జీవనరేఖ
ఆ రోజు ఆఫీసుకి వెళ్తోంటే అనిపించింది. కొన్ని రోజులు ఈ మెకానికల్ జీవితానికి దూరంగా ఎటూ పోలేనా? అని, రోజూ నిద్రలేవడం.... వంట చేయటం, తినడం, ఈ సిటీ బస్సుల్లో వేళ్లాడుతూ ఆఫీసుకి వెళ్ళడం. సీటులో కూర్చుని అవలించడం . నాకే అసహ్యంగా అన్పిస్తోంది.
ఆడవాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉంటుందని గానీ, గవర్నమెంటు ఉద్యోగాల్లో ఉన్న మొనాటనీ ఇంకేకడా లేదు. రూల్ ప్రకారం, సీనియారీటి ప్రకారం ఏవో ప్రమోషన్లు ఇస్తుంటారు. కానీ ఇంపార్టెన్స్ కొంత బాధ్యత ఉన్న సీటు మాత్రం ఇవ్వరు.
సంపాదనకి అలవాటు పడ్డవాళ్ళు ఏ సీటు ఇచ్చినా సంపాదిస్తారు. కాని ఆడవాళ్ళకి సంపాదన కన్నా ఏదో చేయాలని, ఏదో సాధించాలని తపన ఎక్కువ. నాలాంటి వాళ్ళకి బ్రిటీష్ కాలం నాటి రూల్స్ లో మార్పులు తీసుకొచ్చి చాలా సంస్కరణలు తీసుకురావాలని అనిపిస్తుంటుంది . కానీ ఏం చేయగలం?
నేను ఈ ఆఫీసులో చేరిన కొత్తల్లోనే అర్ధమై పోయింది నాకు. నాకేదో తెలివితేటలు చాలా ఉన్నాయని , అవన్నీ ప్రదర్శించాలనుకోవడం , తెలివితక్కువ అని. ఎం.ఏ సైకాలజీ చదివి కూడా గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసి క్లర్క్ గా జాయిన్ అయిన రోజు నా ఆంగ్ల పరిజ్ఞానం ప్రదర్శించబోయి భంగపడ్డ రోజు బాగా గుర్తు.
రొటీన్ డ్రాప్ట్ లో అందమైన ఇంగ్లీషు పదాలు చేర్చి కొత్తగా రాసి నాకేదో మెడల్ ఇస్తాడనుకుని సెక్షన్ ఆఫీసర్ దగ్గరకు తీసుకెళ్ళి కొంచెం గర్వంగా, మరికొంచెం కాన్ఫిడెంట్ గా నిలబడ్డాడు.
నల్లటి మొహం మరింత నల్లగా చేసి "ఏంటిది? ఇట్లా కాదు ఈ డ్రాప్ట్ నీకు కొత్త కదా-- సీనియర్ని అడిగి రాయి. ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన ఫైల్ ఉంటుంది. తీసుకుని చదివితే తెలుస్తుంది. వెళ్ళి కరెక్ట్ చేయించుకురా!" అంటూ నా మొహనికేసి కొట్టినంత పని చేశాడు.
నీరసంగా సీనియర్ దగ్గరకు వెడితే, గర్వంగా ఫోజు పెట్టి - "మీ యంగ్ జనరేషన్ వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ. కాన్పిడేన్స్ ఎక్కువ" అంటూ పాత డ్రాప్ట్ ఇచ్చాడు. అప్పుడే అర్ధమైంది. గవర్నమెంట్ ఆఫీస్ వర్క్ అంటే "టర్న్ ది పేజ్... లెర్న్ ది వర్క్...." అందులో ఎన్ని బూతులున్నా అదే కరెక్ట్. ఎన్ని లోసుగులున్నా శాసనం శాసనమే. అందుకే నెలకి జీతం కరెక్ట్ గా ఉంటుందో లేదో అని తప్ప ఇంకా ఏ విషయంలో కూడా ఏకాగ్రత కూడదని నిర్ణయించుకున్నాను. అందుకే కచ్చితంగా ఏడాదికి ప్రభుత్వం వారిచ్చే పదిహేను రోజుల సాధారణ సెలవులు, ఐదు ఐచ్చిక సెలవులు కాకా కొన్ని ఫ్రెంచి లీవులు కూడా ఉపయోగించుకుంటూ కాలం గడపగా, గడపగా, నా సర్వీస్ లో ఇరవై ఏళ్ళు అతి కష్టంగా గడిచిపోయాయి.
అదృష్టం బాగుండి కొంచెం లేటుగా ఈ ఉద్యోగం వచ్చినదేమో? నాకింకా తొమ్మిదేళ్ళు సర్వీసు మాత్రమే ఉంది. తొమ్మిదేళ్ళని ఈజీగా అంటున్నా... లోపల బెంగ మాత్రం భయంకరంగా ఉంది. ఈ మనుషుల మధ్య ఈ మనస్తత్వాల మధ్య ఎలాగడుస్తాయో తొమ్మిదేళ్ళు అని.
కొంతమందిని చూస్తుంటేనాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దుమ్ము కొట్టుకుపోయిన పాత ఫైల్ లాగా నలభై ఏళ్ళుగా సర్వీసు చేసి రిటైర్ అయినా ఇంకా ఔట్ సోర్సింగ్ కి అవకాశం ఉందేమో అని ఆఫీసర్ల చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళ కిచ్చే జీతంలోసగం కమిషన్ ఇవ్వడానికి ఒప్పుకున్న వాళ్ళకి ఏదో ఒక పోస్టులు ఇవ్వడం కూడా జరుగుతూనే ఉంటుంది. వాళ్ళని చూస్తుంటే నాకు పరమ అసహ్యం వేస్తుంటుంది.
కుర్రవాళ్ళు ఉద్యోగాలు లేక తిరుగుతుంటే కృష్ణా, రామా అనుకోకుండా ముసలి వాళ్ళంతా పైరవీలు చేసుకుని రిటైర్ అయినా సీట్లు ఖాళీ చేయకుండా పట్టుకు వెళ్ళాడుతొంటే వీళ్ళు చచ్చాక కూడా దయ్యాలై ఈ పరిసరాల్లోనే తిరుగుతుంటారేమో అని.
బస్సు కుదుపుకి నేను దిగాల్సిన స్టేజ్ వచ్చిందని అర్ధమైంది.
బస్సు దిగి గోరువెచ్చని ఎండలో ఆఫీసు వైపు నడిచాను. డిసెంబరు నెల కదా, బాగా చలిగా ఉంది.అదేంటో చలి కదా అని స్వెట్టర్ వేసుకుంటే కూడా చిత్రంగా చూస్తారు. మా ఆఫీసులో. అయినా నేను మొండి దాన్ని కదా స్వెట్టర్ వేసుకునే వచ్చాను. గేటులో అడుగు పెట్టగానే కనిపించిన కొందరు పలకరింపుగా నవ్వితే, మరికొందరు నమస్తేలు పెడుతోంటే నా క్యాబిన్ లోకి వెళ్ళి కూర్చోబోతూ ఎస్టాబ్లిష్ మెంట్లో స్టాఫ్ లీవు అకౌంట్ చూసే క్లర్క్ వచ్చాడేమో అని గ్లాస్ డోర్ లోంచి చూశాను. నా పిచ్చి గానీ, పన్నెండు దాటకుండా వచ్చేవాళ్ళేవరున్నారు? స్తబ్దుగా కూర్చున్నా.
కాస్సేపటికి కొంచెం హడావుడిగా "నమస్తే మేడమ్" అంటూ అటెండెన్స్ రిజిష్టరు మంచినీళ్ళ గ్లాసుతో వచ్చింది అటెండరు రుకియా.
రూలు ప్రకారం పదింటికి రావాల్సిన రుకియా అలవాటుగా నాతొ సమానంగా పదకొండు అవుతుండగా రావడం, రోజులాగే ఏదో సమస్య చెప్పుకోవడం మొదలైంది.
"కల్రాత్మే మేరీ బెటీకు సర్ది, ఖాంసీ , పూరీ రాత్ నీంద్ నైధా క్యాకరూ మూసీబత్"అంటూ కొంచెం విషాదంగా ఫీలింగ్స్ పెట్టి "చాయ్ లావూ క్యా" అనడిగింది. చెప్పలేదు కదూ మా గవర్నమెంటు ఆఫీసుల్లో ఎన్నింటి కొచ్చినా రాగానే చాయ్ తెప్పించుకుని, వీలైతే పక్కవాళ్ళ పర్స్ ద్వారా తెప్పించుకుని తాగి కానీ పనికి ఉపక్రమించక పోవడం తరతరాల సంప్రదాయం. నాకా సంప్రదాయం లేకపోయినా, తెచ్చేవాళ్ళ కోసం ఒక్కోసారి తప్పదు. కానీ సాధారణంగా ఒద్దు అనే అంటాను. అలాగే ఒద్దు అనబోయి రుకియా కోసం బ్యాగు తెరిచి ఐదు రూపాయల నోటు ఇచ్చాను. "తుమ్ పీవో" అంటూ ఆ నోటు కళ్ళ కద్దుకుని కాంటీన్ కి వెళ్ళిపోయింది.
నాకు చేయాల్సిన పనేమీ కనిపించలేదు. నా అసిస్టెంట్స్ వచ్చి ఏవన్నా ఫైల్స్ పుటప్ చేస్తే తప్ప నేనుగా చేయడానికి ఏమీ లేదు. మాములుగా అయితే ఆఫీసర్లు బాతాఖానీ లో సమయం గడిపి ఉద్దేశ పూర్వకంగానే ఫైల్స్ పెండింగ్ పెడతారు. వాళ్ళ చుట్టూ ఓ పదిసార్లు తిప్పించుకుని అప్రూవ్ చేయడమో, కొర్రీలతో రిటర్న్ చేయడమో ఆ తిరిగే వారి లౌక్యం మీద ఆధారపడి ఉంటుంది. నాకా అలవాటు, అవసరం కూడా లేకపోవడంతో నా టేబిల్ మీద పెండింగ్ ఫైల్స్ అంటూ ఉండవు.
అప్పుడప్పుడూ నేను తెచ్చి పెట్టుకున్న నవల్స్ తో ఒకటి తీసుకుని చదువు కొడం మొదలు పెట్టాను . ఏమాత్రం సమయం చిక్కినా చదవడం ఒక అలవాటుగా చేసుకున్నాను. అది సాహిత్యమే కాదు, ఏది కనిపించినా ఆఖరికి పచ్చిమిర్చీ బజ్జీలు పొట్లం కట్టిన కాగితం కూడా చదవకుండా పారేయకూడదన్న పాఠం నాన్నగారి దగ్గర నేర్చుకున్న తోలి పాఠం. ఈ అలవాటుకి ఆఫీసులో నేను విమర్శలు ఎదుర్కొన్న సంగతి మ్చిపోను. రూల్స్ కి వ్యతిరేకం అయినా అలవాటు చెడ్డది కాదు కాబట్టి కేర్ చేసే అవసరం రాలేదు.
