విజయలక్ష్మి ముఖంలో కళాకాంతులు లేవు.
"ఏమిటి?"
"డబ్బు కనిపించడం లేదు!"
శేఖరంగారికి మతిపోయినట్టుగా అనిపించింది.
"సరిగా చూడు" అన్నాడు తడబడుతూ.
"సూట్ కేస్ అంతా తిరగేశాను! ఎక్కడా లేదు. జిప్ బాగ్ కనిపించడం లేదు!" అంది రుద్ద కంఠంతో.
"తాళాలు బాగా వేశావా?"
"ఆ తాళం నేనిప్పుడు తీసేదాకా భద్రంగా ఉండింది!"
"మరి ఎలా పోయింది?"
అంతలో నారాయణ, సుందరమ్మ, శేఖరం బావమరిది శేషాచలం, ఆయన భార్యా అంతా వచ్చేశారు.
డబ్బు పోయిన విషయం గుప్పుమని పెళ్ళి పందిరంతా సెంటు వాసన కంటే తీవ్రంగా వ్యాపించింది.
"ఎలా? ఎలా?" అనుకున్నారు అంతా.
"ముహూర్తం మించిపోతుంది!"
"పోతే ఇంకో ముహూర్తం వస్తుంది!"
"అదెలా?"
"అదంతే! డబ్బు ఇచ్చిన తర్వాత నిమిషమే సుముహూర్తం!" అన్నారెవరో.
తలా ఒరీతిగా మాటాడుకుంటున్నారు.
శేఖరంగారి ముఖాన కత్తివాటుకి నెత్తురుచుక్క లేదు.
నంద కిదంతా చిత్రంగా అనిపించింది.
సత్యవతిని, రాజ్యలక్ష్మిని, జయప్రదని, సావిత్రిని వెంటేసుకుని వెళ్ళింది మల్లిఖార్జున్ వద్దకి.
చూడండి! ఆపద వచ్చి పడింది. దొంగతనం జరిగి పోయింది. ఇపుడు అల్లరిపడి, పోలీసు రిపోర్ట్ ఇస్తే అవమానం మిగిలేది శేఖర్ గారికే గాదు. అందరికీను. ఆయన డబ్బు సర్దుబాటు చేస్తామన్నారు. పెళ్ళి జరిగిపోనివ్వండి!"
అతను తండ్రి వైపు చూశాడు.
"మిస్!"
"నన్ను పిలవకండి! నా మాట వినండి! లేదా నేను పెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. జరిగిన అవమానం ఎలాగూ జరిగింది. ఇంత జరిగేక ఇంకేం సిగ్గుచేటు-పోలీసులు దగ్గరుండి తాళి కట్టిస్తారు. లేదా కటకటాల వెనక్కి తోస్తారు.
"అమ్మాయ్!" గద్దించాడు శివరావు.
"మీరూరుకోండి మామగారూ! నాకు మండిపోతోంది. ఇదే మీకు జరిగితే, మీ కూతురి పెళ్ళి ఆగిపోతే మీకు ఎలా వుంటుంది!"
"నేనిలా చేస్తావా?" బింకంగా అన్నాడాయన.
"దొంగతనానికి ఎవరేం చేస్తారండీ!"
"అదో దొంగ ఎత్తు!" హేళనగా అన్నారు.
"ఛ! ఛ! శేఖరం మామయ్యని అనుమానిస్తే పురుగులు పడిపోతారు. ఆయన ఎలాటి వారో మీకు కాకపోయినా మిగతా వాళ్ళకయినా తెలియదా?" కస్సుమంది నంద.
ఆ మాటలకి ఆయనేం అనలేదు.
"ఊఁ చెప్పండి! బాధ ఒకరికొకరీతి, ఇంకొకరి కొక రీతిగా వుంటుందా? పెళ్ళి కానివ్వండి! మీ డబ్బు అందిస్తారు తర్వాత!"
నమ్మలేనట్టుగా చూశారాయన.
"ఒక్క షరతు పెట్టుకోండి! డబ్బు ముట్టకపోతే సులోచనని కాపురానికి తీసికెళ్ళకండి!"
"అయితే ఇప్పుడేమంటావ్?" చిరాగ్గా ప్రశ్నించారాయన. అటువైపువాళ్ళూ, ఇటువైపు వాళ్ళూ తనని కసాయి వాడిగా చూస్తూండడం ఎలాగో వుంది శేఖరంగారికి.
"పెళ్ళి జరగనివ్వండి!" అంది నంద.
"సరే!" అంగీకరించారు శివరావుగారు.
"బావగారూ!" ఆనందంగా అన్నారు శేఖరంగారు! పెళ్ళి కానివ్వండి. వారం తిరక్కుండా డబ్బుతో వస్తాను!" అన్నాడు.
"అప్పుడే కూతుర్ని తీసుకురా!" గంభీరంగా అన్నాడు శివరావు.
"లక్షణంగా" అన్నాడు శేఖరం! ఈ ఆపద ఎలాగైనా గడిస్తే, ఆ తర్వాత ఎలాగో సర్దుకోవచ్చని ఆయన ఆశ.
"సకట్నంగా" సవరించింది నంద.
అంతా గొల్లున నవ్వారు. అంతదాకా వున్న వాతావరణం తేలిక పడిపోయింది.
తర్వాత కార్యక్రమాలు చకచకా సాగిపోయాయి.
అందరూ నందని హీరోయిన్ లాగా చూశారు.
నందకి అప్పుడు వచ్చిన సంబంధాన్ని ఖాయం చేసుకో లేకపోయినా నారాయణ కూతురి చాకచక్యం చూసి మనస్సు లోనే కృంగిపోయాడు. సుందరమ్మ కన్నీళ్ళు పెట్టుకుంది.
నంద ఫ్రెండ్స్ అందరూ ఆమెని ఆకాశానికెత్తేశారు. "నువ్వు వీరనారివి! నందా! నిజంగా నువ్వే యిప్పుడు చొరవ తీసుకోకపోయివుంటే ఈ పెళ్ళి ఆగిపోయేది శేఖరం అంకుల్ కాస్త మెతక మనిషి! డబ్బు పోయిందన్న బాధ కంటే అవమానమే ఆయన్ని ఎక్కువ బాధిస్తోంది! అంతేకాదు యీ పెళ్ళి అర్ధాంతరంగా ఆగిపోతే-తర్వాత ఎలా? ఏం చెయ్యాలి? ఇంకో ముహూర్తం అనుకున్నా- అప్పుడు మళ్ళీ ఎంత ఖర్చు- సంబంధం తప్పిపోతే మరో సంబంధం ఎక్కడ చూస్తారు- ఇన్ని బాధల్నించి తప్పించావు నువ్వు!" అన్నారు. నంద నవ్వేసింది.
18
"ఏమిటా ఆలోచనలు!"
గేటు ముందునిల్చుని స్టెల్లా పిలిచిన పిలుపుకి ఆలోచనలతో పరధ్యానంగా నడుస్తోన్న నంద ఉలిక్కిపడింది. చప్పున వూహలనుంచి బయటపడింది.
"ఊ" అంది సాలోచనగా.
"రెండు కావస్తోంది పద! పద!" అంది స్టెల్లా.
ఆఫీసులో అడుగు పెట్టేసరికి గడియారం టంగ్ టంగ్ మంది.
తన సీటువద్దకు నడిచిన నందకి తన బల్ల ముందు కుర్చీలో కూర్చున్న అపరిచిత వ్యక్తిని చూడగానే ఆశ్చర్యం వేసింది.
'నమస్తే!!' అంది నంద అతను పేరు చెప్పగానే తన వద్ద ఉన్న అతని పెండింగ్ బిల్లు గుర్తువచ్చింది. అతను మరొక బ్రాంచి ఆఫీసు బిల్డింగ్ కట్టాడు. దానికి సంబంధించైనా బిల్లు వచ్చింది. కానయితే అది అంత సులువుగా పాసవదు. చీప్ ఇంజనీర్ రిమార్క్స్ ఒక విధంగా వున్నాయి. చెకింగ్ ఇంజనీర్ ఓకే చేయలేదు. ఆఖరికి డిపార్ట్ మెంట్ సూపర్ వైజర్ కూడా అభ్యంతరాలు పెట్టాడు.
"నా బిల్లు-"
అతను మాట పూర్తి చేయకముందే!" మీరు వెళ్ళి ఆఫీసరుగారిని కలవండి!" అంది నంద.
"మీరు నాకు కొత్త. మీ సీటుకీ కొత్త. ఇలాంటివి అన్నీ ఇక్కడనుంచి ఒకే కావాలి. నేను క్లర్క్ స్థాయినుంచే పని సెటప్ చేస్తూ వెళ్తాను! ఇంద!" అన్నాడు ఓ కవర్ ఆమె టేబుల్ పై పెడుతూ.
