"పురషోత్తమరావు కూతురు ఆస్పత్రిలో ఉన్నదట. అక్కడికి వెళ్ళారు సర్."
" పరవాలేదు." అన్నాడు డి.ఎస్.పి.
" ఇక్కడెందుకు సర్! మనింటికి వెళ్దాం రండి." అన్నాడు మధుమూర్తి.
"పరవాలేదు.మధుమూర్తి గారూ! నేను ఇన్వేస్టిగేషన్ కోసం వచ్చాను. మీరంతా సహకరిచాలి." అన్నాడు.
" అది మా డ్యూటీ సర్." అన్నాడు మధుమూర్తి సిన్సియర్ గా.
" మీరంతా కూర్చోండి. రండి మధుమూర్తిగారూ! ఇద్దరూ లోపలికి వెళ్ళారు.
"కూర్చోండి....." ఇద్దరూ కూర్చున్నారు.
"మీ ఊళ్ళో శ్రీనివాస్ అనే కుర్రాడు వుండే వాడని కనిపించటం లేదని మాకు రిపోర్టు వచ్చింది."అన్నడు.
మధుమూర్తి గంభీరంగా నవ్వాడు.
"సర్! శ్రీనివాస్ అనే కుర్రాడు మాకు తెలుసు. మా అమ్మాయిఅంటే చెల్లెలుతో ప్రేమాయణం కూడా సాగించాడు.ఆతరువాత కనిపించ లేదంటున్నారు. " అన్నారు.
"అదే- మాకు ఇచ్చిన కంప్లంయింట్ లో ఆఖరుసారిగా మీతో చూశానంటోంది. అతని తల్లి."
"అదే ఆఖరు అని నాకు తెలియదుగాని ఆ అబ్బాయిని తీసుకువచ్చి మంచి చెడు చెప్పాను. ఈ ప్రేమ.దోమ ఆవేశంలో ఆలోచించనియ్యని విషయాలు, వాస్తవం ఆలోచించమన్నాను."
" ఏ విషయంలో?"
" అదే మా రాధికను ప్రేమించే విషయంలో .అంతస్తులు వేరు, ఆస్తి, పాస్తులు లేనిదే ఆడపిల్లలు ముఖం కూడా చూడరని చెప్పాను."అన్నాడు.
"శ్రీనివాస్ మీతో ఏకీభవించాడా!"
"మొదట ఏకీభవించలేదు. తరువాత నేను చెప్పింది నిజమేనని అంగీకరించాడు."
" తరువాత?"
" ఏముంది? అతన్ని ఇంటిదగ్గర వదిలి పెడతానన్నాను. అంగీకరించలేదు. 'నేను వెళ్ళగలను' అన్నాడు."
" ఆ తరువాత మీ రతన్ని చూడలేదా?"
"అదేం ప్రశ్న సర్! చూడవచ్చు. చూడకపోవచ్చు. ఎందుకంటే అతను ప్రముఖ వ్యక్తికాడు." అన్నాడు.
" ఐసీ!మరి అతను ఆరోజు నుండే కనిపించలేదుట..."
"కావచ్చు ఒక ధనవంతుల పిల్లతో ప్రేమ నటిస్తే వచ్చేలాభాలు తెలుసు. తనకు ఆస్తి లేకపోయినా ఆ అమ్మాయి తెస్తుందని తెలుసు.అది సాధ్యపడదంటే ఆశాభంగం పొందవచ్చుకదా!"
" నిజమే-ఆత్మహత్య చేసుకోవచ్చునంటారా!"
"అవకాశం లేకపోలేదు."
"శవమయినా దొరకాలి కదా.!"
"ఇక్కడే చేసుకున్నాడో మరెక్కడయినా చేసుకున్నాడో మనకు తెలియదుకదా" అన్నాడు.
ఎన్ని రకాలుగా ప్రశ్నించినా మధుమూర్తి దగ్గరనుండి అదే జవాబు వచ్చింది.
అతడిని బయట కూర్చోమని బసవప్పను పిలిపించాడు.
"దండాలు బాబూ-దండాలు-" అమాతంగా డి.ఎస్ .పి. కళ్ళపై పడబోయాడు అతను.
"ఛ-ఛ-ఏమిటిది?"
" అదే నేను అడుగుతున్నాను. ఆ శివుడి పేరున బ్రతికే మాకు ఈ శిక్ష ఏమిటి!"అన్నాడు లేచి.
అతను నల్లగా ,దిట్టంగా ఉన్నాడు. కాని పంచెకట్టాడు. భుజంమీద ఎర్రగళ్ళు తుండు వుంది. భుజాలదగ్గర, నుదుట విభూతి రేఖలున్నాయి.
"నిన్ను శిక్షించేదేవరయ్యా!" చిరాకుగా అడిగాడు.
" అభిమానధనుడికి పోలిస్ స్టేషన్ కు రప్పించటంకంటే పెద్ద శిక్ష ఏముంది! శివా-పరమశివా రక్షించుంతండ్రీ-"అన్నాడు.
"కూర్చో- నేను అడిగినవాటికి జవాబు చెప్పు." అన్నాడు చిరాకుగా.
