కుర్చీలు
వెంకట్రావ్ నాతో పాటు చదువుకుని కొన్నేళ్ళు క్రితం చదువు మానేసి వ్యవసాయంలోకి దిగిపోయేడు. అతనికిప్పుడు పాతికెకరాల భూమి వున్నదని నాకు తెలుసు. మంచి 'కామందని' పల్లెటూళ్ళో మంచి పేరూ వున్నది.
ఈ కామందుకి ఓ మేనల్లుడున్నాడు. అతనీమధ్యనే బి.ఏ. పాసైన వైనం నాకు మునుపొకసారి వెంకట్రావే చెప్పాడు.
ఒకానొక ఆదివారం సాయంత్రం నేనింటిదగ్గిర కాఫీ పుచ్చుకుంటోన్న వేళ నన్ను చూచేందుకొచ్చినతని పేరు సంగమేశ్వరరావు. బక్కగా, తెల్లగా వున్నాడు. పేరు చెప్పి నీళ్ళు నమలడం ప్రారంభించేడతను. అతను కూర్చునేందుకు ఒక పేముకుర్చీ చూపించాను. అతను దాన్లో బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాడు, కూర్చుని అన్నాడు:
"మీ కథలు చదువుతాను సార్! చాలా బావుంటాయి"
అందమైన మాటనే చెప్పాడతను.ఒక కాఫీ పట్టుకొచ్చి యిచ్చేను. అతనాకాఫీ తాగుతూండగా 'మీరేం చేస్తుంటారని' అడిగేను. నన్నభిమానించే పాఠకుల వివరాలు తెలుసుకోడం నా కనీస ధర్మం. మీదు మిక్కిలి సంభాషణాక్రమమన్నది అందంగానూ మలుస్తుంది.
అతను కుర్చీలో యిబ్బందిగా సర్దుకూర్చుని అన్నాడు.
"బి.ఏ పాసైయాను సార్! ప్రస్తుతం ఖాళీ."
"మీకూ కథలు రాసే అలవాటేమైనా వుందా?"
"లేద్సార్!"
"చదువుతారంతే అవునా? ఆ మాత్రం టేస్టుంటే ఏదో ఓనాడు మీరూ రాసేయగలరు" అన్నాను నా అభిమానిని సరదాపరిచే నిమిత్తం.
అతన్నీరసంగా నవ్వేసి నా ఉద్దేశాన్ని చంపేసి అన్నాడు.
"మీరీవూరు బదిలీ అయ్యేరని మావయ్య చెప్పాడు. కనిపించిపోదామని వచ్చాను."
కొంచెం ఆలోచించి అడిగాను.
'ఎవరండీ మీ మావయ్య?"
"వెంకట్రావ్ గారు."
"చెప్పారు కాదే! వెంకట్రావ్ మేనల్లుడా మీరు వాడు నాకు బెస్టు ఫ్రెండు. భేష్ బాగుంది వెరీగుడ్. ఈ ఏమిటీ విషయాలు? మీవాడు క్షేమమేనా? నేనీ వూరొచ్చినంత కాలమైనా యిప్పటికొచ్చి వాడు నాకు కనిపించలేదు."
"మీరు చాలా అదృష్టవంతులుసార్! సొంత వూళ్ళో చక్కటుద్యోగంతో ఎంచక్కా కాలక్షేపం చేస్తున్నారు."
"బలే! ఈ వూరొచ్చేందుకు నేను నాలుగేళ్ళు ప్రయత్నం చేశాను. దానికేమంటారు మరి?"
"ఏమైనా మీరు అదృష్టవంతులనే అంటాను."
"సర్లెండి అలాగే అనుకుందాం చెప్పండీ. ఏమిటి సంగతులు?"
"ఏముంటాయి సార్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని చూచి పోదామని అనుకుంటూనే చాలా ఆలస్యం చేసేను. మొన్నా మధ్య మినర్వాలో మీ ఫ్రండ్సుతో కనుపించేరు. అంత మందిలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడమెందుకని వూరుకున్నాను."
"అదేమిటండీ! మంచివారేనే! డిస్టర్బ్ చేయడమేమిటండీ బొత్తిగా... నో.... అదేం బాగోలేదు."
సంగమేశ్వరరావు సిగ్గునభినయించేడు. కాఫీ కప్పు కింద వుంచుతా నాన్చుతూ అన్నాడు.
"ఈ మధ్య రెండు మూడు ఇంటర్వ్యూలు వొచ్చేయండి. అవుతే అవన్నీ పరాయివూళ్ళలో అందుచేత నేను వెళ్ళలేదు. ఉద్యోగం చేస్తే మనూళ్ళోనే చేయాలని వుంది."
"అవునవును ఈ రకమైన ఆలోచనలు మనూరి వాళ్ళకి చాలామంది కున్నాయి సుమాండి! బాగుంది."
"ఈ విషయం మావయ్యతో చెబితే నాకేం తెలీదు. నీదారేదో నువ్వే చూచుకోమన్నాడు. అప్పడిహ మీరు నాక్కనిపించేరు."
ఇదీవరస ఈ సంగమేశ్వరరావు నా కథల్ని మెచ్చుకోడానిగ్గానీ, లేదూ నేటి తెలుగు కథారీతి గురించి గానీ మాటాడేందుకు రాలేదు. అది గమనించి నేను బాధపడ్డాను గానీ, సంగమేశ్వరరావుకది తెలీనివ్వలేదు. ఇంకా అతనే మాటాడాడు-
"మీ ఎరికలో ఇక్కడేమైనా ఉద్యోగాలుంటే సాయం చేసి పెట్టండి."
"అది సరే! బట్.... నేనీ వూరొచ్చి ఆర్నెల్లయినా కాలేదింకా....."
"పర్లేదండి. నాలుగైదు నెలలాగమన్నా ఆగుతాను. ఉద్యోగరీత్యా మీరీ వూరొచ్చి ఆర్నెల్లే అయినా మీకీ వూళ్ళో ఎవరెవరితో ఎంతెంత చనువుందో నాకు తెలుస్సార్!" అన్నాడతను తెలివిగా, తెగింపుగా, చొరవగా కించిత్తు లౌక్యంగాను.
ఉద్యోగం కోసం వొచ్చినవాడికి తప్పనిసరిగా వినయ విధేయతలుండి తీరాలని, నేననుగానీ, బొత్తిగా నెత్తికెక్కి "ఏం, వాయ్! నా విషయం ఏం చేస్తావని" డబాయించి అడిగేస్తే మండదూ? అవుతే నేనేం మండిపోలేదు. పైపెచ్చు నీకీ డబాయింపు ధోరణి నప్పదని గూడా చెప్పలేదు. నేను మొహమాటస్థుడిని. నేనేమంటే ఎదటివాడేమైపోతాడోనన్న దిగులున్నవాడిని. అందుచేత సంగమేశ్వరరావు బతికిపోయేడు. నేను మాత్రం తిరకాసుగానే మాటాడవలసి వొచ్చింది.
"నాకీ వూళ్ళో ఎంత పరపతి ఉన్నది చెప్పేరు. బాగుంది. మీకీవూళ్ళో కావలసిన ఉద్యోగమెలాటిది? దానికోసం యెవర్ని అడిగి చూడమంటారూ? ఈ మొదలైనవి గూడా చెప్పేసి వెళ్ళిపోండి" అన్నాను.
అప్పుడతను నిజంగా ఇబ్బందిలో మునిగిపోయినట్టు గమనించేను. మా యింటి వేపూ నా వేపూ, నేను కూర్చున్న కుర్చీవేపూ గబగబా చూచిగాని చెప్పలేదు.
"మీకు పశుపతిగారు తెలుసుగా సార్?"
ఈ ఒక్కమాట అనేసి అతనొచ్చిన కార్యం సిద్ధించినంతగా సంబరపడిపోయేడతను. అతను వెళ్ళిపోయినా పశుపతి గారి గురించి నా ఆలోచనలు మాత్రం దూరం కాలేదు.
పశుపతిగారికి మా వూళ్ళో మంచిపేరుంది. ఒక్కగానొక్క మేడుంది. రెండు కారులు కాబోలు -అవీ వున్నాయి. జ్యేష్టుడి పేరేమిటో తెలీదు గానీ అతనస్తమానూ క్లబ్బులోను సినిమా హాల్లోనూ కనిపిస్తాట్ట. ఒక కుమార్తెగూడా వుంది. మావూరి కాలేజీలో బుద్ధిగా చదువుకుంటుందని నాకెవరో చెప్పారు. ఇంత బలగం గలిగివున్న పశుపతి గారికి మా వూళ్ళో ఒక గొప్ప వ్యాపారము ఉన్నది.
