ఆ సాయంత్రం పార్ధుడు నా గదికొచ్చేడు. వాడి చేతిలో ఆల్బమ్ ఉంది. దాన్ని నాకిచ్చేడు.
"చూడండి. మానాన్నారూ, అమ్మా అందరూ వున్నారు" అన్నాడు.
కుతూహలం కొద్దీ ఆల్బమ్ తెరిచి చూసేను. భయం వేసింది. నిజంగానే భయపడిపోయేను. సుందర శివరావూ, సత్యవతి భార్యాభర్తలు. వాళ్ళ అనురాగానికి హద్దుల్లేవని ఆల్బమ్ చెప్పింది. వాళ్ళ ఫోటోలు చూస్తూంటే నా కళ్ళల్లో నీళ్ళూ తిరిగేయి. ఆల్బమ్ పార్ధుడి చేతిలో పెట్టి, రెండు పిప్పరమెంట్లు యిచ్చి నా గదినుంచి పంపేశాను.
అదృష్టవంతుల భాగ్యంతో పోలిక చేసుకున్న నాడు మనసెంత తేలికవుతుందో, దౌర్భాగ్యుల జీవితాల తాలూకు నీడల్ని నాలో వూహించుకుంటే అంత కలత పడిపోతాను. ఈ రెండోదే జరిగిందిప్పుడు. పార్ధుడు తెచ్చిన ఆల్బమ్ నా పెళ్ళినాటి కొత్తరోజుల్ని గుర్తు చేసింది, సుందరశివరావుని నాతో పోల్చి చూసుకుని తల్లడిల్లిపోయేను. రేపొద్దున్న చావనేది చెప్పి ఒచ్చే యోగం కాదు. బ్రతుక్కీ, చావుకీ మధ్య దూరం చాలా తక్కువ. చావుని తలుచుకుంటూ కూర్చుంటే క్షణక్షణమూ భయపడవలసిన అవసరం ఎంతైనా వుంటుంది.
సుందరశివరావుకి కలిగిన దుస్థితి నాకూ సంభవిస్తే?
ఆ రోజు రాత్రి భోజనం చేయలేదు. ఈ విషయమై శ్రీమతికి ఉత్తరం రాసివుందును. చదివి మరి రెండు సలహాలు చెప్పించుకోగల అవకాశం కోరి మళ్ళా యివ్వడం నచ్చలేదు. అసలీ గదినుంచి దూరంగా యెక్కడికైనా వెళ్ళిపోదామనుకున్నాను. నా చాదస్తం నాలోనే దాచుకోవడం మంచిదని వూరుకున్నాను.
ఏది ఏమైనా పార్ధుడితో ఇక మాటాడరాదని నిర్ణయించుకున్నాను.
ఖర్మకాపోతే, ఈ నిర్ణయం నేనెలా ఆచరించగలను? మునుపెప్పుడో పార్ధుడికి నేనిచ్చిన చనువుని పునస్కరించుకుని వాడు నాకు తరచూ కనిపిస్తూనే వున్నాడు. నా ఆలోచనలన్నీ వాడికి తెలుస్తాయేమో, నా బలహీనతని కనిపెట్టి నాకు పిచ్చెత్తించగల సత్తా వున్నట్టు భయపెట్టేస్తున్నాడు. వాడిని చూచిన ప్రతిసారీ యేవో దుర్శంకలు కలుగుతూనే వున్నాయి.
ఓనాడు, నేనాఫీసునుంచి గది కొస్తూన్న వేళ, నా వెనగ్గా రిక్షా ఆగివుండడం గమనించేను. వెనక్కి తిరిగి చూసేను. పార్ధుడు కొత్తబట్టల్లో కళకళలాడుతూ కనిపించేడు. వాడి పక్కన మరో ఖరీదైన మనిషి కూర్చున్నాడు. అతను దర్జాగా సిగరెట్టు కాలుస్తున్నాడు. అతన్ని నేను వెంటనే గుర్తుపట్టలేదు గానీ, కొంచెం సేపటికి అనగలిగేను.
"లక్ష్మీపతి గదూ!"
అతడు తలూపేడు.
"మా చిన్నాన్న మా ఊర్నుంచి ఒచ్చేడు" అన్నాడు పార్ధుడు.
"ఇక్కడే పన్జేస్తున్నారా?" అడిగేడు లక్ష్మీపతి.
"కొన్నాళ్ళపాటుండాలి. తర్వాత మన వూరే!"
"మావాడు మీకు బాగా తెలుసులావుందే."
"నా ఫ్రండు"అన్నా నవ్వుతూ.
పార్ధుడు రిక్షాలోంచి గెంతి యింట్లోకి పారిపోయేడు. తర్వాత రెండు రోజులూ పార్ధుడు నాకు కనిపించలేదు. వాళ్ళ చిన్నాన్నతో వాడి షికారూ, సినిమాల సందడిలో నేనెందుకు గుర్తుంటాను?
* * *
తెల్లవారుతూండగా ఓ విచిత్రమైన కల వచ్చింది. తెల్లగా బొద్దుగా వున్న పాపాయి, అందమైన పెద్ద కళ్ళల్లో వెల్తురు నింపుకుని తన రెండు చేతులూ చాచి నామీదకి గెంతే సన్నివేశం మనోహరంగా ఉండడంతో నిద్రలోంచి లేచి కూచున్నాను. తర్వాత మళ్ళా నిద్రపట్టనేలేదు. లైటువేసి తల దిండుపై మోచేతులానించి గోడవేపు చూశాను. నగ్నంగా, అందంగా, బోసినవ్వుల పిల్ల సగానికి మూతపడిన చిలిపికళ్ళతో కేలెండరు పాపాయి కనిపించేడు. నేనూ పకపకా నవ్వేసి తలదిండును మరింత దగ్గరిగా లాక్కుని పాట పాడుకున్నాను మెల్లిగా -
"మా చిన్ని కృష్ణుని మాటలు
మరువరాని తేనె తేటలు"
నా కళ్ళు నీటితో నిండిపోటం గమనించేను. పార్ధుడికి స్థితి గుర్తుకురావడంతో అలాగే, పిచ్చిగా చూస్తూండిపోయేను.
కలలు నిజమవుతాయన్నది నేనొక్కడ్నీ చెప్పవలసిన మాటకాదు. ఆ ఉదయం ఆఫీసుకెళ్ళి కూర్చున్న తర్వాత టెలిగ్రాం నా చేతికందింది. లేచి నిలబడి గట్టిగా కేకపెట్టాలనిపించింది.
"అయ్యా! మాస్టారూ! నా కొడుకు పుట్టేడండీ!"
సీట్లో నా అవస్థని చూచి ఆ సెక్షను సూపర్నెంటు గబగబా నా దగ్గిరికొచ్చాడు. టెలిగ్రాం లాక్కుని చదివేడు. అనక నా చేతిని నొక్కుతూ "కంగ్రాచ్యులేషన్స్' అన్నాడు.
శెలవుపెట్టి అటునుంచి ఆటే మా వూరి బస్సెక్కాను. బస్సు నెమ్మదిగా నడుస్తుందనిపించింది. అప్పుడు నేననుకున్నాను. "సొంతంగా ప్రతి మనిషికీ ఒక విమానం వుండి తీరాలని. సాయంత్రానిక్కాబోలు మా ఊరి పొలిమేరలు కనుపించేయి. పెద్ద బజార్లో బస్సుదిగి ఇన్ని పళ్ళూ, పువ్వులూ, స్వీట్సూ వగైరా కొనుక్కుని ఇల్లు చేరుకున్నాను.
మా చెల్లి కొడుకు నన్ను చూస్తూనే గట్టిగా అరిచేడు -
"మలే! నీకు బావ పుత్తాలు"
ఈ అల్లరి వెధవకి వావి వరసలు తెలీవు నాకు బావ పుట్టడమేమిటి?
అన్నయ్య వదినతో మెల్లిగా మాట్లాడుతే నాకు వినిపించదనుకున్నాడు కాబోలు నావసలే పాము చెవులు.
"వీడిని వున్నపళంగా రమ్మని నేనేం వైరివ్వలేదోయ్! మగపిల్లాడు, తల్లీ, బిడ్డా క్షేమమూ అవటానికిచ్చేను. వూరికే అన్నారా - పుత్రోత్సాహము తండ్రి కన్చెప్పి! ఏమంటావ్?"
"చాల్లే.... మీరూరుకోండి. ప్రతిదానికీ పురాణం చెప్తారు!"
స్నానం చేసి హాస్పిటల్ కి వెళ్ళేను. నిండుగా నవ్వుతూ కళ్ళతో ఆహ్వానించింది శ్రీమతి. ఆ కళ్ళు తృప్తితో మెరుస్తూన్నాయి. ఆమెలో యేదో 'కొత్తదనం' కనిపిస్తోంది. మంచం పక్కగా వెళ్ళి నిలుచున్నాను.
"బాబుని చూడొచ్చా?"
"రెండు రోజులుంటారుగా?"
"ఎప్పుడైతే ఏం?"
