"ఛ.....ఛ....నేనలా అనలేదు .దేన్నయినా సక్రమమైన మార్గంలో సాధించమని...."
" మీ నాన్న సంపాదన అంత సక్రమమైన మార్గంలో నే వ్చచిందా "
"బాలూ!"
" ఎందుకా ఉలకిపాటు.!"
"నీ ఆలోచనకు....."
" నా ఆలోచనకు నువ్వేం సానుభూతి చూపవద్దు. నాకు తెలుసు సక్రమ మార్గంలో యెవరూ, దేన్నీ సాధించలేరు."
" మీ మూర్ఖత్వానికి జవాబు లేదు."
" మీది న్యాయం , నాది మూర్ఘత్వం అంటే నేను చెప్పేదేంలేదు."
సిద్దార్ధ ఆలోచిస్తూ నిలబడిపోయాడు.
" రండి. రిక్షా వచ్చింది." శ్వేత పిలిచింది.
బాలరాజుకు చేయూతనిచ్చి లేపి రిక్షాలో కూర్చోబెట్టాడు.
" నీ ఆలోచనలు దారుణమైనవి. బాలూ! మరొక్కసారి ఆలోచించు"అన్నాడు భుజం తట్టి రిక్షా వెళ్ళిపోయింది.
" యెలా ఉంది లైఫ్!" శ్వేత నవ్వింది.
" మీకు నవ్వు వస్తుందా!"
"నవ్వక చేసేదేముంది! ఈ జనం అమాయకులా అతితెలివి మంతులా అర్ధం కావటంలేదు."అన్నది .ఇద్దరూ నడిచివస్తుంటే దారిలో ఒక గ్రేప్ గార్డన్ కనిపించింది.
అక్కడ గుజరాతీలు రాళ్ళలో డబ్బులు గుప్పారు. ద్రాక్షతోటలు వేసారు. ప్రతీ తోటలో ఒకబంగఏళా కట్టుకున్నారు.
ఒక తోటముందు పచ్చికలో కూర్చున్నారు. మిగిలిన టీ రెండు భాగాలుచేసి ఒకటి సిద్ధార్ధకు యిచ్చింది. ప్లాస్క్ తోనే తను త్రాగేసిందామె.
రెండు గ్రుక్కలే అయినా అతనికెంతో రిలీఫ్ నిచ్చింది.
ఆమె యెటో చూస్తూ ఆలోచిస్తుంది.
"ఏమాలోచిస్తున్నారు!"
"మన సమాజంలో స్త్ర్రీ , పురుషులిద్దరూ,ఇద్దరు పరుషుల్లాగా, స్త్ర్రీలలాగా కలిసి ఉండలేరా!"
"అంటే-"
"సెక్సువల్ ఇన్వాల్వ్ మెంటు లేకుండా."
అతని ముఖం ఎఱ్ఱబడింది.
"ఆకర్షణ నుండి తప్పించుకోవటం కష్టం అనుకుంటాను."
" అకర్షణ ప్రతీ స్త్ర్రీ, ప్రతీ పురుషుడి మధ్య ఉంటుందనుకోను."
" మీ ఉద్దేశం!"
" కనిపించిన ప్రతి స్త్ర్రీ ని చూడగానే హృదయం స్పందిస్తుందా!"
" ఉహు! "
"ఉత్తమ పురుషుడు యెప్పడూ స్పందించడు. కనిపించిన స్త్ర్రీఅల్లా కావాలనుకోవటం రాక్షసత్వం."
" నాకీ విషయాలు యెందుకు చెబుతున్నారు. "
" మీ ఇంట్లో మీకు ప్రత్యేక మైన గుణం వచ్చింది కాబట్టి చర్చించాల్సివస్తుంది" అన్నది నవ్వుతూ.
అతను అది అభినందనో, వెటకారమో తెలియక తల ఎత్తాడు.
ఆమె ముఖం కాంతివంతంగా వుంది. సిద్ధార్ధనే సూటిగా చూస్తుంది. ఆచూపులను తట్టుకోలేకపోయాడు.
అభినందనలే.....
చందనకు కుసుమ పరిమళాలే-
అది తోట కాకపోతే,చుట్టూ జనం లేకపోతే ఒక్కసారి ఆమెను ఎత్తి గిరగిర తిప్పేవాడే.
" ఏమిటి నేను అతిశయోక్తి మాట్లాడానా!"
