అయిదు రూపాయలు ఇచ్చాడు సిద్దార్థ.
"బసప్ప రాంగానే పంపుతాను."
"వద్దులే. నేనేవస్తాను."
"గట్లనే అయ్య. తవరెట్లంటే గట్లనే...." అన్నాడు వీరప్పగారపట్టిన పండ్లు ఓ రాయి తీసుకుని ఊడగొట్టాలని పించింది. పవిత్రం అంటారు, గుడి అంటారు.అక్కడ వీరుచేసే వెధపనులన్నీ చేస్తారు.
అతను ఇంటికి వచ్చే సరికి తల్లి విచారంగా ఎదురు వచ్చింది.
" సిద్దూ! సిటీకి తీసుకువెళదాంరా. నిదురమాత్ర ప్రభావం తగ్గింది. మళ్ళీ మామూలుగా అరుస్తోంది." అన్నది దిగులుగా.
సిద్దార్ధ ఆకలి దప్పలు కూడా మరిచిపోయాడు.
చెల్లెలి గదిలోకి వెళ్ళాడు.
"యెవరూ!...అన్నయ్యా.... చిన్నన్నా..... నేనొక వరుడునిఎన్నుకున్నాను. లవ్- ప్రేమించాను....ఆ,-మోడర్న్ యూత్ ప్రేమించి పెళ్ళిచేసుకోవాలి!"
"రాధీ...." ఆర్తిగా పిలిచాడు.
" అన్నయ్యా! నువ్వూ నీకు నచ్చిన అమ్మాయిని చేసుకో.... ఏం ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు.....ఉత్తరాలు రాసుకోవచ్చు....ఊహల ఊయల ఊగవచ్చు....." అన్నది నవ్వుతూ.
ఆ నవ్వు సహజంగా లేదు. వెకిలిగా ఉన్నది.
"రాధికా...."
"నా మాటలు నమ్మవు కదూ! నేను- శ్రీను ఉత్తరాలు రాసుకున్నాము.చూస్తావా! చూడు... చూడు..." అని, తలదగ్గర బీరువాలో నుండి ఉత్తరం తీసి ఇచ్చింది.
సిద్దార్ధ అప్రయత్నంగా ఉత్తరం అందుకున్నాడు.
రాధిక తలుపులు వేసి వచ్చింది.
అతను ఉత్తరం విప్పాడు.
"రాధికా!- నా హృదయంలో వెన్నెలలు కురిపించే చంద్రికా! మూడు రోజులుగా దర్శనం లేదు. కారణం తెలియదు. నాకు పిచ్చిపట్టి నట్టుంది. నాపై కోపం వస్తే తీర్చుకునే పద్దతి కాదు మైస్వీటి...అందని చందమామవని అలమటించే నాకు అందీ, అందకుండా పోతావేం! రేపు ఉదయం కనిపించకపోతే మెంటల్ ఆస్పత్రినుండి ఫోన్ వస్తుంది నీ ఇష్టం!
కనిపించటం అంటే నీ ఇష్టం వచ్చినట్లు కాదమ్మాయ్... నా ఇష్టం వచ్చినట్టు. నీ దగ్గరున్న లేతాకుపచ్చచీర కట్టుకోవాలి. పెద్దపెద్ద రింగులు పెట్టుకోవాలి. తలలో మల్లెలు ముడుచుకోవాలి,అబ్బ నీకెవరు ఫ్యాషన్ అని చెప్పారోగాని, ఆ బొమ్మ లమధ్య బొట్టు నాకు బొత్తిగా నచ్చదు.
నుదుట, మధ్యగా కాస్త చిన్నదిగా ఉండాలి బొట్టు. కాటుక కూడా కళ్ళనింఢా అస్తవ్యస్తంగా పలుముకుంటావు. సన్నగా కాటుకరేఖ దిద్దుకో! నీ కళ్ళు అసలే పెద్దవి. ఆకాటుక పులుముకుంటే అమ్మావారిలా ఉంటావు...." అతని చెతిలో ఉత్తరం చటుక్కున లాక్కుంది.
"అమ్మో!నాన్న చూస్తే చంపేస్తాడు-" అన్నది రహస్యంగా మాట్లాడినట్టు.
" యెవర్ని చంపుతాడు..." సిద్దార్ధ అడిగాడు.
"నన్ను... కాదు... కాదు... శ్రీనుని... శ్రీనూ.... పారిపో..... వద్దు.... వద్దు నాన్నా .... చంపొద్దు-శ్రీను పారిపో- పారిపో...." ఉన్నదిలా అరవసాగింది.
"రాధికా...." వెళ్ళి పట్టుకున్నాడు సిద్దార్ద.
" వద్దు... వద్దన్నయ్యా.... శ్రీనివాస్ ను నేనే రెచ్చగొట్టాను. అతన్ని చంపవద్దు...." భయంగా చూచింది.
" ఎవరూ చంపరు...రాధీకా! నామాట విను."
"చంపేశారన్నయ్యా... శ్రీనూ-" ఆమె ఆవేదనగా ఆరుస్తూ కూలబడిపోయింది. పనివాడు పరుగెత్తుకు వెళ్ళి డాక్టరు జోస్ ను పిలుచుకువచ్చాడు.
"ఆకస్మాత్తుగా ఆమె ఇలా పలువరిస్తుంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. అదేమిటో తెలుసుకోవాలి. ఎందుకయినా మంచిది సైకియాట్రిస్ట్ ను కన్ సల్ట్ చెయ్యండి" అన్నాడు. అతను ఇంజక్షన్ ఇవ్వగానే వేళ్ళాడి పోయింది.సిద్దార్ధ ఎత్తి మంచంలో పడుకోబెట్టాడు.
