యానికి తనే మురిసిపోతూ, గట్టిగా నవ్వుకున్నాడు ప్రకాశరావు. అరుంధతి అక్కడి నుంచి  లేచిపోయింది. ఆరోజు పడుకోబోతూ "అందాన్ని బ్రతుకుతెరువుకు సాధనంగా వాడుకోనేది. ఆడవాళ్ళు మాత్రమే కాదు" అనుకోండి అరుంధతి.
    సుందర్రావు వచ్చి వెళ్ళిన దగ్గర్నుండీ , అరుంధతి కేలానో ఉంది. బావా, తనూ మొట్టమొదటి సారి మాట్లాడుకోవటం గురించి, అరుంధతి లక్షసార్లు లక్ష విధాలుగా కలలు కంది-- బావ కళ్ళలో ప్రేమ, తన కళ్ళల్లో సిగ్గు , బావ మనసులో పశ్చాత్తాపం , తన మనసులో జాలి, బావ కంఠంలో ఆవేదన -- తన కంఠం లో అనునయం.
    ఏదో అనిర్వచనీయమైన ఉద్వేగంతో కదలి పోతా ననుకోంది. తన శరీరంలో ప్రత్యణువూ పులకించిపోతుందనుకుంది. వర్ణింప నలవి కాని, బాధతో తన హృదయం ఘోషిస్తుందనుకొంది.
    కాని, ఏదీ జరుగలేదు. అంతా మాములుగా అతి మాములుగా ఉంది. ఎవరో సాధారణ పరిచయస్థుడితో మాట్లాడినదాని కంటే ప్రత్యేకత ఏమీ లేదు. తన వూహలన్నీ ఇలా తలక్రిందులు కావటం అరుంధతికి చాలా చాలా బాధ కలిగించింది. ఇన్నాళ్ళుగా తాను చిత్రించుకొన్న అత్యుద్భుత మైన శృంగార సామ్రాజ్యం వాస్తవంలో , ఇంత నిస్సారంగా, ఉండటం, ఆమెకు దుస్సహనమయింది. అప్రయత్నంగా కాగితం కలం తీసికొని , తన వూహలు నిజమయితే , ఎలా ఉండేదో నన్న భావనకు భాష నియ్యడానికి ప్రయత్నించింది. తరువాత తను వ్రాసినది తనకే బాగుందనిపించి, దాన్ని కధగా మార్చి తనకు తోచిన పత్రికకు పోస్ట్ చేసింది.
    కొద్ది రోజులలోనే అరుంధతి , మనోరంజనీ సుందర్రావులతో అతి మాములుగా మాట్లాడగలిగే స్థితిలోకి వచ్చేసింది. తాను ప్రేమించినది, ఈ మనోరంజని భర్త సుందర్రావును కాదు -- తన భావనలోని బావను-- ఆ బావ ఎవరూ కాదు-- కేవలం తన వూహ మూర్తి. నేనొక "పిచ్చి పెద్దమ్మను" అనుకోని నవ్వేసుకోంది.
    
                                                         *    *    *    *
    ఆరోజు తార కోసం ఎదురుచూస్తూన్నది అరుంధతి. తార సుందర్రావు చెల్లెలు. ఈమధ్యనే బి.యస్సీ చదవడానికి అన్న దగ్గిర కొచ్చింది. వీధిలో రిక్షా , ఆగిన చప్పుడు వినిపించింది. తార లోపలికోస్తూనే తన చేతిలో పత్రిక బల్ల మీద పడేసి, "ఎంత చల్లని కధ వ్రాశావు వదినా?" కాళిదాస మహాకవి మేఘసందెశాన్ని మించి పొతే ....!" అంది.
    అరుంధతి విస్తుపోయి చూసింది.
    "నేను కధ వ్రాశానా? నీకు మతి పోయిందా?"
    "ఈ పత్రికలో చూడు! శ్రీమతి అరుంధతీ ప్రకాశరావు నువ్వు కాదా? కధ చదివాక , తప్పక నువ్వే అనుకున్నాను--"
    అరుంధతి ఆశ్చర్యంగా పత్రిక తీసి చూసింది. అవును! తను వ్రాసిందే! ఏనాడో వ్రాసినది వ్రాసిన సంగతి కూడా మరిచిపోయాక పత్రికలో వచ్చింది.
    తార అరుంధతి దగ్గిరగా వచ్చి భుజం మీద చెయ్యి వేసింది.
    'అబ్బ! ఎంత బాగుంది వదినా! మల్లికా మాధవ్ ల అనురాగం? పెద్దల ఆంక్షలతో విడిపోయిన ఆ ప్రేమ జీవుల విరహవేదన, తరువాత ఆకస్మికంగా కలుసుకొన్నప్పుడు వారనుభావించిన సంక్షోభమూ, చదువుతుంటే, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయనుకో! అనుభవించినదానివి కనుక, అంత అందంగా వ్రాయగలిగావు."
    "అనుభవమా?' అరుంధతి గట్టిగా నవ్వింది. తార మూతి ముడుచుకుంది.
    "నువ్వు చెప్పకపోతే , నాకు తెలియదనుకొన్నావా? అన్నయ్య నాకంతా చెప్పాడు."
    అరుంధతి వింతగా చూసింది.
    "చెప్పడానికి కేముంది?'
    "అన్నయ్య బొత్తిగా ఇంత డబ్బు మనిషి కాకపోతే చెప్పడాని కేంతైనా ఉండేది, నీకు తెలుసో, తెలియదో కానీ, వదినా, అన్నయ్య నిన్నెంతో ప్రేమించేవాడు . అయినా , మా మనోరంజని వదిన ఐశ్వర్యం అన్నయ్యను మిగిలిన లోకమంతా, మరిచి పోయేలాగా చేసింది. జీవించడానికి డబ్బు కాదు! డబ్బు కోసమే జీవించటం! ఏం మనుష్యులో?"
    అప్రయత్నంగా , తార , అరుంధతీ , ఒక్కసారిగా నిట్టుర్చారు.
    "చూసావా , దొరికిపోయావు " అంది తార నవ్వుతూ!
    "అది కాదు-- జీవితమంటే డబ్బు ముఖ్యమను కొనేది మీ అన్నయ్య ఒక్కరే కాదు -- అది తలచుకొంటే కష్టమనిపించింది."
    "నిజమే వదినా! హాయిగా బ్రతకటానికి డబ్బు కావాలి. కానీ, ఈ డబ్బు బ్రతుకులో హాయినంతా చంపేస్తుంటే , ఇంక దీని ప్రయోజనమేమిటీ? అన్నయ్య మనోరంజని వదిన ఐశ్వర్యాన్ని ప్రేమించాడు కానీ, ఆమెను కాదని నీకూ, నాకూ తెలిసినట్లే, ఆవిడకూ తెలుసు! అందుకనే కాబోలు! ఎప్పుడూ తన జాగ్రత్తలో తను ఉంటుంది. అన్నయ్య ఎవరి వంకైనా, తలతిప్పి చూసినా, ఏనాడైనా , కాస్త ఆలస్యంగా వచ్చినా, చివరకు సినిమా తారల కాలెండర్లు ఇంట్లో తగిలించినా, పెద్ద ప్రళయమే! డబ్బు విషయంలో కూడా మంచి జాగర్త! ఆవిడ సినిమాలూ, షికార్లూ, పెత్తనాలూ, కాక మిగిలిన కాలమంతా , జమా ఖర్చుల పద్దుల పుస్తకాలతోనే , గడుపుతుంది. ఈవిడిన్ని పాట్లు పడుతున్నా అన్నయ్య అడ్డ దార్లు అన్నయ్య కుండనే ఉన్నాయి.
    "నిజమా?"
    "నూరు పాళ్ళూ! ఐశ్వర్య మెందుకూ? అనుభవించడానికెగా! ఇలా కాకపోతే, ఇంకెలా అనుభవిస్తాడు మరి?' తార గొంతుకలో వెతకారమూ, ఆవేదనా సమపాళ్ల లో రంగరించుకొన్నాయి.
    అరుంధతి సమాధానం చెప్పలేకపోయింది. తార మళ్ళీ అంది.-
    "ఇప్పుడు తెలిసిందట. అయ్యగారికి-- నువ్వంటే తనకు చాలా ప్రేమని! చాలా తొందరగా తెలిసికొన్నాడు-'' అరుంధతి ని వదులుకోవటం ద్వారా , నేను జీవితంలో చాలా పోగొట్టుకున్నాను. నిజమే! కానీ, బ్రతకడానికి ప్రేమ ఒక్కటీ సరిపోతుందా? అంటాడు.'
    అరుంధతి గట్టిగా నవ్వింది.
    "నేనూ యిప్పుడే తెలిసి కొన్నాను. మీ అన్నయ్య మీద నాకేమీ ప్రేమ లేదని."
    తార తెల్లబోయి చూసి, అంతలో నవ్వింది.  
    "నేను నీ కధ చదవక పోయి ఉంటె , నీ మాటలు నమ్మేదాన్నేమో కాని, ఇప్పుడెంతమాత్రం నమ్మను."
    "బాగుంది ! కధలకూ, జీవితాలకూ ముడి పెడదామని చూస్తున్నావా? కధకు ఆలంబనం భావన. అనుభవం ఏనాడూ , వూహ ఉన్నంత అందంగా ఉండదు. బ్రతుకుల బంగారు కలలు కధలు. అందుకే కధలు బాగుంటాయి. బ్రతుకులు బాగుండవు."
    తార ఏదో చెప్పబోతుండగానే, రవి వచ్చి వంచిన తల ఎత్తకుండా , సంకోచంగా "అక్కయ్యగారూ, టిఫిన్ కారియర్ ఇస్తారా? బావగారికి తీసి కేళతాను." అన్నాడు.
    అరుంధతి లేవకుండానే "వెంకటలక్ష్మీ నడిగి తీసికెళ్ళు! నువ్విచ్చావెం?" అంది.
    "ఇవాళ వెంకయ్యను ఏదో పని మీద పంపించారు. బావగారు వెళ్ళమంటే వచ్చాను."
    తల వంచుకునే చెప్పాడు రవి -- తనవంక దీక్షగా చూసే , తార చూపుల చేత ప్రభావితుడయి , ఒక్కసారి తలెత్తి ఆ చూపుల్లో హేళన గుర్తించి చటుక్కున మరింత తల దించుకొన్నాడు. ఇంతలో వెంకట లక్ష్మీ కారియర్ తెచ్చిచ్చింది. రవి అది తీసుకొని వెళ్ళిపోయాడు.
    "ఈ తమ్మయ్యగారెవరు?"
    నిర్లక్ష్యంగా నవ్వుతూ అడిగింది తార!
    "పాపం! మావారి దగ్గిర గుమాస్తా -- చాలా బీదవాడు -- కష్టం మీద మెట్రిక్ ప్యాసయ్యాడు-- మెత్తని వాడు-- ఆ లోకువ కనిపెట్టి ఈయన పాపం, అతణ్ణి పూర్తిగా ఉపయోగించుకొంటారు.
    "ఈ నన్నన్న.... దద్దడ్డగాళ్ళ కంతే శాస్తి కావాలి. మనుష్యులై పుట్టి, మనుష్యులుగా బ్రతకలేనివాళ్ళనేమనాలి?"
    "అట్లా అనకు తారా! పరిస్థితులు , కొంత మందిని విధిగా ఎదుటి వాళ్ళకు లోకువ చేస్తాయి-- అధికారాలలో ఉన్న వారందరూ , తమ క్రింది ఉద్యోగుస్తులను కొంత తేలికగానే చూస్తుంటారు. ఎంత అత్మగౌరవమున్నా , ఏం చెయ్యగలరు? ఎదురు తిరగొచ్చు! కానీ, ఆ ఎదురీత ఎంత కష్టమో, తెలియని దేవరికి? ఈ తరతమభేదాలు , పై వర్గంలో వాళ్ళు క్రింది వర్గంలో వాళ్ళను చులకనగా , లోకువగా చూడటం , అంతటా ఉంది. వ్యక్తుల హృదయాలు కొంచెం విశాలమయ్యేవరకూ, మానవుల గుండెల్లో దయాదాక్షిణ్యాలు మరి కాస్త పెరిగే వరకు దీనికి పరిహారం లేదు.'
    "నువ్వనేది నిజమే! కాని, కొంతమంది తమకు తామే , తమ వ్యక్తిత్వం మాట మరిచిపోయి, ఎదుటి వాళ్ళకు లోకువయిపోతారు. అట్లాంటి వాళ్ళంటే, నాకు మంట!"
    "రవి విషయం వేరు! పాపం, అతని జీవితమంతా, మొదటి నుంచీ ఇతరుల దయా దాక్షిణ్యాల పైనే ఆధారపడింది. జ్ఞానం వచ్చిన దగ్గర్నుండీ , ఒదిగి ఉండటమే నేర్చుకున్నాడు. సహజంగా సాత్వికుడు -- అనేక రకాలైన ఎదురు దెబ్బలతో , అనేకుల చీదరింపులతో , తనలో తనకు నమ్మకం పోగొట్టుకొన్నాడు. ఎవరైనా ప్రయత్నించి అతనిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించి, మంచి తనమంటే లోకువ కాదని తెలియజెప్పగలుగుతే , ఇతనిలా ఉండకపొవచ్చు -- కానీ , ఇదంతా సంభవమయ్యే  వూహ కాదు."
    తార సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ కూర్చుంది. తారకూ, సుందర్రావుకూ పోలిక అందంలో మాత్రమే! తార కళ్ళు చాలా చిన్నవి. కానీ, అవి నీలంగా మెరుస్తూ ఉంటాయి. కనురెప్పల చివరి వెంట్రుకలు పోడవై వంపు తిరిగి, కనుపాపల్లో నల్లని కాంతులను సృష్టిస్తూ ఉంటాయి. గుండ్రటివి కావు. సొగచేరి ఉంటాయి. చిన్న నోరు, శరీరచ్చాయ పచ్చనిది కావడం వల్ల , పెదవులు సహజం గానే, ఎర్రగా ఉంటాయి. తారకు ఎలా అలంకరించుకోవాలో తెలుసు! ఆమె పెట్టుకొన్న కాటుక, ఆమె కళ్ళ అందాన్ని ఇనుమడింపజేస్తుంది. తారను పొడగరి అనడానికి లేదు గాని, పొట్టి మాత్రం కాదు. చాలా సన్నగా ఉంటుంది కానీ, చూసీ చూడగానే అందమైన రంగుల చిత్రాలు గుర్తు వస్తాయి. చాలా నిరాడంబరంగా ఉంటుంది. సాధారణమైన మిల్లు చీర, మెడలో సన్నని గొలుసు! ఒక చేతికి రెండు బంగారు గాజులు. మరొక చేతికి వాచ్ ఉంది.
    జీవితంలో చేదు రుచి చూడని ఆమె లేత పెదవుల పై ఎప్పుడూ కాంతివంతమైన చిరునవ్వు మెరుస్తూ ఉంటుంది. ఆ నవ యవ్వనిలో సౌందర్యమూ, లావణ్యమూ , ఒకదానితో ఒకటి పోటీలు పడ్తూ కనిపిస్తూ ఉంటాయి.
    బ్రతుకును గూర్చిన ఊహలే కాని, అనుభవం తెలియని - తెలియడానికవకాశం లేని, ఆ ముగ్ధ ఎప్పుడూ ఆశయాలు, ఆదర్శాలు అంటూ పిచ్చి కలలు కంటూ ఉంటుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS