అత్తాగారికి కాఫీ ఇచ్చి తన కప్పు తెచ్చుకుని "చెప్పవే" అంటూ కుర్చీలో కూర్చుంది నా ఎదురుగా.
"ఏం చెప్పను? నిన్ను చూస్తుంటే నాకు చాలా కోపం వస్తోంది" అన్నాను.
"ఏం ఎందుకు?" ఆశ్చర్యంగా చూసింది.
"ఏంటా అవతారం? జుట్టు నెరిస్తే రంగేసుకోవచ్చుగా. మొహం గురించి అసలు పట్టించుకోవా?" ఆ పొట్ట ఏంటి? మార్నింగ్ వాక్ చేయవా?"
సరోజ పకపకా నవ్వుతూ నన్ను పరిశీలనగా చూసింది. "నువ్వంటే ఉద్యోగస్తురాలివి. మొహం, జుట్టు, పర్సనాలిటీ అన్నిటి మీదా శ్రద్ధ వహిస్తూ ఇప్పటికీ అందంగా, నాజుగ్గానే ఉన్నావు. వంట చేయడానికి వంట మనిషి, పనికి పనిమనిషి ఉంటుంది. నీకు పని ఉండదు. కానీ, నాకెలా కుదుర్తుంది? తెల్లారి లేచిందగ్గర్నించి హడావుడి, ఉరుకులు, పరుగులు, వంట, టిఫిను, కాఫీలు, అందించడాలు, మధ్యమధ్య అతిధులు, బాధ్యతలు, ఇంట్లోనే బోలెడంత వాక్" అంటూ "అవునే నువ్వెలా మెయిన్ టైన్ చేస్తున్నావు. మీ అయన బాగా కోపరేట్ చేస్తారా?' అడిగింది.
నవ్వాను.
"ఇందాకట్నించి చూస్తున్నాను. ప్రతిదానికీ నవ్వుతావెంటే! నీ విషయాలేవీ చెప్పవేం?" ఖాళీ కాఫీ కప్పు టేబిల్ మీద పెట్టేసి కోపంగా అడిగింది.
"ఏం ఉంది చెప్పడానికి? అయినా చెప్పే కన్నా నువ్వు వచ్చి చూస్తె బాగుంటుంది."
"ఏం - చెప్పడానికి సిగ్గా. నలభై ఏళ్ళు దాటి ఇంకా సిగ్గేంటే బాబూ... ఆ రోజులు పోయాయి. ఏమిటో కాలం ఎంత త్వరగా గడిచి పోతోందో! చక్కగా పెద్ద పెద్ద జడలేసుకుని, పరికిణి ఓణీలు వేసుకుని కాలేజి కి వెళ్ళిన రోజులు గుర్తొస్తే -- అబ్బా తీయటి రోజులన్నీ ఇంత త్వరగా వెళ్ళిపోయాఏంటి అనిపిస్తుంది."
సరోజ మాట్లాడుతుండగానే నాలుగైంది. గోడ గడియారం గంటల శబ్దం విని చటుక్కున లేచింది. "అమ్మో నాలుగైంది. ఈయన వచ్చేస్తారు. టిఫిన్ చేయాలి" అంటూనే లేచి వెళ్లి, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు రెండు, అల్లం తెచ్చుకుని చాకుతో టేబుల్ మీదే కోయడం మొదలుపెట్టింది.
"ఏవిటోనే, పెళ్ళవగానే సంసారం అనే సముద్రంలో పడిపోతాం. అని ఆ రోజు అనిపించి ఉంటె పెళ్ళి చేసుకోక పోదునెమో" అంటూ మళ్ళీ గడియారం వైపు చూసింది. నాలుగూ పది అయింది. "ఈయన ఇంకా రాలేదేంటో" అంటూ తరిగిన ముక్కలన్నీ ప్లేటులో వేసి లేచింది.
ఒకసారి వీధి వాకిలి వైపు తొంగి చూసి "ఏంటబ్బా ఇంకా రాలేదు" అంటూ తరిగిన ముక్కలు పెట్టిన ప్లేటు తీసుకుని కిచెన్ లోకి వెళ్ళింది.
ఉప్మా పోపు వాసన వచ్చింది నాకు.
మళ్ళీ నా దగ్గరకు వచ్చి "ఉండు ఈయనకి ఓసారి ఫోన్ చేస్తాను. నాలుగయ్యే సరికి టంచనుగా రావాలి. రాలేదేంటో" అంటూ లోపలికి వెళ్ళి కార్డ్ లెస్ తీసుకొచ్చింది. నెంబరు కలుపుతున్న సరోజ మోహంలో టెన్షన్ చూస్తుంటే 'ఎందుకంత కంగారు? అతనేం చిన్నపిల్లాడా" అనిపించింది నాకు. ఇంతా చేస్తే నాలుగుంబావు అయింది. పదిహేను నిమిషాలు ఆలస్యం అయితే ఇంత టెన్షనా? భర్తంటే ఎంత ప్రేమ దీనికి.
"వస్తారులే సరోజా... పది నిమిషాలు అటూ ఇటూ ....ఎలా వస్తారు? స్కూటరా, కారా?"
"కారే! కోర్టు అయిపోగానే మావయ్య గారిని క్లబ్ దగ్గర దింపి ఈయన ఇంటికే వస్తారు. ఏంటో ఇంకా రాలేదు. ఏమైందో ఏమో, బొత్తిగా టైం సెన్స్ ఉండదే మగవాళ్ళ కి. బైట పెత్తనాలు ఏం ఉంటాయి? ఇంటి దగ్గర పెళ్ళాం, పిల్లలు ఎదురుచూస్తుంటారన్న జ్ఞానం ఉండదు ఈ మనిషికి. ఛ.... ఈ నెంబరు ఎప్పుడూ కలవదు" అంటూ కార్డ్ లెస్ , టేబిల్ మీద విసురుగా పడేసి, మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళింది. మరుగుతున్న నీళ్ళల్లో రవ్వ వేసి బాగా కలిపి, ఉప్మా మీద మూత పెట్టి స్టవ్ ఆర్పేసి వచ్చింది.
ఇప్పుడు సరోజ స్వరం మూగబోయింది. మాటలాపేసి, టెన్షన్ తో గేటు వైపు తొంగితొంగి చూస్తోంది. దాని టెన్షన్ చూస్తుంటే ఇంక నాకు ఉండబుద్ది కాలేదు. "నేను వెళ్తానే....మళ్ళీ కలుద్దాం' అంటూ లేచాను.
"ఉండు ఆయనొచ్చాక పరిచయం చేస్తాను" అంది.
"ఇంకోసారి పరిచయం చేసుకుంటాలే. ఇప్పుడు నాకు వేరే పనుంది" అంటూ లేచాను.
బైట కారు ఆగిన శబ్దం అయింది. సరోజ చటుక్కున కుర్చీలోంచి లేచి పరిగెత్తినట్టుగా బైటికి వెళ్ళింది.
ఎంత ప్రేమ భర్తంటే. ఎంత ఆరాటం! అయన వచ్చేతపప్తికి టిఫిన్ చేసిపెట్టి, ఆయన క్షేమం కోసం తపిస్తూ అబ్బ... సరోజ లాంటి భార్యని పొందిన అతను అదృష్టవంతుడు అనిపించింది. అతను కూడా ఎంత టంచనుగా వచ్చాడు ఇంటికి.
పెళ్ళి కాని నాకు ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుపడలేదు. భార్యాభర్తలు ఒకరికోసం ఒకరు తపనపడుతూ , ఒకరికొకరు ప్రేమించుకుంటూ, ఒకరికొకరుగా బతకడమే జీవితం కాబోలు. స్వంత ఇల్లు, కావాల్సినంత డబ్బు, పెద్ద దిక్కుగా అత్త మామలు, రత్నాల్లాంటి పిల్లలు, కనుసన్నల్లో మెలిగే భర్త ఇంతకన్నా ఏంకావాలి ఆడదానికి?
ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాను. కెరియర్ కెరియర్ అంటూ ఎప్పటికప్పుడు పెళ్ళి వాయిదా వేస్తూ, వచ్చిన సంబంధాలన్నీ తిరగొట్టి తీరా చేసుకోవాలనుకునే సరికి వయసు దాటిపోయింది. రెండో పెళ్ళి వాళ్ళు రావడంతో పెళ్ళే మానుకున్నాను. ఇప్పుడింక ఆ ధ్యాస కూడా లేదు. అలాంటిది ఇప్పుడు సరోజని చూశాక నా మనసు మళ్ళీ పెళ్ళి మీదకు మళ్ళింది. ప్రేమానురాగాలతో, పరస్పరం గౌరవించుకుంటూ, ఒకరి క్షేమం కోసం ఒకరు ఆరాటపడుతూ జీవించెందుకే పెళ్ళి అనే తంతు కావాలి కాబోలు. ఇలా ఒంటరిగా బతికే బతుకు కూడా బతుకేనా.... సన్నగా నిట్టుర్చాను.
లోపలి నుంచి సరోజ స్వరం వినిపించింది. "కోర్టు అయిపోగానే ఇంటికి రాకుండా ఎక్కడి కెళ్ళారు? నాలుగున్నర అయింది. క్లబ్ చూడగానే మీకూ కాస్సేపు కూర్చోవాలనిపించిందా? రేపట్నించీ మీ నాన్నగారిని దింపడానికి మీరు వెళ్లొద్దు ఆయన్ని ఆటోలో వెళ్ళ మనండి. లేదంటే ఇంకో కారు కొనుక్కోమనండి. మీరు నాలుగయ్యేసరికి ఇంట్లో ఉండాలి. అంతే! కాళ్ళూ, చేతులు కడుక్కురండి. టిఫిన్ పెడతాను. నా ఫ్రెండ్ ని పరిచయం చేస్తాను. చూడండి....ఆడపిల్ల కనిపించింది కదా అని తేరిపార చూడకుండా విష్ చేసి మీ గదిలోకి వచ్చేయండి. రండి త్వరగా" మాటలు ఆగిపోయాయి.
సరోజ నా దగ్గరకు వచ్చింది.
నేను నిశ్చేష్టురాలినయ్యాను. సరోజ...భర్త రావడం ఆలస్యం అయిందని టెన్షన్ తో కూర్చున్న సరోజ కూతురు ఎక్కడ కంది పోతుందో అని బరువంతా తానె మోసిన సరోజ.... అత్తగారికి టైం కి కాఫీ ఆవిడ గదిలోకి తీసికెళ్ళి ఇచ్చిన సరోజ.... సంసార భారం బరువైనా తానె సహనంతో మోస్తున్న సరోజ.
ఈమెకు ఉన్నది తన వాళ్ళ పట్ల ప్రేమో లేక వాళ్ళంతా తన గుప్పిట్లో ఉండాలన్న పంతమా? అందుకేనా 'ఒక గంట నేనింట్లో లేకపోతే ఇల్లంతా తల్లకిందులైపోతుంది అంది. ఈ సంసారం కోసం, ఈ కుటుంబం అనే రక్షణ వలయం కోసం తనని తాను మర్చిపోయి, తన స్వేచ్చ ని, తన ఆశల్ని తన ఆరోగ్యాన్ని, అందాన్ని అన్నిటినీ నిర్లక్ష్యం చేస్తూ ఇంటిల్లిపాదీనీ తన కనుసన్నల్లో పెట్టుకుని ఎంతకాలం కాపాడుకోగలదిలా."
సరోజది త్యాగమా? స్వార్ధమా? నాకేం అర్ధం కాలేదు.
ప్లేట్ల లో ఉప్మా పెట్టుకుని టేబుల్ దగ్గరకు వస్తున్న సరోజ వైపు అయోమయంగా చూస్తున్న నాకు పెరట్లో పంపు దగ్గర కాళ్ళు, చేతులు కడుక్కుని తలవంచుకొని వస్తున్న లాయర్ రామబ్రహ్మం ఉరఫ్ సరోజ మొగుడు కనిపించాడు.
నిట్టూర్చి లేచి నిలబడ్డాను, బ్యాగు చేతిలోకి తీసుకుని.
***
