"రాజభూషణంగారు! మీరటు కూర్చోండి అక్కడ ఆ ఫోనుంది చూడండి! ఆ బల్లవద్దు!" అన్నాడు హెడ్ క్లర్క్.
ఏదో సూచన అందినట్టుగా రాజభూషణం అటు కదిలి కుర్చీలో కూర్చుని రింగ్ చేశాడు.
"ఆగండి ఫోన్ క్రింద పెట్టండి క్రెడిల్ చేయండి!" అంటూ మరో ఆఫీసరు వచ్చి చొరవగా అతని చేతిలోని ఫో నందుకుని పెట్టేశాడు. రాజభూషణం, హెడ్ క్లర్క్ ఇద్దరూ నిరాశపడిపోయారు.
"మీరు ఆయన ఫైల్ పెండింగ్ లో పెట్టారా? మీ కోసం వచ్చారా? డబ్బు ఏమైనా ఇచ్చారా?" అడిగాడాయన నందని.
"ఆ అందులో లోపాలున్నాయి. అందుకే పాస్ చేయలేదు. ఆయన డబ్బు ఇవ్వబోతే తిరస్కరించాను!" ధైర్యంగా చెప్పింది నంద.
"మరి ఫైలు తీసి ఉంచారేమిటి?"
"ఆఫీసరు చూడమని చెప్పారు!" సంజాయిషీగా అంది నంద.
"అమ్మాయ్ అబద్దం ఆడకు! డబ్బు ముట్టిందేమో సార్" అన్నాడు హెడ్ క్లర్క్.
"షటప్!" అంది నంద ఆవేశంగా.
"ఆవేశపడకండి! మేం చెక్ చేస్తాం కదా! అని ఆమె వేనిటి బాగ్, టేబిల్, రాక్ అంతా చూశారు. మిగతాస్టాప్ అంతటిని చెక్ చేశారు ఎక్కడా ఏం లేదు.
ఆఖరికి హెడ్ క్లర్క్ ని చెక్ చేయగానే అతనివద్ద రెండు వేల రూపాయలు దొరికాయి.
"ఎక్కడిది ఈ డబ్బు?"
"నాదేనండి!"
"ఎందుకు ఆఫీసుకు తెచ్చారు?"
"ఈవెనింగ్ షాపింగ్ కి వెళ్ళాలి!"
"ఏ బ్యాంక్ లో డ్రా చేశారు?"
"ఇంటినుంచే తెచ్చాను!"
"ఇంట్లో ఎక్కడిది?"
"మా ఆవిడ పుట్టింటినుంచి తెచ్చింది!"
"ఫోన్ చేసి కనుక్కుంటాం."
"మా ఇంటికి ఫోన్ లేదు."
"సారీ పరశురాంగారూ! మీ ఆ డబ్బు మేం స్వాధీనం చేసుకుంటాం. ఇది మీదో, యితర్లదో, దీనిపై మీ వేలి ముద్రలు కాక, ఇంకెవరివయినా వున్నాయేమో చూడాలి!
"రాజభూషణంగారూ! మీరు ప్రయివేట్ వ్యక్తులు అయినా అనుమానాస్పద స్థితిలో వున్నారు కాబట్టి మీ వేలి ముద్రలు ఇవ్వండి. వీటిపై ముద్రలతో సరిపోల్చాలి!" ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడతను.
"క్షణాలపై ఆలోచనలకి తావివ్వకుండా పని చకచకా జరిగిపోయింది.
రాజభూషణం నిర్లిప్తంగా వున్నాడు.
హెడ్ క్లర్క్ కి శిక్ష తప్పదు అనుకున్నారంతా.
అప్పుడు పిలిచారు ఆఫీసరుని.
ఆయన కింతవరకూ ఈ గొడవే తెలియదు.
ఆయనను చెక్ చేశారు.
ఆయన గదంతా చెక్ చేశారు.
ఏమీ దొరకలేదు.
హెడ్ క్లర్క్ ని అందరిముందు చెడామడా తిట్టేశారు ఆఫీసర్.
అతనెంతో నిజాయితీ పరుడన్నట్టుగా వ్యవహరించాడు.
నంద నిర్ఘాంతపోయి చూసింది.
యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు స్టేట్ మెంట్స్ తో డబ్బుతో వెళ్ళిపోయారు.
"నువ్వొట్టి వెధవయ్యా!" అన్నాడు రాజభూషణం.
"పరశురాం! నువ్వు ఫూల్ వి! సంతకం చేయనని మొరాయించవలసింది!" అన్నాడు ఆఫీసర్.
అతను బిక్కమొకం వేశాడు.
"వెళ్ళండి వాళ్ళు ఎక్కడ మకాం చేశారో కనుక్కోండి ఆ రెండువేలకి జతగా మరో వెయ్యి ఇవ్వండి. తలావేయి పంచుకుంటారు. నీపై రిపోర్ట్ చింపేస్తారు. వాళ్ళకి మాత్రం డబ్బంటే చేదా?"
రాజభూషణం వైపు చూశాడు పరశురాం.
"పద!" అన్నాడు అతను.
ఇద్దరూ శరవేగంతో వెళ్ళారు.
ఆఫీసరు గుర్రుగా చూశాడు నందవైపు.
"ఇంట్లో భార్యకి ఇవ్వమని చెప్పి వుంటాడు. అనుకుంది నంద.
తిరిగి ఆఫీసంతా మామూలైపోయింది.
నందకి తనకి జరిగినట్టే తన తండ్రికీ జరిగిన అన్యాయం గుర్తు కొచ్చింది. ఈనాడు ఆపద ఎంతలో తప్పిపోయింది. తను ఎంత నిజాయితీగా వుంటేనేం! ఆ వచ్చిన ఆఫీసరు కాస్త లాలూచీ పడేవాడయినా, యిక్కడ హెడ్ క్లర్క్ తన సీటు వద్దకి రాగలిగే అవకాశం వుండినా ఏమయిపోయేది! తనో స్కేప్ గోట్ అయ్యేది. ఆ డబ్బు ఎలాగో తన సీట్లోకి వచ్చేది. తను దొరికిపోయేది. నలుగురి ముందూ తను దొంగ అయిపోయేది. ఉద్యోగం పోయేది. భగవంతుడు తనని యీ నాడు రక్షించాడు! కానీ ఆనాడు.... తండ్రిని...
19
ఎవరో డబ్బు తెచ్చి నారాయణ ఫైల్స్ పెట్టుకునే రాక్ లో పెట్టారు.
ఎప్పుడు పెట్టారో తెలియదు.
ఎలా పెట్టారో తెలియదు.
ఒక ఇంటర్వ్యూలో డబ్బు తీసుకుని తన ఆఫీసరుకి, రికమెండ్ చేశాడని కంప్లైంట్ వెళ్ళింది. ఆనాడు సడన్ గా యాంటీ కరప్షన్ వాళ్ళు వచ్చేశారు.
అందరినీ వదిలేసి నారాయణ వద్దకు వచ్చారు. అతన్ని చెక్ చేయాలని ఐడెంటీ చూపారు.
నిర్భయంగా చెక్ చేసుకోమన్నాడు అతను.
ఆఫీసర్లు కొంచెం సందేహించారు.
ఆ ఆఫీసు ఆఫీసరు "నో! నో! నారాయణగారు అలాటివారు కాదు. ఆయన్ని అనుమానించడం అమానుషం!"
అన్నారు అయినవాళ్ళు "సర్! ఇది మా డ్యూటీ పర్టిక్యులర్ గా రిపోర్ట్ చేశారీయనపైన చెక్ చెయ్యాలి అన్నారు వాళ్ళు.
ఆఫీసరు అంగీకరించాడు.
చెకింగ్ మొదలైంది.
తన శవాన్ని పోస్ట్ మార్టం చేస్తోంటే చూస్తూన్నట్టుగా ఎంతో అవమానం ఫీలవుతూ నుంచున్నాడు నారాయణ. అతని కేమీ అర్ధం కావటం లేదు. తనకేదో చెడు కాలం అన్నట్టు చూస్తున్నాడు. ఆఖరికి రేక్ లో దొరికాయి అయిదువందలు'
నారాయణతో పాటే అందరూ నిర్ఘాంతపోయారు.
తర్వాత ఆ నోట్లపై ఆయన వేలిముద్రలు గుర్తులు కనిపించాయి. రెడ్ హేండెడ్ గా దొరికాడని ఆయన్ని సస్పెండ్ చేశారు. కేసు ఎంక్వయిరీకి వేశారు.
