Previous Page Next Page 
ఆదివిష్ణు కథలు పేజి 35


    "మా కళ్ళముందు మా పార్ధుడు తిరుగుతూంటే వాడిలో మా అన్నయ్యను చూచుకుంటూ కొంత బాధనైనా మరిచిపోగలం. మాకు వాడు కావాలి. ఆ ఇంటినుంచి మా వదినా, పార్దుడూ ఇద్దరిక్కడికొచ్చేయాలి. అందుకేదైనా మార్గముంటే చెబ్తారా?"
    "నేనేం చెప్పగలను? నిజమే -పార్ధు డిక్కడికొస్తే కేవలం బంగారం భోంచేయవచ్చు. పార్ధుడి అక్కడి దుస్థితికి పరాయివాడిని నేనూ బాధపడిపోతున్నాను.
    కానీ నేను లక్ష్మీపతికి యేమార్గమూ బోధించలేదు. బాగా చీకటి పడుతున్న వేళ మేం ముగ్గురం ఆ తోటనుంచి బయటపడ్డాం.
    

                                        *    *    *
    
    సెలవు పూర్తికాకుండానే నేనావూరు వెళ్లేందుకు నిశ్చయించుకున్నాను. ఈ విడ్డూరానికి మా వాళ్ళంతా ఆశ్చర్యపోయేరు. వదిన మాత్రం నన్ను అడిగింది గూడాను.
    "ఏమిటయ్యా! ఏమిటీవింత? నువ్వు మెచ్చుకుంటూన్న నీ సొంతవూరొదిలి వెళ్ళిపోవడమే. పైగా పనసపండు లాంటి మీ చిరంజీవితో రెండురోజులు గడపకుండానే వెళ్ళిపోతావా ఏమిటి చోద్యం? బడాయిపోవద్దు మీ ఆవిడేమైనా అంటే నే చెప్తాను. సరేనా?"
    నేనెవరిమాటా వినలేదు. నా మనసు వీళ్ళెవరికీ తెలియదు. నాకెందుకో భయంగా వున్నది. ఈ జీవితం, ఈ సంసారం పిల్లలూ బాంధవ్యాలూ, ఇవన్నీ తలచుకోని ఘడియలేదు. సుందరశివరావు, సత్యవతీ, పార్దుడూ - వీళ్ళల్లో ఎవరు గుర్తుకొచ్చినా బ్రతుకుపట్ల వైరాగ్యం కలిగే ప్రమాదం జరగొచ్చని భయంగానూ వుంది. పిచ్చెక్కుతూన్నట్టుంది. మొండిగా మా వాళ్ళ ముచ్చటని గూడా గమనించకుండా మా వూరొదిలి వెళ్ళిపోయేను.
    ఆఫీసుబృందానికి, నేను సెలవు రద్దు చేసుకోవడంలోని తిరకాసు అర్ధమైంది కాదు.
    బాగా పొద్దుపోయేటంతవరకూ, ఉదయం తొమ్మిది గంటలకు లేచి ఆఫీసుకెళ్ళే కార్యక్రమం వారంరోజులుగ్గాని అలవాటు కాలేదు. కావాలని చెప్పి పార్ధుడి విషయం మరచిపోవడానికి ప్రయత్నించటం ప్రారంభించేను.
    నేనొచ్చిన ఆఫీసుపని చివర్లో పడింది. రెండు రోజుల్లో ఈ వూరువదిలి వెళ్ళవలసి వుంటుంది. అనగా - దౌర్భాగ్యుడైనా పార్దుడిని వదిలి నా గూట్లో నేను చేరుకుంటానన్నమాట. నా వూళ్ళో నా స్నేహితుల్తో సరదాల్తో కలిసిపోతానన్నమాట.
    ఆ రోజు పెందరాళే యింటికొచ్చాను. నా గది గుమ్మం ముందు పార్ధుడు కూర్చున్నాడు. వాడిని చూస్తూ గతుక్కుమన్నాను. నేను తలుపు తాళం తీస్తుండగా అడిగాడు.
    "మీ రస్సలు కనిపించడమే లేదు."
    "అవునోయ్ ఆఫీసు పని అలా తగలబడింది మరి"
    "మా అమ్మకి జ్వరమొచ్చి నయమయింది."
    "అలాగా"
    "అప్పుడు నేను మా ఊరెళ్ళిపోదామంటే అమ్మ ఏడ్చింది."
    పార్దుడ్ని అర్ధం చేసుకున్నాను. చొక్కావిప్పుతూ అన్నాను:
    "నేనీ మధ్య మన వూరెళ్ళి మీ తాతయ్య వాళ్ళింటికీ వెళ్ళివొచ్చేను తెలుసా? మీ చిన్నాన్నా, మీ బామ్మా అందరూ నిన్నడిగామని చెప్పమన్నారు."
    "మరి... మరి మా సరోజత్తయ్యా!"
    "ఆహా... ఆ అమ్మాయి గూడా అడిగింది."
    "..... మరి మా శాంత పిన్ని"
    "ఆవిడ గూడాను."
    "రంగయ్య?"
    "అతనెవరు?"
    "మీకు తెలీదా? మా తోటమాలి."
    "అవునవును అతనూ అడిగేనని చెప్పమన్నాడు."
    "బలే అయితే మీరు అందర్నీ చూచారన్నమాట."
    వీడికేం చెప్పాలో తోచింది కాదు. కాళ్ళు కడుక్కునేందుకు దొడ్లోకి వెళ్ళేను. బాల్చీతో నీళ్ళు తోడి కాళ్ళు కడుక్కుంటూండగా నావెనకే నించున్న పార్ధుడు అడిగాడు.
    "మళ్ళా ఎప్పుడు వెడతారు."
    "ఎల్లుండి ఉదయం ఆరుగంటలకి మరింకి ఇటు రాను."
    "ఎప్పుడూ?"
    "వూహు"
    తల దువ్వుకుంటూ అద్దంలో పార్దుడిని చూచాను. చొక్కా చివర్తో కళ్ళొత్తుకుంటున్నాడు వాడు. జాలి కలిగింది. కించిత్తు కోపమూ కలిగింది. అప్పటికప్పుడే నేనో కథ అల్లి చెప్పాను. (ఈతప్పు నాదే అయినాసరే వాడి కర్ధమయ్యేలా కథని తయారుచేసి చాలా వోపిగ్గా చెప్పాను.)
    "విను పార్ధు! నీలాగే నేనూ చిన్నప్పుడు మా అమ్మమ్మగారింటిలో వుండేవాడిని. వాళ్ళుత్త రాక్షసులు రోజస్తమానం నన్నూ, మా అమ్మనీ తిట్టేస్తూండేవారు. నాకేమో చెడ్డ బాధగా ఉండేది. మా బామ్మగారి వూరెళ్ళి పోతే మా చిన్నాన్న, మా అత్తయ్యా వాళ్ళెంతో మంచి వాళ్ళు కనుక నన్ను నెత్తిమీద పెట్టుకు తిరుగుతారు. నాకు బోల్డు కొనిపెడతారు."
    "నిజం, మా సరోజ అత్తయ్య చాలా మంచిదండి."
    "నన్ను చెప్పనివ్వు మరి. అయ్యిందా - అప్పుడు మా అమ్మనడిగాను. మనం మన బామ్మవాళ్ళూరు వెళ్ళిపోదామని. అమ్మ రానంది. అప్పుడు నేనేమి చేశానో తెలుసా ఒక రోజున మా బామ్మవాళ్ళూరి మనిషి కనిపిస్తే అతన్తో పాటు మా బామ్మ వాళ్ళూరికి పారిపోయాను."
    "పారిపోయేరా? మీకప్పుడు భయం వేయలేదూ?"
    "వూహు-మనకెందుకూ భయం? మా బామ్మవాళ్ళూరి మనిషి చాలా పెద్దవాడుగా అంచేత అతన్తో కలిసి వెళ్ళిపోయాను."
    "బలే... బలే... బాగుంది. తర్వాత?"
    "తర్వాత ఏమైందంటే నేను పారిపోయిన విషయం మా అమ్మకి తెలిసి, నేను లేకపోతే తనకీ తోచదు గనుక ఆవిడ కూడా మర్నాడు పొద్దునే మా బామ్మగారి వూరొచ్చేసింది. అప్పట్నుంచీ మా అమ్మతోపాటే మా బామ్మగారి దగ్గిరే వుండిపోయింది ఎంచక్కా!"
    కథ పూర్తిచేసి వాడివేపు చూశాను. వాడు కథంతా విని నవ్వు మొహంతో అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయాడు.
    ఆ రెండురోజులూ ఆఫీసులో అప్పగింతల్తోనే సరిపోయింది. అప్పగించవలసిన కాగితాలూ, వెంటబెట్టుకెళ్ళవల్సిన రిపోర్టులూ, అన్నీ ముగించుకుని బయటపడేసరికి రాత్రి పదయింది. రాత్రంతా పెట్టె, బేడా సర్దుకోడంలో మునిగిపోయాను.
    తెల్లవారుజామున లేచి స్నానం ముగించి ప్రయాణం తాలూకు హడావిడిలో ఉన్న వేళకి ణ ఆగడిలోకి పార్ధుడొచ్చేడు. వాడిచేతిలో చిన్న సంచి ఒకటున్నది. ఒచ్చి అన్నాడు.
    "పదండి తొరగా మీతోపాటు నేనూ పారిపోతున్నాను గదా మా అమ్మ రేపుదయం వస్తుంది. తొందరగా పోదాం పదండి"
    ఉలిక్కి పడ్డాను. ఏమిటి వీడి చొరవ?
    "రాత్రి మా అమ్మతో పోట్లాడాను. నేను పారిపోతానని చెప్పేన్లేండి. రండి పోదాం."
    "భగవంతుడా నువ్వు సృష్టించిన 'జైళ్ళు' చాలా చిత్రమైనవి. ఈ పసిదొంగ నీ జైలునుంచీ పారిపోతున్నాడు. చేయూతనిస్తున్న నన్ను క్షమించు."
    ఆ క్షణంలో మరింకేం తోచలేదు. గబగబా పార్ధుడితో బైటకొచ్చి ఆగిపోయేను.
    నా ముందు కామాక్షమ్మగారూ, సత్యవతీ నించున్నారు. పార్ధుడు నా వెనుక పిల్లిలా నక్కుతున్నాడు.
    కామాక్షమ్మగారు చాలా అన్నారు. ఆడవాళ్ళలో క్రూరత్వం ఎంత అసహ్యంగా వుంటుందో నాకప్పుడు తెలిసింది. పార్ధుడి రెక్క పుచ్చుకుని బరబరా లాక్కుంటూ తీసుకెళ్ళారు.
    సత్యవతి నా వేపు క్షణం చూసింది. ఏం మాట్లాడింది కాదు. తన రెండు చేతులూ జోడించింది. ఈ అభ్యర్ధన ఎందునిమిత్తమో తెలీదు.
    డాబామీద ముకుందరావు దంపతులూ కనిపించేరు. ఇదిగాక నా గది చుట్టూతా కొందరు మనుషులు నించున్నారు.
    నా కళ్ళు తిరుగుతున్నాయి. కాళ్ళు గబగబా ఒణుకుతున్నాయి. కాళ్ళమీద నుంచోడం అతి కష్టం మీద వోపిక తెచ్చుకుని రెండడుగులు ముందుకు వేశాను.
    సత్యవతి వలవలా ఏడుస్తున్నట్టు పసిగట్టాను.
    
                                        *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS