Previous Page Next Page 
స్త్రీ పేజి 32

 

    సుశీల ఏమీ జవాబు చెప్పలేదు. వాళ్ళ తాలూకు మామ్మగారోకావిడ బల్ల మీద కూర్చుని అంతా వింటూనే ఉంది. పార్వతి అడిగిందానికి తనే కలగజేసుకుని , "అయ్యో! ఏం జబ్బు అని చెప్పమంటావు , తల్లీ? రెండు మూడేళ్ళ నుంచీ ఇలా సుస్తీల తోనే బాధ పడుతోంది. ఎన్నడూ లేనిది మాయదారి పెళ్ళయ్యాకే ఇస్టీరియా తెగులు పట్టుకుంది. అది అలా వుండగా ఓసారి కడుపు పోయింది. మొన్న పిల్లాడు పుట్టి ఓ నెల్లాళ్ళు బ్రతికే పోయాడు. వాడు పోయాక ఇది బొత్తిగా తెగుళ్ల పాలై పోయింది. వందల కొద్దీ రూపాయలు విరజిమ్ముతోన్నా మందుల దారి మందులదీ, తెగుళ్ళ దారీ తెగుళ్లదే అవుతోంది. తిండి తిప్పలూ లేవు. అసలు తెగులే లేదంటున్నారు డాక్టర్లు. ఏం చెప్పమంటావమ్మా!కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది" అంటూ కళ్ళు ఒత్తుకుంది.
    పార్వతి విస్మయంగా సుశీల కేసి చూసింది. నీరసంగా చూస్తూ అలాగే పడుకుని ఉంది సుశీల. మామ్మగారు చెప్పిన సంగతులన్నీ ఏమిటో సరిగ్గా అర్ధం కానేలేదు పార్వతికి. సుశీలకు పిల్లాడు కూడా పుట్టి పోయాడా? రఘుపతి నడిగితే ఆ ముక్కే చెప్పలేదే! అసలు రఘూ ఏం చెప్పాడు గనకా? పెళ్ళానికి జబ్బేమిటో తనకు తెలీదన్నాడు. కళ్ళలో ప్రాణాలు పెట్టుకు బ్రతుకుతున్న దాన్ని వదిలి పోయాడు. ఇద్దరికీ సరిగా కుదరటం లేదా ఏమిటి? ఉలిక్కిపడింది పార్వతి. ఆ కళ్ళలో ఏ భావమూ వ్యక్తం కావటం లేదు. జబ్బు పడ్డ మనిషి ఎలా వుంటుందో అలాగే ఉంది. ఏం మాట్లాడాలో ఎలా ఓదార్చాలో అర్ధం కాలేదు. మామ్మగారితోనే సంగతులన్నీ అడిగి తెలుసుకుంటూ కూర్చుంది చాలాసేపు. చీకటి పడుతోంటే , వెళ్లొస్తాను , సుశీలా! నువ్వేం బాధ పడకు. అదే తగ్గిపోతుంది" అంటూ లేచింది.
    "అప్పుడప్పుడూ వస్తూ వుంటావా, అక్కయ్యా?" ఆశగా చూసింది సుశీల.
    "తప్పకుండా వస్తానమ్మా! మా రుక్కు ఇక్కడే ఉందిగా?' అంతలోనే తన పొరపాటు తెలుసుకుని. "రుక్కు లేకపోతె ఏంలే. నిన్ను చూడటానికి తప్పకుండా వస్తూ ఉంటాను. మరి వెళ్ళి రానా?" అంటూ మరోసారి ధైర్యం చెప్పి బయటికి వచ్చింది. సుశీల విషయం లో మాత్రం ఏదో అర్ధం కాని అనుమానం పాములా పెనవేసుకుంది గుండెల్ని. రఘూ అంటే సుశీలకు ఇష్టం లేదా?
    రుక్కును ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకు పోయినా పార్వతి తరచూ వెళ్ళి సుశీలను చూసి వస్తూనే ఉంది. సుశీల ఒక్క జబ్బు తోనే కాకుండా ఏదో దిగులుతో కూడా తీసుకొంటుందన్న విషయం కనిపెట్టటానికీ అట్టే కాలం పట్టలేదు. నిజంగానే రఘూ అంటే సుశీలకు ఇష్టం లేదేమో?

                              *    *    *    *
    "సుశీలా! నిన్నొక మాట అడగనా?' మరెంతో కాలం తనలో తపన భరించలేక పోయింది పార్వతి. మనస్సులో మాట అడగాలని నిరీక్షిస్తున్న పార్వతికి మంచి అవక్షమే చిక్కింది. సుశీల ఆరోగ్యం కాస్త కుదుట పడింది. రోజంతా పడుకుని ఉండకుండా కాస్సేపు లేచి తిరగాడుతుంది. ఆస్పత్రి నుంచి విడుదల అయి ఇంటికొచ్చింది.
    విశాలమైన మేడలో సుశీలకు ప్రత్యేకమైన సదుపాయాలూ, అపురూపంగా చూసుకునే తల్లీ, తండ్రీ , కన్నుసన్నల వెంట పరుగులెత్తే పని మనుషులూ . అంతులేని భోగభాగ్యాలతో తులతూగే సుశీల దిగుళ్ళ తో కృశిస్తుందంటే అది దాంపత్య విషయం కాకపోతే మరేమై ఉంటుంది? అసలు మొట్టమొదటే తనకంత ఇష్టం లేని పెళ్ళేందుకు చేసుకుంది? దౌర్భాగ్యం కాకపోతే రఘుకు సుశీల వల్ల కూడా సుఖం లేదా?
    సాయంత్రం వేళ నీరెండ లో మల్లెపందిరి కింద కుర్చీ వేయించుకు కూర్చుని ఏవో పుస్తకాలు తిరగేస్తుంది సుశీల. కోలుకొంటున్న ఆరోగ్యంతో ఆమె చిరునవ్వు లో కాస్త జీవం తొణికిసలాడింది. "రా అక్కయ్యా!" అంటూ ఎదురు వచ్చి ఆహ్వానించింది పార్వతిని.
    పార్వతి కూడా మరో కుర్చీలో కూర్చుంటూ కాస్సేపు కాలక్షేపంగా మాట్లాడి చివరికి మనస్సులో మాట కాస్తా వెల్లడించేసింది. "సుశీలా ! నిన్నిక మాట అడగనా?"
    కళ్ళు తిప్పి సామాన్యంగా చూసింది సుశీల. అదో మాదిరిగా నవ్వుతూ అంది: "ఏం మాట అడుగుతావు?"
    "నువ్వేమీ అనుకోనంటే ఎన్ని మాటలైనా అడుగుతాను. ఏమీ దాచుకోకుండా మనస్పూర్తిగా జవాబులు చెప్పాలి. అడగనా, మరి?"
    మాట్లాడలేదు సుశీల చాలాసేపు. "నాతో ఇంత ప్రేమగా మాట్లాడేది నువ్వొక్క దానివే, అక్కయ్యా! నువ్వేదడిగినా నా హృదయ పూర్వకంగా చెప్పగలననుకుంటున్నాను."
    "మీదాంపత్య రహస్యాలు కూడా?"
    విస్మయంగా చూసింది సుశీల. 'అంటే?"
    "మరేమీ అనుకోకు, సుశీ! నా అనుమానాలు నివృత్తి చేసుకుంటే గాని ఈ బాధ తగ్గదని పిస్తోంది. మా రుక్కు ఒకటీ, నువ్వు ఒకటీ కాదు నాకు. నువ్వెందుకో సంతోషంగా లేవు. ఎప్పుడూ ఏదో దిగులుతో బాధపడుతోన్నట్టు కన్పిస్తున్నావు. అవునంటావా?"
    సుశీల సంశయిస్తూనే ఒప్పుకుంది. నీకలా కనిపిస్తే నేనెలా కాదన గలను?"
    'అయితే నీకు రఘు బాబంటే ఇష్టం లేదా? పోనీ, ఈ పెళ్ళి చేసుకోవటం మానలేక పోయావా?"
    "అక్కయ్యా!' విభ్రాంతి గా చూస్తూ అంది సుశీల. "నాకు.... ఆయనంటే ఇష్టం లేదూ? ఎవరు చెప్పారీ మాట? ఎలా తెలిసింది నీకు?" కాస్త చురుగ్గా చూసింది.
    కంగారు పడింది పార్వతి. "అబ్బే! నాకెవరూ చెప్పలేదు, సుశీ! నాకు సరిగ్గా తెలీదు కూడాను. ఊరికే అలా అనుకున్నాను. నువ్వేదో బెంగతో బాధ పడుతున్నావని, మీ యిద్దరికీ కలియటం లేదేమోనని ఊహించాను. రఘుపతి నాకు తెలుసు. అతను ఇష్టపడే నిన్ను పెళ్ళి చేసుకున్నాడు. పొతే నువ్వు...."
    "నామాట అలా ఉంచు. అయన ఇష్టపడే నన్ను పెళ్ళి చేసుకున్నారా?"
    "ఎందుక్కాదు? తల్లీ, తండ్రీ కుడుర్చిన సంబంధం, సంతోషంగానే పెళ్ళి చేసుకున్నాడు."
    "లేదక్కయ్యా! లేదు. అయన గురించి నీకేమీ తెలీదు. ఆయనకి నేనంటే బొత్తిగా ఇష్టం లేదు. ఆనాటికీ ఈనాటికీ నేను ఆయనకీ ఇష్టం కాలేక పోతున్నాను."
    అయోమయంగా చూసింది పార్వతి.
    "నిజం, అక్కయ్యా! ఇంతవరకూ వచ్చాక నీతో అంతా చెప్పేసుకోవాలనిపిస్తోంది. నా మనస్సయినా తేలిక పడుతుంది. నా మాట నమ్మవా?"
    నమ్మలేనట్టే చూసింది. "రఘూ కి నువ్వంటే ఇష్టం లేదని ఎలా తెలుసు నీకు?"
    "ఎంత అమాయకంగా అడుగుతున్నావక్కయ్యా? నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడో లేదో నేను తెలుసుకోలేనా? నాసాహచర్యం ఆయనకు కావాలో లేదో నాకు అర్ధం కాదా? నన్ను అయన కోరి పెళ్ళి చేసుకోలేదనీ, నేను ఆయన్ని సంతోష పెట్టలేననీ తెలుసుకోటానికి ఒక్క నెల రోజులైనా పట్టలేదు. ఆనాటి నుంచీ నా దురదృష్టానికి కుళ్లి పోతూనే వున్నానక్కయ్యా!" సుశీల గొంతు భారమై కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    పార్వతి మృదువుగా సుశీల చెయ్యి పట్టుకుంది. "ఇలా బాధ పడకు, సుశీ! అసలు సంగతేమిటో నాకు సరిగా చెప్పవూ?"
    "ఇంకా ఎలా చెప్పనూ? అయన మనస్సు నాకేనాడో తెలిసిపోయింది?"
    "అదే అడుగుతున్నాను. ఎలా తెలిసింది? రఘూ నిన్ను బాధ పెట్టేవాడా?"
    "బాధ! బాధ కాకపోతే ఏమిటి? ప్రత్యేక్షంగా నన్ను కొట్టి తిట్టి ఎన్నడూ బాధ పెట్టకపోయినా అంతకన్నా ఘోరంగానే ప్రవర్తించారు. నేనంటూ ఓక మనిషిని ఆయన జీవితంలోకి వచ్చానన్న సంగతే అయన పట్టించుకోలేదు. భార్యగా నా నుంచి పొందగలిగే సుఖాలను వేటినీ అయన లక్ష్య పెట్టలేదు. మా యిద్దరికీ పెళ్ళి ఎందు కైందో ఇప్పటికీ నాకు అర్ధం కాదు."
    "ఊ"
    "ఈ గడిచిన కాలంలో ఒక్క గంట సేపు కూడా మేమిద్దరం ఆప్యాయంగా మాట్లడుకోలేదంటే నమ్ముతావా? ఉదయం లేచింది మొదలూ అయన ధోరణి ఆయనది. నా కాలక్షేపం నాది. నా కష్ట సుఖా లేన్నడూ  అడిగి తెలుసుకోనూ లేదు. అయన మంచి చెడ్డలు నాతొ చెప్పనూ లేదు. మా యిద్దరికీ మానసికంగా ఏవిధమైన బంధమూ లేదక్కా!"
    నిట్టుర్పు విడిచి మళ్ళా చెప్పటం మొదలు పెట్టింది సుశీల. "ఆయన ఎప్పుడూ ఎందుకంత ఉదాసీనంగా ఉంటారో అర్ధం కాదు. ఏదో పోగొట్టుకున్నట్టు వెర్రిగా ఎటో చూస్తూ బాధ పడుతూ ఉంటారు. ఎందరున్నా తన కెవరూ అక్కర్లేదన్నట్టూ  నిర్లక్ష్యం చేస్తారు. అయ్యన్నేలా కనిపెట్టుకు వుండాలో ఎవ్వరికీ అర్ధం కాదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS