Previous Page Next Page 
ఒప్పందం పేజి 34

 

    అమ్మా! శశికి నేనంటే ప్రాణం... నాకూ శశి అంటే ఇష్టం. అలా అని నిన్ను వదిలి శశినే లోకంగా బతకాలని నేనెన్నడూ అనుకోలేదు. కానీ నువ్వే నేను ఎంత దగ్గరగా అవాలనుకునేదాన్నో డిసిప్లిన్ అంటూ నన్ను అంత దూరంగా పెట్టావు. గారాబంగా పెంచుకోవడం వేరు... ప్రేమతో పెంచుకోవడం వేరు. నేను ఏం కోల్పోతున్నానో నాకు అందించడానికి నువ్వేం ప్రయత్నించలేదు. అలా చేసి ఉంటె నాన్నని వదిలి వచ్చేముందే నా గురించి ఒక్కక్షణం అలోచించి ఉండేదానివి . అమ్మా! సహజీవనం అంటే ప్రేమానురాగాలు పంచుకుంటూ, ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటూ , వ్యక్తిత్వాన్ని కాపాడుతూ, కాపాడుకుంటూ బతకడం అని నా అభిప్రాయం. నాకు కుటుంబం కావాలి. పెద్ద కుటుంబం కావాలి. నువ్వు....నేను.... నీ బిజీ లో నువ్వు నా హోం వర్క్ లు, పరీక్షల ప్రిపెరేషన్స్ లో నేను.... మనకేవరున్నారు? ఎప్పుడన్నా అమ్మమ్మ గానీ, తాతయ్య గానీ, నానమ్మ గానీ, మేనత్త లు గానీ మనింటికి వచ్చారా? నాకోసం ఏదన్నా తెచ్చారా?మనింట్లో, సందడి అనేది వినబడిందా? లేదు... నాకు తెలిసి ఎన్నడూ లేదు.
    నీకు నీ పేరు ప్రతిష్టల మీద, నీ మీటింగ్ ల మీద, నీ రచనల మీద, అభిమానుల మీద ఉన్న ఆసక్తి లో కొంచెం నామీద ఉండి ఉంటె నా జీవితం బహుశా ఇంకోలా ఉండేదేమో. నీ ఆదర్శాల కిచ్చిన విలువ నా ఆశల కివ్వలేక పోయావు. నీ బిజీ లైఫ్ లో నన్ను ఒంటరిని చేశావు. ఆదర్శం ఏమిటో నాకెప్పటికీ అర్ధం కాదు. నువ్వు నమ్మిన సిద్దాంతం నీకు ఆదర్శం  అయితే, నేను నమ్మిన సిద్దాంతం నాకు ఆదర్శమే కదా.... నాకు ఆదర్శ గృహిణిగా ఉండడం ఇష్టం. అలా అని శశి నన్ను అలా మార్చుకున్నాడని అనుకోకు. తనే మందలిస్తుంటాడు. "ప్రతి దానికి డిపెండెంట్ గా ఉండకు . నీ ఇండివిడ్యూవాలిటీ నీకుండాలి" అని కానీ, నాకెందుకో ఏం కావాలన్నా శశి ద్వారా పొందడమే ఇష్టం.
    నేను మొదటిసారిగా గర్భం దాల్చినప్పుడు ప్రేమగా నన్ను నీ దగ్గరకు తీసికెళ్ళి పెడితే కడుపు చలవ అంటారు. అలా చేశావా/ లేదు. నీకు టైం లేదు. డెలివరీ అయాక పాపని చూసుకోడానికి కొంతకాలం నా దగ్గర ఉన్నావా? లేదు....నీకు టైం లేదు.
    నీకిప్పుడు వయసు అయిపొయింది. సహజంగా ఏర్పడే కొన్ని అనారోగ్య లక్షణాలు నీలో ఏర్పడ్డాయి. నీవిప్పుడు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆవిశ్రాంతిలో , ఈ ఖాళీలో నీకు నేను గుర్తోచ్చాను. ఏం ఇంతకాలం  నిన్ను ఉక్కిరిబిక్కిరి చేసిన నీ వ్యాపకాలు, నీ అభిమానులు, నీ ఇంటర్వ్యూల కోసం పోటీపడే చానెల్స్ వాళ్ళు వీళ్ళంతా నీకు ఇప్పుడు గుర్తు రావడం లేదా? వాళ్ళెవరూ నీకేమీ సాయం చేయలేరా? లేదు చేయరు. ఎందుకంటె వాళ్ళు నీకేమీ కారు. ఏదో ఉద్యోగ ధర్మంగా నిన్ను ఎంటర్ టైన్ చేశారు . వాళ్ళు నీ రక్తసంబందీకులు కాదు. నీ బంధువులు కాదు. నీతో జీవితం పంచుకున్న వాళ్ళు కాదు. జాతీయ స్థాయిలో కీర్తిని సంపాదించుకున్నావే.... ఆ కీర్తి నీకిప్పుడు ఒక్క ఆత్మీయులని అందివ్వగలదా?
    "సారీ అమ్మా! నేను నీ పెంపకం లో చాలా కోల్పోయాను. సాధారణంగా ప్రతి వ్యక్రీ తానెం కోల్పోయాడో దానికోసం అన్వేషిస్తాడు. నాకు బోలెడంత స్వేచ్చ ఇచ్చావు. నాకు ప్రతి పని నేను చేసుకుని విసుగొచ్చింది. నా పనులు ఎవరన్నా చేసిపెడితే బాగుండు... నాకేం కావాలో ఎవరన్నా అమరిస్తే బాగుండు అనిపించింది. అన్నీ శశి సహచర్యంలో తీరుతున్నాయి. అలా అని నువ్వనుకున్నట్టు నేను బానిసను కాను. ఇంట్లో ఏం చేయాలన్నా నా అంగీకారం ఉంటె తప్ప శశి చేయదు. అత్తగారికి నేనంటే విపరీతమైన నమ్మకం. మావయ్యగారికి చాలా అభిమానం. నాన్నా! అయన స్నేహితుల్లా ఉంటారు. ఎవరూ కూడా నిన్ను ద్వేషించడం లేదు.ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం, మనిషి సామాజిక జంతువూ అంటారు. దాని అర్ధం నాకు తెలిసింది ఏంటంటే సమాజంలో ఒకడుగా, సమాజ ధర్మాన్ని అనుసరిస్తూ సాగిపోవడమే మనిషి బాధ్యత అని నేను అనుకుంటున్నాను. మరి ఒక ఫెమినిస్టుగా నీ ఆలోచన ఏమిటో నాకు తెలియదు.
    నాకు ఒంటరితనం అంటే భయం. అసహ్యం కూడా క్రమశిక్షణ పేరుతొ నన్ను ఆమడ దూరంలో ఉంచావే కానీ, ఏనాడూ దగ్గరకు తీసుకుని నన్ను నీ గుండెలకు హత్తుకోలేదు. మనమధ్య నాకు ఒక వయసు వచ్చిన దగ్గర్నించీ ఏదో తెలియని దూరం ఏర్పడింది. ఆ దూరం తగ్గించే ప్రయత్నం నువ్వేం చేయలేదు. నాకు నా ఇల్లు వచ్చేపోయే అతిధులతో కళకళలాడాలి. నిత్య కల్యాణం పచ్చ తోరణం లా ఉండాలి. నాకు తెలిసీ మనింటికి ఎవరూ ఎప్పుడూ వచ్చి ఒక పూట ఉన్నట్టుగా లేదు.
    అమ్మా! జీవితంలో మనకేం కావాలో పోరాడితే లభించదు... జీవితానందం కోల్పోవడం తప్ప ఫలితం ఉండదు. రాజకీయంలో పోరాడితే తప్ప ఏదీ లభించదు. జీవితం రాజకీయం కాదు. నేనిప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. ఒకవేళ నువ్వనుకున్నట్టు ఎప్పుడన్నా ఒంటరిగా ఈ జీవితాన్ని ఎదుర్కోవాల్సిన స్థితి వస్తే ఎలా ఎదుర్కోవాలో కూడా నాకు తెలుసు . అమ్మా !నీ ముందు ఇప్పుడు మూడు మార్గాలున్నాయి. నాన్న నిన్ను ద్వేషించడం లేదు. ఈ వయసులో నీకు తన అవసరం, తనకి నీ అవసరం చాలా ఉందని ఆయనకి తెలుసు. అలాగే నాకూ నీ ప్రేమాభిమానాలు కావాలి. నా పిల్లలకి అమ్మమ్మ అనురాగం కావాలి. కాబట్టి నా ఇంటి తలుపులు కూడా నీకోసం సదా తెరిచే ఉంటాయి. ఇకపోతే  నువ్వెంచుకున్న గమ్యం.... నీ సాహితీ లోకం.... నీ అభిమానులు... నీ కీర్తి ప్రతిష్టలు..... మాతో ఉన్నా వాటి కెక్కడా భంగం కలగదు. ఈ మూడు మార్గాల్లో నీకిప్పుడు ఏమార్గం సుగమామో, ఎక్కడ నువ్వు నిశ్చింతగా , హాయిగా ఉంటావో నిర్ణయించుకునే హక్కు నీదే. నువ్వెటు నడచినా నీకో గమ్యం మాత్రం ఏర్పరచుకో. అదే కోరేది. ఉంటాను."
    లాలిత్య
    కృష్ణవేణి వెక్కివెక్కి ఏడవసాగింది. పని పూర్తీ చేసుకుని చీర చెంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చిన కుమారి ఆవిడ ఏడుపు చూసి నిశ్చేష్టురాలైంది.
    'అమ్మగారూ ఏమైంది? నెప్పి ఎక్కువగా ఉందా?" ఆప్యాయంగా అడిగింది.
    కృష్ణవేణి మాట్లాడలేదు. చాలాసేపు అలా ఏడుస్తూనే ఉండిపోయింది. కుమారికేలా ఓదార్చాలో అర్ధం కాలేదు. ఎప్పుడూ గంబీరంగా చూపుల్తో నే ఆమడ దూరంలో నిలబెట్టే అమ్మగారంటే భయం. అందుకే ఏం మాట్లాడాలో అర్ధం కాక నిరుత్తరాలిగా నిలబడి పోయింది. కృష్ణవేణి కళ్ళు తుడుచుకుని కొంచెం వెక్కుతూ "కుమారీ! ఈ ఒక్కరాత్రి నా దగ్గర ఉండగలవా?" అడిగింది.
    "నేనా?' ఇక్కడా...." నీళ్ళు నములుతూ అంది కుమారి. "ఇంటి దగ్గర పిల్లలున్నారమ్మా...వెళ్ళి వంట చేసి వాళ్లకి అన్నం పెట్టాలి . మా అయన కూలీ నుంచి వస్తాడు. వేడిగా అన్నం వండితేనే తింటాడు. నాకు కుదరదమ్మా...."
    చెంప మీద చెళ్ళుమని కొట్టినట్టు అనిపించింది కృష్ణవేణికి. "సరే వెళ్ళు"అంటూ మొహం తిప్పుకుంది.
    కుమారి నెమ్మదిగా అక్కడి నుంచి కదిలి బైటికి వెళ్ళిపోయింది.
    వెల్లకిలా మంచం మీద వాలిన కృష్ణవేణి కళ్ళకి పైన గిరగిరా తిరుగుతున్న సీలింగ్ ప్యాన్ తప్ప మరేం కనిపించలేదు. కళ్ళు నీటి కుండల్లా మారాయి. షెల్ఫ్ లో ఉన్న లాలిత్య చిన్ననాటి ఫోటో వెక్కిరిస్తున్నట్టు అనిపించింది.

                                    ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS