"మంచి సంబంధాలు రాలేదా?"
"సర్! ఆయనవైపు చూసి అంది. "నేను మన వూరు వన్ టవున్ యస్సై అనీల్ పెళ్ళి చేసుకోవాలని ఏనాడో నిశ్చయించుకున్నాం. వాళ్ళ అమ్మగారు ఒప్పుకున్నారు. నేనే అడ్డు చెబుతున్నాను. మా ఇంటి విషయాలు ఒక కొలిక్కివచ్చి కనీసం మా తమ్ముడి చదువు అయ్యేదాకానయినా ఆగమనికోరాను!" నిదానంగా చెప్పింది.
కంగ్రాట్స్ చెప్పాడాయన.
ఇక వెళ్ళొస్తానన్నట్టుగా లేవబోయింది.
"నేనో సలహా చెప్పమంటారా?"
"విత్ ప్లెజర్!"
"మీరిద్దరూ పెళ్ళి చేసుకోండి త్వరగా, నైతికంగా అతని తోడు మీకెంత వుంటుందో మీకు అనుభవ పూర్వకంగా తెలియదు. రెండు సంవత్సరాలుగా ఇష్టపడుతున్నా డంటే అతను మీకోసం వెయిట్ చేస్తున్నాడంటే అతన్ని మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు."
తలూపింది నంద.
"మీ నిర్ణయాన్ని జంటగా వచ్చి తెలియజేస్తే చాలా సంతోషిస్తాను!"
ఆమె కళ్ళల్లో ఆశ మెరిసింది. సూటిగా ఆయన్ని చూసింది. ఆయన కళ్ళల్లో ఏవో దుఃఖ వీచికలు- ఏవో స్మృతులు తాలూకు బాధలు.
"సెలవు!" కృతజ్ఞతా పూర్వకంగా అంది. ఆమెకి ఆయన మాటలు, ధోరణి అంతా వింతగా అనిపించాయి.
ఆఫీసర్ గదిదాటి వచ్చీరాగానే ఆమెకి పాత ఆఫీసరు అతని ప్రవర్తన గుర్తుకు వచ్చాయి.
సీట్లో కూర్చున్నా ఆ విషయాలే మెదిలాయి మదిలో.
22
"రండి! రండి! ఆప్యాయంగా పిలిచాడు పరమేశ్వర రావు. అతనికి నందని చూస్తే ఒళ్ళు తెలియదు. ఆమె పచ్చని శరీరఛాయ చూస్తే అతనికి కళ్ళు గిర్రున తిరుగతవి. ఎత్తయిన ఆమె ఒంపుసొంపులు చూడగానే అతను మెలికలు తిరిగి పోతాడు. శిల్పాకృతిలో చక్కని శిల్పి మలచినట్లుగా వుండే ఆమె అవయవాల పొందికని చూస్తేనే అతని శరీరం అష్టవంకర్లు తిరుగుతుంది.
కుర్చీలో కూర్చుంది నంద.
"మీ ఇంక్రిమెంట్ బిల్ చేశారా?"
తలూపింది నంద.
"వెరీగుడ్! హెడ్ క్లర్క్ చాలా చురుకైన మనిషి. నేనేదయినా చెబితే అది నా పర్సనల్ విషయమన్నట్టుగా చూస్తాడు. అందులో నీ విషయం చెబితే క్షణం కూడా ఆగడు!" వెర్రిగా నవ్వుతూ అన్నాడు.
"థాంక్స్!" అంది నంద. ఆమెకి అలా వినటం ఎబ్బెట్టుగా వుంది.
"ఒకమాట!" మెల్లిగా అన్నాడు.
"చెప్పండి సర్!"
"మీ సీటు చాలా వాల్యూబుల్! మన శివసుందరానికి స్టెల్లాకి, చంద్రమౌళికి అందరికీ ఆ సీటు మీదే దృష్టి!"
"ఎందుకు సర్?" అమాయకంగా అడిగింది నంద.
"వెర్రిదానివా?" అన్నట్టు చూశాడు. ఆఫీసరు - మీ సీటు కల్పవృక్షం లాటిది. ప్రతి ఫైలూ కదలాలంటే కనకవర్షం కురిపిస్తేనే కదులుతుంది! అది మీరు గుర్తుంచుకోవాలి మీరు ఒక్క రోజు డిలేచేస్తే వాళ్లకి చాలా నష్టం! అందుకని మీరు అడిగింనంతా యిస్తారు!!"
"లంచమా?" ఆశ్చర్యంగా అడిగింది.
అతను కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు. ఎలా చెప్పాలా అన్నట్టుగా కుర్చీలోంచి లేచాడు. అటు తిరగ్గానే ఫ్లాస్కు కనిపించింది. రెండు కప్పుల్లోకి టీ వంచి, "తీసుకోండి" అన్నాడు.
"థాంక్స్!" చెప్పి టీ తాగేసింది.
నందకి ఈ విషయాలు చాలా కొత్తగా, వింతగా, అసహ్యంగా వున్నాయి__ లేవబోయింది ఆమె.
"ప్లీజ్ సిడవున్! డబ్బు తీసుకోవటం నీ కిష్టం లేకపోతే వదిలెయ్!"
"అలాగే సర్?"
"పార్టీలను ఇక్కడికి పంపించు నేను ఒ.కే. చెయ్యందే నువ్వేం బిల్లులు పాస్ చెయ్యకు."
తలూపింది ఇక తప్పదన్నట్టుగా.
"థాంక్యూ!" సంతోషంగా అన్నాడు ఆఫీసరు.
"వస్తాను సార్!"
"మీ మారేజ్ ప్రపోజల్స్ వున్నాయా?"
నంద ముఖం ఎర్రనైంది.
"అహ అపార్ధం చేసుకోవచ్చు-ఒకమాట చెబుతాను!"
మెల్లిగా లేచి వచ్చి నంద కూర్చున్న కుర్చీ వెనుక నించున్నాడు.
అది చూసి నంద లేవబోయింది.
"ఫర్వాలేదు కూర్చో! మన మధ్య ఇక ముందు ఇలాంటి ఫార్మాలిటీస్ ఎందుకు నువ్వు సరేనంటే అన్నీ సర్దుకుపోతాయి!" అన్నాడు వెగటుగా నవ్వుతూ.
అతని మాటలు పూర్తికాకముందే కాలికి వున్న హైహీలు షూ విడిచి చేతబట్టుకుని 'యూ' అంటూ కాండ్రించి వుమ్మింది నంద.
అతనింకేదో అనబోయేలోగానే ఎడాపెడా వాయించేసింది నంద.
మహిషాసుర మర్ధనిలాగా షూతో వాయించేసింది.
"గెటవుట్!" అన్నారు ఆఫీసరు.
షూ తొడుక్కుని చకచకా వెళ్ళిపోయింది నంద.
23
నంద బల్లముందు నుంచుని స్టెల్లా ఆమె కళ్ళల్లోకి వూదింది. బుగ్గన పెన్ పెట్టుకుని ఆలోచనా తరంగాల్లో కొట్టుకపోతున్న నంద ఉలికిపాటుతో 'వోయ్' అంది చప్పున.
"ఏమిటి పగటి కలలు కంటున్నావా?"
"అంత అదృష్టమా?" నిరాశగా అంది నంద.
"లేకపోతే ఏమిటా పరధ్యానం? ఎవరి గురించి ఆలోచన? అనీల్ కలలోకి వచ్చాడా?" నవ్వుతూ అంది స్టెల్లా.
నిట్టూర్చింది నంద. "అదేమిటోగాని ఈ రోజంతా ప్లాష్ బ్యాక్ లతోనే గడిచిపోతోంది?"
"ప్లాష్ బ్యాకేమిటి?"
"ప్రతి సంఘటనకి వెనుకటి రోజులతో పోలికలు గుర్తుకొచ్చేస్తున్నాయి!"
"సరే తీరిగ్గా ఆలోచించుకుని బాధ పడుదువుగానీ అయిదు అయిపోయింది. అందరూ వెళ్ళిపోతున్నారు పద!"
ఫైళ్ళు కట్టేసి అల్మరాలో పెట్టి తాళం వేసింది నంద. టేబిల్ కి కూడా తాళంవేసి లాగి చూసి, లేచింది. ఇద్దరూ గేటు వద్దకి వచ్చారు.
"హలో ఇంటికేనా?" పలుకరించాడు శివరాం.
"లక్షణంగా ఇంటికే! ఇంటికి కాక పార్కులకీ, సినిమాలకి, షికార్లకి వెళ్ళే అలవాటూ లేదు. వోపికా లేదు!" అంది స్టెల్లా.
