తరువాత పక్కగదిలోకి వడివడిగా వెళ్ళి పోసాగింది.
తలుపు ప్రక్కగా వున్న అరుణ చటుక్కున తలవంచుకొని, కన్నులను చేతిలో తీసుకున్న పుస్తకం మీద కేంద్రీకృతం చేసింది.
"అరూ!.." ఆవేశంగా రాజశేఖరం. లేవబోయాడు. "నీ యిష్టం అరుంధతీ!. నీ యిష్టం.. నీ యిష్టం వచ్చినట్లే వ్రాయి.. సంతకం పెట్టేస్తాను.. వెంటనే వ్రాసేయ్ అరుంధతీ!" మొఖంమీద రెండు చేతలూ కప్పుకొని, తల పక్కకు తిప్పుకున్నారు.
-అరుంధతి మాటలకు ఎదురు చెప్పలేని అశక్తు డెందుకవుతున్నాడో తనకే ఆగమ్యంగా వున్నది!
మొఖాన్ని గోడ వైపుకు తిప్పుకొని పడుకున్నాడు. కళ్ళు మూసుకున్నా నిద్ర పట్టటంలేదు. అరుంధతి కళ్ళ ముందు తిష్ఠవేసుకు కూర్చున్నది.
అరుంధతికి తన మీద ఎందుకంత జాలి ఏర్పడింది?
అరుంధతి తనని, తన ఆచ్చాదనలోకి, తన బంధాల్లోకి ఎందుకు లాక్కుంటున్నది?
అరుంధతే దీనికి సమాధానం చెప్పాలి!
తరువాత పావుగంటకు గాబోలు-చిన్నగా దగ్గిన చప్పుడయితే మెడ ఎత్తి చూచాడు.
అక్కడ నేల మీద అరుంధతి కూర్చోని వున్నది. ఆమె చేతిలో లెటర్ ప్యాడ్, కలమూ వున్నయి.
చిరునవ్వుతో, "చెప్పు.. ఏం వ్రాయమంటావ్?" అన్నది.
"ఏం చెప్పమంటావ్?.. నీవే ఏదో ఒకటి వ్రాసేయ్!" అన్నాడు కళ్ళు సగంవాల్చి.
వ్రాస్తూ, "సామాన్లు గూడా ప్యాక్ చేసి రైల్లో పడేయమంటాను.." అన్నది అరుంధతి తలఎత్తి.
"సామాన్లంటూ ఏంవున్నయి?..పెట్టి, బెడ్డింగ్ కొన్ని పుస్తకాలు!"
అతడు శూన్యంలోకి చూస్తున్నాడు!
* * *
"అరుణకు ట్యూషన్ మాన్పిద్దామనుకుంటున్నాను!" అన్నది అరుంధతి గడప మీద కూర్చుంటూ.
"మాన్పించి?.." తలెత్తి సూటిగా ఆమె మొఖంలోకి చూస్తూ అన్నాడు.
చల్లటిగాలి ఉండుండి మీదగాపోతుంది.
ఆరుబయట పేము కుర్చీల్లో అరుంధతీ రాజశేఖరం కూర్చొని వున్నారు.
అరుణ గడప మీద తలవంచుకు కూర్చుని పక్కన చేత్తో పిచ్చి గీతలు గీస్తోంది.
మళ్ళా రెట్టించాడు. "మాన్పించి ఏం చేద్దామనుకుంటున్నావ్?"
అరుంధతి నవ్వింది.
"అరుణ ఏం చదువుతున్నదో నీకు తెలుసు గదా?"
"మెట్రిక్ కదూ?"
"అవును!"
"బి. ఎ. చదివే వాళ్ళకు ట్యూషన్ చెప్పే నీవు అరుణకు చెప్పలేవా?"
"అయితే నాకు ఉద్యోగం కూడా ఏర్పరుస్తున్నావన్నమాట! "నవ్వి అన్నాడు రాజశేఖరం.
"అయితే జీతం లేదనుకో!" ఫక్కున నవ్వింది అరుంధతి.
"ప్రతిపనికీ డబ్బు లెక్కబెట్టరు ఉద్యోగంలో...ఉద్యోగంలో అంటూ జేరిన తరువాత, ఆఫీసరు ఏం చెప్పినా గొణక్కుండా చేసి తీరాలి!" మరింత పెద్దగా నవ్వుతూ అన్నాడు రాజశేఖరం.
అరుంధతి చటుక్కున తలెత్తింది.
ఆమెముఖం నల్లగా మారిపోయింది.
పెదిమలు భయంతోను, వేదనతోనూ అల్లల్లాడినయ్.
కంఠం గీరబోయింది.
నీరసమైన గొంతుతో, "వద్దుబావా వద్దు అరుణను అక్కడికే వెళ్ళనియ్!" అన్నది. మాటలు నంగి నంగిగా వున్నాయి.
ఎందుకో విచిత్రంగా అరుణమొఖంలోకి చూడబోయింది. కాని, అరుణ అక్కడలేదు.
* * *
రాజశేఖరానికి ఆరాత్రి నిద్ర పట్టలేదు ఆలోచనలు పిచ్చిపిచ్చిగా పోసాగినయ్. అరుంధతి తనను ఎందుకు పిలిపించింది? అరుణని గాకుండా ఏమొగపిల్లవాడినో తెచ్చుకొని పెంచుకొనివున్నట్లైతే-ఆమెకు నిజంగా, ఎప్పటికైనా ఎంతో సహాయకారిగా వుండగలిగే వాడు!
రాజశేఖరం నిద్ర పట్టక అటూ, యిటూ కదలటం చూసి అరుంధతి అడిగింది. "నిద్రపట్టటం లేదా బావా?"
తన మంచానికి వేసివున్న దోమ తెరలో నుండి అరుంధతి తన మంచంమీదలేచి కూర్చోవడం చూశాడు.
"ఉహూ...." అన్నట్లుగా గొణిగాడు...
"ఏదో ఆలోచిస్తున్నట్లున్నావ్?" అతి నెమ్మదిగా ప్రశ్నించింది.
"ఆలోచించటానికి ఏవున్నది?"
"అరుంధతి అనే వలయంలో చిక్కుకొని బాధపడుతున్నావా?" చిన్నగా నవ్వటానికి ప్రయత్నించింది.
"అదేదో భయంకర వలయం అనుకొని మనస్సును ఎందుకు వంచించు కోవాలి.? నాకెందుకో అనిపిస్తోంది- జేరవలసిన చోటుకే జేరనేమోనని!...... జరిగింది ఒక పీడకల అనుకుంటే, ఇకముందు జీవితంలో కొత్తదనం గాని, విచిత్రంగానీ ఏఁవీ కనబడదు!"
"నిజాన్ని పీడకలగా ఎలా ఊహించుకో గలుగుతాం?
"నిజాన్ని నిజంగా క్షణ క్షణం గుర్తుకు తెచ్చుకుంటూ ముందు జీవితంలో పావుకు తినేదేవీ లేదు గనుక!"
"అదేం మాట......నీకు కాలు లేకపోవటమే ఒకపీడ కల అనుకొని, ఇకముందంతా కాలు వున్నట్లుగా నడవగలుగుతావా?"
"చేస్తున్నదదే గదా మరి!" నవ్వాడు విజయం సాధించినట్లుగా.
"కాదు నీవెప్పుడూ అనుకోవటం లేదు. నిజమైన కాలు స్థానంలో చెక్కకాలును ఆసరాగా తీసుకున్నావ్......దానితో జీవితాన్ని గడపటానికి తాపత్రయ పడుతున్నావ్......నీమనస్సంతా రెండుకాళ్ళతోనూ నడుస్తున్న మనుష్యులను చూసి ఈర్ష్య నింపుకుంటున్నావ్!......నీ మీద నీవే జాలి కురిపించుకుంటూ కృంగిపోతున్నావ్......అవునా? నిన్ను నీవు వంచించుకుంటూ నా ప్రశ్నకు సమాధానంగా అబద్ధం చెప్పవద్దు" గంభీరంగా అన్నది అరుంధతి.
ఆమె కంఠానికి అచ్చెరువొందాడు.
తను - కాదు- అని ఎలా అనగలడు?
ఓడిపోయి మౌనాన్ని ఆశ్రయించాడు.
"పిచ్చిబావా!" ఆమె తేలిక పడ్డట్లు నవ్వింది.
మాటమారుస్తున్నట్లుగా, "అరుణ పోషణ భారం నీమీద ఎందుకు వేసుకున్నావో నాకు అర్ధం కావటంలేదు.!" అన్నాడు చిన్నగా.
"పోనీయ్ నీపోషణ భారాన్ని నామీద ఎందుకు వేసుకున్నావో నీకు అర్ధమయిందా?"
రాజశేఖరం గుండె దడ దడ లాడింది.
అతడు సమాధానం చెప్పకపోవడంతో అరుంధతే "నీకు రెండూ ఒకేసారి అర్ధమవుతయిగాని- మనస్సంతా పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఖరాబు చేసుకో బోకు. దుప్పటి బిగించి పండుకొని నిద్రపో?!" అని ఫక్కున నవ్వి అరుంధతి తనపక్క మీద పడుకున్నది.
"అరుణ మీవారి తరుపు బంధువా?" మొండిగా ఇంకా ముందుకు పోసాగాడు తన ప్రశ్నలతో.
అరుంధతి మంచం మీద సగంలేచి చీకటిలో దోమతెర నడుమవున్న రాజశేఖరాన్ని చూడటానికి ప్రయత్నిస్తున్నట్లుగా కళ్ళు చించుకు చూస్తూ.... "అవును, ఆయనకు మరదలవుతుంది....చాలా బీద కుటుంబం.....అంతేగాకుండా ఆమెను అనాధగా చేస్తూ, తల్లి దండ్రులు మరణించారు. అందుకనే నాదగ్గర జేర్చుకొని, ఆమెకు అక్కయ్యనయ్యాను!" అన్నది.
అలా అంటూనే, ఇక ఏవీఁ మాట్లాడటం ఇష్టం లేదన్నట్లుగా, అటు తిరిగి పడుకున్నది అరుంధతి!
* * *
"నీదగ్గర పేకవున్నదా అరుంధతీ!" అడిగాడు రాజశేఖరం.
సరిగ్గా పదకొండు గంటలయింది.
అప్పటికి గంట క్రితం అరుణ ట్యూషన్ కు వెళ్ళింది.
వెళుతున్న ఆమెను చూస్తూ అనుకున్నాడు: "పాపం రోజూ ఆమెను అంతదూరం ఎందుకు పంపాలి.....ఆ చెప్పేదేదో తను చెప్ప గూడదా?.." అని ప్రశ్నించుకున్నాడు సర్వ సాధారణంగా.
"అవును! అనవసరమే!" అని కూడా అని పించింది.
అదే అరుంధతికి చెబుదామనుకున్నాడు.
ఆరోజు అరుంధతి అడిగినవాడు, తను తొందరపడి అనుకోకుండా అలా అనేశాడు. తన మాటలకు అరుంధతి మనస్సు గాయపడింది. అందుకనే ఎన్నడూ ఆ విషయం ఆమె ముందు ఎత్తలేదు.
అరుంధతి ఎదురుగా ఫేము కుర్చీ తెచ్చుకు కూర్చొని, పేక మ
ంచం మీద పడేసింది.
రాజశేఖరం పక్కగా వున్న స్టూలును మధ్యకు లాగాడు.
"నేను అరుణకు చదువు చెబుదామనుకొంటున్నాను." అన్నాడు ఉన్నట్లుండి పేకను కలిపే వాడల్లా ఆగి తలెత్తి.
అరుంధతి నిశ్చలంగా రాజశేఖరం మొఖం లోకి చూచింది.
"అది అంతగా నాకిష్టంలేదు!"
"ఎందుకని అంటే- ప్రతి ప్రశ్నకు సమాధానాలు చెప్పటం కష్టం!-నాకిష్టం లేదు అంతే!" అన్నది గంభీరంగా.
"నీకెందుకు ఇష్టంగా లేదో నాకు తెలుసు. ఆరోజు నేనన్న మాటలు నీకు కష్టం కలిగించినయ్ కదూ?.....అవునా...."
"అయితే ఈరోజున ఈ ప్రసంగమూ నాకు కష్టం కలిగిస్తుంది......నీవు మానుకుంటావా మరి."
దెబ్బతిన్నట్లుగా ఆమె ముఖంలోకి, చూచాడు.
