Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 37


     "ఇదెక్కడి అన్యాయంరా?బంగారంలాంటి పిల్ల-" యశోదమ్మ శోకాలు తీసింది.

     " మనము చేసిన ఖర్మ! పెద్దవారు చేసిన ఖర్మకు చిన్నవాళ్ళు అనుభవించాలమ్మా!"అన్నాడు కోపంగా,

      " ఆ శ్రీనివాస్- "

    "చచ్చిపోయాడంటావా?"

    " అదేదో విన్నట్టుంది."అన్నాడు.

     పురుషోత్తమరావు విషయం విని హడావుడిగా జీపు తీసుకుని పరుగెత్తుకు వచ్చాడు.

     " అమ్మాయి,అబ్బాయి ఇక్కడుండి సాధించేది, సంపాదించేది ఏం లేదు. హైద్రాబాద్ లో మన బంగళా ఖాళీ చేయించాను.అక్కడే ఉందురుగాని...." అన్నాడు.

     యశోదమ్మ మాట్లాడలేదు.   

     మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు ఆయన.ఆయన నిరంకుశత్వం తెలిసిన యశోదమ్మ మాట్లాడదు కూడాను.   

     సిద్దర్ధకు ప్రస్తుతం చెల్లెలి ఆరోగ్యం ముఖ్యం. అందుకే మాట్లాడక తండ్రితో ప్రయాణం అయ్యాడు.
   
     ఆఖరు క్షణంలో ఏమనుకున్నాడో ఆయన. తను  తరువాత వస్తానన్నాడు పురుషోత్తమరావు.
   
     కరీమ్  ఇంటిముందుకు రాగానే జీపు ఆపించాడు. శ్వేత కంగారుగా బయటకి వచ్చింది.

     "శ్వేతా! మా చెల్లాయి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది వెంటనే డాక్టరును చూడాలి. రెండు విషయాలు తెలిశాయి నిరూపించటమే సమస్య అవుతోంది." అన్నాడు.
   
    " ఏం తెలిశాయి?"

    "శ్రీనివాస్ హత్య చేయబడ్డాడు.అది యెలాగో రాధికకు తెలిసింది. రెండో విషయం చేయించినవారు వారేనని కూడా తెలిసింది." అన్నాడు.

    "ఈ విషవలయం ఛేధించండి."

    "ప్రయత్నిస్తాను." ఆమె చెయ్యి అందుకున్నాడు అంటీ, అంటనట్టు చుంబించాడు ఆమె తెల్లబోయినట్టు చూచింది.

     "సారీ శ్వేతా? ఏదో నా తల భారంగా ఉండి నీ స్పర్శ నాకు కొత్త ఊపిరి పోస్తోంది. నాకు భయంగా ఉంది."

    "యెందుకు.?"

    " శివుడి గుడిలో ఊడ్చే వీరప్పకు కొన్ని విషయాలు తెలుసు. అది తెలిసిదంటే వాడిని బ్రతుకు  నివ్వరు."

    " మరెలా?"

    " అదే  నువ్వు కరీమ్ చాచా చూడండీ."

    "సరే- "అన్నది.

     అతను వచ్చి జీపు ఎక్కాడు. జీపు కదిలింది.
   
    పోలీసు స్టేషన్లో అంతా కొంపలు మునిగినట్లు అందరూ హడవుడిగా తిరుగుతున్నారు. డి.ఎస్. పి. స్వయంగా వస్తున్నారు.

     "ఎందుకయి ఉంటుంది!"

    " మనకేం తెలుసు!"

     వాళ్ళు అనాధలా తల్లి అండన బ్రతికే శ్రీనివాస్ కోసం పోలిసులు వస్తారా అనుకున్నారు.

    "ఏయ్ త్రినాట్ పన్! వెళ్ళి పురుషోత్తమరావుగారి పెద్ద కుమారుడిని పిలిపించు."

    "ఎస్ సార్...."సెల్యుట్ చేసి వెళ్ళిపోయాడు.

     "ఎస్సైగారూ! శివునిగుడిలో ఉండే పూజారి బసవప్పను గుడిఊడ్చే వీరప్పను పిలిపించండి."

    "ఎస్ సర్...."

    "అలాగే జంగయ్య కొడుకు  బాలరాజును రప్పించు."

    "ఎస్ సర్...." పోలీసులు కాళ్ళకు చక్రాలు వచ్చినట్టు పరుగులు పెట్టారు.

     మరో అరగంటలో అందరూ అక్కడకు చేరారు.

     మధుమూర్తి ముఖం  గంభీరంగా ఉన్నది. అతను దేనికో ఆరాటపడుతున్నట్టుంది ముఖం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS