Previous Page Next Page 
మౌనవిపంచి పేజి 34


    
    "ఏమిటిది?" చిరాగ్గా అంది నంద.
    
    "లాంచనం! రెండు వేలు! మీ సంతకం విలువ!" నవ్వుతూ అన్నాడతను.  

 

    అతనంత సూటిగా అనటం ఆశ్చర్యం అనిపించింది ఆమెకి. ఎంత ధైర్యం!" అనుకొని "ఆ కవరు తీసేసుకోండి. నేనలాటి దాన్ని కాదు!" అంది-
    
    "ఇదిగో చూడండి! ఈ ప్రజాస్వామ్య యుగంలో ఇలాటివి చాలా మామూలు. మా ఎమ్మల్యే ఉన్నాడు. ఎం.పీ. ఉన్నాడు. ఆఖరికి ముఖ్యమంత్రి ఉన్నారు. అందరూ యధాశక్తి పానకాలరాయుల్లే.
    
    అంచేత మీరు పుచ్చుకోండి- ఒకవేళ మీరు కాదన్నా పని ఆగదు. నాకు పని ముఖ్యం! అనుకుంటే మీ ఆఫీసరే నిన్ను పిలిచి డ్రాఫ్ట్ రాయిస్తాడు. డబ్బు విలువ అలాంటిది. డబ్బు మహిమ అలాంటిది. డబ్బు శక్తి అలాంటిది. మీ ఆఫీసరు దాకా ఎందుకమ్మాయ్!
    
    మీ హెడ్ క్లర్క్ కి ఇస్తే ఆయనే ఫైలు పుటప్ చేసి నీ యినిషియల్స్ చేయిస్తాడు. కాబట్టి డోంట్ లూజ్ ది ఆపర్చ్యునిటీ! డబ్బు తీసుకో. నా పని పూర్తి చేసెయ్" అన్నాడు నీతి బోధిస్తోన్నట్టుగా.
    
    "దయచేసి వెళ్ళండి" ఒళ్ళు మండుతోన్న నంద అంతకంటే ఇంకేం అనలేకపోయింది.    

 

    అతను పెదాలు బిగించాడు. నందకేసి వెర్రిదాన్ని చూసినట్టుగా చూశాడు. "మీకు డబ్బు వద్దా?" అని అడిగాడు ఆఖరి ప్రయత్నంగా.    

 

    "షటప్!"
    
    "అయితే ఊరకే బిల్లు పాస్ చేయండి!"    

 

    "అది పాస్ కాదు-" ఖండితంగా చెప్పింది నంద.
    
    "నీ తల్లో జేజమ్మ చేయిస్తుంది. నువ్వెంత నీ పవరెంత? నీలా అడ్డు తగిలినందుకే ఓ దానవుడి తల ఎగిరిపోయిందట!" ముఖాన్నే తిట్టేసి హెడ్ క్లర్క్ వద్దకి వెళ్ళాడు అతను. రుస రుసలాడుతూ, చిరాకుతో అతను వెళ్ళిపోయాడు.  

 

    నివ్వెరపోయి చూసింది నంద.

 

    అతని తెగింపుకి ఆశ్చర్యపోయింది.
    
    వెళ్ళి హెడ్ క్లర్క్ తో ఏం చెప్పాడో, ఏమిచ్చాడో కానీ ఆ కవరే కాక ఇంకో కవరు కూడా జేబులో పెట్టుకుని ఆఫీసరు గదిలోకి వెళ్ళాడు అతను.
    
    అతని వెంటే అనుసరించి వెళ్ళాడు రాజభూషణం.    

 

    నందకి లోకమంతా డబ్బు మయంగా కనిపించసాగింది.    

 

    వెళ్ళి స్టెల్లాతో చెప్పింది అంతా జరిగిందానికి స్టెల్లా భగ్గున మండిపడ్తూ అంది నువ్వు సంతకం పెట్టొద్దు! ఏం జరుగుతుందో చూద్దాం."
    
    "ఊహూ! చూస్తాను. ఆఫీసరు ఏమంటాడో! ఉద్విగ్నంగా అంది.
    
    స్టెల్లా మరోమారు ధైర్యం చెప్పింది.
    
    ఆఫీసరు గదిలో ముగ్గురూ ఏం మాటాడుకుంటున్నారో అని ఉద్విగ్నమానసంలో ఉండిపోయింది నంద.
    
    మరో పది నిముషాలకి ఎటెండర్ వచ్చాడు.  

 

    "మేం సాబ్ పెద్దసార్ పిలుస్తున్నాడు!"
    
    నంద నర్వస్ టెన్షన్ లోకి వచ్చాయి "నేను రాను. నాకు పని ఉంది!" అని చెప్పెయ్యాలనుకుంది. కానీ ఉద్యోగ ధర్మం నోరు నొక్కేసింది. మెల్లగా అతన్ననుసరించింది. అప్పటికెలా తోస్తే అలా సమాధానం చెప్పెయ్యాలనుకుంది.
    
    ఆఫీసరు గదిలో అతనితో పాటే సమానంగా కూర్చుని కాఫీతాగుతూ జోరుగా కబుర్లు చెబుతున్నాడు రాజభూషణం ఆ కబుర్లు వింటూ ఆఫీసరు నవ్వేస్తున్నాడు. అదిచూసి హెడ్ క్లర్క్ కులాసాగా నవ్వుతున్నాడు.
    
    అది ఆఫీసరు కేబిన్ లాగా లేదు.
    
    అది ఫ్రెండ్స్ గదిలాగా వుంది.
    
    జాలీ క్లబ్ లాగా వుంది.
    
    నంద గదిలోకి అడుగుపెట్టిన రెండు మూడు నిమిషాల దాకా ఆమెని గమనించనట్టే నటించారు. నందని నించోబెట్టి అవమానిస్తోన్నట్టుంది.
    
    ఆమెకి నిప్పుమీద నుంచున్నట్టుగా వుంది.
    
    "సర్!" మరో నిమిషం తర్వాత పిలిచింది.
    
    "ఓ వచ్చావా! చూడమ్మాయ్! రాజభూషణం గారి ఫైలుండాలి! ఇలా తీసుకురా! ఆ బిల్ పాస్ చేద్దాం!" హుందాగా అన్నాడు ఆఫీసరు.
    
    "సర్!" ఏదో చెప్పబోయింది.
    
    "నో ఆర్గ్యుమెంట్స్- ఆయనెవరో తెలుసా? ఇప్పుడే సి.యం.గారి పి.ఏ. బామ్మర్ధి ఫోన్ చేశారు! ఇంకేం మాటాడకుండా వెళ్ళు! చెప్పినట్టుచేసి నువ్వు బాగుపడటం నేర్చుకో-" అన్నారు సీరియస్ గా.
    
    "నీతికి సమాధి కట్టేస్తున్నాడు!" అనుకుని వెనుదిరిగింది నంద వచ్చి సీట్లో కూర్చుని అతని బిల్లున్న ఫైల్ తీసింది. ఆమె అంతరాత్మ మొండికేసింది. ఒక్క క్షణం పాటు జాబ్ కి రిజైన్ చేద్దామా అనిపించింది.
    
    మరో క్షణంలో ఆ రెండు వేలూ తీసుకుని వుంటే బావుండేదేమో, ఈ విషయంలో తనొక్కతే మడికట్టుకుని కూర్చోవటంవల్ల లాభమేమిటి? అనుకుంది. డబ్బు పోగొట్టుకొంటున్నావా అనుకుంది! అంతలో వివేకం తలెత్తి "నువ్వూ దిగ జారిపోతావా? నీతికి తిలోదకాలిచ్చేస్తావా? ఛీ! ఛీ!" అనుకుంది. ఏం చెయ్యాలో- ఎలా తిరగబడాలో తెలీక ఉద్యోగ ధర్మరీత్యా చివరికి విధిలేక ఫైల్ తీసుకుని వెళ్ళటానికి లేచింది.
    
    అంతలో ఎవరో ముగ్గురు ఆఫీసర్లు వచ్చేశారు టకటకా.
    
    "ఎవరూ ఎక్కడికీ కదలకండి!" అన్నారొకరు.
    
    ఆఫీసరు గదినుంచి బయటికి వస్తోన్న వాళ్ళని చూసి "ఎవరండీ" అన్నాడు.
    
    "యాంటీ కరప్షన్ డిపార్ట్ మెంట్!"
    
    ఆ జవాబు విని అదిరిపోయాడతను.
    
    "అందర్నీ చెక్ చేయాలి!" అన్నాడు ఆ ఆఫీసరు.
    
    "పదండీ?" గంభీరంగా అన్నాడు హెడ్ క్లర్క్.
    
    అతని వెంట వచ్చిన రాజభూషణం గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.
    
    "వీరెవరు?" రాజభూషణాన్ని చూసి అడిగాడతను.
    
    "వీరు రాజభూషణంగారు. కంట్రాక్టరు...!" అని ఆయన పరిచయం పూర్తిగా చేశాడు. ఏదైనా ఫలితం ఉంటుందేమో నన్నట్టుగా.
    
    "ఐ.సీ!" తల పంకించాడు కొత్త ఆఫీసరు.
    
    "ఎందుకొచ్చారు?"
    
    "ఏదో బిల్ పెండింగ్ లో వుంది. అదేదో ఆ సీట్లో వుండే ఆ అమ్మాయి వద్ద వుంది... ఏదో..." వెకిలిగా నవ్వాడు హెచ్.సి.
    
    "అక్కడికి పదండి!"    

 

    తనూ నడవబోయాడు హెడ్ క్లర్క్ ఆనందంతో. క్షణ క్షణానికి పాపంలా బరువెక్కిపోతున్న రెండువేల రూపాయల కట్టని ఎలాగో నంద బల్ల క్రింద వేయాలని అతని తపన!
    
    "మీరు ఆగండి! రాం వెళ్ళి చూడు!" ఆదేశించాడు ఒక ఆఫీసరు మరో అతన్ని.
    
    అతను వెళ్ళాడు.
    
    నీరస పడిపోయాడు హెడ్ క్లర్క్ కానీ ధైర్యం పుంజుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS