Previous Page Next Page 
అరుణోదయం పేజి 4


    "అంతేకాదు... నాకు యిష్టమయిన పనులు నిన్ను ఎన్నో చేయమంటాను....చేయ గలవా?"-ఏదో అవకాశాన్ని జారవిడుచుకోవటం ఇష్టంలేదన్నట్లుగా తొందర పడుతూ అడిగింది.
    "చేయగలిగితే-"
    "నీవు ఆలోచించుకునే ఆస్కారం లేదు. నేను చేయమన్నప్పుడు చేయాలి."
    "అఫ్ కోర్స్ ....... పరుగెత్త మంటే పరుగెత్తలేక పోవచ్చు!" ఫక్కున నవ్వాడు.
    అరుంధతి మొఖం వివర్ణమయింది. జాలిగా కన్నార్పకుండా, అలాగే అతడి వంక చూడసాగింది. కళ్ళను నీటిపొరల క్రమ్మి వేసినయి. ఒక్క సారి బాధగా కనురెప్పలు వాల్చటంతో అప్పుడప్పుడే గూడు కట్టు కట్టుకుంటున్న నీరు పట్టుతప్పి, చెంపల మీదగా గుండెల మీదకు జారినయ్.
    "బావా!"    
    "అరూ!...బాధపడుతున్నావా?.." కంఠం గీరబోయింది.
    "నీవు డాక్టర్ వయి వుండవలసింది!"
    "దేనికి?" వింతగా అడిగాడు.
    "నీ చేత ఏదో వంక పెట్టి నాగుండెల్ని కోయించుకుండేదాన్ని...అప్పటికి నాజీవితంలో శాంతి లభించి వుండేది.!"
    "అరూ!................"
    "నీకు తెలియదు బావా, నాబాధ!..నేను..నేను ఎవ్వరికీ చెప్పలేనిది..... చెప్పలేను గూడా ఎవ్వరికీ! నిజం.....నీకయినా...నీకయినా చెప్పగలుగుతావో లేదో.....చెప్ప గలిగితే...... నేను నిజంగా ధన్యురాలినే!"
    "నన్ను పరాయివాడిగా వూహించుకుంటున్నావా, అరుంధతీ!"
    "నాకు ఈ ప్రపంచంలో నీకు మించిన ఆప్తు లెవరైనా వుంటేగా, అలా అనుకో వటానికి!"
    రాజశేఖరం హృదయం ఆమె మాట లకు ఆనందంతో త్రుళ్ళిపడింది.
    కొద్ది కొద్దిగా అతడి ఆశలు బలం పుంజుకో సాగినయి. ఊహలు రూపాన్ని పొందడానికి తాపత్రయ పడుతున్నాయి. కళ్ళముందు గీసుకుంటున్న పిచ్చిపిచ్చి గీతలు గుమిగూడి, అందమైన బొమ్మలై అందాల్ని పులుము కుంటున్నాయి.....అతడు ఆమె మాటలకు ఉత్తేజితుడయ్యాడు.
    "అరూ!- ఆవేశంగా అన్నాడు.
    గోపన్న వచ్చారు.
    "ఏం గోపన్నా! బాగుడ ఏమీ లేదా?'
    "లేదమ్మా!"
    "అయితే, గులాబీకి పాదు బాగుచేద్దామా" "అంటూనే లేచి నిలబడింది." ఎందుకనో ఆచెట్టున పువ్వులు సరిగ్గా పూయటం లేదు..............మళ్ళీ ఎరుపేధైనా తెప్పించి వేయాలి బావా! అన్నది" అంటూనే గోపన్న వెనకాలే బయటకు వెళ్ళింది.
    రాజశేఖరం మనస్సు మనస్సులో లేదు.
    చేతిలోని పేకను ఊరికినే కలుపుతున్నాడు. దిక్కులు తోచనట్లు, ఆలోచనలకు అంతం లేదన్నట్లు ముక్కలను ఇష్టం వచ్చినట్లు పేరుస్తున్నాడు.
    ఉన్నట్లుండి ఒకముక్కను బయటకు లాగాడు!    
    రాజు!    
    మరోముక్క తీశాడు.
    రాణి!
    కళ్ళు చించుకు ఆబొమ్మ ముఖం లోకి చూడసాగాడు ఆబొమ్మలో ఏదో అందం లోపించినట్లనిపించింది ఆమె ముఖాన్ని ఏదో బోసితనం కప్పి వేసివున్నట్లని పించింది. తరచి, తరచి చూచాడు. కళ్ళముందుకు లాక్కున్నాడు. కళ్ళు నెప్పులు పుట్టేలా కన్నార్పకుండా పరిశీలించ సాగాడు.
    లోపమేదో కళ్ళకు కట్టినట్టయింది.
    కళ్ళు ప్రఫుల్ల మయినాయి.
    పక్కగా కిటికీలో పెట్టివున్న కలాన్ని చేతికి తీసుకున్నాడు.
    'రాణి' నుదుటిమీద కలంతో చుక్కపెట్టాడు.
    "అరుంధతీ!" గొణిగాడు.

                                   *    *    *

    రాజశేఖరం ఆలోచనలనూ, ఆవేశాన్ని అరికట్టుకోలేకపోయాడు.
    భావ పరంపరులు అతడిని ఉక్కిరి బిక్కిరి చేయగా, తనకు ఇన్నాళ్ళూ లేదనుకున్న, తనది కాదూ అనుకున్న తన ప్రియమైనవస్తువు ఈక్షణంలో తనకతినమీపంగా వచ్చి నిలచినట్లు తనదే అవబోతున్నట్లు ఊహించుకొని ఉవ్విళ్ళూర సాగాడు.
    నిన్న అరుంధతి ఆమాట అనేటంత వరకూ తను చీకటిలోనే వున్నాడు. వెలుగును, అరుంధతి మనస్సును చూడలేక పోయాడు. తనని తనే దూషించు కున్నాడు.
    ఒక స్త్రీ-అందునా, పరిస్థితుల ప్రభావంలో, సంఘం కట్టు బాట్లలో ఇరుక్కు పోయి- గిలగిల లాడుతున్న ఆమె యింతకు మించి ఇంకెలా చెప్పగలదు?
    ఈరోజు ఎలాగైనా ఈ విషయాన్ని అరుంధతి ఎదుట తనకు తానుగా కదపాలి.
    ఆమె వాడిపోతున్న చెంపల్లో కెంపులు చూడాలి.
    కుంకుమ లేని కళావిహీనమైన ఆమె ముఖంలో తిరిగి కళాకాంతులు ప్రజ్వలింప జేయాలి.
    ఆమె జీవితాన్ని తిరిగి నూరేళ్ళ పంట చేయాలి.!
    పిడికిలి బిగుసుకు పోయింది.
    తన ఈ నిర్ణయాన్ని ఇంకెవ్వరూ అడ్డగించలేడు.

                                 *    *    *

    పదకొండు గంట లయింది.
    రాజశేఖరం భోజనం చేశాడు.
    అరుంధతి భోజనం చేసింది.    
    అరుణ ట్యూషన్ కు వెళ్ళింది.
    ఇల్లంతా- ప్రశాంతంగా, ఏదో గంభీరంగా- అరుంధతి మనస్సులా- ఆవరించినట్లుగా అనిపించింది రాజశేఖరానికి. మంచంమీద పడుకున్న తను క్షణక్షణానికి ఏదో తెలియని బాధతో కదిలే వాడిలా అటూ యిటూ కదులుతున్నాడు.
    ఆవేశంలో ఉండి ఉండి ఒక్కసారిగా లేవబోతున్నాడు.
    అరుంధతి అప్పటికే పక్క గదిలో మంచం వేసుకొని విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా పడుకున్నది.
    చివరకు, ఒక నిర్ణయానికి వచ్చిన రాజశేఖరం చిన్నగా లేచాడు.
    చేతికర్ర తీసుకొని చంకను తగిలించు కున్నాడు.
    ఒక్కొక్క అడుగే అతి నెమ్మదిగా వేయ సాగాడు.
    అవతల గదిలో కాలు పెట్టబోతుంటే, ఒక్క క్షణం సంశయం ఆవరించగా, వళ్ళంతా చెమటలు పట్టినట్లే ఫీలవ్వసాగాడు.
    తాను పొరబాటు పడుతున్నాడేమో?    
    అరుంధతిని తను తప్పుగా వూహించుకోవటం లేదు గదా?
    మరో అడుగు వేసే టప్పటికల్లా తన ఆ వూహలన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలే అనిపించింది.
    ఆమెకు ఆవిషయం మనస్సులోలేక పోయినట్లైతే ఎప్పుడో మర్చిపోయిన తనను, ఇంట్లోనుంచి వెళ్ళిపోయిన తనను ఎందుకు అంత తాపత్రయపడి పిలిపించుకుంటుంది. వెళ్ళి పోతానన్నా అంత మొండిగా ఎందుకు ఉండమని బలవంతంగా ఆపుతుంది?    
    -మొఖమ్మీద చిరునవ్వు తళుక్కున మెరిసింది!
    దబదబా మరే ఆలోచనా లేకుండా అడుగులు ముందుకు వేశాడు- ఎడంకాలు స్థానంలో వున్న కర్ర చిన్నగా 'టక టక' మంటుండగా!
    అరుంధతి కళ్ళు మూసుకొని వున్నది.
    ఆమె మంచానికి అతిసమీపంగా వచ్చాడు
    మంచం పట్టిమీద ఒకచేయివేసి చంకకింద కర్రను తీసి పక్కన పెట్టాడు ఆవేశంగా ముందుకు వంగాడు.
    నిద్రలో నవ్వుకుంటున్న అరుంధతి మొఖానికి దగ్గరగా తనమొఖాన్ని చేరుస్తూ నెమ్మదిగా, తీయగా, "అరూ!" అన్నాడు.
    ఇంకాస్త ముందుకు వంగాడు. తన చెంపను ఆమెచెంపకు ఆనిస్తూ, "అరు!" అన్నాడు మరోసారి.
    అరుంధతి ఉలిక్కి పడింది.
    తనముఖంలో ముఖంపెట్టి వంగి నవ్వుతూ చూస్తున్న రాజశేఖరాన్ని చూడటంతో కలవర పడిపోయింది. మొఖం పాలిపోగా పెదిమలు ఒణకసాగినయ్.
    రాజశేఖరం మొఖాన్ని చటుక్కున తీసేసిఎగిరి పక్కన నిలబడింది.
    "బావా...................!
    రాజశేఖరం మొఖం సిగ్గుతో వాలి పోయింది.
    ఇద్దరూ నిర్విన్నులయి నోటివెంట మాటరాక నిలబడి పోయారు.
    చటుక్కున రాజశేఖరం, చంకకిందకు కర్రను లాక్కున్నాడు. వెనక్కు తిరిగాడు. తాగినవాడిలా తూలుకుంటూ ఇవతల గదికి రాసాగాడు.
    అరుంధతి గొణిగింది. "నేనెంత అదృష్ట వంతురాలిని.......అరుణ గనుక చూస్తే ఎంత అభాసయివుండేది?"
    రాజశేఖరం ఆ మాటలకు ఒక్కక్షణం కదలలేకపోయాడు!
    అరుణ!....అరుణ గనుక లేకుండావున్నట్లయితే.........?!
    మొట్టమొదటిసారిగా అతడిలో అరుణ మీద తెలియని అసూయా, ద్వేషం ఏర్పడినయి!

                                    *    *    *

                                       2

    "మనం గతాన్ని మరువలేనూ, అరుంధతీ?" ఆనాటి సంఘటన మనస్సులో మెదులుతుండగా, ఓ నాడు విశ్రాంతిగా కూర్చున్నప్పుడు అన్నాడు.
    "అది అయ్యేపని కాదు బావా!" నవ్వింది పేలవంగా అరుంధతి.
    "ఎందుకుకాదు...అంత కష్టమా అది?' ముందుకు వంగాడు ఆవేశం.
    "ఆవేశపడబోకు బావా.. కోరికలు చెలరేగే వేళ మనకు సర్వస్వం చీకటిగానే కనిపిస్తుంది... కోరికలు తీరిన తరువాత సర్వం తేటతెల్లమవుతుంది. నాటి నిజస్వరూపాన్ని, పరిస్థితులను, ఫలితాలను అవగాహన చేసుకోగలుగుతాం.. ఇద నేను స్వానుభవంతోచెబుతున్న విషయం... పోనీయ్, ఇప్పుడవన్నీ ఎందుకుగాని... నిన్ను ఒక్కవిషయం అడుగుదామనుకుంటున్నాను... చెబుతావా?"
    "అడుగు!"
    "కాదులే.. అడగటం కాడు!" తప్పు సరిదిద్దు కుంటున్నట్లు త్వరత్వరగా అన్నది. "కోరుకుంటున్నాను...నీవు కాదూ అనగూడదు బావా!"
    "విషయం చెప్పకుండా వాగ్ధానం తీసుకోవడం మాత్రం ఏం సబబు ... ఒక విధంగా అది జీవితాలతో చెలగాటం లాంటిది!"
    "సరే! ఎందుకు ఈ రభసంతా!" చిన్న నవ్వింది. "నీవు వివాహం చేసుకోవాలి!"
    తిరిగి రాజశేఖరం శరీరమంతా ఆమె మాటలకు ఒక్కసారి జలదరించింది. ఎంత నిగ్రహించుకున్నా కలవరపాటును దాచుకోలేకపోయాడు. మొఖం పాలిపోయి శూన్యంలోకి చూస్తున్నట్లుగా అరుంధతి మొఖంలోకి చూస్తూ కూర్చుండి పోయాడు.
    "నిన్నే బావ!.. ఏవం  ?" అరుంధతి రెట్టించింది.
    "అయితే వ్యక్తిని నిర్ణయించేది నేను!" తన ఆశకు నీరు పోసుకుంటూ అన్నాడు. అతడి మాటలు, చిన్నపిల్లవాడి తప్పటడు గుల్లా వున్నయి.
    అరుంధతి మొఖంలో ఒక్కక్షణం, కలవరపాటు తొంగి చూచింది.
    "నా మీద ఆమాత్రం విశ్వాసం లేదా నీకు" ఏదో గుంభన దాచుకుంటున్న ట్లుంటా అన్నది.
    "ఆహా... అదిగారు.. ఈ కుంటిశేఖరానికి వివాహం అంటే, మరొకరి మెడకు ఉచ్చు బిగించటమే గదా?" తన మామూలు పేలవపు నవ్వు నవ్వాడు. "అందుకనే... ఆ అధికారం నేనే వుంచుకుందామనుకుంటున్నాను!"    
    అరుంధతి మొఖం తెల్లబడిపోయి జాలిగా అతడి కళ్ళల్లోకి చూడసాగింది. ఆమె కళ్ళను నీటి పొరలు క్రమ్మినాయి. ఏదో దృశ్యం కళ్ళముందు కదిలినట్లనిపించగా కళ్ళు రెపరెపలాడించి, రాజశేఖరం మొఖం లోకి బిత్తరచూపులు చూడసాగింది.
    "ఒకప్పుడు స్వార్ధంతో నీకు అన్యాయమూ మోసమూ చేసిన మాట వాస్తవమే కాని ఇప్పుడు నిర్మలమైన మనస్సుతో కోరుకుంటున్నాను- నన్ను నమ్మలేవా? నా మీద ఆ భారం మోపలేవా?" ఏడుపు ఆపుకుంటూ అన్నది.
    రాజశేఖరం జాలితో కరిగిపోయాడు. కాని ఆవేశంతో సర్వం మరిచి, "నేను వివాహమంటూ చేసుకుంటే నిన్ను తప్పా మరెవ్వరినీ చేసుకోను అరుంధతీ!" అన్నాడు.
    తను ఆమెను ఎలాగైనా ఒప్పించాలి!
    తను ఇక జీవితంలో సుఖం అంటూ పొందగలిగితే- అది ఒక్క అరుంధతి తన భార్య అవ్వడంలోనే వున్నది!
    క్షణక్షణానికి అంతస్థుల మీద అంత స్థులు కట్టి వేస్తున్నాడు.
    కళ్ళు వింతగా నవ్వుతున్నయి.
    మనస్సు ఎంతో ఉల్లాసంగా వున్నది.
    తన జీవితంలో- అంతకు మించి కోరుకో దగ్గది ఏవున్నది?
    ఆమె నుండి 'ఎలాటి సమాధానమూ రాకపోవటంతో ఆలోచనలకు ఆనకట్ట వేసి అరుంధతి మొఖంలోకి కన్నార్పకుండా చూచాడు.
    ఆమెను చూస్తూనే ఉలిక్కిపడ్డాడు.
    శిలావిగ్రహంలా కూర్చోని వున్న ఆమెను చూస్తూనే కలవరపడ్డాడు. ఆమె శూన్యం లోకి చూస్తున్నట్లు కనురెప్పలార్పకుండా కూర్చున్నది. ఆమె నుండి ఉచ్చ్వాశ నిశ్వాసలైనా వెలువడుతున్నయ్యా లేదా అన్నంత నిశ్చలంగా కూర్చొని వున్నది.
    ఆమె కన్నుల నుండి నీరు ఉబికి ధారలై కారుతోంది.
    "అరుంధతీ!" చాలా చిన్నగా కలవరపడుతూ పిలిచాడు.
    ముందుకు వంగి, కుడిచేతిని ఆమె భుజం మీద వేసి కదిలించాడు.
    అరుంధతి కళ్ళు రెపరెపలాడించింది.    
    "అల ఎలా ఊహించుకోగలిగావ్ బావా!" నూతిలో నుండి మాటలు వెలువడుతున్నట్లున్నాయి.
    "దానిలో తప్పేవున్నది" ఉత్సాహంగా ముందుకు జరిగాడు. "ఇరవై రెండు సంవత్సరాల్లో జీవితంలో నీ సుఖాలన్నీ హరించి పోయినయ్యా అసలు నీవైనా జీవితాన్ని అనుభవించాలనే సహజ కోరికను అందుకు అణిచి వేసుకోవాలి ... నీవు చేసుకున్న పాపమేమిటి?"
    "నేను చేసుకున్న పాపమేమిటో నాకు తెలుసు.....నా జీవితం ఇలా వెళ్ళిపోవాలని వ్రాసి పెట్టి వున్నప్పుడు....తప్పించటం ఎవ్వరితరం" ఆమె మాటలు చాలా బరువుగా వున్నాయి. "అంతేకాదు బావా!... నీలాంటి వాడికి నేను తగను!"
    "నీ గురించి చెప్పుకోవల్సింది నీవు కాదు. నేను!" తానేదో విజయం సాధించుతున్న ట్లుగా ఉత్సాహితుడవుతున్నాడు రాజశేఖరం.
    అరుంధతి చటుక్కున లేచి నిలబడింది. "ఏవైనా కానీయ్! అది నా నిర్ణయం. బావా!... నీవు అరుణను చేసుకోవాలి... అరుణ నీకు తగిన పిల్ల!" ఒక్కక్షణం కన్నార్పకుండా గూడా అక్కడ వుండలేదు, ఆ మాటలు అన్న తరువాత వడివడిగా వంట యింట్లోకి వెళ్ళిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS