Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 31

   
     "చట్టం మీ చేతిలోకి తీసుకుని చలగాటం ఆడటం అన్యాయం." వెళ్ళి బాలరాజు కట్లు విప్పాడు.
   
    బాలరాజు కళ్ళలోని భయం మాయం అయింది. అతను సిద్ధార్ధ చెయ్యిపట్టుకున్నాడు.

     " నీకేం భయం లేదురా...." అతడి చెయ్యి పట్టుకుని బయటికి తీసుకు వచ్చాడు.

     "మళ్ళీ , మంత్రం తంత్రం  ఆమబిడ్డ్యా! తోట ఊడదీస్తాం." అన్నాడు.
   
     బ్రతుకు  జీవుడా అని పరుగు బయట పడ్డారు.

     కొద్ది దూరం రాగానే బాలరాజు కూలబడిపోయాడు.

     "నేను నడువ లేను, మంచినీళ్ళు...." ఆయాసంతో రొప్పసాగేడు.

    శ్వేత తన సంచీలోనుండి చిన్న ప్లాస్క్ తీసింది. టీ ఒంపి ఆతని కిచ్చింది.
   
     సిద్ధార్ధ ఆశ్చర్యంగా చూచాడు.

    "మీరు టీలు, మోసుకు తిరుగుతారా!"

    "టీ,  మంచినీళ్ళు , బిస్కెట్లు ఎప్పుడూ నావెంట ఉంటాయి."అన్నది.

     " ఎందుకు?"

    " ఊరూర తిరిగేవాళ్ళం కదా." అన్నది క్లుప్తంగా.

     " మీ రు టీ త్రాగుతుండండి అలా రోడ్డుమీదికి వెళ్ళి ఏదయినా రిక్షా వస్తుందేమో చూస్తాను." అన్నది శ్వేత.

     ఆమె వెళ్తుంటే వెనుక జడ పాములా అటు,ఇటు కదలాడుతూ చూపరుల దృష్టి అక్కడే బంధించి ఉంచుతుంది. ఒక క్షణం సిద్దార్ధ చూపులు ఆమె జడను అనుసరించి మళ్ళీ వచ్చాయి.
   
    " బాలరాజా!నీకు బుద్ధి ఉందా అసలు!"

    అతను కళ్ళెత్తి చూచాడు.

     " అటు మీనాన్న చితి అయినా ఆరలేదు, నీకు మంత్రాలు నేర్చుకోవాలన్న ఆలోచన యెలా వచ్చిందిరా!"

    "అది కాదురా.... "

    " ఏది   కాదు మీ నాన్న పోవటమా? నీకు మంత్రాల పిచ్చి పట్టటమా?"

    " సిద్దూ! జీవితంలో ఏముందిరా ! అంతా బోర్-రొటిన్- ట్రాష్! ఎదయినా అద్భుతం చేయాలిరా." అన్నాడు.

    "వాళ్ళు పళ్ళు రాలగొడితే అద్బుతంగా ఉండేది కదూ!"

     బాలరాజు మాట్లాడలేదు.

    " ఈ మంత్రాలు నేర్చుకుని ఏంసాధించాలనిరా!"
 
     "ఏం లేదు."

    " ఇదిగో ఏదో దాస్తున్నావ్! అసలు నీకీ దుర్బుద్ది యెలా పుట్టింది!"

    "నీకు నీకున్నట్టు కాస్త ఫవరున్న తండ్రి ఉంటే ఎన్నో నీతులు చెప్పేవాడివి." అన్నాడు.

    " అంటే నీ ఉద్దేశం!"

    " ఏముంది! నీ నాన్న లాంటి వారు డబ్బుతో అందరిని ఆడిస్తున్నారు. మీ అన్నలాంటి వారు దుర్మార్గంతో అందరిని  అరచేతబట్టారు. సర్పించిలాంటి వారు అధికారంతో ఆడిస్తున్నారు-"

    " అంటే.... అంటే ఇప్పుడు నువ్వు  నీ మంత్రశక్తి తో అందరినీ చేతబట్టాలనా!" అన్నాడు.

     "నువ్వెలాగయినా అనుకో."

    " అసలు ఈ మంత్రాలు,తంత్రాలు నమ్ముతావా?"

    " నేను నమ్మటం ఏమిటి? పెద్ద, పెద్దవాళ్ళే నమ్మారు...." గబగబ ఓ అరడజను  పేర్లు చెప్పడు.అవన్నీ ఇంగ్లీషు  పుస్తకాలు,దయ్యాలు, భూతాలున్నాయని చెప్పేవి.

     సిద్దార్ధకు పూర్తిగా అర్ధం అయిపోయింది. ప్రపంచం పూర్తిగా ఫవర్ కాన్షనెస్ అయింది. ఏదో  ఒక రకంగా ఫవరు చేజిక్కించుకోవలన్న తప్పమరేం లేదు.

     అది సక్రమమైన మార్గం అయితే కష్టం. అందుకే ఏదో రకంగా చేజిక్కించుకోవాలన్ని తపన పట్టుకుంది.

    " రాజూ! అందరికీ అన్నీ అబ్బవు."

    "ఓహో! అయితే అధికారం మీస్వంతం అంటావు అవునా!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS