" వద్దండి-ఇక్కడికి రావటమే నేరం చేసినంత బాధ కల్గిస్తుంటే ఇంకా కూర్చోవటం కూడానా!"
" శ్రీనివాస్ అనే కుర్రాడు తెలుసా!"
" ఏ శ్రీనివాస్!"
"పార్వతమ్మ అనే సాలేరు.భార్య.ఆమె కొడుకు."
!ఓం-సాంబశివా! -అలాంటి పేరు కూడా విన్నట్టు లేదు."అన్నాడు.
"అయిసీ-పార్వతమ్మ కొన్నాళ్ళు పాలు తెచ్చేదట మీ గుడికి"
"తెస్తే తెచ్చిందేమో స్త్రీలను చూడటం మహాపాపం అనుకునే వాడిని,"అన్నాడు.
"మీరు ఆమెతో మాట్లాడేవారని ఆవిడ అంటున్నారు."
"శివార్పణం! మాట్లాడితే , మాట్లాడానేమో, కొన్నిసార్లు మాట్లాడక తప్పదుకదా"అన్నాడు.
" మరి అలాంటప్పుడు శ్రీనివాస్ ను చూడలేదా!"
"చూస్తే, చూచానేమో,అతనే శ్రీనివాస్ అని నాకేం తెలుసు!"అన్నాడు.
" శివ శివ యనరాదా ఓ మనసా-" అంటూ గొణుక్కోవటం మొదలు పెట్టాడు.
డి.ఎస్.పి. గారు తలపంకించాడు.
"పాలుపోసే పార్వతమ్మ కొడుకు శ్రీనివాస్ కనిపించలేదని అతను ఆఖరుసారిగా కనిపించింది, మధుమూర్తి స్కూటరెక్కి మీ గుడికి వచ్చాడనే మాకు రిపోర్టు వచ్చింది" అన్నాడు.
"వస్తే రావచ్చు. మేం పూజలో వుంటాము,.అవన్నీ గమనించం" అన్నాడు.
"ఐసీ-మీరు బయట కూర్చోటానికి అభ్యంతరం లేదుగా."
"పోలీసుస్టేషన్ కు రావటానికి అభ్యంతరం లేదుగా."
"పోలిసు స్టేషన్ కు రావటానికి అభ్యంతరం పెట్టాలి. శివా- పరమశివ! ఏం పాపం చేసాను తండ్రీ" అన్నాడు.
"ఊర్కోవయ్యా! మీదొంగేడ్పులు నువ్వూను." అప్పుడే వచ్చిన ఎస్సై కసురుకున్నాడు.
"స్వరం శివార్పణం!బయట నిలబడి ఉంటాను. పిలిపించండి. అతను వెళ్ళిపోయాడు.
"ఇతని గురించి ఏమయినా తెలుసా!"
"ఒట్టి పిచ్చి మాలోకం సర్-"
"ఐసీ.... వీరప్పను పిలిపించండి."
వీరప్ప వణుకుతూ వచ్చి నిలబడ్డాడు.
"నాకేం తెలియదుసార్.... నన్ను చంపొద్దు.... నన్ను చంపవద్దు."
" నిన్ను చంపుతామని యెవరన్నారు?"
"ఆ....ఆమె.... నాకేం తెలియదు....." వచ్చి డి.ఎస్.పి. గారి కాళ్ళు పట్టుకున్నాడు.
" నిన్ను చంపుతామని ఎందుకు భయపడుతున్నావ్."
అతను జవాబు చెప్పలేదు.
అతను కట్టుకున్న ధోవతి తడి అయింది.
డి.ఎస్.పి. గార్కి చిరాకు, విసుగు, కోపం కలిగాయి.
" చాల్లే భోగం వేషాలు!"
" అయ్యా!-నాకేం తెలియదు నన్ను చంపొద్దు-"
"నిన్నెవరు చంపుతున్నారయ్యా-లేచి కూర్చుని అడిగిన వాటికి జవాబు చెప్sపు."
"నాకేం తెలియదు దొరా! నన్ను చంపొద్దు-"
"నోరుముయ్యి-శ్రీనివాస్ అనే కుర్రాడు తెలుసా!"
"నాకేం తెలియదు దొరా-నన్ను చంపకండి- నన్ను చంపకండి." ఏడ్వటం మొదలుపెట్టాడు.
"నిన్నెవరు చంపుతారు! అంతా నీ భయం. మేము అడిగినవాటికి జవాబు చెప్పు చాలు."అన్నాడు.
" అయ్యనాయనోయ్. నాకేం తెలియదండి. నన్ను చంపొద్దు."
"ఈ చంపటం పిచ్చి పట్టుకుదేమిటి!యెవరు చంపుతారు ? ఒక్క విషయం చెప్పు శ్రీనివాస్ తెలుసా!"
"తెలుసండి- రోజూ దండంపెట్టుకుంటాను. శివుడి గుడిలో వుండి ఆ శ్రీనివాసుడికి, ఏడుకొండలవాడికి దండం పెట్టటం పొరపాటే నండి-"అన్నాడు భయంగా.
