"ఏం ఫర్లేదు. మంచి నక్షత్రంలోనే పుట్టేడు."
"వూ..... ఎవరి పోలికట?"
"చెప్పుకోండి చూద్దాం."
"ఊహూ..."
"చాలావరకు నేనే!!"
"వెరీగుడ్. అందగాడేనన్నమాట. థేంక్యూ సీతా, థేంక్యూ ."
"గట్టిగా అరవకండి. ఎవరైనా వింటారు. అది సరేగానీ, బొత్తిగా అంత లావైపోయారేమిటండీ! ఆ వూరినీళ్ళు పళ్ళేదేమిటి? లేక మీ పార్ధుడి గురించి బెంగా."
పార్ధుడు! సీతతో మాటాడేందుకు నోరు పెగల్లేదు. చాలాసేపు సీత ఒక్కర్తే మాటాడింది. మళ్ళా రేపొస్తానని చెప్పి అక్కడ్నుంచి కదిలొచ్చేశాను. వెళ్ళిపోయే ముందు సీత అన్నది.
"బాబుని చూడరూ?"
మనసంతా వికావికలైపోయింది. ఈ పార్ధుడనబడే ఒకానొక అమాయకపు పిల్లవాడు గుర్తుకొచ్చిన క్షణం నేనెంతో భయపడిపోతున్నాను. భగవంతుడా! నేను చాలా మంచివాడిని మంచి వాళ్ళకి నువ్వు కీడు చేయనని తెలుసు. నన్ను బతకనివ్వు మా చిరంజీవి కోసం నన్ను బతకనివ్వు.
ఎంతో పరిచయమున్న మావూరి రోడ్డుమీద పరాకుగా నడుస్తున్న నన్ను చూచిన మావూరి జనం నాకు పిచ్చెత్తిందని అనుకున్నా ఆశ్చర్యపోనక్కరలేదు.
బాగా రద్దీగా వున్నచోట నన్నెవరో పేరు పెట్టి పిలిచారు. ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాను. రోడ్డుపక్కన లక్ష్మీపతి సిగరెట్టు కాలుస్తూ నుంచున్నాడు. అతనివేపు నడిచేను.
"ఎప్పుడొచ్చేరు?"
చెప్పేను.
"ఇక్కడెన్నాళ్ళుంటారేమిటి?"
"రేపెళ్ళిపోతున్నాను. ఈ నెలాఖర్లో వొచ్చేస్తాను గూడా!"
"రండి! ఓ తడవ మా యింటికెళ్ళి ఒద్దాం."
అతన్తో వాళ్ళింటికి వెళ్ళాలనిపించింది. అతన్ని అనుసరించాను. పదిగజాల దూరంలో వాళ్ళ కారొకటి ఆగి వుంది. తలుపుతీసి ఎక్కమన్నాడు. కారెక్కాను. అతను స్టీరింగు దగ్గర కూచుని కారుని స్టార్టుచేసి అన్నాడు.
"మా పార్ధుడెలా వున్నాడు?"
"క్షేమం...."
అతనింకేం మాట్లాడలేదు. కారు బాణంలా దూసుకుపోయింది. లక్ష్మీపతి వాళ్ళింటిదగ్గరాగింది. (అందమైన ఒక భావన విశేషాన్ని ఇల్లని చెప్పడం పొరపాటే) లక్ష్మీపతి విసురుగా నడిచేడు. హాల్లో కూచున్న నలుగురూ మమ్మల్ని చూచి లేచి నించున్నారు. గుమ్మం దగ్గిరే ఆగిపోయి గోడలవేపు చూస్తూండిపోయేను. లోపల లక్ష్మీపతి మాటలు వినిపించేయి.
"నేను చెప్పేను రావ్ గారని -వారొచ్చేరు."
క్షణమాణి నన్ను పేరుతో పిలిచాడు. లోపలికి వెళ్ళాను. పేరు పేరునా ఆ నలుగుర్నీ నాకు పరిచయం చేశాడు. లక్ష్మీపతి తల్లిదండ్రులూ అతని భార్య అతని చెల్లెలూను. నమస్కారం చేసి నించున్నానే తప్ప వాళ్ళ మొహాల్లోకి చూచేంత చొరవ లేకపోయింది. లక్ష్మీపతి భార్య కాఫీలు పట్టుకొచ్చేంతవరకూ హాల్లో మిగిలిపోయిన మామధ్య కేవలం పార్ధుడి గురించే సంభాషణ జరిగింది. వాడి ఆరోగ్యం, చదువు, వాడి అల్లరీను నేనక్కడ చూచినా నిజాన్ని ఆ మనుషుల దగ్గర తప్పనిసరిగా దాచవలసిన పరిస్థితి ఎంతదారుణమైనదో నాకొక్కడికే తెలుసుననుకున్నాను. కానీ లక్ష్మీపతి నాన్నగారు నన్ను పదిగట్టిన వైనం విని అల్లాడిపోయాను. ఈ యింటికి నేనెందుకొచ్చానా అని బాధపడి పోయాను. ఆయన అన్నదీ కొద్దిమాటలే-
"నీ మంచితనాన్ని నేనూ మెచ్చుకుంటాను. కానీ రావ్! మా పార్ధుడి దినచర్య నాకు తెలుసు. శివుడు లేడు. రోజస్తమానం పుట్టెడు దిగుల్తో నేను బతికివున్నాను పార్ధుడి భవిష్యత్తు ఏమని రాసిపెట్టివుందో గాని శివుడు పోవడం సామాన్యమైన విషయం కాదు నాయనా!"
లక్ష్మీపతి భార్య ఆవేళకి కాఫీ పట్టుకురాకపోతే ఆయన మాటల్తో చచ్చి వూరుకుందును.
ఆ యింటినుంచి బయటపడ్డాను. లక్ష్మీపతి నన్ను కాదు వేపు తీసుకెడుతూ అన్నాడు.
'రండి! కాసేపు మాతోటలో కూచుని వెళ్ళిపోదాం"
కార్లో కూచున్న తర్వాత చూసేను. మా వెనకసీట్లో లక్ష్మీపతి చెల్లెలు సరోజ వున్నది. ఇబ్బందిలో యిరుక్కుంటున్నానేమోననిపించింది.
రెండు మైళ్ళదూరంలో వాళ్ళ తోట వున్నది. ఆతోట దగ్గర కారాపాడు లక్ష్మీపతి. తోటలోకి అడుగు పెడుతున్నప్పుడు పూర్వం సుందరరావు మా కేర్పాటు చేసిన పార్టీ గుర్తుకొచ్చింది. బరువుగా నడిచాను.
మా కెదురుగా ఒక చిన్న అందమైన డాబా ఒకటున్నది. దానిమీద బంగారు రంగులో "సత్యనివాస్" అని రాసున్నది. ఆ డాబాని చూస్తూ ఆగిపోయాను. లక్ష్మీపతి ఆగలేదు.
"వదిన కోసం అన్నయ్య దీన్ని కట్టించేడు" అన్నది సరోజ.
తలొంచుకున్నాడు. ఆ సమయానికి సత్యవతిని ప్రేమించిన మా సత్యం గుర్తుకొచ్చాడు.
"నాకు బాగాగుర్తు! ఆ సాయంత్రం వదిన పాట పాడింది. ఆమె చాలా చక్కగా పాడుతుంది. మేమంతా గూడా అప్పుడు అక్కడే ఉన్నాం. పాట మధ్యలో అన్నయ్య బాధగా వెనక్కి ఒరిగాడు. వదిన పాట ఆపేసింది. మేమందరం ఆత్రంగా అన్నయ్య దగ్గర చేరాము. మా అందరివేపూ అన్నయ్య భయంగా చూచాడు. అన్నయ్య అలా చూడడం అదే మొదటిసారి. అంతే రావ్ గారూ! మరింక అన్నయ్యలేడు." సరోజ కనుకొలకుల్లో నీళ్ళు నిలిచినయి.
"మీరు ఏడుస్తున్నారు" హెచ్చరించాను ఓదార్చే ఓర్పులేక.
సరోజ పమిటచెంగుతో కళ్ళొత్తుకుని 'రండి వెడదాం' అన్నది.
మేమిద్దరం డాబా దగ్గిరికెళ్ళాము. హాల్లో మేము కుర్చీలో కూర్చున్న లక్ష్మీపతి మా రాకని గమనించలేదు గాబోలు - అతని చూపు మామిడిచెట్టు మీదుగా అక్కడెక్కడో ఒరిగిపోయిన ఆకాశపుటంచుమీద వున్నది. అక్కడున్న కుర్చీల్లో మేమిద్దరం కూర్చున్నాం. క్షణం గడిచిన తర్వాత లక్ష్మీపతి అన్నాడు.
"చెట్టులాంటి అన్నయ్య పోయాడన్న దిగులుతో పాటు శ్రీధరరావుగారి లౌక్యం మా పార్దుడ్ని మాకు దూరం చేసింది రావ్ గారూ! మీరో సాయం చేయగలరా?"
నేనతనివేపు చూశాను.
