సరోజ మొగుడు
అ ఆఫీసులో రిపోర్టు చేశాక ఒకరోజు లీవ్ పెట్టి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, కొనుక్కోవాలంటే నాకు లీవ్ పెట్టె అవకాశమే దొరకలేదు. బిజీ అయి పోయాను. ఇవాళ కాస్త ఖాళీ దొరికింది. అందుకే మధ్యాహ్నం నుంచీ పర్మిషన్ తీసుకుని వచ్చేశాను.
పదిహేడో తేదీ నా పుట్టినరోజు. పుట్టిన రోజుకి చీర కొనుక్కోవడానికి అబిడ్స్ లో ఉన్న పెద్ద డిజైన్ద్ద్ శారీస్ షాపి కి వెళ్ళాను. షోకేస్ లో ఉన్న చీరలు చూస్తున్న నన్ను ఎంతో మర్యాదగా ఆహ్వానించాడు కౌంటర్ ముందు కూర్చున్న మేనేజర్. "రండమ్మా....లోపల చాలా మంచి చీరలు ఉన్నాయి" అన్నాడు ఎంతో వినయంగా. నేను అతని ఆహ్వానం మన్నించి లోపలికి వెళ్లాను.
"కూర్చోండి."
సేల్స్ బాయ్ స్టూలు నా దగ్గరకు జరిపి , అరల్లో ఉన్న అందమైన చీరలు తీసి ఒక్కో చీర మడతలు విప్పి బట్ట నాణ్యత , రంగు డిజైన్ చూపిస్తున్నాడు.
"బాబూ! ఆ బ్లూ కలర్ చీర ఇలా ఇవ్వు" నా కుడి చెవి దగ్గరగా వినిపించిందో స్వరం. తలతిప్పి చూశాను. ఒక్క క్షణం ఆశ్చర్యం! ఆమె....సరూ....! "సరోజా!' ఆనందంగా పిలిచాను.
ఆమె నా వైపు చివ్వున తలతిప్పి చూసింది. ఆ కళ్ళల్లో అంతులేని ఆనందం. "ఏయ్ సుధా నువ్వా... అబ్బ ఎంతకాల మైందే నిన్ను చూసి.... నువ్వు హైదరాబాద్ లో లేవుగా.... ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు?" గబగబా మాట్లాడుతూ నా చేయి పట్టుకుంది.
ప్రమోషన్ మీద ఈమధ్యే ఇక్కడికి బదిలీ అయింది. మెయిన్ ఆఫీసులో రిపోర్టు చేసి వారం అవుతోంది. ఇంతకీ నువ్వెక్కడ ఉంటున్నావు? ఎలా ఉన్నావు? ఈ అమ్మాయి ఎవరు?' సరోజ పక్కనే నిలబడి మావైపు వింతగా చూస్తున్న పద్నాలుగేళ్ళ అమ్మాయిని చూస్తూ అడిగాను.
"ఎవరెంటే బాబూ! నా కూతురు దివ్య, టెన్త్ చదువుతోంది."
దివ్య సరోజ భుజాల మీదికి ఒంగి నెమ్మదిగా అడుగుతోంది. "ఎవరు మమ్మీ ఈ అంటీ...."
"నా ఫ్రెండ్, మేమిద్దరం ఆరో తరగతి నుంచి డిగ్రీ దాకా కలిసి చదువు కున్నాం" కూతురికి సమాధానం చెప్పి నా వైపు చూసింది. "నీకెంత మందే పిల్లలు?"
నేను నవ్వి "చెప్తాలే.... మా ఇంటికి రా.... హాయిగా మాట్లాడుకుందాం." అన్నాను.
"ఎక్కడుంటున్నావు ? మీ ఆఫీసేక్కడా?"
"ఆఫీసు పంజాగుట్ట లో, ఇల్లు ఆనంద్ నగర్ కాలనీ లో."
దివ్య నెమ్మదిగా మళ్ళీ ఏదో గిణిగింది. సరోజ చెవిలో. సన్నగా, తెల్లగా పొడుగ్గా ఉంది దివ్య. వంకీలు తిరిగిన జుట్టు వత్తుగా, భుజాల దాకా ఉంది. జుట్టు పైకి దువ్వి కొంత భాగాన్ని వదిలేసి, మిగతా భాగం క్లిప్పు పెట్టుకుంది. లాంగ్ స్కర్ట్, టాప్.... ముద్దుగా ,అందంగా ఉంది. సరోజ పోలికలు మోహంలో స్పష్టంగా కనిపిస్తున్నా, పర్సనాలిటీ మాత్రం సరోజది కాదు. సరోజ పొట్టి, ఐడడుగులే ఉంటుంది. పైగా ఇప్పుడు లావై మరీ పొట్టిగా అనిపిస్తోంది. బాగా పొట్ట వచ్చేసింది. వాళ్ళని పరిశీలిస్తున్న నాతొ అంది సరోజ 'సర్లే నీఫోన్ నెంబరు ఇవ్వు ఫోన్ చేస్తాను."
"ఫోన్ చేయడం ఏంటి? చాలా కాలమైంది మనం కలిసి కాస్సేపు కబుర్లు చెప్పుకుందాం చీరల సెలక్షన్ అయిందా నీది?"
"నేను చీర కోసం రాలేదు. దీనికి డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను. బిల్లు కట్టేసి వెళ్తుంటే, అదిగో అ చీర బాగున్నట్టు అనిపించి చూద్దామని అడిగాను. మరి వస్తానే. దివ్య ట్యూషన్ కి వెళ్ళాలి. టైమైంది" భుజాన బ్యాగు,చేతిలో కవర్లు సంసార భారం అంతా తన మీదే ఉన్నట్టు అనిపించింది. దివ్య చేతులు రెండూ ఖాళీగా ఉన్నాయి. తల్లి చేతుల్లో బరువు అందుకునే ప్రయత్నం ఏదీ చేసినట్టు లేదు.
"ఓ కవర్ తన చేతికివ్వచ్చుగా ' అన్నాను.
"దాని మొహం దాని శరీరం బరువే అది మోయలేదు. ఇదేం మోస్తుంది" అంది జారిపోతున్న బ్యాగును చేయి ఎగరేస్తూ పైకి తోసుకుంటూ.
ఎంత ప్రేమో కూతురంటే ఇంత సున్నితంగా పెంచడం, తరవాత బాధ పడడం తల్లులంతా ఇంతే! సరోజ అప్పుడే వెళ్ళిపోతాననడం నాకు చాలా నిరుత్సాహంగా అనిపించింది. చిన్ననాటి స్నేహితురాళ్ళం ప్రాణానికి ప్రాణంగా బతికినవాళ్ళం. పెళ్ళిళ్ళ వల్ల కెరియర్ డెవలప్ మెంట్ గురించిన తపన వల్ల మా మధ్య దాదాపు చాలా ఏళ్ళ గ్యాప్ . డిగ్రీ అవగానే సరోజ పెళ్ళి చేసుకుంది. నేను పి.జి లో చేరాను. సరోజ పిల్ల తల్లి అయ్యేటప్పటికి నా పీజీ పూర్తయ్యింది. ఆ తరువాత గ్రూప్ 2 పరీక్షలు రాసి, రెవిన్యూ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం సంపాదించాక డిస్ట్రిక్ ఆఫీసర్ గా ఊళ్ళు తిరగడం . దాంతో మా స్నేహానికి చిన్న అంతరాయం . ఏది ఏమైనా స్నేహం స్నేహమే. ఇంతకాలానికి కలిసిన తరువాత కాసేపు మనసు విప్పి మాట్లాడుకోకుండా వెళ్ళడం ఏంటి? మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో, అందుకే అడిగాను "మళ్ళీ ఎప్పుడు కలుస్తావు?"
"ఫోన్ చేసి చెప్తానే. ముందు అనుకుంటే నాకసలు కుదరదు. ఈ పిల్లలతో ఆయనతో. వీలు చూసుకుని వస్తా. అయినా నువ్వే రాకూడదు.... మా ఇంటికి' అంది మళ్ళీ.
"ఎక్కడ మీ ఇల్లు?' అడిగాను.
'చిక్కడపల్లి లో దగ్గరేగా. కాసేపు కూర్చుని వెళుదువు గానీ రావే" అభ్యర్ధనగా అడిగింది సరోజ.
నేను వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. "ఒక్క క్షణం" అంటూ మావైపే సీరియస్ గా చూస్తున్న సేల్స్ బాయ్ వైపు చూసి, నాకు అంతకుముందు నచ్చిన లేతా ఆకుపచ్చ చీర ప్యాక్ చేయమని చెప్పాను.
"నేను అటో మాట్లాడతాను. ప్యాకెట్ తీసుకుని వచ్చేయ్" అంటూ సరోజ బైటకి నడిచింది. దివ్య తల్లిని అనుసరించింది.
నేను బిల్లు చెల్లించి , చీర కవర్ తీసుకుని బైటకి నడిచాను. అప్పటికి అటో మాట్లాడి తల్లీకూతుళ్ళు ఆటోలో కూర్చున్నారు. నన్ను చూస్తూనే "రా... రా" అంది సరోజ. నేను నాలుగు మెట్లుదిగి అటో ఎక్కాను.
"చిక్కడపల్లి పోనీ బాబూ" అని అటో డ్రైవర్ కి చెప్పి "ఇంక చెప్పవే ఏంటి విశేషాలు? నీకు ప్రమోషన్ వచ్చిందా?" అవునూ నీకు కారివ్వలేదా?"
"ఇంకా పర్సనల్ గా ఇవ్వలేదు. ఉదయం ఇంటి కొచ్చి పికప్ చేసుకుని, సాయం కాలాలు ఇంటి దగ్గర దింపేస్తారు" అన్నాను సర్దుకుని కూర్చుంటూ.
'అలాగా.... మీ అయన ఏం చేస్తున్నాడు? అయినా నీ పెళ్లి క్కూడా పిలవలేదేంటి? మన మధ్య కరస్పాండెన్స్ లేనంత మాత్రాన నన్ను వదిలేస్తావా? మన స్నేహం మర్చిపోతావా? నిన్నసలు క్షమించకూడదు" గబగబా ప్రశ్న, జవాబు తనే వేసుకుంటూ నాకు జావాబు చెప్పే అవకాశం ఇవ్వకుండా మాట్లాడేస్తోంది సరోజ. తనకి ఇద్దరు పిల్లలని, దివ్య పెద్దదని , కొడుక్కి పదేళ్ళ ని , వాడు మొండిగా తయారవుతున్నాడని, పిల్లలిద్దరినీ తండ్రి గారభం చేస్తాడని, తాతగారు- మామ్మల గారాబం కూడా ఎక్కువని ...ఇలా చాలా విషయాలు దారి పొడవునా చెప్తూనే ఉంది. దివ్య మౌనంగా రోడ్డు వైపు చూస్తూ కూర్చుంది. ఆ అమ్మాయి ఎక్కువ మాట్లాడదని మాత్రం నాకర్ధమైంది. సరోజ వాగుడు కాయ. మొదట్నించీ అంతే. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. బహుశా ఈ విషయంలో కూడా దివ్యకి తండ్రి పోలికే వచ్చి ఉంటుందనుకున్నాను.దివ్యని నారాయణగూడా లోని ఒక కోచింగ్ సెంటర్ దగ్గర డ్రాప్ చేసి, మేం చిక్కడపల్లిలోని సరోజ ఇంటి ముందు అటో దిగిపోయాం.
ఇండిపెండెంట్ హౌస్. వాళ్ళ మావగారు నలభై ఏళ్ళ క్రితం కట్టించిన ఇల్లు. అయన అడ్వకేట్. సరోజ భర్త కూడా అడ్వకేట్. గేటుకి రెండు వైపులా లాయర్ వీరభద్రం, లాయర్ రామబ్రహ్మం అనే నేమ్ ప్లేట్స్ ఉన్నాయి.
"మీవారి పేరేంటి?" అడిగాను సరోజ వెనకాలే లోపలికి నడుస్తూ.
"రామబ్రహ్మం గారు"అంది.
తర్వాత నన్ను కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళింది. నేను గది పరిశీలిస్తూ నిలబడ్డాను. ముందు గదిలో రాక్స్ నిండా లా పుస్తకాలు . టేబిల్ మీద కూడా ఆ పుస్తకాలే. లోపల హల్లో కూడా అవే పుస్తకాలు. జర్నల్స్, ఇల్లంతా సామానుతో పుస్తకాలతో గందర గోళంగా ఉంది. ఇల్లు పెద్దదే. కానీ సరిగ్గా సర్దుకోకుండా నీట్ గా ఉంచుకోక పోవడంతో ఇరుగ్గా, చిరాకుగా అనిపిస్తోంది. తిరిగి వచ్చిన సరోజ "లోపలికి రావే" అంటూ తనతో పాటు డైనింగ్ హాల్లోకి తీసికెళ్ళి "కూర్చో కాళ్ళూచేతులు కడుకోస్తా" అంటూ పెరట్లో కి వెళ్ళి వచ్చింది.
డైనింగ్ టేబిల్ నిండా ఉదయం వండుకుని తినగా మిగిలిన వంటకాల గిన్నెలు, కొన్నిటి మీద మూతల్లేవు. కొన్నిట్లో గరిట అలాగే ఉంచి మూత పెట్టారు. ఉప్పు, మిరియాల పొడి ఉంచిన చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు, స్పూన్స్ వేసిన ఒక ప్లాస్టిక్ డబ్బా, ఎప్పుడో తెచ్చి పెట్టిన స్వీట్లు పాకెట్లు, వాటిల్లో మిగిలిన ఒకటీ ఆరా స్వీట్స్ బాగా మగ్గిపోయిన అరటి పళ్ళు, రెండు, పప్పు, ఊరగాయ మరకలతో నిండి ఉంది టేబిల్.
"కాఫీ తాగుతావా? టీనా?" అడుగుతూ కిచెన్ లోకి నడిచింది సరోజ.
నేనేం మాట్లాడలేదు. తను అడిగిందే కానీ, నాజవాబు వినిపించుకో కుండానే ఐదు నిముషాల్లో కాఫీ కలిపి కప్పులో పోసి ఒకటి నాకిచ్చింది. రెండో కప్పు తీసుకుని ఇప్పుడే వస్తా అత్తయ్యకి కాఫీ ఇచ్చి" అంటూ ఒక బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. డిగ్రీ దాకా చదువుకున్న సరోజ. ఎన్నో కొన్ని ఆదర్శ భావాలున్న సరోజ ఒక మాములు గృహిణి అయింది. పెళ్ళయి పదిహేనేళ్ళు . ఇద్దరు పిల్లల తల్లి. భర్త, పిల్లలు, అత్తగారి , మావగారి బాధ్యతలు. వీటిల్లో పడి తన శరీరం మీదా, ఇంటి మీదా, కూడా శ్రద్ధ చూపించడం లేదని స్పష్టంగా అర్ధం అవుతోంది. రకరకాల బ్యూటీ టిప్స్ ప్రతి పేపర్ లో , టీవీల్లో చెప్తున్నా ఏ ఒక్కటీ సరోజ పాటించడం లేదని తెలుస్తోంది.
