Previous Page Next Page 
ఒప్పందం పేజి 32


    కృష్ణవేణి ఊహించని ప్రస్తావన రావడంతో ముందు కొంచెం షాక్ అయింది. తరువాత ఆలోచనలో పడింది. ఇంతకాలం కేవలం స్నేహితులమే అనుకున్నా అతనలా చెప్పాక ఆమె మొదటిసారిగా అతడిలో ప్రియుడిని , ఆ తరువాత జీవిత భాగస్వామిని ఊహించుకుంది. నెమ్మదిగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. లేత నారింజరంగు పులిమినట్టు ఆకాశం అందంగా ఉంది. నీళ్ళ మీద పడుతున్న ఆ కిరణాలు వింత అందాన్ని సంతరించుకున్నాయి. చిన్న పాప బెలూన్ తో మైమరచి ఆడుకొంటోంది. కృష్ణవేణి గోపాల్ వైపు చూసింది. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఇంతకాలం కలగని భావనేదో ఆమెలో కలిగింది. సన్నటి పులకింత నిలువెల్లా పాకింది. "విప్లవ కుమారి' అని పిలిపించుకున్న కృష్ణవేణి కళ్ళు మొదటిసారిగా సిగ్గుతో వాలిపోయాయి. ఆమె మోహంలో.... కలుగుతోన్న భావాలు గోపాల్ లో ఉత్సాహాన్ని కలిగించాయి.
    "సో నీకిష్టమే కదా' అడిగాడు హుషారుగా.
    తల ఊపింది . పెళ్ళి అనే తంతు. సన్నాయి వాయిద్యం, పూల రేకుల వర్షం. భవిష్యత్తు ఎంతో అందంగా, ఆహ్లాదంగా కనిపించింది. కాదనడానికి కారణం ఏమీ కనిపించలేదు. గోపాల్ తనకి బాగా తెలుసు మంచివాడు సంస్కార వంతుడు. తన భావాలు, మనస్తత్వం ఆశయాలు బాగా ఎరిగినవాడు.
    ఆ తరవాత సరిగ్గా రెండు నెలల్లో ఇరుపక్షాల పెద్దల ఆశీర్వాదంతో పెళ్ళి అంతా కలలోలా జరిగింది. కొంతకాలం జీవితం పరిమళభరితంగా, మంచి కావ్యంలా మధురంగా సాగిపోయింది. ఇద్దరికీ ప్రైవేటు కాలేజీల్లో విడివిడిగా లెక్చరర్ ఉద్యోగాలు దొరికాయి. ఆషాడమాసపు అభ్యంతరాలు, అధికమాసం నిబంధనలు అన్నీ అయాక అత్తగారింటికి బయలుదేరింది కృష్ణవేణి. అప్పటిదాకా పెళ్ళంటే తానూ, గోపాల్ అనుకున్న కృష్ణవేణి కి హటాత్తుగా గోపాల్ తో పాటు మరికొంతమంది కి తనమీద అజమాయిషీ హక్కులు కలిగాయని తెలుసుకుంది. అలా ఎలా? పెద్దేనిమిదేళ్ళు దాటగానే అమ్మా నాన్నే తనని స్వతంత్రంగా వదిలేశారు. అన్నిటిలో స్వయం నిర్ణయాలే తీసుకుంది. అలాంటిది పెళ్ళయ్యాక తాను ఒక గృహిణిగా మారాక తనమీద మరొకరు పెత్తనం చేస్తుంటే భరించ లేకపోయింది.
    విశాలమైన ఆ ఇంట్లో ఆరు గదులు. వసారా, పెరడు, ముందు పూల మొక్కల మధ్య సన్నటి దారి, ఎత్తైన అరుగులు, సింహద్వారం, అలాంటి ఇంట్లో తనకి ముందుగా వంటగది అప్పగించింది అత్తగారు. ఉదయాన్నే లేచి పాలు కాచి, కాఫీలు ఇవ్వడం, టిఫిన్లు , వంట ఇదంతా పూర్తీ చేసుకుని తనకి, గోపాల్ కి బాక్స్ సర్దుకుని కాలేజీకి వెళ్ళాలంటే బ్రేక్ ఫాస్ట్ చేయడానికి టైం సరిపోయేది కాదు.
    ఓరోజు గోపాల్ తో అంది. "ఇదేంటి గోపాల్ బొత్తిగా నేను వచ్చిన దగ్గర్నించి మీ చెల్లెలసలు వంటగదిలోకి రావడం లేదు. మీ అమ్మగారు అసలే రావడం లేదు. ఇంత పని చేసి కాలేజీకి వెళ్ళేటప్పటికి అల్ మోస్ట్ లేట్ అవుతోంది.
    గోపాల్ నిస్సహాయంగా అన్నాడు. "ఇది ఆడవాళ్ళ విషయం కృష్ణా.... నేను కల్పించుకుంటే బాగుండదు. ఇంకా కొంచెం పెందలాడే లే పోనీ."
    "ఇంకా పెందలాడేనా!" ఇప్పటికే ఐదింటికల్లా లేస్తోంది. ఇంకా పెందలాడే అంటే, విపరీతమైన కోపం వచ్చింది. అతని మీద బలవంతంగా అణచుకుంది. నిజమే, ఈ సమస్య తనే పరిష్కరించుకోవాలి అనుకుంది.
    మర్నాడు యధావిధిగా కాఫీలు ఇచ్చేసి నేరుగా వంట చేసింది. టిఫిన్లు చేయలేదు.
    ఎనిమిది అవగానే టిఫిను అంటూ ఇంటిల్లిపాదీ అల్లాడి పోయారు. గోపాల్ జడ వేసుకుంటోన్న కృష్ణ వేణిని "కృష్ణా! బ్రేక్ ఫాస్ట్ అవలేదా" అనడిగాడు.
    "చేయలేదు. నాకు టైం లేదు. బైట నుంచి తెచ్చుకోండి. లేదంటే బ్రెడ్డు తెచ్చుకుని టోస్ట్ చేసుకు తినండి" నిర్లక్ష్యంగా చెప్పి చీర మార్చుకోవడానికి తలుపు వేసేసింది.
    ఆ తరువాత చాలా రభస జరిగినా తనకేం సంబంధం లేనట్టు వెళ్ళిపోయింది.
    సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పటికి అందరూ ఎడమొహం, పెడ మొహం గా కనిపించినా పట్టించుకోలేదు. ఆ రాత్రి గోపాల్ తో అంది. "మీఇంట్లో కోడల్ని పనిమనిషిగా భావిస్తారని నాకు ముందే ఎందుకు చెప్పలేదు."
    "ఏమైంది? ఎవరేమన్నారు?" ఊరదిస్తున్నట్టుగా అడిగాడు.
    "ఇవాళ టిఫిను చేయనందుకు నన్నో శత్రువు లా చూస్తున్నారు. వాళ్ళు చేసుకోవచ్చు గా కావాలంటే."
    'అలా ఎందుకు అనుకుంటావు. నీకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారని అందరూ నీమీదేఅదారపడి ఉన్నారని ఎందుకు అనుకోకూడదు? నీకు కొత్త కావచ్చు కానీ, ప్రతి ఇంట్లో మామూలే కృష్ణా!"
    "మామూలేనా? ఏంటి మాములు. కోడలు అనగానే వంట చేసి , అందరికీ సేవలు చేసే ఓ పనిమనిషిగా భావించడమా? నీకు నా సంగతి తెలుసు. నా భావాలు ఆలోచనలు తెలుసు. నాలో ఉన్న ఇండివిడ్యూవాలిటీ తెలిసి కూడా ఇలాంటి వాతావరణం మీ ఇంట్లో ఉంటుందని, దాన్ని నేను ఫేస్ చేయాల్సి వస్తుందని నాకు ముందే చెప్పాలి కదా!ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్ళి చేసుకుంటే చాలనుకున్నావా?"
    "అది కాదు కృష్ణా! ఇది చెప్పేదేంటి? ఆడదానికి నిజానికి నాకన్నా నీకే ఎక్కువగా తెలియాలి ఇలాంటి విషయాలు,. ప్రతి ఆడపిల్ల అత్తగారింట్లో పనిచేయాల్సిందే కదా! నువ్వు మినహాయింపు అవుతావని ఎలా ఎక్స్ పక్ట్ చేశావు?"
    కృష్ణవేణి ఆశ్చర్యంగా చూసింది. అవును నిజమే తను కేవలం గోపాల్ గురించే ఆలోచించింది. వాళ్ళ కుటుంబ విషయాల గురించి , వాళ్ళ మనస్తత్వాల గురించి ఆలోచించాలని, తెలుసుకోవాలని తనకి తోచలేదు. పెళ్ళంటే తను ప్రేమించిన వ్యక్తితో ఆనందంగా, హాయిగా, కలిసి బతకడమే అనుకుంది. పెళ్లి వెనకాల కొన్ని బాధ్యతలు, అదనంగా వస్తాయని, పెళ్ళితో తనకున్న స్వేచ్చ హరించి పరిహారంగా ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న ఆడపడుచుకి, మావగారికి, అత్తగారికి భర్తకీ, వేళకి టిఫిన్లు, కాఫీలు , వంట చేసి వాళ్ళ మెప్పు పొందాలా? నో, అలా జరగదు. ఓ నిర్ణయానికి వచ్చేసింది. టిఫిన్ చేయడం పూర్తిగా మానేసింది. కొన్నాళ్ళు దేప్పుళ్ళు, మరి కొన్నాళ్ళు మౌన పోరాటాలు జరిగాయి. కానీ, ఇంట్లోకి కార్న్ ఫ్లేక్స్, ఓట్స్ లాంటివి తెచ్చి మావగారికి వాటిలో ఉండే మినరల్స్ , విటమిన్స్ ఆరోగ్యానికి అవి ఎంత మంచివో చెప్పాక ఇంటిల్లిపాదీ వాటికి అలవాటు పడ్డారు.
    ఆరోజు స్నేహితురాలు అనురాధ ఫోన్ చేసింది...."ఏంటి కృష్ణా ఎంఫిల్ అప్లై చేశావు కదా! ఎగ్జాం రాయలేదెం."    
    కృష్ణవేణికి షాక్ కొట్టినట్లు అయింది. అవును కదా!ఎంఫిల్ అప్లై చేశాను కదా! ఏమైంది అసలు ఆ విషయమే మర్చిపోయింది. ఇదెలా జరిగింది/ ఆమె మెదడు మొద్దు బారింది. పెళ్ళంటే ఇదా? అనుకుంది. జీవన ప్రవాహాన్ని ఆపే ఆడ్డుకట్టలు వైవాహిక జీవితంలో వచ్చే బాధ్యతలు, భార్యతలు లేని వైవాహిక జీవితమూ ఉండదా?
    ఆరోజు గోపాల్ తో దేబ్బలాడింది . నేను మర్చిపోతే నువ్వైనా గుర్తు చేయవా? నీకన్నా ఎక్కువ చదివేస్తే ఎలా అని అవాయిడ్ చేశావా?' అంటూ తిట్టింది.
    గోపాల్ ముందు నచ్చచెప్పడానికి  ప్రయత్నించాడు. తరవాత అతనిలో కూడా ఆవేశం పెరిగింది.ఫలితంగా వాగ్వివాదాలు మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. చిలికి, చిలికి గాలివాన గా మారింది. కారణం చిన్నదే అయినా పెద్ద అఘాతం ఏర్పరచింది వాళ్ళిద్దరి మధ్యా.
    దాంపత్య జీవితంలో అనురాగాల స్థానం లో అపార్ధాలు, ప్రేమ స్థానంలో ద్వేషం ఏర్పడ్డాక లోకం కోసమో, పిల్లల కోసమో తప్పనిసరి పరిస్థితుల్లో రాజీపడినట్టు నటిస్తూ జీవితాంతం బతకడం అనేది కొందరే చేయగలరు. కాకపొతే కృష్ణవేణి ఆ కొందరి జాబితాలోకి రాలేదు. పుట్టింట్లో ఆడింది అట, పాడింది పాటగా జరిగింది. ఆమె స్వేచ్చకి ఎవరూ అడ్డు చెప్పేవారు కాదు. ఇక్కడ మాత్రం గడపదాటాలంటే అత్తగారి పర్మిషన్, మావగారి పర్మిషన్ తప్పనిసరి. ఆఫీసు నుంచి గంట ఆలస్యం అయితే ఎక్కడి కెళ్ళావు? ఆలస్యం ఎందుకైంది? అంటూ ప్రశ్నలు, జవాబుల సంతృప్తిగా లేకపోతె గోపాల్ కి ఫిర్యాదులు. ఈ ఇంట్లో ఉండలేను బాబోయ్ నా వల్ల కాదు. అనుకుంటూనే ఏడాది గడిచింది.
    ఆరోనేల గర్భవతి అని తెలియగానే "మాకు మనవడు కావాలమ్మాయ్! ఆడపిల్లలను కంటే ఊరుకునేది లేదు' అంటూ అత్తగారు, మావగార్ల వార్నింగ్ లు రోజురోజుకీ కృష్ణవేణి కిమతి పోసాగింది. ఈ ప్రపంచంలో ఇలాంటి మనుషులుంటారా? ఆశ్చర్యంగా అడిగింది తల్లినోసారి. ఆవిడ నవ్వింది. "ఇలాంటి వాళ్ళే ఉంటారు. మనింట్లో లాగా అందరూ ఉంటారని ఎలా అనుకుంటావు కృష్ణా! తప్పదు , సర్దుకు పోవాలి....అంతె! ఇది జీవితం.. నీలాగే నేనూ పుట్టింట్లో గారాభంగా పెరిగాను. కానీ, ఏం లాభం? కాపురానికి వస్తూనే మడికట్టుకుని వంటలు, వడ్డనలు, పొద్దున్నే గేదెల పని, సాయంత్రం వంట.... నాకు నలుగురు అడబడుచులు, ముగ్గురు మరుదులు.... మీ నాన్నగారే పెద్దవారు. అత్తగారు, ఆవిడ అత్తగారు , మావగారు.... ఇంతదాకా నా జీవితం సాగింది కదా....'అంది ఊరడిస్తూ.
    "ఒ గాడ్...నా వల్ల కాదమ్మా....అలా వంటగదిలో , ఓ పోయ్యిలాగో, రాగి బిందె లాగో నేనుండలేను. నా జీవితం స్థంభించినట్టుందమ్మా.... ఎలా మర్చిపోయానో నాకే అర్ధం కావడం లేదు.ఎంఫిల్ అప్లై చేసి వదిలేశాను. ఎలాగైనా ఈ ఏడాది మళ్ళీ ప్రయత్నిస్తాను."
    "ఇంకేం చేస్తావు.... పసిపిల్లతో ఇటు ఇంట్లో పని, అటు చదువు , ఉద్యోగం అన్నీ కుదురుతాయా? మర్చిపో ఎం.ఫిల్ సంగతి...."
    "వాట్?" ఆశ్చర్యంగా చూసింది. "మరచిపోనా.......ఎంత ఈజీగా అన్నావమ్మా" బాధగా అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS