Previous Page Next Page 
మౌనవిపంచి పేజి 37


    
    "పిక్చర్స్ కి రమ్మని పోరేవాడట- వెళితే ఎవరు చూడాలని ఇంత నీట్ గా సోకు చేసుకున్నావు. భర్త కోసం ఒక సాయంకాలమయినా ఇలా డ్రస్ చేసుకున్నావా అని సాధించే వాడట."
    
    అందుకే పాపం ఇలా అయిపోయింది. ఇది బహుశా ఆత్మహత్య నేమో!! జాలిగా అంది స్టెల్లా.
    
    "ఏమో!!" దిగులుగా అంది నంద.
    
    ఆమెకు చప్పున తన పినతల్లి కూతురు గుర్తుకి వచ్చింది.    

                                        21
    

    బాల బంగారు బొమ్మలా వుంటుంది. స్వర్గానికి వెన్నెలతోట కర్పూర వాసనలు రంగరిస్తే ఎలా వుంటుందో అలా వుంటుంది. బాల పదునాలుగు సంవత్సరాలు నిండక ముందే టెన్త్ పూర్తి చేసింది.
    
    తర్వాత కాలేజీకి పంపడానికి తల్లి ఒప్పుకోలేదు.
    
    రామకృష్ణకి కూడా భార్య అంటే అమితమైన ప్రేమ. అపారమైన గౌరవం.
    
    ఆమె ప్రాక్టికల్ గా ఆలోచిస్తుందని నమ్మకం!
    
    అందుకే అంగీకరించి వెతికి వెతికి ఒక సంబంధం తెచ్చాడు. వాళ్ళు  అడిగినంత కట్నం ఇచ్చాడు. పరమానందం రిక్రూట్! కాకీ డ్రస్సులో ఎసిస్టెంట్ కమీషనర్ గా అల్లుడు ఎదురొస్తే ఆనందపడ్డాడు రామకృష్ణ!
    
    అందం, ఐశ్వర్యం, మంచి ఉద్యోగం, చక్కని చదువు కున్న అల్లుడు దొరికినందుకు అంతా ఆనందించారు.
    
    కానయితే రామకృష్ణ మనస్తత్వమే విచిత్రమైంది! అతనికి ఎలా అలవడిందో మనుషుల్ని నమ్మడు, అతనికి భార్య అయినా ఒకటే-తల్లి దండ్రులు, సోదరులు - ఎవరైనా ఒకటే-
    
    లాడ్జింగ్ లో రైడ్ లో దొరికిన ఆడదాని మనస్తత్వానకి తన భార్య మనస్తత్వానికి తేడా లేదనేంతటి మూర్ఖుడు అతను.
    
    బాలని అలాగే ట్రీట్ చేశాడు.
    
    బాలది నిండైన వ్యక్తిత్వం! అప్పుడప్పుడే పదహారేళ్ళు నిండీనిండని తాజా గులాబిలాంటి మనిషి.
    
    అతని కరకు ధోరణి సహించుకోలేక పోయింది.
    
    తల్లితో అంతా మొరపెట్టుకుంది.    
    
    అతను బెల్ట్ తో కొట్టిన దెబ్బలు, సిగరెట్లతో పెట్టిన వాతలు గోళ్ళతో గుచ్చిన సూదిగుర్తులు. క్లిప్స్  పెట్టి లాగిన గుర్తులు అన్నీ రెండేళ్ళ జీవితాలకి గుర్తులయాయి.
    
    కాపురం చేసినందుకు ఆ గుర్తులే మిగలాయిగానీ, మరేమీ అనుభవానికి రాలేదు. అతను ఒక్కనాడూ భార్యని ప్రేమగా కౌగిట్లోకి తీసుకోలేదు. అదొక అవసరం అంతే!
    
    ఒకరోజు బాల తిరగబడింది! అతనితో పోట్లాడి చావు దెబ్బలు తిని- మామూలు నేరస్తురాలిగా అతనితో లాటీ దెబ్బలు తిని పారి వచ్చింది.    

 

    ఇక అతని ముఖం చూడనని తండ్రికి తెగేసి చెప్పింది. తను అతనితో కాపురం చేసిన అనుభవాల తీపిగుర్తులు సిగ్గువిడిచి తండ్రికి చూపించింది.    

 

    నిజానికి అవి లేడీ డాక్టర్ మాత్రమే చూడగలిగిన విషాద చిహ్నాలు!" సర్టిఫికెట్ సంపాదించింది. డాక్టరు సహాయంతో-
    
    కోర్టులో డైవర్స్ కి దాఖలు చేసింది.
    
    "నందా!"
    
    స్టెల్లా పిలుపుకి గతంనుంచి బయటపడింది.
    
    చప్పున అటు చూసింది.
    
    "ఏమిటలా అయిపోయావు?" అంది స్టెల్లా.
    
    "మా బాల గుర్తుకి వచ్చింది" అంది నంద. ఆమె గొంతులో వేయి వీణలు విషాద సంగీతం పలికినట్టుగా వుంది. కోటి ముఖారి రాగాలు ఒక్కసారిగా పలికినట్టయింది.
    
    ఆఫీసంతా గంభీరంగా వుంది. ఇంకో గంటలో ఆఫీసు మూసేస్తారు! అయిదు తర్వాత ఎవరూ ఆఫీసులో వుండకూడదు.
    
    అది ఈయన కొత్తగా చార్జీ తీసుకోగానే, తీసుకున్న నిర్ణయం- పని ఎంత పెండింగ్ వున్నా ఎన్ని అర్జెంటు పేపర్లున్నా అయిదు తర్వాత పని చేయకూడదనేది అతని సిద్దాంతం.
    
    "అర్జెంట్" అనేది ప్రపంచంలో లేనేలేదు. ఎప్పటికప్పుడు రెడీగా వర్క్ చేస్తుంటే గొంతు మీద కూర్చునే ఫైల్ అంటూ వుండదు.
    
    సోమరిపోతులు మాత్రమే అలా వర్క్ పెండింగ్ పెడతారు!
    
    నాకు వాళ్ళంటే ఎలర్జీ- అది అతను ఫస్టు చెప్పిన విషయం.
    
    "మేడం ఆఫీసర్ సాబ్ పిలుస్తున్నారు!" అన్నాడు మెసింజర్ సింగ్.
    
    లేచి  నుంచుంది నంద.
    
    యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళువచ్చి రైడ్ చేసి హెడ్ క్లర్క్ ని బుక్ చేసివెళ్ళాక ఆఫీసంతా శ్మశాన వాతావరణంలో వుంది.
    
    ఆ ఖాతాలో ఆఫీసరు భాగం ఉందేమోనని అందరికి అనుమానమే!
    
    అయితే అతను లాంఛనాలు, స్వీకరించిన దాఖలాలు ఏమీ లేవు.
    
    "కమిన్!"
    
    భయం భయంగా వెళ్ళి కూచుంది నంద.
        
    "మిమ్మల్ని అభినందిస్తున్నాను!"
    
    ఆశ్చర్యంగా చూసింది నంద.
    
    "మీ కందరికీ హెడ్ క్లర్క్ తో నేనూ కుమ్మక్కయి పోయానని అనుమానం కదూ!"
    
    తల అడ్డంగా వూపింది నంద.
    
    నవ్వేశాడాఫీసర్ "పోనీలే! మీ నిజాయితీ ఋజువు అయింది ఆఫీసులో. అందరూ మిమ్మల్ని ఎలా గౌరవించేది నాకు తెలుసు!" అన్నాడు అభినందన పూర్వకంగా.    

    "థాంక్స్"
    
    "మీ ఇంక్రిమెంట్ డేట్ వచ్చింది.  రాశాను. చెప్ప కూడదు. కానీ మీ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కూడా రాశాను. అది మీకు ప్రమోషన్ కి ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్ స్టెల్లాకి కూడా ప్రమోషన్ రావచ్చు!"
    
    "థాంక్స్!" అంది కృతజ్ఞతా పూర్వకంగా.
    
    ఆఫీసరు ఒక్క క్షణంపాటు ఏమీ మాట్లాడలేదు.
    
    "సర్! నాకు ప్రమోషన్ వస్తే ట్రాన్స్ ఫర్ అవుతుందేమో! మా ఇంటి పరిస్థితులు చాలా చిక్కుగా వున్నాయి. కొన్నాళ్ళు నాకు ప్రమోషన్ రాకపోతే మంచిదేమో!"
    
    ఆశ్చర్యంగా చూశాడతను. "అరె! ప్రమోషన్ వద్దంటారేమిటి?" పోనీలెండి! మీ యిబ్బందులేవో నాకు తెలీదు! "ఈ రోజు నుంచీ మీరు కొన్ని ఫైల్స్ చూడటం మానేయండి. ఇంకో క్లర్క్ వస్తున్నాడు. ఈ వీకెండ్ లోగా జాయినవుతాడు. అతడికి వర్క్ ఎలాట్ చేసేప్పుడు మీ పని కొంత తగ్గిస్తాను!"
    
    "థాంక్యూ సార్!" అంది అతని అభిమానానికి.
    
    మళ్ళీ కొద్ది క్షణాలు నిశ్శబ్దం.
    
    "మరేమీ అనుకోకండి! మీరెందుకు పెళ్ళి చేసుకోకూడదు. తోడు వుంటే మీ బరువు బాధ్యతలని పంచుకుంటాడు. ఒంటరిగా ఈదే ఈ సంసారసాగరం ఈదటానికి ఎవరికయినా తోడు కావాలి కదా!"

 

    చప్పున తలవంచుకుంది నంద.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS