Previous Page Next Page 
మౌనవిపంచి పేజి 32


    
    అతనదోలా చూశాడు.
    
    "మీ ఎలయన్స్ తప్పిపోవాల్సింది కాదు. మీ మేనత్త కూడా ఒక కారణమైంది!" అన్నాడు నర్మగర్భంగా నవ్వుతో.
    
    "అసలైంది డబ్బేగా?" ఎత్తిపొడిచింది నంద.
    
    "అఫ్ కోర్స్?" గిల్టీ ఫీలవుతూ నవ్వాడు.
    
    "మీరు ఇంటర్ కేస్టు మేరేజు కి ఇష్టపడతారా?" అడిగింది స్టెల్లా సూటిగా రంగంలోకి దిగాలనుకుందామె.
    
    "ఎందుకలా అడుగుతున్నారు?"
    
    "మీకు తెలియదా? మేం కన్వెర్టెడ్ క్రిస్టియన్స్ మీ."
    
    "కానీ మీ ఫాదరు?"
    
    "ఆయన చెప్పలేదా?" అడిగింది నంద.
    
    "ఇప్పుడు నే చెబుతున్నాగా!" అంది స్టెల్లా.
    
    అతనేం అనలేదు.
    
    "మీకు కట్నం కూడా పైసా ముట్టదు!"
    
    "మీ నాన్నగారు-"
    
    అతని మాటల్ని ఖండిస్తూ "మీ నాన్నగారి విషయం మీ విషయం చెప్పండి! రేటు తగ్గించారా లేదా? అయినా పెంచే ఉంటారేమో! మీరు చదువుకున్నారు. కట్నానికి గుడ్ బై చెప్పలేరా!" అంది నంద.    

 

    "మీలాటి అమ్మాయిల కోసం త్యాగం చేయాలా?"
    
    అతని హేళన ఆమె గుండెల్లో దూసుకెళ్ళింది.
    
    అయినా నవ్వుతూ అంది "స్టెల్లా విషయం మీకు తెలియదేమో! ఆమె ఒకపైసా కట్నం కూడా ఇవ్వదు."
    
    "వాళ్ళ నాన్నగారు ఆమె పేర పదిహేనువేలకి ఎప్.డి. వుందన్నారు!" అక్కడ స్టెల్లా లేదన్నట్టుగా అన్నాడు విష్ణు.
    
    స్టెల్లా లేచి నుంచుంది 'వెళదామా?' అంది.
    
    "అఫ్ కోర్స్! మన పరిచయం అయింది. మీరు నాకు మనస్ఫూర్తిగా నచ్చారు- మీ అభిప్రాయం తెలియజేస్తే-"
    
    "ఎంతగా దిగజారిపోయాడు!" అనుకుంది నంద.
    
    ఆమెకి అతన్ని చూస్తే జాలేసింది.
    
    "సరి అయిన వయసులో పెళ్ళి కాకపోతే కోరికలు తీరని డిసిప్లిన్ గర్ల్స్ కి పెళ్ళి అంటే ఎంతో భ్రమ ఉంటుంది అంటారు. కానీ ఇతనేమిటి?" అనుకుంది.
    
    స్టెల్లా అతన్ని నిలేసింది మాటల్లో.
    
    "మీకు నిజంగా నచ్చానా?"
    
    "ఆ" అన్నాడు పొడిగా.
    
    "నేను దమ్మిడీ కట్నం ఇవ్వను."
    
    "అఫ్ కోర్స్ ఇవ్వకున్నా ఫర్లేదు."
    
    "నా జీతం ఒకపైసా ఇవ్వను. నేను మదర్ నయ్యేదాకా అది నా పేరెంట్స్ కి చెందుతుంది. నేను తల్లి నయ్యాక అది నా పిల్లల పేర ఎప్.డి.లో వేస్తాను."
    
    "యస్" అలాగే కానివ్వు అన్నట్టుగా చూశాడతను.
    
    "నా పాకెట్ మనీ మొదలు నా ఎక్స్ పెండిచర్ అంతా మీరే భరించుకోవాలి!" ఇంకో చురక అంటించింది స్టెల్లా.
    
    అతను విస్మయంగా చూశాడు.
    
    "ఇవన్నీ మీకు నచ్చి, సివిల్ మేరేజుకి ఇష్టపడితే పెళ్ళయ్యాక సింపిల్ డిన్నర్ కి అంగీకరిస్తే-" మధ్యలో వదిలేసింది ఆమె.
    
    "నేను మీ ఫాదర్ కి రింగ్ చేస్తాను."
    
    "అక్కర్లేదు మీకు అన్ని విధాల నేను నచ్చితే రేపు ఆఫీసుకి రండి. వెళ్ళి ఎప్లికేషన్ పెట్టి వద్దాం. దట్సాల్. బై" అంది స్టెల్లా.
    
    ఆమె స్థైయిర్యానికి మెచ్చుకుంది నందా.
    
    అతను వెళ్ళిపోయాక పకపక నవ్వింది స్టెల్లా.
    
    "ఎందుకు నవ్వటం?"
    
    "నందా! ఇలాంటి జెర్రిగొడ్డుల్ని నేను పెళ్ళిచేసుకుంటానా? ఈ రోగ్ నిన్నెంత హర్ట్ చేయాలని చూశాడో చూడు. ఇలాంటి వెధవలు లెక్చరర్స్ గా ఉండటం వల్లే విద్యార్ధులు అలా తయారవుతున్నారు. దేశం ఇలా అయిపోతోంది-" అంది ఆవేశంగా.
    
    మధ్యతరగతి, మనుష్యుల మనస్తత్వం- అప్పుచేసి అయినా కట్నం ఇచ్చి కన్నెచెర విడిపించాలని ప్రయత్నంచేసి, తాము చెరలో పడిపోతారు. ఈ వరకట్న పిశాచి ఎప్పుడు నశిస్తుందో కానీ- అంతదాకా ఈ మధ్య తరగతి సంసారాలు ఇలా ఘోషించాల్సిందే!
    
                                       17
    
    స్టెల్లా మాటలు నందకి తన కాలేజీ రోజుల్లో జరిగిన తన ఫ్రెండ్ పెళ్ళినాటి సంఘటన గుర్తుకి వచ్చింది. హోటల్ నుంచి ఆఫీస్ కి నడిచి వస్తోంటే ఆ సంఘటన అక్షరాక్షరం తలపుల్లో మెదిలింది. సినిమారీలులా గతం గిర్రున తిరిగింది.
    
    చంద్రమోహన్ ఒకవైపున వుంటే నారాయణ ఇంటికి మరోవైపున శేఖరంగారున్నారు. ఆయన రైల్వేలో అసిస్టెంట్ స్టేషన్ మాష్టర్. ఆయన చాలా స్ట్రిక్ట్ అని పేరు తెచ్చుకున్నవాడే కానీ రైల్వే ఆస్తి ఒక్కపైసా అయినా ఎరగడు నిజంగా గుణ శేఖరుడు ఆయన.
    
    ఆయనకి ఇద్దరే పిల్లలు.    

 

    ఒక కొడుకు, ఒకే కూతురు.
    
    కొడుకు రైల్వేలోనే ఇంజనీర్.    

 

    కూతురు డిగ్రీ పూర్తిచేసి మిక్స్ డ్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తోంది.
    
    సులోచన చాలా అందగత్తె!
    
    అందుకే మల్లిఖార్జునరావు ఆమెని చూడగానే ఒప్పేసుకున్నాడు.
    
    పెళ్ళి తిరుపతిలో! అటు వారికీ, ఇటు వారికీ అనుకూలంగా వుంటుందని ఏర్పాటు చేశారు.
    
    శేఖరంగారి నిజాయితీ తెలిసిన జోనల్ సూపరిండెంట్ ప్రత్యేకంగా ఈ పెళ్ళివారికి పాసులు యిచ్చారు.
    
    ఆయన బోర్డ్ మెంబర్ కి రాసి మరీ పర్మిషన్ తెప్పించాడు.
    
    దాంతో పెళ్ళికి అందరూ బయలుదేరారు.
    
    నారాయణ కుటుంబం అంతా తాళాలు వేసి బయలుదేరింది.
    
    పెళ్ళికి బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరిగాయి. మర్యాదలు మన్ననలు జరిగాయి. కలాపాలు జరుగుతూ తాళికట్టబోయే ముందు పురోహితుడు హెచ్చరించాడు వరుడ్ని-
    
    "అయ్యా! తరువాత చెప్పలేదని మమ్మల్ని నిందించకండి! కట్నం డబ్బులు ముట్టాయా!"
    
    శేఖరంగారు చిరునవ్వు నవ్వి భార్యవైపు చూశారు. విజయలక్ష్మి లేచి విడిది గదిలోకి వెళ్ళింది. కట్నం నగదు ఇరవై వేలూ సూట్ కేస్ లో భద్రంగా వుంచింది. పదివేలకి నగలు సులోచనకి పెట్టేశారు.    

 

    ఒక్క నిమిషం వ్యవధిలో "ఏమండీ" అన్న పిలుపు విని శేఖరం లోపలికి వెళ్ళాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS