Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 35


    " కావ్చచు. యెవరి కర్మకు యెవరు కర్తలు."

     సిద్దార్ధకు మతిపోయింది.
   
     " అర్జున్ నువ్వు మాట్లాడవేంరా!"

     " ఏం మాట్లాడాలి! వాడో నిశ్చయానికి వచ్చాడు.అదొక కొత్త సంధా. కానివ్వండి." అన్నాడు.
    " మంత్రాలున్నాయని నువ్వు నమ్ముతావా!"

    " ప్రపంచం అంతా నమ్ముతుంది."

    సిద్దార్ధకు వాదించే అవకాశం లేనేలేదు.

     " విష్ యు ఆల్ ద బెస్ట్!" అన్నాడు.

     "థాంక్యూ....."

    సిద్ధార్ధకు అశాంతిగా ఆరాటంగా ఉంది.

     ఏమిటి ! ఏం చేసారు!  ఎందుకీ ఎండమావుల వెంట పరుగెడుతున్నారు. తల సలుపసాగింది.

     అతను మెల్లగా రాములు ఇంటికి వెళ్ళాడు.డప్పులు మ్రోగుతున్నాయి. రాములు అంతిమ యాత్రకు తయారు చేసారు. ఆత్మ హత్య చేసుకున్నా, ఎందుకు చేసుకున్నారని ఎంక్వయిరీ  చేస్తారు.   

    పోలీసులు నిమ్మకు నీరెత్తి నట్టున్నారు.

     కారణం ఏమయి ఉంటుంది?

     అతని కాళ్ళు అప్రయత్నంగా పార్వతమ్మ ఇంటివైపు వెళ్ళాయి.

    " బాబూ! మావాడి జాడ...."

    " ఇంకా లేదమ్మా! అన్నట్టు రాములు తెలుసా అమ్మా...." వివరాలు చెప్పాడు.ఆమె  తల పంకించింది.

     " ఆ జంగయ్య , రాములు తాగుడుకు ఒకేచోట కూర్చునేవారుట.

    "నీ కొడుకును గుడిలో దాచారు" అనేవాడయ్యా! గుడంతా వెతికాను" అన్నది.   

     "ఆలాగా!" అతను లేచాడు.   

     పార్వతమ్మ వచ్చి అతని రెండు కాళ్ళు పట్టేసుకుంది.

     " సిద్దుబాబూ! నీకు పాలు కుడిపాను. నాపై దయతలిచి.మీ వాళ్ళకు చెప్పి, నీకొడుకును నాకిప్పించు. వాడీ ప్రాంతాలలో ఉండకుండా చూస్తాను. మీకు చెడ్డ పేరు రాకుండా చేస్తాను." అన్నది దయనీయంగా.

    " నా ప్రయత్నంలో లోపం లేదమ్మా" అన్నాడు.
   
     అతనికి మద్రాసు జీవితం .అక్కడి జనం గుర్తుకు వచ్చారు. చీకూ చింతా లేకుండా గడిపాడు. ఇల్లు చేరిన దగ్గరనుండి  సమస్యలే. దారి పొడవునా" నీ కొడుకును గుడిలో దాచారు." అని రాములు పార్వతమ్మతో అన్నమాటలు గుర్తుకు వచ్చాయి.   

     అతను పిచ్చివాడిలా గుడిలోకి వెళ్ళాడు.

     చుట్టూ ఆవరణ, లోపల రెండు వైపుల సత్రాలు. ఒకవైపు తోట ఉన్నాయి.ఇంకా కాస్త లోపలికి వెళ్ళగానే విశాలమైన ఆవరణలో శివలింగం ఉన్నది.

    "దండాలు బాబూ..." అన్నాడు గుడిఊ వీరప్పడే.   

    " దండాలు.ఇక్కడెవరూ లేరా!"

     " జంగం దేవర బసవప్ప ఉన్నారు.ఇప్పుడే ఊరు వెళ్ళినట్టు వెళ్ళిండయ్యా! పెద్దయ్య పంపించిండ్రా.?" అన్నాడు.

    "మళ్ళీ వస్తాను."

    " రాధికమ్మకు సంబంధం కుదిరిందా"?

    " కుదిరింది."

    "కుదరక ఏం చేస్తాదిలెండి?  నక్క నాగలోకం చేరుకోవాలంటే చేరుకుంటుందా! ఆ శీనుగాడు స్వర్గలోకం చేరుకున్నాడు."అని గారపట్టిన పళ్ళు బయటపడేలా నవ్వుతూ, సాగనంపాడు.అతని మెడలో  నలుపు బారిన వెండి లింగంకాయ ఉన్నది.

      "శ్రీనివాస్ స్వర్గం చేరాడు. అదంతా బయటికి వస్తే మనం నరకం చేరుకుంటాం."

    " నరమానవుడికి తెలిస్తేకదా నరకం చేరేది! మనమంతా గుట్టుగా చేస్తాము. ఒక రెండు రూపాయలు ఇవ్వుబాబూ!" అన్నాడు వీరప్ప.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS