Previous Page Next Page 
గూడు చేరిన పక్షులు పేజి 3

 

    'మరి అంత తొందరైతే ఎలాగే! నీవు కనుపించి ఎన్ని రోజులైంది?'    
    'కనుపించి చాలా రోజులే అయిందనుకో! ఇప్పటికే ఆలస్య మైంది రేఖా! ఈ విషయం మన వాళ్ళందరికీ చెప్పాలిగా! మరి నే వస్తా! ఈసారికి నన్నోదులు ఎలాగూ పిక్నిక్ లో బోలెడు విషయాలు  మాట్లాడుకోవచ్చు. ఏమంటావ్? పిక్నిక్ కు మాత్రం రెడీగా ఉండు....'
    'ఇంతకీ యిప్పుడు మాత్రం ఉండనంటావ్?' బుంగమూతి పెట్టాను.
    'నువ్వు నీ బుంగమూతి బాగానే ఉంది. కాని నన్ను వెళ్లనివ్వు మళ్లీ కలుస్తాగా....! ప్రామిస్!'
    'సరే! నీవంతగా వెళ్ళతలచుకుంటే కాదనేదేముంది? వెళ్లిరా!'
    "గుడ్ బై....!'
    "టాటా....!'
    వాణి వెళ్ళిపోగానే బద్దకంగా ఒళ్ళు విరుచుకున్నాను. ఆవలింతలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. కళ్ళు మండుతున్నాయి. నిద్ర ముంచుకు వస్తూ ఉంది.
    "సీతమ్మా....! నాకు నిద్ర చాలలేదు. ఆవలింతలు బాగా వస్తూ ఉన్నాయి. నిద్ర పోతాను. లేపకేం....!"
    "స్నానం చేసి, నాన్నగారితో భోజనం చేసి పడుకోండమ్మయి గారూ! హాయిగా నిద్రపడుతుంది.'
    ';లేదు సీతమ్మా...యిప్పుడు లేచే వోపిక లేదు.'
    సరే! మీ యిష్టం !'
    సీతమ్మ వెళ్లిపోగానే నిద్ర కుపక్రమించాను. ఎంతసేపు నిద్రపోయానో ఏమో? ఉలికి పడి లేచాను. పిల్లి స్టూలు పై ఉన్న కప్పు సాసరు ను క్రింద పడేసి పారిపోయింది. అవి పగిలి పోయాయి. చప్పుడు వినపడి విషయం తెలుసుకుందామని కాబోలు సీతమ్మ పైకి వచ్చింది ఆత్రుతగా--
    "అయ్యో! ఎంత మందమతిని...కప్పులు సాసర్లు తీసివేయడం మరిచే పోయాను. బంగారం లాంటి జత పగిలిపోయింది.'
    'పోనీలే సీతమ్మా! పగిలిన ముక్కలు జాగ్రత్తగా తీసి పారవేయి. కాళ్ళకు గుచ్చు కుంటాయి.'
    సీతమ్మ పగిలిన ముక్కలను ఒక దగ్గరకు తీయసాగింది. చెదిరిన భావాలను నేను కూడా తీయసాగాను. మగత నిద్ర ....అర్ధం పర్ధం లేని పిచ్చి కలలు. బాగా అలసట.... యిప్పుడే కలలో ప్రసాదు కనిపించాడు. ఆతృతతో ఏదో మాట్లాడాలను కుంది. సిగ్గు తెరల వల్ల మాట పెగిలి రాలేదు. ఆప్యాయంగా పిలిచాడు. ఇంతలో తెలివి వచ్చింది. ఎప్పుడొస్తాడో....? వెళ్ళి కొద్ది కాలమే అయినా, నాకు మాత్రం ఎంతో కాలం గడిచినట్లుగా ఉంది. ఈరోజు వాణి వచ్చింది. మనసుకు కొంత హాయి. వాణి నా ప్రాణ స్నేహితురాలు. తెగువ -- చురుకుతనం దాని సొత్తు. పాపం....! ప్రసాదు ను తన వాడిగా చేసుకోవాలని ఎంత ప్రయత్నం చేసిందో! దాని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రయత్నాలు విఫలమయ్యాకే యిద్దరమూ బాగా సన్నిహితులం మయ్యాము. అప్పుడు జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. కాలేజీ లో వార్షికోత్సవాలు జరుగుతున్న రోజులవి. వక్రుత్వ పోటీలో గెలుపు ప్రసాదుది. వ్యాసరచన ....గెలుపు ప్రసాదు ది గేయ రచన ప్రసాదు దే. గెలుపు.-- ఆటల పోటీలు ...రెండు వంతులు ప్రసాదు కు బహుమతులు. నాటిక ప్రదర్శన ....ఉత్తమ నటుడు గా ప్రసాద్ కు బహుమతి. నా ప్రక్కనే కూర్చొని వాణి ప్రసాదు ను నమిలి మ్రింగేలా చూడసాగింది.
    'అబ్బ! ప్రసాదు ఎంత చురుకైనవాడే రేఖా....? చదువు లో , సాహిత్యం లో అటలలో అన్నింటా ఉన్నానంటాడు.'
    నేను మాట్లాడలేదు. దాని చూపులకే ఈర్ష్య పడుతున్న నాకు దాని మాటలు గాయం పై కారం చల్లినట్లుగా ఉన్నాయి. అదేమిటో? ప్రసాదు ను నా స్నేహితురాళ్లు ఎవరైనా అతిగా పొగిడినా , కన్నార్పకుండా చూసినా, ఈర్ష్యా నన్ను నిలువునా దహించేసేది. యిప్పుడు కూడా అదే జరిగింది.
    'అతని జోక్యం నీకెందుకే? మహా గర్విష్టి ' ఎలాగైనా దాని మనసులో నుండి ప్రసాదు గురించిన ఆలోచనలు తప్పించాలని అన్నాను. కాని ఫలితం శూన్యం. వాణి తన ధోరణి మానలేదు, దాని వాగుడుకు అంతులేదు. కోపంతో కళ్ళెర్ర జేసాను. కాని అది నావైపే చూడందే! ఉత్సాహంతో తన ధోరణి సాగిస్తూనే ఉంది. వాణి ధోరణి చూసిన నాకు ప్రసాదు ను పెద్దలు పొగిడిన పొగడ్తలు , అతను సంపాదించిన బహుమతులు , కార్యకర్తలు అతనిని అభినందిస్తూ మాట్లాడిన మాటలు, మిత్రులంతా సంతోషంతో ప్రసాదు ని తదేకంగా పొగుడుతూ మాట్లాడుతున్న మాటల వల్ల కలిగిన సంతోషం, పులకింత మాయమయ్యాయి. మనస్సంతా కోపంతో నిండిపోయింది. ఆవేశంతో వణికి పోయాను. కారణం .... ప్రసాదు నా వాడనే  దృడ విశ్వాసం. వార్షికోత్సవాలు బహుమతీ ప్రదానం లో ముగిశాయి. అంతా బయలుదేరి వెళ్ళి పోతున్నారు. ఆ హడావుడి లో ప్రసాదు నా వైపు రావడం ....అతనినే గమనిస్తున్న అందరి కళ్ళూ మాయిద్దరి పై పడడం గమనించి గర్వించాను. ఇంతలో వాణి మా యిద్దరి మధ్యా అడ్డుపడి 'హల్లో ప్రసాద్....! కంగ్రాచ్యులేషన్స్ మీ విజయాలకు నా హృదయ పూర్వక అభినందనలు.' వాణి మాట్లాడిన మాటల తీరు. ఆ చూపులు, హావభావాలు భరించలేక పోయాను. ప్రసాదు నలుగురికి థాంక్స్ చెప్పిన విధంగానే వాణితో 'థాంక్యూ ' అని నాతొ మెల్లిగా 'అమ్మాయి గారూ! ఇక వెడదామా?' అన్నాడు. 'అలాగే....!' అని యిద్దరమూ కారు వైపు నడక సాగించాము. ఎందుకో వెనుతిరిగి వాణిని చూడాలనిపించి చూశాను. దాని ముఖం జేవురించి ఎర్రగా కనుపించింది. ప్రసాదు మాములుగా బస్సులోనే కాలేజీ కి -- కాలేజీ నుండి యింటికి వస్తాడు. ఇటువంటి ప్రత్యెక సమయాలలో బస్సులు దొరకనటువంటి ప్రత్యెక సమయాలలో నా కారులో రాక తప్పదు అటువంటి అవకాశం నాకు ఎప్పుడు లభిస్తుందా ....అని  ఎదురు చూస్తూ ఉంటాను.
    'వాణి కూడా ప్రసాదు ను ప్రేమిస్తూన్నదా?' అనే సందేహంతో మనసులో ఈర్ష్య పడుతూ, ప్రసాదు సాన్నిధ్యంలో అనుభవించవలసిన ఆనందాన్ని అనుభవించ లేకపోయాను.

                             

                                      2
    ఆ తర్వాత ఒకరోజు జరిగిన సంఘటన తో వాణి కళ్ళు తెరిపడి పడ్డాయి.    ఆ పూట లీజర్ గా ఉండడం వల్ల సన్నిహితులమైన స్నేహితుల మందరము కులాసా కాలక్షేపం చేసేందు కై పబ్లిక్ గార్దేన్సు కు వెళ్లాము.
    ఒక కంట వాణిని కనిపెడుతూనే ఉన్నాను. ఆమె ప్రసాద్ తో మాట్లాడడానికి తగిన అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూడడం గమనించాను. ప్రసాద్ ను అంటి పెట్టుకొని తిరుగుతూన్న నేను వాణికి ఆ అవకాశాన్ని కలగనివ్వలేదు. అనుకోకుండా యింటి నుండి కబురు రావడంతో ప్రసాదు ను ఒంటరిగా వదిలి వెళ్ళలేక వెళ్ళిపోయాను.
    ఆ తర్వాత అక్కడ జరిగిన సంగతులు కొన్ని ప్రసాదు ద్వారా, మరికొన్ని స్నేహితురాళ్ళ ద్వారా తెలిశాయి.
    'ప్రసాద్....౧ నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి."
    ప్రసాదు -- వాణి ఒక ప్రక్కగా వెళ్ళడం లలిత గమనించిందట! కన్ను, చెవి ఆ ప్రక్కకు వదిలింది. చాలా తెలుసుకో గలిగింది.
    'ప్రసాద్! నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నా అంతట నేను బయట పడినందుకు చులకన చేయవద్దు. నీవు సరే నంటే నేను మావాళ్ళతో మాట్లాడుతాను."
    ప్రసాద్ వాణిని ఒక్క క్షణం తేరిపార చూశాడు--
    'వాణి....! మీరు లక్షాధికారులు ...నీవు అందమైన దానవు. ఆవేశంలో త్వరపడవద్దు. నేను ఒకరిని ఆశ్రయించి కాలం వెళ్ళబుచ్చుతున్నవాడను. నా భవిష్యత్తు నాకే తెలియదు. నిన్ను నా చెల్లెలుగా భావించి ఒక చిన్న సలహా యిస్తున్నాను. నీవు విలాసాలకు అలవడినదానవు. కాలు క్రింద పెట్టి ఎరుగవు..కార్లు.... పరిచారికలు ....ఆన్ని సౌకర్యాలూ తగినంత శక్తి సామర్ధ్యాలున్న దానవు. ఆవేశం తగ్గిన తర్వాత ఆ సౌకర్యాలను ఒదిలి ఉండగలవా? బాగా ఆలోచించు. ఇప్పటికే మన ఇద్దరినీ అందరూ గమనిస్తున్నారు. వింతగా చూస్తున్నారు. నీ మనస్సు నొప్పిస్తే మన్నించు.... శలవ్!'
    పై సంభాషణను ఉన్నది ఉన్నట్లు చెప్పింది లలిత. ప్రసాదు కొంత చెప్పాడు. ఈ విషయాన్ని ప్రసాద్ అంతగా పట్టించుకొనే లేదు. ముఖ్యమైన విషయాలు కాదన్నట్లుగా తేలికగా తీరిపారేశాడు.
    పై సంఘటన జరిగిన తర్వాత వాణి ఒక రోజు మా యింటికి వచ్చింది. ప్రసాదు, నేను ఏదో విషయం చర్చించుకుంటున్నాము.
    'హల్లో రేఖా! హల్లో ప్రసాద్!'
    మమ్ముల నిద్దరినీ విష్ చేసి మాకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది వాణి. ఆ సమయంలో ఎందుకు వచ్చిందో తెలియక తికమక పడసాగాను నేను.
    'ప్రసాద్ నా తొందర పాటు మన్నించు , దూరం ఆలోచించాను. నిన్నర్ధం చేసుకున్నాను -- జీవితంలో మళ్ళీ యిటువంటి పొరపాటు చేయను.'
    'మన్నించవలసినంతటి తప్పు నీవేం చేశావని? వాణి....! నీవే కాదు ...ఈ విధంగా చాలామంది లేనిపోని అపోహలు పెంచుకొని బాధపడుతుంటారు. నన్ను అర్ధం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అపార్ధం చేసుకొని నా మనసుకు శాంతి లేకుండా చేస్తావేమోనని బాధ పడ్డాను.... రక్షించావమ్మా వాణి!'
    'ఈరోజు నాకెంతో ఆనందంగా తేలికగా ఉంది.... వస్తాను రేఖా ....! గుడ్ బై.'
    అప్పటి నుండీ వాణి , నేనూ ప్రాణ స్నేహితులం ---------
    
                               *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS