Previous Page Next Page 
అపశ్రుతులు పేజి 4


    "అమ్మాయి ఒక్కర్తీ వెళ్తూంది స్టాండుకు వెళ్ళరాదూ అబ్బాయ్" అన్నారు రంగనాధం కొడుకు నుద్దేశించి.
    "ఫర్వాలేదు వెళ్ళగలదు నాన్నా." రమ వినేలా అని తన గది కెళ్ళిపోయాడు శ్రీనివాసరావు.
    "నే వస్తాను పదమ్మా" అంటూ రమ వెనుక వెళ్ళేరు రంగనాధం.
    గృహ ప్రవేశం అయిన తర్వాత నలుగురైదుగురు దగ్గర బందువులూ. శ్రీనివాసరావు అక్కయ్య కామేశ్వరీ నాలుగు రోజుల్లో వరసగా వెళ్ళిపోయారు. ఒక్కరాత్రి మాత్రమే అత్తగారింట గడిపి శలవు లేదంటూ వెళ్ళిపోయిన రమగురించి గుసగుస లాడుకున్నారు.
    తల్లీ, తండ్రీ తానూ మాత్రమే ఉన్నప్పుడు. మీరిలా చేస్తారని అనుకోలేకపోయాను నాన్నా?" బాధగా అన్నాడు శ్రీనివాసరావు.
    "ఏం చేశాన్రా బాబూ!" నవ్వ బోతూ అన్నారు రంగనాధం.
    "నన్ను మీరు అభిమానిస్తున్నారనీ. నా మాటకి గౌరవం ఇస్తారనీ. నన్నూ ఈ కుటుంబంలో విలువ వున్న వ్యక్తిలా చూస్తూన్నారనీ భ్రమించి మోసపోయాను."
    "ఏవిటి బాబూ మోసపోయింది! సూటిగా చెప్పు" కొంచెం కదిలి మళ్ళీ సరిగ్గా కూర్చుంటూ అన్నారు రంగనాధం.
    "ఏడువేలకి నన్ను అమ్ముకున్నారు."
    పకపకా నవ్వారు రంగనాధం. "ఓరి పిచ్చి సన్నాసి అదా! అమ్మాయి అందం. చదువూ చూసి మూడువేలు తగ్గించాను. అందరూ పదివేలిస్తామన్నారు. అమ్మడమేవిట్రా. కన్యాదానం చేసే అప్పుడు దక్షిణగా ఇచ్చే డబ్బునే మనం కట్నం అంటున్నాం అంతే"
    "ధరో. దక్షిణో నాకు తెలియదు. తిరిగి ఆ ఏడువేలూ వాళ్ళకి ఇచ్చెయ్యండి" కరుకుగా ధ్వనించింది శ్రీనివాసరావు గొంతు.
    'బాగుంది నవ్వగలరెవరన్నా ఎక్కడుంది ప్పుడు అమ్మాయికిచ్చిన బంగారం, చీరలూ మూడు వేలయ్యాయి. మన ఖర్చులు రెండువేలు. ఐదు వేలుపోను. మిగతా రెండువేలూ ఏవో చిల్లర బాకీలు తీర్చాను."
    "సరే ఎలాగోలా భూము లమ్మైనాసరే వాళ్ళ డబ్బు వాళ్ళకి పారెయ్యాలి"
    "ఏరా! ఏమైనా అమ్మాయీ నువ్వూ..." అంటూ కొడుకువైపు పరిశీలనగా చూశారు రంగనాధం.
    "అవన్నీ మీకనవసరం. డబ్బు జతపర్చండి వాళ్ళకిచ్చేసి వస్తాను."
    "బాగుంది వరస..." అప్పటివరకూ తండ్రీ కొడుకూ సంభాషణ మౌనంగా వింటూన్న జానికమ్మ కొడుకువైపు ఉదాసీనంగా చూసింది.
    "వరస బాగుండకెలా వుంటుందమ్మా! ఈయన కెన్నిసార్లు చెప్పాను కట్నం తీసుకోవద్దని!"
    "లోక లాంఛనం కాదంటే తప్పుతుందిరా బాబూ? అయినా ఆ అమ్మాయి ఏమన్నా చెప్పిందేవిట్రా?" బుగ్గలునొక్కుకుంటూ తనకొడుకేనా కాదా, అన్నట్లు అతనివైపు చూసింది జానికమ్మ.
    "నాకెవ్వరూ ఏమీ చెప్పరు. చెప్పినా వినను. ఆ డబ్బు ఆ అమ్మాయి కిచ్చెయ్యాలంతే..."
    ఏదో అనబోతున్న రంగనాధంకి సౌంజ్ఞ చేసింది ఏమీ అనవద్దన్నట్టు జానికమ్మ.
    మర్నాడే ఏదో పనిమీద వెళ్ళారు పట్నం రంగనాధం.
    రమ దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది శ్రీనివాసరావుకి ఆ వుత్తరం అతనికేమీ తృప్తినివ్వలేదు సరికదా! ఏదో ఉద్రిక్తతని రేకెత్తించింది. తాను కాలేజీ ప్రిన్సిపాల్ ని కన్సల్టు చేసిందట. తప్పక త్వరలో హెల్పు చేస్తానని అన్నారట. వెధవ రికమండేషను. భార్య రికమండేషను మీద తనకు ఉద్యోగం. ఛ ఛ గొణిగాడు. పచార్లు చేశాడు. జుట్టు పీక్కున్నాడు. క్రమంగా అతని కనురెప్ప లెరుపెక్కాయి. కసిగా ఉత్తరం చించిపారేశాడు.
    "అబ్బాయ్ రేపు సప్తమీ ఆదివారం. ప్రయాణాన్కి భేషుగ్గా వుంది." అన్నారు రంగనాధం కళ్ళజోడు సరిచేసుకుంటూ పంచాంగం చేత్తో పట్టుకుని.
    "డబ్బు జతపరిచారా?" అడిగాడు శ్రీనివాసరావు.
    "శ్రీనూ! అన్నీ నువ్వన్నట్టూ జరగాలనే స్వభావం మార్చుకుని కాస్త సర్దుకుపోవాలి. వారంరోజులై తంటాలుపడి తెచ్చాను. సరేఇచ్చెయ్ అమ్మాయి డబ్బు నీది కాదా నీ డబ్బు నాది కాదా అంటూ నవ్వి వ్యవసాయం అని అమ్మతో అన్నావుట ఐదుసంవత్సరాలై పంటలు పోతున్నాయని రైతులు అఘోరిస్తుంటే మనం కొత్తగా వ్యవసాయం ఏం చేస్తాం.? భాగానికి ఇచ్చేస్తే ప్రాణం స్థిమితంగా ఉంటుంది. నీకూ రాసే ఉంటుంది. ప్రిన్సిపాల్ గార్ని కలసి..."
    "నేను ఉద్యోగం చేస్తే తాను మానేస్తుందానే నమ్మకం నాకు లేదు నాన్నా..." తండ్రి మాట పూర్తి కాకుండానే అన్నాడు విసుగ్గా శ్రీనివాసరావు.
    "పోన్లేరా! ఎందరు ఆడపిల్లలు ఉద్యోగం చెయ్యడం లేదిప్పుడు! పోనీ నీకిష్టం లేదన్నావ్! నెమ్మదిమీద మాన్పించేద్దాం. అన్నిటికీ మొండిగా నీ మాటే చెల్లాలనే పట్టుదల ప్రదర్శించకుండా ఇష్టప్రకారం జరగనీ అంటూ నీ ఇష్టప్రకారం జరిగించుకోవాలి. తెలివిగల వాడివైతే, ఆ.... సరే డబ్బిస్తాను. ఇచ్చెయ్ ఆ అమ్మాయి, నువ్వూ మాట్లాడుకుని మీ యష్ట మొచ్సినట్టూ చెయ్యండి. అని ఏదో అర్జంటు పని వున్నట్టు వీధిలో కెళ్ళిపోయాడు రంగనాధం.
    ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటే ఆదాయం బాగుంటుందనీ తానూ భర్తా కూడా వారిదగ్గరే వుండొచ్చనీ ఎన్నో రకాల హితబోధలు శ్రీనివాసరావు విన్నావినకపోయినా చెప్పుకుపోయింది జానికమ్మ.

                                      *    *    *

    ప్రకృతిలో సంధ్య చీకట్లలుముకుంటున్నాయ్ స్విచ్ వేసి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటూన్న రమ. వీదితలుపు తట్టినచప్పుడైతే "ఎవరూ" అని ప్రశ్నించింది.
    "తలుపు తియ్..." శ్రీనివాసరావు గొంతు.
    తలుపు తెరచి చిరునవ్వుతో అతని చేతిలోని బేగ్ అందుకుంటూ "రండి అనుకుంటున్నాను ఎదురుచూస్తున్నాను ఎప్పుడు వస్తారా?" అని అంది రమ.
    అతనేం జవాబు చెప్పలేదు. మౌనంగా ఆమె వెనుక లోపలికొచ్చాడు.
    "కూర్చోండి కాఫీతెస్తాను" అంటూ ఈజీ చైర్ వాల్చింది రమ.
    డబ్బు మొహాన విసిరికొట్టి ఉద్యోగం రిజైన్ చేసి నేను చెప్పినట్టూ వింటూంటేనే నీకూ నాకూ సంబంధముంటుంది లేకపోతే లేదని ఖచ్చితంగా చెప్పాలనివచ్చిన శ్రీనివాసరావు ఎందుకనో అంత ఆప్యాయతగా ఆమె మాట్లాడుతూంటే సభ్యత కాదనుకున్నాడో ఏమో ఈజీ చైర్లో కూర్చుంటూ బేగ్ ఇలా ఇయ్యి అన్నాడు.
    "నేను తీస్తాను లుంగీ టవలూనా!" అంటూ బేగ్ తెరవబోయిన ఆమెను వారిస్తూన్నట్టు చెయ్యి ఊపి ఆమె చేతిలో బేగ్ తీసుకున్నాడు శ్రీనివాసరావు.
    ఐదు నిమిషాల్లో కాఫీ గ్లాసుతో వచ్చిన రమ. కాఫీ తాగి బట్టలు మార్చుకోండి అంది.
    బేగ్ లోంచి ఒక బరువైన కవరు ఆమె చేతికిస్తూ. "ఇదిగో మీరు మానాన్న కిచ్చిన ఏడువేలు లెక్కపెట్టు" అన్నాడు.
    ఎందుకో ఆమె వదనంలో కళ్ళల్లో పెదవుల్లో కొంటెగా హాసరేఖలు కదుల్తున్నాయ్.
    ఆమెవైపు చూస్తున్న అతనికి ఉడుకుమోత్తన మొచ్చింది.
    "మీరు కాఫీ తీసుకోండి" అంటూ ఎదురు బల్ల మీద కాఫీగ్లాసు పెట్టి నవ్వును దాచే పెదవులు వింతగా కదుల్తూంటే గబగబా లెక్కపెట్టి "ఆ ఉన్నాయి". అంటూ తలెత్తిచూసిన ఆమె "కాఫీ తీసుకోలేదేం" అంది. కొంచెం వెదురుగా అతనివైపు చూస్తూ.
    అవరించలేదు. "ఊ మరి వెళ్తాను." లేచి నిల్చున్నాడు. శ్రీనివాసరావు.
    "అదేమిటి? వెళ్లడమేమిటి? కేవలం డబ్బివ్వాలనే వచ్చారా?.... "అతని చెయ్యి పట్టుకుంది రమ.
    "అవును," అతనిగొంతు దృఢంగా ధ్వనించింది. "ఎందుకండీ ఈ అర్ధంలేని కోపం. నేను కట్నమిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమంటున్నానా? ఎందుకని? నేనేంతప్పు చేశానని? పెళ్ళి రోజు.....మిమ్మల్ని పెళ్ళి పీటలమీద కూర్చున్న దగ్గరనుంచీ పరిశీలిస్తున్నాను. ఏదో బాదపడి పోతున్నారు. కనీసం నలుగు మాటలన్నా మాట్లాడకుండా వెళ్తానని లేస్తే. నేనేమనుకోవాలి. ఆమె కళ్ళనిండా నీళ్ళు తిరిగాయి. గొంతు పూడిపోయిది.
    "నాలుగుకాదు. ఎన్నో మాట్లాడాలనీ. నీ అభిప్రాయాలు తెల్సుకోవాలనీ అనుకున్నది పెళ్ళికి ముందు. ఇప్పుడు మాట్లాడీ.....ప్చ్......లాభం లేదు అనుభవించాల్సిందే!"
    బాధగా నిట్టూర్చి, "అబ్బ....ఏమిటో నాకేమీ అర్ధం కావడంలేదండి : కనీసం కట్నం తీసుకున్నారని ..... ఆ హ కాదు. అలా మీతో చెప్పకుండా ఉండాల్సింది....పోనీ పెళ్ళికిముందే మాట్లాడకపోయారా? అయినా ఇప్పుడేమయిందని?"
    "ఏమీ కాలేదు...మరి వెళ్తాను....బస్ మిస్సయిపోతుంది లేటయితే."
    అతని చెయ్యి వదలకుండానే అంది రమ. "ప్లీజ్" దయచేసి ఆగండి. మనిద్దరి మధ్యా పరిచయం అనుబంధం ఏదయినా ఒక్కరోజుది...నేనివాళ మీ మాట ప్రకారం అక్కడ ఉండలేదని కోపంకావచ్చు కాని... ఉద్యోగంలో ప్రవేశిస్తే కాని ఆ సాధక బాధకాలు తెలియవు" అని ఆమె తనను దెప్పుతున్నట్టనిపించి"ఉద్యోగం చెయ్యకపోయినంత మాత్రాన, రూల్సులు తెలియవనుకోకు. వదులు చెయ్యి. వెళ్ళనీ" విసురుగా ఆమె చెయ్యి విడిపించుకున్నాడు శ్రీనివాసరావు.
    "మీరెవరికన్నా మనసిచ్చిరా? మీరెవర్నో పెళ్ళి చేసుకుంటానని అంటే మీ వాళ్ళు బలవంతంగా పెళ్ళిచేశారా? నేనేమీ అనుకోను నిజం చెప్పండి" అంది రమ గొంతు వణుకుతూంటే.
    "రమా!" తెల్లబోయి ఆమెవైపు చూశాడతను.
    "అవును అయి ఉంటుంది. దురదృష్టవంతురాల్ని" తలవాల్చి నిల్చుందామె.
    "ఛ! ఛ? అలాంటిదేం కాదు రమా!"
    "ఎందుకలా కాదని దబాయిస్తారూ! ముమ్మాటికీ నిజం. మీ వాళ్ళు బలవంతాన్న చేశారు. నేనంటే మీకు ఇష్టంలేదు. అందుకనే అదోలా ఉంటున్నారు. నేనా మాత్రం గ్రహించగలను.
    ఆమె తనను బ్రతిమిలాడాలి అనుకుంటూ బెట్టుచేస్తూన్న శ్రీనివాసరావు. అందమయిన ఆమె వదనం చిన్నబోయి కళ్ళు చెమ్మగిల్లి ఉండడం గమనించి కరగిపోయాడు. "ఇదేమిటి? ఆమె అన్నట్టు ఇద్దరిమధ్యా పరిచయం ఏ పాటిది? భార్యా భర్తలమయ్యామనే అభిప్రాయం తప్ప తానేం చేసింది? ఆమె నేమ్దుకిలా అర్ధం లేకుండా విసిగింది బాధించాలి!" అని అనుకున్న క్షణంలో ఆమెను దగ్గరకు తీసుకుంటూ. "అటువంటి అపార్ధలకి మన మనస్సుల్లో చోటియ్య కూడదు రమా! ఇప్పటివరకూ నేనెవరికీ మనసివ్వలేదు. నా మనసు నువ్వేతీసుకోవాలి. అలా....నువ్వలా ఫీలవుతూంటే నాకేదో బాధగా ఉంది. ఏదీ నా వైపు చూడు. ఒకరిపై ఒకరం పూర్తి విశ్వాసంతో కాపురం చెయ్యాలి రమా?" అన్నాడు లాలింపుగా.
    అతని భుజం పై చెయ్యివేసి అతని వదనంలోకి చూస్తూ వెళ్ళిపోతా నంటున్నారు? వెళ్ళి ఆ ఊళ్ళో ఏం చెయ్యాలని? చెరొకచోటా బ్రతకాలనా పెళ్ళి చేసుకున్నది! ఎండన ఎండి, వానకు తడిసి వట్టి మోటు మనిషిలా మీరు వ్యవసాయం చేయించగలరా! ఆ..... తర్వాత ఆ విషయాన్నీ "బట్టలు మార్చండి. ఇదుగో కాఫీ, సుతారంగా కాఫీగ్లాసుతీసి అతని నోటిదగ్గర పెట్టింది రమ" ఎంతవారుగాని. వేదాంతులైన గాని" రేడియో రకార్డు కాబోలు వినిపిస్తూంది పక్కఇంట్లోంచి పాట.
    కాఫీ తాగి బట్టలు మార్చి బాత్ రూమ్ వైపు నడిచాడు శ్రీనివాసరావు. రమ ఎంత తియ్యగా- ఎంత ఆప్యాయంగా మాట్లాడుతుంది. మనసొకటీ మాటొకటీ అవుతుందా? ఈమెనా తాను తనను నిర్లక్ష్యం చేసి బ్రతికే గర్విష్టిగా ఊహిస్తున్నది! నొచ్చుకున్నాడు శ్రీనివాసరావు.
    "మీ బామ్మ నీ దగ్గరలేరా?" భోజనం చేస్తూ అడిగాడు శ్రీనివాసరావు.
    "మా ఊర్లో స్వంత ఇల్లు ఉందిగా. అంతా అద్దెకిచ్చి ఓ గదిలో తానుంటూంటుంది వచ్చి వెళ్తూంటుంది లెండి." పొడిగా సమాధానం చెప్పింది రమ.
    చురుగ్గా వంట ఇంటిపనీ ముగించి ఆఫీసుకు తయారై వెళ్ళే రమవైపు పరవశంగా, తానెంతో అదృష్టవంతున్ననే గర్వం హృదయంలో చోటు చేసుకోగా చూశాడు శ్రీనివాసరావు. తృప్తిగా నిట్టూర్చి. ధైర్యంగా గుండెలనిండా గాలిపీల్చు కున్నాడు ఆమె ఆఫీసునుంచి రాగానే షికారూ సినిమా, హాయిగా నలుగు రోజులు దొర్లిపోయాయి.
    "ఒక్కసారి ప్రిన్సిపాల్ గార్ని కలుద్దాం వస్తారా?" నెమ్మదిగా అడిగింది రమ.
    చప్పున కనుబొమలు ముడిపడ్డాయి శ్రీనివాసరావుకి. "ఈ ఊళ్ళో చెయ్యాలనిలేదు" అన్నాడు టక్కున.
    "మరో ఊర్లో మనని పిల్చిఇస్తారా చెప్పండి. అస్సలు ఉద్యోగం దొరకడమే పెద్ద ప్రోబ్లమ్ అయిపోయిందీ రోజుల్లో....అస్సలు ఉద్యోగమే చెయ్యనన్నారు ఒకప్పుడు. ఈ నాలుగురోజులూ మీ దగ్గర ఎక్కువ డబ్బు లేదు. నేను పర్సు తీస్తూంటే ఫీలయ్యేవారు. పోనీ నా డబ్బు కాక పోయినా నాన్నగార్నన్నా అడగందే డబ్బెలా వస్తుంది? మీ కాళ్ళమీద మీరు నిల్చుని ఎవ్వరి నన్నా ఎదిరించవచ్చు...."
    "నా కాళ్ళమీద నేను నిలబడి బ్రతకగలిగినంత మాత్రాన నాన్నని ఎదిరించాలనుందా?"
    "అహ...కాదు...మీకూ ఊరికనే ఉంటే డోర్ గా ఉండదూ? ప్లీజ్. రండి వెళ్దాం. ట్రై చేద్దాం తర్వాత అది అదృష్టం" అనునయంగా చెప్తూన్న రమ మాట కాదనలేక ఆమె వెనుక వెళ్ళాడు శ్రీనివాసరావు.
    ఒక వారంలో తాను సెలక్షను కావడం ఆ ఊరి కాలేజీలో లెక్చరర్ గా చేరడం యాంత్రికంగా జరిగిపోయాయి. ఈ శుభవార్త తెలిసిన రంగనాధం వచ్చి తన సంతోషాన్ని వ్యక్తపరచి కోడల్ని అభినందించి వెళ్ళిపోయారు.
    కాలేజీకి వెళ్ళబోతూ "రమా!" అని పిల్చారు శ్రీనివాసరావు.
    "తొందరగా అంటే కాలేజీ విడవగానే వచ్చేస్తారు కదూ. ఇవ్వాళ నుంచీ నైట్ డ్యూటీ" అంది రమ. అతని దగ్గరగా వస్తూ!
    "అన్నట్టు చెబ్దామనుకుంటూ నీకు తెలియదేమిటనుకుని ఊరుకున్నాను. ఆ డబ్బు ఏదన్నా బ్యాంకులో జాగ్రత్త పెట్టావా? ఇద్దరం చెరొక తోవనా పోతే ఇంట్లో డబ్బు ఎవరన్నా తస్కరించవచ్చు."
    "ఆ ఆ జాగ్రత్త పెట్టాను." తడబాటుగా అంది రమ.
    "ఆంధ్ర బ్యాంకులో నీ ఎక్కౌంటుందన్నావ్. ఏ బ్యాంకిలో వేశావ్?"
    "ఆంద్ర బ్యాంకిలోనే మీకు టైమయిపోయిందే" అంది వాచ్ చూసుకుంటూ ఎందుకో నవ్వింది ఫక్కున-
    "ఆ. మరి వెళ్తాను" అంటూ గబగబా నీదిలోకి కొచ్చాడు శ్రీనివాసరావు తనూ నవ్వుకుంటూ.
    వచ్చిన పదిరోజులయీ గమనిస్తూన్నా మౌనంగా తనను తాను నిగ్రహించుకున్న శ్రీనివాసరావు. "నైట్ డ్యూటీ కెళ్ళేప్పుడు ఇంత చలిలో అంత పల్చని చీరలేమిటి రమా, చేతులు కాస్త పొడుగ్గా ఉన్న చోటేలయితే బాగుంటాయి" అన్నాడు సాధ్యమైనంత సౌమ్యాన్ని గొంతులో నింపుకుంటూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS