ఆఖరికి విషయం బయటపడింది.
సుందరమ్మకి వేలు విడిచిన బంధువు రామచంద్రం-అతని కొడుక్కి ఉద్యోగం ఇప్పించడంలో నారాయణ సహాయం చేయలేదని అతనే ఇలా చేయించాడు.
వెళ్ళి ఎంతగానో బ్రతిమిలాడాడు నారాయణ. అయితే అతనేం సహాయం చేయలేదు. పైగా తన కొడుక్కి ఉద్యోగం విషయంలో సహాయం చేయలేదని ఎద్దేవా చేసి నిష్ఠూరాలు ఆడాడు.
నారాయణ నిష్ప్రయోజకుడిమల్లే అయ్యేడు. ఇన్నేళ్ళ అతని నిజాయితీ, మంచితనం ఎందుకూ పనికి రాలేదు.
చెల్లెలి విషయం, కూతురి విషయంలో ప్రమోద్ దౌర్జన్యం తనపై జరిగిన ఈ దొంగకేసు బనాయింపు ఇన్నిటిని అతని పేద గుండె భరించలేకపోయింది.
ఆ వూరు వదిలి వచ్చేశారు.
ఊరు మారినా అదృష్టం మారుతుందా?
ఉద్యోగం పోయింది డిస్మిస్ చేశారు.
తాలూకానుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ కి మారిన ఆ కొత్త వూర్లో-అద్దె ఇంట్లో దొంగతనం జరిగింది.
ఇల్లు అమ్మి తెచ్చుకున్న డబ్బంతా పోయింది.
కుటుంబం, కుటుంబం కూలిపోయింది దిగులుతో.
ఇన్ని షాకులతో నారాయణ నిస్తేజుడైపోయాడు.
"నాన్నగారూ! భయపడకండి! దేవుడున్నాడు మనల్ని అందుకుంటాడు! మంచి రోజులు రాకపోవు" అంది నంద.
"పట్టుదలతో డిగ్రీ పూర్తిచేసి ఎగ్జామ్స్ రాసింది పాసైంది. ఉద్యోగం కూడా సంపాయించుకుంది. ఏటికి ఎదురీదుతున్నట్టుగా ఉద్యోగం చేస్తూ తల్లిని తండ్రిని తమ్ముళ్ళని చెల్లాయిని పోషించుకుంటూ వుంది. అయినా పెద్ద సంసారం కొద్ది జీతం- అనారోగ్యానికి గురైన కుటుంబం-విశ్రాంతి లేని పోరాటం లాటి బ్రతుకు. క్షణం క్షణం ఏదో యిబ్బంది! ప్రతిరోజూ ఏదో చిక్కు! ఎప్పుడూ ఏదో ఆరాటం! మనస్సులో వేదన! ఇవన్నీ తీరిపోయి హాయిగా సుఖంగా శాంతిగా జీవితం సాగిపోయేదెన్నడో!
20
"టీ కావాలా అమ్మగారూ?"
కేంటిన్ బాయ్ పిలుపుతో ఉలికిపడింది నంద. చప్పున వూహల్లోంచి బయటపడింది! టీ బాయి వైపు చూసింది.
రోజూ సరిగ్గా మూడింటికి హాట్ హాట్ టీ తీసుకుని వస్తాడు ఆ అబ్బాయి. ఎంతో రుచిగా వుంటుంది! ధర తక్కువ! సీట్లోకే తెచ్చిస్తారు. ఇస్తే డబ్బు తీసుకుంటాడు. లేదా ఫస్టు కిస్తారు. చాలామంది తాగుతారు అందుకే-
టిఫిన్ కూడా తెచ్చిస్తాడు.
దానికీ వెంటనే డబ్బు ఇవ్వవచ్చు. లేదా జీతం వచ్చాక ఇవ్వచ్చు. వీళ్ళ యిష్టం-అంతే!
కొందరు ఎడ్వాన్స్ గా ఇస్తారు.
అలాటి వారికి రేట్లపై రిబేట్లు ఇస్తాడు. అయిదు రూపాయలకి ఆరురూపాయల టిఫిన్ పెడతాడు.
ఏ క్లాస్ హోటల్ లో లాగా రుచిగా వుంటాయి.
అప్పుడే మూడైందా! అంది కంగారుగా ఆమె ఇంత దాకా ఒక్క పేపరూ సరిగ్గా చూళ్ళేదు! ఈ రోజంతా సంఘటనల మయమైపోయింది అంతా గతాన్ని గుర్తుకి చేస్తోంది! అనుకుంది.
"తీసుకోండి! టీ అందించాడు నాయర్."
వేడివేడి టీ తాగసాగింది నంద.
ఆమె మనస్సు కొద్దిగా సేద తీర్చుకున్నట్లుగా వుంది.
మనస్సు ప్రశాంత పడసాగింది.
"ఆనందలక్ష్మీ ఎవరండీ!"
కాకీ యూనిఫాం వేసుకున్న యువకుడు అడుగుతున్నాడు. గేట్ కీపర్, నైట్ వాచ్ మన్, ఎటెండర్ సింహాద్రిని! అతను టెలిగ్రాం మెసింజర్.
ఆనంద గుండెలు దడదడలాడాయి. ఏమిటిలా భగవంతుడాఅని ఒక్క క్షణంపాటు భయపడింది.
"టెలిగ్రామండీ"
సంతకం చేసి తీసుకుంది.
"ఎక్కడనుంచి! ఆదుర్దాపడుతూ అడిగింది స్టెల్లా.
చదివిన నంద నిర్ఘాంతపోయింది.
"స్టెల్లా విశాల చనిపోయిందట! గద్గద కంఠంతో అంది."
"విశాల చనిపోయిందా?" నివ్వెరపోయింది స్టెల్లా. ఆమెకీ విశాల తెలుసు.
విశాల, నంద మంచి స్నేహితులు.
ఈ వూరు వచ్చాకే పరిచయమైనా వాళ్ళ స్నేహం దృఢ పడింది.
ఆమెకి నంద అంటే పంచప్రాణాలు.
నందకి ఆమె అంటే అంత ప్రేమ.
అలాంటి విశాల చనిపోయిందంటే నందకి ఎంత దుఃఖంగా వుంటుందో తెలుసు స్టెల్లాకి.
"వేరీ సారీ నందా! ఏమైందో?"
"ఏమవుతుంది? ఆ త్రాష్టుడే అనుమానంతో చంపేసి వుంటాడు. అలాటి వెధవ అసలెందుకు పెళ్ళి చేసుకోవాలి?"
"హీ ససెక్ట్ స్ హర్!"
"ఆఁ! అది నాకు మొదటనుంచీ తెలుసు. అసలు పెళ్ళి లోనే పేచీ పెట్టుకున్నాడని చెప్పాగా!"
"డవురీ కోసమా?"
"అవును! డవురీ కోసం పెళ్ళిలో పేచీలు పెట్టాడు! చీరల సెలక్షన్ లో, నగలకొట్టులో అన్నిటా!"
"బాగా చదువుకున్నాడన్నారే?"
"ఎన్ని డిగ్రీలుంటేనేం!"
"నందా! ఈ మగాళ్ళలో ఎప్పుడొస్తుందే మార్పు?"
"మార్పా! నెవర్! మనం ఇలా బానిస బుద్దులతో ఉన్నన్ని రోజులు వీళ్ళ మనస్తత్వం ఇంతే! వాళ్ళు మారరు. మనం మార్చలేం! ఒదిగొదిగి వుండేకొద్దీ దర్పంతో, దౌర్జన్యంతో మనల్ని రూల్ చేయాలనే అనుకుంటారు!" మనతో చాకిరీ చేయించుకోవాలనే వుంటారు' రోషంగా అంది నంద.
"చిత్రం చూశావా!
తండ్రి మగవాడు- తమ్ముడు మగవాడు!
భర్త మగవాడు!
తండ్రి జాలిపడతాడు. తమ్ముడు ప్రేమిస్తాడు. అయినా వీళ్ళిద్దరూ ఆ చేసుకున్న భర్తనే సమర్ధిస్తారు. కన్న కూతుర్ని కాని, సోదరిని కాని వీళ్ళు వెనకేసుకుని రారు!!"
తన మనసులో ఏదో మెదలగా అంది స్టెల్లా.
"అంతేకాదు స్టెల్లా! వాడికి విశాలపై అనుమానం వుందట! ఆ ముఖానికి విశాల దొరకటం అదృష్టం- తానెంత చార్మింగ్ గా వుండేదో తెలుసుకదా!
వాడు కుళ్ళుకునేవాడట!
శుభ్రంగా తలదువ్వుకుంటే ఎదురింటి కుర్రాడికోసమా అనేవాడట!"
"రియల్! అలాటి రాస్కిల్స్ ని సూట్ చేయాలి!" ఆవేశంగా అంది స్టెల్లా.
