పెరటి తోటలో సపోటాచెట్టు క్రింద నిల్చుంది రమ చల్లగాలికి సన్నజాజిసువాసనలు మత్తుగా గాలితో వీస్తున్నాయి. పక్షుల కిలకిలా రావాలు ఎప్పుడూ పల్లె తోటలూ అక్కడ లభించే అనుభూతులూ చవిచూడవిరమ ఎగిరెగిరి కొమ్మల పై వాలే పక్షుల వైపు చిత్రంగా చూస్తూంది.
"రమా!" మృదు గంభీరమైన గొంతుక పిలుపు-
ఉలికిపాటుగా తలతిప్పి చూసి చప్పున సిగ్గుగా తలవాల్చి పైపంటితో క్రిందిపెదవి నొక్కిపట్టి చీరచెంగు వ్రేలికి చుట్టుకుంటూ కాలి బొటన వ్రేలితో నేలమీద రాస్తూ నిల్చుంది రమ.
గ్రాడ్యుయేట్ అమ్మాయికి కూడా ఇంత సిగ్గుంటుందా ఆమె భజంపై చెయ్యివేసి రెండవ చెయ్యి ఆమె గడ్డంక్రింద ఆన్చి సున్నితంగా ఆమె మొహం తనవైపు త్రిప్పుకున్నాడు శ్రీనివాసరావు.
గ్రాడ్యుయేట్ అయినంత మాత్రాన స్త్రీ సహజ మయిన సిగ్గే లేకుండా పోతుందా? అనాలనుకుంది. కాని అదే సిగ్గు ఆమె మౌనాని కికారణమైంది.
"నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అలా కాస్సేపు కూర్చుందామ్మా?" అన్నాడు తర్జనతో మామిడిచెట్టు క్రింద ఉన్న సిమెంటు బెంచీ చూపిస్తూ.
మౌనంగా అతన్ని అనుసరించింది రమ.
ఇద్దరూ మౌనంగా ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. ఇద్దరి పెదవులపై చిరునవ్వు తొణికిసలాడింది. అతని మధురస్మృతిని చెరపేస్తూ కమ్మని కల కరగిస్తూ సన్నని వానజల్లు కిటికీ ఊచల మధ్యనుంచి శ్రీనివాసరావు మొహానికి కొట్టింది. కిటికీ తలుపులు మూసి కర్చీపుతో మొహం తుడుచుకుంటూ". అబ్బా ఆ నాటి రమ చూపులో ఎంత తియ్యని భావముంది. అలా ఇద్దరం మౌనంగా మూగ దంపతులుగా ఉండిపోతే మా జీవితమెంత సుఖమయమయేది! క్షణ క్షణం సూతీపోటీ మాటలు సన్నని నడవడులు ఎవరి ఇష్టమొచ్సినట్టు వారు మాటలు విసిరి మూతులు ముడుచుకుని మళ్ళీ ఒక దగ్గర చేరడం. "తన్ను సవాలు చేస్తూన్నట్టు నువ్వు ఓడిపోయావు అన్నట్టు రమ కొంటెగా నవ్వడం. తాను ఆమెను దూరంగాతోసి చివాలున లేచి పోవడం, ఏమిటీ దాంపత్యం! ఎవరితో లోపముంది? నాలోనా? రమలోనా?"
కణతలు బలంగా రుద్దుకుని మళ్ళీ గతాన్ని నెమరువేసుకుంటూన్న శ్రీనివాసరావు దృక్పథంలో సినిమా రీలులా. మళ్ళీ కదలిపోతూంది అతనిలో గతం.
* * *
"నేను మీకు నచ్చలేదట. నతహో పెళ్ళి వద్దన్నారట నిజమేనా?" కాస్త కొంటెతనం. కాస్త నిజం తెలుసుకోవాలనే గడుసుతనం మేళవించి చిన్నగా చిలిపిగా నవ్వింది రమ.
మొట్టమొదట తనతో రమ మాట్లాడిన కాదు తన్ను ప్రశ్నించిన. ఆ ప్రశ్నకి కంగారుపడి మళ్ళీ క్షణంలో నిగ్రహించుకుని "ఎవరు చెప్పారు?" పెదాలమీదికి చిరునవ్వు తెచ్చుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు.
"నా అందంమీకు నచ్చలేదా?" అతని ప్రశ్న విన్పించనట్టు అడిగింది రమ.
"నీ అందం నచ్చక పోవడం ఏమిటి? ఎవరన్నా నవ్వగలరు. నువ్వెంత అందంగా ఉంటావో చెప్పనా? విరిసిన గులాబిలా. సంధ్యా రుణ కాంతులలో తెలి మబ్బుల పశ్చిమాకాశం ఎంత సౌందర్యంగా. మనస్సు పరవశింప జేసే దిగా ఉంటుందో అంత అందంగా ఉంటావు."
సిగ్గుపడింది రమ అతనలా ఆమెను చూస్తూ వర్ణిస్తూంటే.
రెండు క్షణా లిద్దరి మధ్యా నిశ్శబ్దంగా దొర్లాయి. శుక్ల పక్ష సప్తమి చంద్రుడు. ఆకాశంలో మెరుస్తున్నాయి. చీకటిని చేలుస్తూ పరుచు కుంటూంది వెన్నెల.
రమ వాచ్ చూసుకుంటూ 'నాతో ఏమో మాట్లాడాలన్నారు.' అంది నెమ్మదిగా...
'ఆ... అదే.... ఈ ఊరు నీకు నచ్చింది కదూ?"....అన్నాడు తడబాటుగా శ్రీనివాసరావు.
"ఒకరోజైతే ఫర్వాలే. బాగుంటుంది. ఈ పల్లె పరిసరాలు కాస్త లైఫ్ కి రిలీఫ్ ఇచ్సినట్టుంటుంది."
రెండు క్షణాల మౌనం తర్వాత మెల్లగా ఆమె ముంగురులు సవరిస్తూ, "ఒక్కరోజు కాదు. ఎప్పుడూ ఈ ఊర్లోనే కమ్మని పెరుగన్నం తింటూ, తియ్యని నీరు త్రాగుతూ, ఈ స్వచ్చమైన గాలి పీలుస్తూ ఇక్కడే ఉండిపోవాలన్పించడంలేదూ రమా!" అన్నాడు శ్రీనివాసరావు.
"అయ్ బాబోయ్. నేను పుట్టిన దగ్గర నుంచీ సిటీలోనే పెరిగాను. ఆ జీవితాని కలవాటుపడి పోయాను. ఎప్పుడైనా ఎక్స్ కర్షను లా వస్తా లెండి మీ ఊరు."
"మీ ఊరా?..."
"అయామ్ సారీ.... మన ఊరు." చిన్న శబ్ద మయ్యేలా నవ్వింది రమ.
అతను బరువుగా నిట్టూర్చి మౌనంగా ఉండి పోయాడు.
"ప్రొద్దుపోయింది.... మరి వెళ్ళనా?"
"నాకేమో ఈ ఊళ్ళో వ్యవసాయం చేయిశూ ఉండిపోవాలనుంది." అన్నాడు శ్రీనివాసరావు స్వగతంలో.
"ఓ ఎస్... అలాగే ఉండిపోండి"
"మరి.... మరి..."
"నేనేం చేస్తాననా? నేనా ఊళ్ళోనే ఉంటాను. జాబ్ చెయ్యాలిగా!"
"ఆహే..... ఎందుకు చెయ్యాలని?" సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు శ్రీనివాసరావు.
నవ్వింది రమ... "ఎందుకేమిటి? డబ్బు కోపం.... చదివిన చదువు వినియోగపరచుకో వడం కోపం.... ఇంకా"
"ఆ... ఇంకా!...." తన్ను తాను ఏదో ఆవేశం నుంచి అణచుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు.
"స్వతంత్రంగా బ్రతకాలని మరోలా ఫీలవరనుకుంటాను" నెమ్మదిగా అంది రమాదేవి.
"ప్చ్..... పొరపాటయింది" గొణిగి నట్టన్నాడు శ్రీనివాసరావు.
"ఏమిటి? ఏమిటి పొరపాటయింది!" కలవరపాటుగా ధ్వనించిందామె గొంతు.
క్షణంసేపు ఆమెవైపు చూసి "ఉద్యోగం లేకపోతే డబ్బు సంపాయించకపోతే నీకు స్వంతంత్రం లేదా రామా! నా ద్బబూ నా ఈ ఆస్తీ నీది కాదా? నేను నీ వాణ్ణికానా! అన్నం బత్తా ఇచ్చి నిన్ను పోషించలేని అసమర్ధున్నీ దరిద్రున్నీ కాదుగా నేను.... నేను.... నేనుండగా నీకు ఉద్యోగం..... ఆ శ్రమా ఎందుకు రమా!" అన్నాడతను.
"థాంక్స్..." తృప్తిగా అతనివైపు చూసిందామె.
"ఉద్యోగం రిజైన్ చేస్తావా?" ఆమె రెండు చేతులూ నొక్కి పట్టుకున్నాడు శ్రీనివాసరావు.
"ఇప్పుడేమిటి తొందర! ఏదోలా చెయ్యొచ్చు. మీకూ ఆ ఊళ్ళో ఏదన్నా పోష్టు దొరుకుతుంది ట్రై చేస్తే" మృదువుగా అతని చేతుల్లోని తన చేతులు తీసుకుంటూ అంది రమ.
నేను ఉద్యోగం చెయ్యను అని ఖచ్చితంగా చెప్పెయ్యాలనుకున్న శ్రీనివాసరావు. ఎందుకనో అలా చెప్పకుండా చిరునవ్వుతో "అలానేలే ఇప్పుడేమిటి తొందర! ఏదోలా చెయ్యొచ్చు" అంటూ లేచి నిల్చున్నాడు.
సంతోషంగా అతనివైపు చూసింది రమ.
* * *
తెల తెల వారుతూంది. మత్తుగా వత్తిగిల్లాడు శ్రీనివాసరావు.
చెరగిన జుట్టూ. నలిగినా చీరా. కంగారుగా లేచి నిల్చుని. వాచ్ కోసం టేబిలువైపు నడవబోయింది రమ.
చప్పున ఆమె చెయ్యి పట్టుకుంటూ....."వెళ్ళిపోకు రామా? కనీసం ఒక్కరోజన్నా సెలవు పెట్టు. మా పొలాలూ, తోటా, హాయిగా తిరుగుదాం." అన్నాడు శ్రీనివాసరావు.
"పొలాలూ, తోటా కాదు.... ఒక నెల లీవు కాంక్షను చేయించుకు వస్తాను. ఇద్దరం హాయిగా దక్షిణాది అంతా తిరిగేదాం" చిన్నగా నవ్వి అతని చెయ్యి విడిపించుకుంది రమ.
"వద్దు....వద్దు" ఉలికిపాటుగా అన్నాడు శ్రీనివాసరావు.
"ఏం? ఎందుకు వద్దు?"
"నెలరోజులు తిరిగిరావాలంటే బోలెడుడబ్బు కావాలి ఒక్క సంవత్సరం పోనీ... అలాగే వెళ్దాం...ఏం? మరేం అనుకోవుకదూ?" లాలనగా ఆమె చెయ్యి పట్టుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు.
"కావాలంటే డబ్బు లేదా! ఏమిటి? పోన్లెండి చెయ్యి దురుసుగా లాక్కుంది రమ.
"ఎలా ఉంటుంది రమా డబ్బు? నేనింకా సెటిల్ కాలేదు. నాన్న రిటైరయారు. ప్రావిడెంటు ఫండ్ వచ్చాక..."
"ఎందుకొచ్చిన కబుర్లండీ! మేమిచ్చిన ఏడువేలూ ఏమయ్యాయ్.... ఒక్క వెయ్యి రూపాయలు.....సర్దాగా ఖర్చుచెయ్యలేరూ?....."
"ఏడువేలు కట్నమిచ్చారా?".....మీ దగ్గర ఏడువేల రూపాయలు తీసుకున్నారా నాన్న? నిజమా రమా? లేచికూచుంటూ అన్నాడు శ్రీనివాసరావు.
"ఓహ్....ఏం తమాషాగా మాట్లాడతారు. రెండెకరాల పొలమేగా ఉన్నది. అది అమ్మాయి పేర రాస్తానని బామ్మ బ్రతిమిలాడింది మీ నాన్నని.... అదికాదు కేష్ కావాలన్నారటగా!"
"ఎవరు?" అరిచినట్టన్నాడు శ్రీనివాసరావు.
"మీరు"
"నేనా?" తెల్లబోయి హతాశుడై పోయాడు శ్రీనివాసరావు, అతనేదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. రమ గబగబా అవతలికెళ్ళిపోయింది.
"ఓ అరగంట తర్వాత అందంగా తయారై వచ్చిన రమ. రేగిన జుట్టూ ఎరుపెక్కిన జ్యోతుల్లా ఉన్న కళ్ళూ ఏదోలాగవున్న శ్రీనివాసరావుని చూసి చలించి. మరుక్షణంలో. "ఏం? ఎందుకని అలా ఉన్నారు! నా మీద కోపమా?" అంది రేగినజుట్టు సవరించి అతని చెంపలు మృదువుగా స్పృశిస్తూ.
"హు! నీ మీద ఎందుకు కోపం! నువ్వేం చేశావ్? .... ఏడువేల రూపాయలకు అమ్ముడు పోయాను......ఛ.....ఛ. ఉండు క్షణం ఆగు వెళ్ళిపోదువుగాని. నీ డబ్బు మీ బామ్మ కట్నంగా ఇచ్చినది నాన్నగారి దగ్గర తీసుకొని ఇచ్చేస్తాను..."
"అంటే?.... అంటే మీ ఉద్దేశ్యం?"
"ఉద్దేశ్యమేంలేదు.... నువ్విచ్చిన కట్నం నీకు పారేస్తాను. ఆ డబ్బు తీసుకువెళ్ళి పొమ్మంటున్నాను."
"మీరు కట్నం తిరిగి యిచ్చినంత మాత్రాన మీ ఇంట్లోంచి పోయేదాననుకాను..." రోషంగా అందామె.
ఆ మాటవిన్న అతను నవ్వాడు చిన్నగా "అది కాదు రామా! కట్నం తీసుకోవద్దని నాన్నతో చెప్పాను. నిన్నేకాదు ఎవర్ని పెళ్ళి చేసుకున్నా కట్నం తీసుకోకుండా పెళ్ళిచేసుకోవాలనుకున్నాను."
"పోన్లెండి మరేం గొడవలు పెట్టుకోకండి. అందరూ ఉపన్యాసాలిచ్చే వారే కాని ఎక్కడ వరకట్నం ఆపగలిగేరు! ఏ పెళ్ళికొడుకు డబ్బు తీసుకోకుండా పెళ్ళి చేసుకుంటున్నాడు?.... ఆ పట్నంలో నాలుగైదువేలు ఖర్చయేపోయి ఉంటుంది..... ప్లీజ్ ఏది నా వైపు చూడండి మీరూ, మీ నాన్నగారూ అనవసరంగా-" అతని గెడ్డం క్రింద చెయ్యి వేసింది.
"టైమయిందేమో వెళ్ళు. నువ్వేం చెప్పక్కర్లేదు నాకు ఆమె చెయ్యి చిరాగ్గా తోసేస్తూ అన్నాడు శ్రీనివాసరావు.
చిన్నబోయిన వదనంతో ఒక్కసారి అతని వైపుచూసి వెనుదిరిగి వెళ్ళిపోయింది రమ.
తాను కోపంగా ఉన్నాడని తనమనస్సు బాగా లేదనీ ఆ పూట రమ వెళ్ళదనుకున్నాడు. తననూ బతిమాలి లాలిస్తుందనుకున్నాడు. ఆమె ఒక్క రాత్రి పరిచయంతో ఆమె వెళ్ళి పోతూంటే తానెలా సహించలేకపోతున్నాడో. ఆమెకోసం తన హృదయం ఎలా తపిస్తోందో. ఆమె కూడా తన కోపం, తనను సంతోషపెట్టడంకోసం ఉండి పోతుందనుకునాడు కనీసం ఆమెతో రమ్మంటుందనుకున్నాడు. తన ఊహలన్నీ కల్లజేసి నిర్లక్ష్యంగా వెళ్ళిపోతూన్న రమవైపు చూసిన శ్రీనివాసరావు మనస్సు మరి నిలవలేక గబగా నాలుగంగల్లో ఇవతలికొచ్చి రమ వెనుక నిల్చున్నాడు. "ఉత్తరం వ్రాస్తూండమ్మా" అంటున్నాడు రంగనాధం. మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మాయీ! అంటోంది జానికమ్మ. "అల్లాగే మామయ్యా. బహుశా ఈ నెల్లో రాలేనేమో అత్తయ్యా!" అంటూ ఒక్క సారి శ్రీనివాసరావు వైపు చూసి ముందుకి నడిచింది రమ.
