Previous Page Next Page 
ఒప్పందం పేజి 38

 

    అబ్దుల్ కలాం గారి 'ఒక విజేత ఆత్మకధ' చదువుతూ కూర్చున్న నాకు చాలాసేపటికి కానీ ఆఫీసులో ఎవరూ లేరన్న విషయం అర్ధం కాలేదు. చూస్తె టైం ఒంటిగంట. సెక్షన్ మొత్తం ఖాళీ....చాయ్ తాగడానికి వెళ్ళిన రుకియా కూడా రాలేదు. ఏమైందివాళ ఏదన్నా బంద్ ఉందా? ఈమధ్య ఏ క్షణాన బందో ఏ క్షణాన ధర్నా జరుగుతుందో తెలియడం లేదు. నేను సీటు లోంచి లేచి బైటికి రాబోతోంటే వచ్చింది రుకియా. "ఎక్కడి కెళ్ళావు? ఇంకా ఎవరూ రాలేదేంటి? ఇవాళేమన్నా బంద్ ఉందా!"చిరాగ్గా అడిగాను.
    "అరె బందేమ్లేద్ మేడమ్. మన టెలిఫోన్ ఆపరేటర్ మేడమ్ కా పతీకా ఇంతేఖమ్ హోగయ్ కతే సబ్జనే వహ గయే కతే గిప్పుడే వస్తున్రు" అంది.
    టెలిఫోన్  ఆపరేటర్ రేఖ ....అరె రేఖ భర్త పోయాడా.... పాపం.... వచ్చే ఏడాది పదవీ విరమణ చేయబోతున్న రేఖకి అకస్మాత్తుగా ఎంత కష్టం వచ్చింది.
    నేను భాధపడుతుండగానే కొంతమంది స్టాఫ్ వచ్చారు. కొందరు అటు నుంచి అటే ఇళ్ళకు వెళ్ళిపోయారు. ప్రజాస్వామ్య దేశం కదా! పెళ్ళిళ్ళకు, చావులకు హాజరవడానికి మా ఉద్యోగులకి ఎవరి అనుమతి అవసరం లేదు. ఇది మా ప్రాధమిక హక్కు వీలైతే వస్తాం ఆఫీసుకి. లేకపోతె ఇంటికి వెళ్ళి బడలిక తీర్చుకుంటాం. అందుకే వెళ్ళిపోయిన వాళ్ళ గురించి వదిలేసి రేఖ భర్త మరణానికి కారణం వాకబు చేయసాగాను.
    ఆమె భర్త చాలా ఆరోగ్యవంతుడు. కానీ హటాత్తుగా రాత్రి హార్ట్ ఎటాక్ వచ్చింది. హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళే లోపే పోయాడు. హటాస్మరణం సంభవించడం పున్యాత్ములకే దక్కుతుంది. "హీ ఈజ్ వెరీ లక్కీ" కానీ, "రేఖ వెరీ అన్ లక్కీ" ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇద్దరూ మగపిల్లలు . రేఖ ముప్పై ఏళ్ళ నుంచీ మా ఆఫీసు లో టెలిఫోన్ ఆపరేటర్ . ఆమె భర్త పంచాయితీ డిపార్ట్ మెంట్ లో ఈమధ్యే సీనియర్ క్లర్క్ గా పదవీ విరమణ చేశారు. మగపిల్లలందరూ దుబాయ్ లో ఉద్యోగాలు చూసుకుని వెళ్ళిపోయారు. రేఖ ఒంటరి దైంది  
    ఈమధ్య సాప్ట్ వేర్ వాళ్ళంతా అమెరికా కి, కాని వాళ్ళు కొందరు ఆస్ట్రేలియా కి , కొందరు గల్ఫ్ కంట్రీస్ కి వెళ్ళడం మామూలు విషయం అయింది. ఏం చేస్తారు పాపం? స్వదేశంలో యువత అవసరం కనిపించడం లేదు. రాజకీయాల్లో ఎనభై ఏళ్ళ వాళ్ళు ఉండడం లేదా అంటూ పదవీ విరమణ వయసు పెంచమని ఉద్యోగుల పోరాటాలు, ఆరాటాల మధ్య కొత్త రిక్రూట్ మెంట్స్ లేవు. సాప్ట్ వేర్ కి తప్ప సాధారణ చదువులకి విలువ ఉండడం లేదు. అంతా ప్రవేటు మయం. అవుట్ సోర్సింగ్ మయం. లేదంటే పయనం. కాదంటే మీడియా అభయం. అప్పటిలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంతగా లేవు. స్టెనో లు, టైపిస్ట్ లు ఏమీ లేవు. అందుకే పేరెంట్స్ అంతా పిల్లలు పుట్టగానే మెంటల్ గా ప్రిపేర్ అయి పోతున్నారు. వీళ్ళు అబ్రాడ్ వెళ్ళడం ఖాయం అని. అందుకే భార్యాభర్త లలో ఎవరు పోయినా రెండో వాళ్ళు ఒంటరిగా ఉండడంలో ఆశ్చర్యం గానీ, బాధ గానీ కలగడం లేదు.
    రేఖ పదిహేను రోజుల తరువాత ఆఫీసు కి వచ్చింది. ఈలోగా నేను కూడా ఒకసారి వాళ్ళింటికి వెళ్ళి ఆమెని పలకరించి వచ్చాను. బాగా ఏడ్చింది. "ఇంక నాకేం మిగిలింది మేడమ్. నేనెవరి కోసం బతకాలి" అంది. ఇలాంటి సమయాల్లో ప్రతివాళ్ళు వేసే ప్రశ్న ఇదే. కాకపోతే నేను ఒకటే అంటాను. ముందు "ఎవరి కోసం ఇంతకాలం బతికాను" అని ప్రతివాళ్ళు తమని తాము ప్రశ్నించుకోవాలి. తరవాత ఇకముందు ఎవరి కోసం బతకాలి అనే ప్రశ్న వేసుకోవాలి" అని అదే చెప్పి ఓదార్చి వచ్చాను.
    ఎప్పుడూ బాగా అలంకరించుకుని, జడలో ఏనాడూ పూవులేకుండా ఆఫీసుకి రాని రేఖ విషాదం మూర్తీభవించినట్టు రావడం చూడలేకపోయాను. రకరకాల స్టిక్కర్ల తో కనిపించే నుదురు నల్లటి చుక్కతో ఉంది. ఐలైనర్తో అంతో, ఇంతో అందంగా కనిపించే కళ్ళు కళావిహీనంగా ఉన్నాయి. పూలు లేని జడ బోసిగా ఉంది.ఈమధ్య వర్క్ చేసిన చీరల్తో ఎక్కువగా కనిపించిందేమో ఆమె కట్టుకున్న చీర కూడా సింపుల్ గా ఉంది. మొహాన నవ్వులేదు.
    నా సీటు దగ్గరికి పిలిపించుకుని చెప్పాను -- "ఈరోజుల్లో ఎవరు పాటిస్తున్నారివన్నీ .....ఎందుకిలా వచ్చావు?' అని.
    ఏమీ మాట్లాడలేదు.
    "పోయినవాళ్ళతో పోలేము, అలా అని వాళ్ళు లేరని తిండి, నిద్రా మానము కదా' అన్నాను.
    "ఏమో మేడమ్ లైఫ్ అంతా ఏమి చేయాలో తెలియడం లేదు. ఇంక నాకు లైఫ్ ఏం ఉంది?" మా ఆయన్తోనే పోయింది.
    'అలా అనకు. అలా అనుకుంటే ఎవరూ బతకలేరు. వాళ్ళంతా బతకడం లేదా" అన్నాను నాకాబిన్ బైట కబుర్లు చెప్పుకుంటున్న క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్ నిచూపిస్తూ, వాళ్ళంతా భర్తలు చనిపోగా వాళ్ళ స్థానం లో ఉద్యోగాలకి వచ్చినవాళ్ళు .అందరికీ ఎన్నో సమస్యలు. భర్తలు తాగుబోతులై ఇళ్ళు....ఒళ్ళు.... గుల్ల చేసుకుని అప్పులని, గంపెడు పిల్లలని వదిలి అకాల  మరణం పొందిన వాళ్ళు. నానా అగచాట్లు పడుతూ ఆ అప్పులు తీర్చుకుంటూ చావలేక బతుకుతున్నా మొహాల్లో చిరునవ్వులు చెదరవు. వాళ్ళెప్పుడూ "మేమెవరి కోసం బతకాలి" అని ప్రశ్నించడం నాకు తెలియదు. క్యా కర్నా బచ్చోంకే లియా జీనా పడ్తా'.... పిల్లల కోసం బతకాలి అనుకుంటూ మానసికంగా పరిణితి పొందిన వాళ్ళు.
    "పిల్లలుకూడా ఎవరి దారిన వాళ్ళు పోయారు. ఒంటరిగా బతకడం ఎట్లా? భయం వేస్తోంది."
    "భయమా? నాకు భయం గురించి తెలియదు. అందులోనూ ఒంటరిగా బతకడం గురించి అసలే భయం లేదు. గత పదేళ్ళుగా అంటే అమ్మా, నాన్న పోయినప్పటి నుంచీ ఒంటరిగానే బతుకుతున్నా. నాకు వేరే వాళ్ళతో కలిసి బతకడం అంటేనే భయం. వాళ్ళ బలహీనతలను భరించాలంటే భయం. వాళ్ళ హిపోక్రసీ ని చూస్తూ బతకడం మరీ భయం. వారి ప్రేమాభిమానాల్లో నటన అంటే భయం. మమతానురాగాలకన్నా, మనీ రాగాలంటే భయం. నాకు నా పుస్తకాలే తోడుగా, నా సిద్దంతాలే నీడగా నిర్మలంగా బతికే ఈ బతుకంటే ఏ భయం లేదు. అవన్నీ అనలేదు నేను. అన్నా కూడా ఆమెకి అర్ధం కావని తెలుసు.
    ఆమె కూడా ఏమీ మాట్లాడలేదు.
    నా మాటలు ఏమన్నా ప్రభావం చూపించాయేమో అని రెండు రోజులుగా పరిశీలించా. పెద్దగా ఫలితం కనిపించలేదు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. మా ఆఫీసులో ఒక పక్క రూల్స్, మరో పక్క ప్రజాస్వామ్యం యధాప్రకారం సాగిపోతూనే ఉన్నాయి. ఐదారు నెలలు గడిచిపోయి ఉంటాయి. నా రిటీన్ లో మార్పు లేదు. రాదు కూడా. ఆఫీసులో కూడా మార్పు ఏం ఉంటుంది? బ్రిటీష్ కాలం నాటి అవే జీవోలు....అవే రూల్స్ అయితే చిన్న కెరటం లాంటి మార్పు. అది రేఖలో....
    భర్త పోయాక కలిగిన మార్పులో కొద్దిపాటి చైతన్యం. ఆమె ఇప్పుడు మాములుగా తయారవుతోంది. అప్పటిదాకా ఆమె మీద కుండల కొద్ది సానుభూతి కురిపించిన మా స్టాఫ్ లో గుసగుసలు మొదలయ్యాయి.
    రకరకాల స్టిక్కర్స్, ఐలైనర్, మంచి చీరలు ముందు గమనించిన మార్పులు. జడలో మల్లెపూల దండ, తరువాత గమనించిన మార్పు. పోనీలే ఆమెలో ఆత్మవిశ్వాసం కలిగినట్టుంది. వయసుకి తగిన మానసిక పరిణతి రావాలి కదా! ఆమె పదవీ విరమణ కాలం దగ్గరికి వచ్చింది కూడా అనుకున్నా..
    కాని మిగతావాళ్ళు మాత్రం ఎబ్బెట్టు గానే చూశారు.
    నాక్కూడా.... ఎక్కడో... ఏ మూలో.... ఇలాంటి భౌతికమైన సాంత్వన అవసరమా? ఈ వయసులో అనిపించింది. కానీ అలా అనుకోడం సంస్కారం కాదని నన్ను నేను మందలించుకున్నా, ఎవరిష్టం వారిది. ఆమెకి జీవితంలో అలంకరణకి అంత ప్రాధాన్యం ఇచ్చిందేమో! దానిదేం ఉంది. భర్త పోయినవాళ్ళు అలంకరించుకోకూడదా!
    అయితే ఆరోజు తెలుసుకున్న విషయంలో ఆమె మీద జాలిపడాలో? అ మానసిక బలహీనత మీద కోపం తెచ్చుకోవాలో తెలియలేదు.
    నేను ప్రతి ఆదివారం  క్రమం తప్పకుండా వెళ్ళే బాబా గుడికి ఆ ఆదివారం రేఖ వచ్చింది. ఒక్కతే రాలేదు. పక్కన ఎవరో పెద్దాయన ఉన్నాడు. మొహంలో ఏదో తృప్తి మరేదో ఆనందం కనిపిస్తున్నాయి. కొంచెం నా మనసులో ఎక్కడో చిన్నగా ఇబ్బందిగా అనిపించింది. మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకుని ఏమోలే వాళ్ళన్నయ్యో....బంధువో  కావచ్చు అనుకున్నాను.
    కానీ అదే వ్యక్తీ ఓసారి సినిమా హల్లో కనిపించడం, నవ్వుతూ, తుళ్ళుతూ ఉండడం నేను తట్టుకోలేక పోయాను. ఆవ్యక్తి ఎవరో కాదు, అక్కగారు చనిపోతే రేఖ కి భర్తగా మారిన ఆమె బావగారే అని తెలిశాక ఆ వాస్తవం జీర్ణించుకోడం చాలా కష్టమై పోయింది.
    అవసరమా ఈ వయసులో మరో పెళ్ళి? దేనికోసం చేసుకుంది? తోడు కోసమా? అరవై ఏళ్ళకి చేరువవుతున్న ఈ వయసులో మగతోడే కావాలా? సెక్స్ కోసమా? ముప్పై ఏళ్ళు అనుభవించిన ఆజీవితం మీద ఇంకా మోజుందా? వగైరా ప్రశ్నలతో నా మెదడు వేడెక్కింది.
    ప్రజాస్వామ్యానికి బ్రిటీష్ కాలం నాటి రూల్స్ కి పొంతన లేని పద్దతులతో రాజీపడి ఉద్యోగిగా ఇరవై ఏళ్ళ నుంచి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న నేను.... రేఖ ఎంచుకున్న చివరి మజిలీ ని మనస్పూర్తిగా అభినందించాలో ? లేదో అనే సందిగ్ధం లో ఉండగానే రేఖ ఉద్యోగం మానేసి వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుంది.

                                     ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS