"తప్పదు కృష్ణా! ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి"
"అయితే ఈ కాపురం వదులు కుంటానమ్మా"
"ఏం తమాషాగా ఉందా? చదువు కోసం నూరేళ్ళ కాపురం వదులు కుంటావా? అలాంటి పని చేయకు పరువు పోతుంది. మన ఇంటా, వంటా అంతా సర్దుకుపోయి బతికినా వాళ్ళే. ఏదో ఒక్కతే కూతురువని గారాభంగా పెంచాం. అంతేగాని, నువ్వు ఏం చేస్తే అది కరెక్టు అంటాననుకోకు" అంటూ కోపంగా చాలాసేపు క్లాస్ తీసుకుంది తల్లి.
కృష్ణవేణికి అర్ధమై పోయింది. తనకి సపోర్టుగా ఉండేవాళ్ళు ఎవరూ లేరు. గోపాల్ కూడా చదువు సంగతి ఎత్తితే మాట మారుస్తున్నాడు. పుట్టబోయే పిల్లాడి గురించి మాట్లాడుతున్నాడు. కాకపోతే పిల్లాడే కావాలని వాళ్ళమ్మా నాన్నలాగా పట్టుపట్టడం లేదు. కూతురైనా ఒకే అంటున్నాడు.
కృష్ణవేణి కి డెలివరీ అయింది. పాప పుట్టింది. అత్తగారు, మావగారు పెద్ద రభస చేశారు. గోపాల్ ఈ విషయంలో వాళ్ళతో ఘర్షణ పడ్డాడు. నాకు లక్ష్మీ పుట్టింది. ఈ రోజుల్లో ఎవరైనా ఒకటే అంటూ వాళ్ళ నోరు మూయించాడు.
కృష్ణవేణి పాపాయి పనుల్లో పడి తాత్కాలికంగా తన మానసిక సంఘర్షణను మర్చిపోయింది. పాపకి మూడేళ్ళు వచ్చాయి. కృష్ణవేణి జీవితంలో ఎదుగుదల లేదు. ఉద్యోగం లో అంతకన్నా లేదు. అనుకుంటూనే నాలుగేళ్ళు గడిచి పోయాయి. ఎంఫిల్ లేదు.... పిహెచ్ డి అసలే లేదు. ఏడుగు బొదుగూ లేని జీవితం అయిపొయింది. ఆమెలో అణగారిన అసంతృప్తి జ్వాలలు తిరిగి రగుల్కొన్నాయి. భర్తతో మనసారా మాట్లాడుకోవడానికి కూడా ఆ ఇంట్లోప్రివసీ ఉండదు. రాత్రి పూట పడుకున్నప్పుడే అలసిపోయి మంచం మీద వాలగానే ఆకలిగా ఆక్రమించుకునే వాడితో భవిష్యత్తు ఏం చర్చించగలదు.
హటాత్తుగా గుర్తిచ్చింది తాను రచయిత్రి గా కూడా చచ్చిపోయిందని కృష్ణవేణికి. ఉప్పెనలా దుఖం ముంచు కొచ్చింది. తనని హత్తుకుని పడుకుని గుర్రు పెడుతున్న గోపాల్ ని మెల్లిగా తప్పించి లేచి టేబిల్ దగ్గరకి నడిచింది. ఇంట్లో ఒక పేపర్ కూడా దొరకలేదు. తనదొక పాత డైరీ ఖాళీగా ఉంది. అది తీసుకుని , టేబిల్ లైట్ అన్ చేసి నెమ్మదిగా తన మనసులో భావాలను అక్షరాలుగా మార్చసాగింది. కాస్సేపటికి చిన్న చిన్న జల్లుల్లా సాగిన ఆమె రచన ఓ ప్రవాహంలా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
కృష్ణవేణి నవల ఒక ప్రముఖ వారపత్రికలో సీరియల్ గా ప్రారంభమైంది. అందులోని పాత్రలు అత్తగారు, ఆడపడుచులు, మావగారు, వ్యక్తిత్వం లేని భర్త, ఆమె తను కోల్పోతున్న ఆనందాలను, దానికి కారణాలను విపులంగా చర్చించడంతో పాత్రలన్నీ కుటుంబసభ్యులకి దగ్గర పోలికలు ఉండడంతో అందరూ ఒక్కసారిగా ఆమె మీద విరుచుకు పడ్డారు. "ఇంటిగుట్టు రచ్చ కీడ్చి కీర్తీ, సానుభూతి పొందాలనుకుంతున్నావా? ఏం వేరే సబ్జెక్టు దొరకలేదా నీకు రాయడానికి?' అంటూ గోపాల్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, సీరియల్ ఆపేయమని కోర్టుకి వెడతాననడం కృష్ణవేణి జీవితంలో దుమారం రేగింది. ప్రయత్నం గానో, అప్రయత్నంగానో తానొక సంచలనానికి తెరదీసింది. నిజానికి తనకీ తెలుసు ఒక వరవడి లో రాసుకుపోయిన ఆ నవల తన జీవితానికి చాలా దగ్గరగా ఉందని.... అందులోని పాత్రలన్నీ తన చుట్టూ తిరుగుతున్నవే అని.... కానీ , అందుకు ఆమె సంజాయిషీ, ఇచ్చుకోడానికి గానీ, క్షమార్పణ అడగడానికి కానీ సిద్దపడలేదు. కుటుంబంలో ఎలా ఉన్నా పాఠక లోకంలో కృష్ణవేణికి చాలాపెరోచ్చింది. అభిమానులు అనంతంగా పెరిగిపోయారు. సీరియల్ సశేషం తరువాత బోలెడన్ని లెటర్స్ కూడా పబ్లిష్ అవుతున్నాయి. వాటిలో అలాంటి అత్తమామలతో అంతకాలం కలిసి ఉన్న హీరోయిన్ మీద మహిళా పాఠకులు బోలెడంత సానుభూతి చూపించారు.
కృష్ణవేణి ఆగలేదు. ఆమెకి తన గమ్యం ఏవిటో అర్ధమై పోయింది. గోపాల్ తో జరిగిన వాగ్వివాదం విడిపోయిందాకా తీసుకొచ్చింది. కూతుర్ని తీసుకుని బైటకు నడిచింది.
కాలింగ్ బెల్ మోగడంతో కృష్ణవేణి ఆలోచనల్లోంచి బైటపడింది. కన్నీళ్ళతో తడిసిన జాకెట్టు చల్లగా తగిలింది. పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంది. లేచి వెళ్ళి తలుపు తీసింది. పనిమనిషి లోపలికి వచ్చింది. చిరునవ్వు నవ్వి లోపలకు వెళ్ళి పోయింది. ఆ పిల్లకి ఏమీ చెప్పనవసరం లేదు. ఏ టైం లో ఏం పని చేయాలో తనే చేస్తుంది. ఇవాళ కృష్ణవేణి కి అంతులేని కీర్తి ఉంది... తనదీ అనే ఆస్తి ఉంది. సోంత ఇల్లు ఉంది. కారుంది. సమాజంలో స్టేటస్ ఉంది. కానీ, నా అని చెప్పుకోడానికి ఎవరూ లేరు. ఇంతకాలం కూతురు మీద తనకి సర్వహక్కు లున్నాయని కుంది. కానీ... కానీ.... కృష్ణవేణి నీళ్ళు నిండిన కళ్ళతో టీపాయ్ మీద ఉన్న కాగితాల వైపు చూసింది.
లాలిత్య రెండు చేతుల్తో ఆకాగితాలు పట్టుకుని తన కళ్ళ ముందు రెపరెప లాడిస్తూ కొంటెగా నవ్వినట్టు అనిపించింది.
కృష్ణవేణిది చాలా బిజీ లైఫ్ ఆమె తన జీవితాన్ని అలా మలచుకుంది. రచయిత్రిగా ఒక స్థానం అంటూ కలిగాక, పైగా అనుకోకుండా పడిన స్త్రీవాద రచయిత్రి అన్న బ్రాండ్ నుంచి ఆమె బైటికి రావడానికి ఇష్టపడలేదు. మామూలు రచయిత్రిగా కన్నా స్త్రీవాద రచయిత్రి గా ఆమెకో ప్రత్యెక గుర్తింపు లభించింది. ఎక్కడ ఏ సభ జరిగినా కృష్ణవేణి ఒక అతిధి గానో, స్పీకర్ గానో తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తోంది. అలా నేషనల్ లెవెల్ దాకా ఆమె పేరు ప్రతిష్టలు ఎగబాకాయి. కీర్తి, డబ్బు సంపాదించిన కొద్దీ ఇంకా, ఇంకా కావాలనిపిస్తుంది. దానికి అంతం అనేది ఉండదు. కృష్ణవేణి క్కూడా అలాగే ఉంది. గోపాల్ నుంచి రెండు మూడు సార్లు రాయభారం వచ్చింది. జరిగిందేదో జరిగింది కలిసి బతుకుదాం రమ్మని. కానీ, మళ్ళీ కుటుంబం అనే చట్రం లోకి వెళితే తన వ్యక్తిత్వం, తన స్వేచ్చ, తన కీర్తికి భంగం కలుగుతుందని పించింది. అలాంటప్పుడు కేవలం ఒక గృహిణిగా బతకడంలో ఆమెకి ఎలాంటి ఆసక్తి కలగలేదు. కేవలం భర్తతో లభించే శారీరక సుఖం కోసమే కుటుంబ జీవనం గడపాలనుకుంటే ఆ పావుగంట కోసం మిగతా అమూల్యమైన కాలాన్నీ వంటింట్లో వంట చేయడానికి, అంట్ల గిన్నెలు తోమడానికి వెచ్చించడం ఆమెకి ఇష్టం లేదు. అందుకే అతని ఆహ్వానాన్ని నిర్దయగా తిరస్కరించింది.
కృష్ణవేణి నిట్టూర్చింది. లాలిత్య పెళ్ళయి కాపురానికి వెళ్ళాక ఒక్కసారి కూడా తల్లి దగ్గరకు రాలేదు. కృష్ణవేణి ఒక్కసారి వెళ్ళి కూతురు ధోరణికి చికాకేసి వచ్చేసింది. అది పక్కా ఇల్లాలైంది. ఎలా బతుకుతుందో అనుకుంది. అలా రెండేళ్ళు గడిచాయి. లాలిత్య నెల తప్పిందని వాళ్ళత్తగారు ఉత్తరం రాసింది కృష్ణవేణికి. ఆవార్త కృష్ణవేణి కి ఆనందం కలిగించలేదు. లాలిత్య సంసారం అనే ఊబిలోకూరుకు పోతున్నట్టు అనిపించింది. పైగా "పురుటికీ ఏడో నెల్లోనే మీరు తీసికెళ్ళాలి.... బెంగుళూరు వచ్చి సీమంతం చేసి తీసి కేళ్ళండి." అంటూ ఆవిడ రాసిన ఉత్తరం చూస్తె మండిపోయింది కృష్ణవేణికి. ఈవిడెవరు తనకి ఆర్డర్ ఇవ్వడానికి అనుకుంది. వెంటనే "తొమ్మిదో నెలలో వస్తాను....వచ్చి తీసుకేడతాను. నేను బిజీగా ఉన్నాను" అంటూ ప్రత్యుత్తరం రాస్తూ లాలిత్య కి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని, ఇంటిల్లిపాదీ కి సేవలు చేస్తూ కూర్చోకుండా గర్బిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ నెట్ లో చదువుకుంటూ గడపమని రాసింది.
లాలిత్య కి తొమ్మిదో నెల వస్తూనే కృష్ణవేణి వెళ్ళడానికి ప్రయాణం ఏర్పాట్లు చేసుకునే లోగానే లాలిత్య కి డెలివరీ అయి పాపాయి పుట్టిందని ఫోన్ చేసింది. పాపని చూడడానికి వెళ్ళి, పదకొండో రోజు నీళ్ళు పోసి, నెల లోపల పుట్టింటికి తీసుకురావాలనుకుంది. కానీ, లాలిత్య "నేను రాను మమ్మీ! పాపను చూడకుండా శశి ఉండలేడు. తర్వాత వస్తాలే" అంటూ తిరస్కరించింది.
పాపకి ఏడాది దాటుతోంది. అయినా రాలేదు. కృష్ణవేణి కూడా మీటింగ్ లని, సెమినార్ లని , వర్క్ షాప్ లని తిరగడంతో సరేలే ఎక్కడో అక్కడ హాపీగా ఉంది కదా అనుకుంది గానీ, లాలిత్య కి సీమంతం చేయకపోవడం తన నేరంగా భావిస్తున్నారని గానీ, మొదటిసారి గర్భంతో ఉన్న కూతురికి చేయాల్సిన ముచ్చట్లు లేవీ చేయలేని తల్లి ఒక తల్లా అని తనని అందరూ విమర్శిస్తున్నారని వగైరా విషయాలు ఏమీ తెలియలేదు. తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అయితే ఇటీవల సింగపూర్ లో జరిగిన తెలుగు మహాసభలకు వెళ్ళి వచ్చాక కృష్ణవేణి ఆరోగ్యంలో చిన్న మార్పు వచ్చింది. మోకాళ్ళు నొప్పి, నడుం నొప్పి, అంటూ డాక్టర్ దగ్గర కెళితే ఖచ్చితంగా నెలరోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని, డిస్క్ ప్రోలాప్స్ అయిందని చెప్పాడు.
చాలాకాలం తరువాత మంచం కదలకుండా ఇంట్లోనే ఉన్న కృష్ణ వేణికి ఒక్కసారి కూతుర్ని మనవరాలిని చూడాలనిపించింది. వెంటనే లాలిత్య ను రమ్మని ఉత్తరం రాసింది. తనకిలా అనారోగ్యంగా ఉందని, బెడ్ రేస్త్లో ఉన్నానని , నాలుగు రోజులు ఉండేలా రమ్మని రాసిన ఉత్తరానికి లాలిత్య నుంచి వచ్చిన జవాబు ఆమెని నిర్ఘాంత పోయేలా చేసింది. నా కూతురు ఇంత ఎదిగిందా? అనిపించింది. కృష్ణవేణి వణుకుతున్న చేతుల్తో మరోసారి ఉత్తరం అందుకుంది.
"అమ్మా నీ ఉత్తరం చేరింది. నీకు అనారోగ్యంగా ఉందని, డాక్టర్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారని రాశావు. ఇప్పుడెలా ఉంది? పనిమనిషి కుమారి రెగ్యులర్ గా వస్తోందనుకుంటాను. తను నిన్ను బాగానే చూసుకుంటుందని నా నమ్మకం. నేనిప్పుడు రావాలంటే చాలా కష్టం. శశికి ప్రమోషన్ వచ్చింది. బాధ్యతలు పెరిగాయి. అత్తయ్యగారి ఆరోగ్యం కూడా బాగాలేదు. ఆవిడ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. ఆమె పాపని చూసుకుంటున్నారు.నేను వాళ్ళందరి బాధ్యతా తీసుకున్నాను. నీకిది వింతగా అనిపించవచ్చు. కానీ...నాకు చాలా సహజంగా అనిపిస్తోంది. ఆడపిల్ల పెళ్ళి అయాక అత్తగారి వాళ్ళకే సొంతం అవుతుంది. అది సమాజ ధర్మం. ఈ ధర్మాన్ని నేను కాదనలేను. ఎందుకంటె నేను నాధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నీలాగే సంసార జీవితానికి దూరం కావాల్సి వస్తుంది. ఒకసారి భర్తతో మనస్పర్ధలంటూ ఏర్పడ్డాక తిరిగి కలవడం జరగదు. అప్పుడు నిన్ను వెలేసినట్టే నన్ను నా వాళ్ళంతా వెలేస్తారు. నా కూతురికి తండ్రి ప్రేమని దూరం చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటె తండ్రి ప్రేమ పొందని ఆడపిల్ల మనసెంటో నాకు తెలుసు. తండ్రి సంరక్షణ లేని ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు. బంధువులు, మిత్రులు వస్తూ పోతూ ఉండే ఇళ్ళల్లో ఉండే చైతన్యం , మనింట్లో నాకెప్పుడూ కనిపించలేదు. ప్రతి దీపావళి కి ఎదురింటి వాళ్ళు దీపాలు వెలిగించి, అందరూ కలిసి టపాకాయలు కాలుస్తుంటే , వంటరిగా నేను చిచ్చుబుడ్డి వెలుగుల్లో నా భవిష్యత్తు ని వెతుక్కున రోజులు నాకు బాగా గుర్తు. అందుకే నా పిల్లలకి అమ్మా, నాన్నా, మామ్మా, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్యా అందరూ కావాలని నా కోరిక.
