"సుశీ! రఘూ మనస్సు సంతోష పెట్టటానికి ఏమైనా ప్రయత్నం చేశావా? అన్ని విషయాలలోనూ నీకై నీవే కలగ జేసుకుని అతన్ని అంటి పెట్టుకు తిరగరాదా? మనుష్యులందరూ ఒక్కలా ఉండరమ్మా! వాళ్ళ కోరికలు కూడా ఒక్కలా ఉండవు. రఘూ మంచి వాడు కాదని ఎవ్వరూ అనలేరు. కాకపోతే అతనిలోనూ కొన్ని బలహీనతలుండచ్చు. వాటి కతడు లొంగి తిరుగుతోంటే నీ దారిన నువ్వూ వదిలేసి ఊరుకుంటావా? ఆలోచించు, సుశీల!"
"లేదక్కా! నీకు సిగ్గు విడిచి చెప్తున్నాను. అయనకి ఏంతో సన్నిహితం కావాలని ప్రయత్నిస్తాను. ప్రయోజనం ఉండదు. నాకై నేను దగ్గరికి వెళ్తే తప్పకుండా ఆదరిస్తారు. కాని అందులో నాకు తృప్తి దొరకదు. నామీద కోరిక లేని ఆయనని విసిగిస్తున్నానేమో నన్న బాధ నా మనస్సులో మొలకలేత్తుతుంది. ఎన్నోసార్లు దుఃఖం ఆపుకోలేక అయన గుండెల మీద తల ఆన్చుకుని ఏడ్చాను. తాత్కాలికంగా నన్ను బుజ్జగించినా తర్వాత మరి మార్పు కనిపించదు. 'ఎందుకు నన్నంత అసహ్యించుకుంటారు? నేనంటే మీకు ఇష్టం లేదా? నిజం చెప్పండి" అని అడిగితె అమాయకంగా చూస్తూ "నిన్ను అసహ్యించుకుంటున్నానా? అదేం మాట సుశీలా! నువ్వేం తప్పు చేశావనీ? నువ్వంటే నాకు ఇష్టం లేకపోవటం ఏమిటి? భార్యంటే భర్తకి ఇష్టం ఉండద్దూ?' అంటారు. ఇదీ ధోరణి. నేను తప్పు చెయ్యను కాబట్టి అసహ్యించుకోరు. భార్యని కాబట్టి ఇష్ట పెట్టుకుంటారు. ఇలా నిబంధనల ప్రకారం సాగిస్తారు సంసారం. నేను తననెంత ఆరాధిస్తున్నానో అది ఆయనకి ఇప్పటికీ తెలిసినట్టు లేదు. అనారోగ్యాలతో ఎన్నాళ్ళు తీసుకున్నా ఒక్క ఉత్తరం ముక్క కూడా వ్రాయరు. వ్రాసినా, "నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో" అంటూ పొడి పొడిగా గిలికి పారేస్తారు. 'నా ఆరోగ్యం కాపాదవలసింది మీరు గానీ నేను కాదు' అంటూ ఏడావాలనిపిస్తుంది నాకు. బాబు పుట్టినప్పుడు చూడటానికి వస్తే, 'బాబు చాలా ముద్దుగా ఉన్నాడు కదూ?' అన్నాను.
'అవును. పిల్లలు ముద్దుగా ఉండరూ?" అన్నారు తనకేమీ పట్టనట్టు. పసిపిల్లలు ముద్దుగా ఉంటారన్న సంగతి తెలుసు కాబట్టి మా బాబు కూడా తండ్రికి ముద్దుగానే కనిపించాడు గానీ మరేవిధమైన అనుభూతీ కలగ లేదన్న మాట! నా భార్య, నా కొడుకు అన్న తపనే కనిపించదాయనలో. తామరాకు మీద నీటి బొట్టు తొణికిసలాడినట్టు ఈ సంసార బంధాన్ని అంటీ అంటకుండా కాలం గడుపుతున్నారు.' ఆగింది సుశీల.
వింటున్న పార్వతి నిట్టూర్చింది. "ఏం చెప్పటానికీ తోచకుండా వుంది, సుశీ!"
"ఇదంతా నా దురదృష్టం తప్పితే ఒకరు సమర్ధించగలగటానికేమీ లేదక్కా! నా బాబు నైనా చూసుకు కాలం గడుపు దామనుకుంటే ఆ అదృష్టం కూడా లేకుండా చేశాడు భగవంతుడు. దాంపత్య సుఖానికి నోచుకోని వ్యక్తులకి, శాంతి ఉంటుందంటావా? తన దారి తనది, నా దారి నాదీ. ఈ అనారోగ్యాలతో నెలల తరబడి పుట్టింటే ఉండి పోవలసి వస్తోంది నాకు. నాకోసం ఒక్క వారం రోజులు ఉండమన్నా అయన ఇక్కడ ఉండలేరు. నేను ఉన్నా లేకపోయినా అయన ఒంటరే! ఆ ఒంటరి తనమే కావాలి తనకి.
వింటున్న కొద్ది చాలా బాధ కలిగింది పార్వతికి.
"కానీ, అక్కయ్యా, నాకు ఒక్కటే అనుమానం. ఇంత ఇష్టం లేకుండా నన్నెందుకు పెళ్ళి చేసుకున్నారు? ఇష్టమైన మరో అమ్మాయి నేవరినైనా చేసుకుంటే ఇద్దరూ సుఖంగా ఉండేవారు కదూ?"
"సుశీలా!" ఆవేశంగానే అంది పార్వతి. "ఇష్టాయిష్టాలు ఆలోచించుకోవలసినది వివాహానికి ముందే గానీ తర్వాత కాదమ్మా! ఇష్టాయిష్టాలు నిర్ణయించుకోగలిగే శక్తి ఉన్న వాళ్ళసలు ఇలాంటి అన్యాయాలకి తలపడరు."
విస్మయంగా చూసింది సుశీల. తన గాధ వింటే పార్వతి అక్కయ్యకు జాలి వేస్తుందా? దీనంగా చూస్తూ అంది: "ఇన్నాళ్ళూ ఈ బాధని గుండెల్లో దాచుకుని గుండెల్ని అరబెట్టుకున్నాను. నీలా ఇంత చల్లగా అడిగి అర్ధం చేసుకున్న వాళ్ళు కూడా కనిపించలేదు చెప్పుకుని ఏడవటానికి!"
"ఇక మరెప్పుడూ ఏడవకు , సుశీ! సంసార జీవితంలో చివరి క్షణం వరకూ గెలుపు కోసమే ప్రయత్నించాలి. ఆశతోనే నిరీక్షించాలి. జరిగిందేదో జరిగింది. నీ ప్రయత్నాలు నువ్వు మానకు. రఘుబాబు బొత్తిగా అమాయకుడు! నువ్వు కాకపోతే అతన్ని ఎవరు క్షమిస్తారు? తల్లి మాట వినని పసిపాపని ఎలా బుజ్జగిస్తావో అంతకన్నా ఎక్కువగా రఘూని చూసుకోవాలి నువ్వు. అతను ఎండమావుల కోసమే వెదుకుతున్నాడనీ, నీ సన్నిధి లో తప్పితే మరెక్కడా శాంతి దొరకదనీ, తెలియచెయ్యాలి. ఒర్మీకి సహనానికి ఆకారమైన స్త్రీ హృదయం తో మంచి కోసమే ఎదురు చూడాలి నువ్వు."
"అక్కయ్యా!"
"నిన్ను ఒదార్చటానికే కేవలం ఈ మాటలు చెప్పటం లేదు, సుశీ! నీ బాధ అర్ధం చేసుకుని హృదయ పూర్వకంగా ఈ సలహా ఇస్తున్నాను. నీ పరిస్థితిలో చిక్కుకుంటే నేనూ అదే చేస్తాను. నువ్వు ఎప్పుడూ ధైర్యం కోల్పోకు. సాధ్యమైనంత ఎక్కువ కాలం నీ భర్త దగ్గరే గడుపు. అతన్ని ఎందుకు మార్చుకోలేననే పట్టుదలతో ప్రయత్నిస్తే నీకేదీ అసాధ్యం కాదు. పౌరుషాలకీ, పంతాలకీ మించిపోయిన పరిస్థితి నీది. అతన్ని సుఖపెట్టి నువ్వు సుఖ పడాలి అన్నది ఒక్కటే నీ ధ్యేయం." పార్వతి కళ్ళు చెమర్చుతుంటే చటుక్కున తుడుచుకుంది.
భారం తీరిన గుండెలతో , కాంతు లీనే చూపులతో చిత్తరువులా కూర్చుంది సుశీల.
"వస్తాను , సుశీ! చాలా పొద్దు పోయింది. ఇంటి దగ్గర చంటి పిల్లవాడు . వస్తానమ్మా!" అంటూ లేచిన లేవటమే మరేమీ వినిపించుకోకుండా వెళ్ళిపోయింది పార్వతి.
సుశీల రఘుపతి ని గురించి చెప్పుతుంటే పార్వతి అంతరంగం భరించలేని క్షోభతో ఎంత అల్లకల్లోల,మైందో సుశీల కేం తెలుసు?
"కూతురు పుడితే పార్వతి పేరు పెడతానన్నావ్. మరి కొడుకుని కన్నావెం?" అంటూ చెల్లెలితో హాస్య మాడాడు సూర్యం.
"బావుంది. పుడితే పెట్టుకుందామనుకున్నాను. నేనేం దేవుడ్నా ఏమిటి?" మూతి మూడు వంకర్లు తిప్పింది రుక్మిణి.
"అబ్బ! ఊరుకోండర్రా మీ వాదాలూ మీరూనూ" అంటూ విసుక్కొంది పార్వతి.
మూడు నెలల బాబిగాడు ఊ ఊ కొడుతూ దీపాల వెలుగు చూసి కేరుతూ పండులా ఆడుకొంటున్నాడు. వాడికి తగ్గ పేరే కుదరలేదు. పృద్వీ ;లో ఉన్న పేర్లేవీ పనికి రాదంటుంది వాళ్ళమ్మ.
"అక్కయ్యా, దీని మాటలు నిజమనుకున్నాం గానీ దీనికి కూతురు పుట్టినా నీపేరు పెట్టదే! తీరా ఇంతవరకూ రానిచ్చి 'పార్వతీ' పేరేమిటి? చెత్త-- అనేదే సుమీ!"
"ఒరేయ్! నువ్వు నన్నెందుకలా అడి పోసుకుంటావు? నా కిష్టమైతే పెట్టుకుంటాను; లేకపోతె లేదు. అదేం రూలా ఏమిటి? ఈ కాలంలో అంత పాత పెర్లేవరు పెట్టుకుంటున్నారసలు?"
పార్వతి మనస్సు చివుక్కుమంది. ప్రశాంతంగానే అంది. 'అర్ధం లేకుండా పోట్లాడు కుంటున్నారర్రా మీరు. మీరు పెడతా నన్నా నా పేరు పెట్టనివ్వను. ఇంతోటి అదృష్ట వంతురాలి పేరూ ఆ పసి వాళ్ళకి కూడా అంట గట్టాలా? ఈ ఆనవాయితీ వస్తే వాళ్ళు మాత్రం సుఖపడతారు?"
పార్వతి అంత సౌమ్యంగా మాట్లాడినా ఆ మాటల్లో దాగి వున్న నిష్టూరం ఇద్దరికీ అర్ధమైంది. రుక్మిణి పిల్లాడి దగ్గరికి వెళ్ళుతున్న నెపం మీద లేచిపోయింది . సూర్యం ఏదో పుస్తకం తెరుచుకుని దీక్షగా చదవటంలో మునిగి పోయాడు.
వాతావరణం బొత్తిగా అంతఉదాసీనం కావటం నచ్చలేదు పార్వతికి. చిన్నవాళ్ళేదో హస్యాలాడుకున్నదానికి తను పట్టించుకుని బాధపడటం అవివేకం అనిపించింది. "నేనేం సుఖపడ్డాను?" అని తను దేప్పేసరికి పాపం వాళ్ళిద్దరూ చిన్న బుచ్చుకున్నారు. పెద్దదానికి తనకే లేని వివేకం వాళ్ళ కెక్కడిది? తోడబుట్టిన వాళ్ళిద్దరి మీదా అభిమానం ముంచుకు వచ్చింది.
"రుక్కూ! వాణ్ణి కాస్సేపిలా ఇవ్వవే. ఎత్తుకుంటాను"అంది ఉల్లాసంగా గొంతు మార్చుకుని.
"పాలు తాగుతున్నాడక్కయ్యా!"
రుక్మిణి పిల్లాడికి పాలిస్తుంటే పార్వతి కేమిటో సిగ్గు వేస్తుంది. ఏదో పనిలో మునిగిపోయినట్టూ ఆ పరిసరాల కైనా వెళ్ళకుండా దూరం దూరంగా తచ్చాడు తుంది. రుక్కుకు మాత్రం అలాంటి సిగ్గేమీ ఉన్నట్టు లేదు. తనతో మాట్లాడుతూనే కొంగు అడ్డం పెట్టుకుని పాలిస్తూ కూర్చుంటుంది. ఎంతైనా రుక్కు పెద్దదానిలాగా మారిపోయింది.
"తాగేశాడే , రుక్కూ?" మళ్ళా అడిగింది పార్వతి.
"నిద్రపోతున్నాడక్కయ్యా! పడుకో బెట్టాను."
"నా కిమ్మన్నాను కదే?" నిష్టూరం తెలిసేలాగే అంది.
"పాలు తాగేసరికి కళ్ళు మూతలు పడిపోయాయి వాడికి. అయినా ఇప్పుడే ఎత్తుకు తిప్పితే పాలన్నీ కక్కేసు కుంటాడక్కయ్యా!"
ఉయ్యాల దగ్గరికి వెళ్ళబోయిన పార్వతి ఆగిపోయింది. సరేలే! పడుకోనియ్యి" అంటూ మళ్ళా కుంపటి దగ్గర కూర్చుంది.
తెల్లగా, పెద్ద పెద్ద కళ్ళతో, ఒత్తు జుత్తుతో బొద్దుగా ఉండే బాబుని ఎత్తుకు తిప్పుతుంటే పార్వతి కేమిటో శరీరం పులకరించినట్టు ఉంటుంది. గుప్పెళ్ళు గాలిలోకి విసురుతూ కాళ్ళు కొట్టుకుంటూ బోసిబోసిగా నవ్వుతూ, అంతలోనే ఏడ్చేసే వాణ్ణి చూస్తుంటే వాడు శాశ్వతంగా తనకు కావాలనిపిస్తుంది. ఉయ్యాల్లో నిశ్చింతగా నిద్రపోతున్న వాణ్ణి ఘడియ ఘడియకూ వెళ్ళి చూస్తూ వాడెప్పుడూ లేస్తాడా అన్నట్టు కాచుక్కుర్చుంది పార్వతి. వాడు నిద్రలోనే నవ్వుతూ కమ్మటి కలలు కంటూ గంటకు పైగానే పడుకున్నాడు. ఉన్నట్టుండి ఉలిక్కిపడి లేచి కెవ్వుమని గుక్క పట్టాడు.
నుదురు తలుపుకి కొట్టుకున్నా లెక్క చెయ్యకుండా పరుగెత్తింది పార్వతి. పిల్లవాణ్ణి అందుకుంది. రుక్మిణి కూడా కంగారుగా పరుగెత్తుకు వచ్చింది. "ఇలా ఇవ్వక్కయ్యా!"
"ఫర్వాలేదే! నేనూరు కొబెడతాను" అంటూ వాణ్ణి పొత్తిళ్ళ లో వేసుకుని, "ఊరుకోరా బాబూ! ఊరుకోరా! ఏం? ఎందుకురా గుక్క పట్టావు? నిన్నెవరేమన్నారు?" అంటూ సముదాయించటం ప్రారంభించింది. వాడి రాగం తగ్గలేదు. సరిగదా శ్రుతుల వారీగా హెచ్చసాగింది. రుక్మిణి ఉండబట్టలేక , "వాడలా ఊరుకోడక్కయ్యా! ఇందాక కడుపు నిండకుండానే నిద్రలో పడ్డాడు. అకలు వేస్తోన్నట్టుంది. ఇలా ఇచ్చేయ్! ఒక్కసారి అడ్డం వేసుకుంటాను." అంటూనే కొడుకుని అందుకుని కొంగు అడ్డం పెట్టుకుని పాలిస్తూ కూర్చుంది. వాడి ఏడుపంతా ఏమైందో కిమ్మన కుండా తల్లి గుండెల్లో దూరాడు. పార్వతి ఎంతో అవమానపడి పోయినదాని లాగ భిన్నురాలై పోయింది. అవును, వాణ్ణి ఎత్తుకునే అర్హత తనకేక్కడుంది? వాణ్ణి ఊరడించటానికి తన దగ్గర ఏముంది? ఉత్త మాటలతోనే కడుపు మంట చల్లారుతుందా? తల్లి కాలేని తనకు బిడ్డలా మీద మమకారం మాత్రం దేనికి?
అందరి భోజనాలు ముగిశాక వంటిల్లు సర్దుకుని బయటికి వచ్చింది పార్వతి. కిలారు మని నవ్వుతూ , కాళ్ళూ చేతులు ఆడిస్తూ దీపం కేసి చూస్తున్న పసివాణ్ణి చూస్తె మళ్ళా ఆశ రేగింది పార్వతి లో.
"రుక్కూ! ఈ రాత్రి కాస్సేపు వీణ్ణి నా పక్కలో పడుకోబెట్టుకుంటానే!"
"వాడేడిస్తే నీకు గమ్మున మెలుకువ వస్తుందా?"
"ఎందుకు రాదు? నేనంత మొద్దు నిద్ర పోతానా ఏమిటి? పోనీ, వాడెడుస్తుంటే నువ్వు లేస్తావుగా?"
"ఏమో? దూరంగా పడుకుంటే నాకు కూడా మెలుకువ రాదేమో? అయినా బొత్తిగా పసివాడు! నీకు అలవాటు లేక ఏ కాలో చెయ్యో వాడి మీద వేసేస్తే?" నవ్వుతూనే అంది రుక్మిణి. పార్వతి మళ్ళా మాట్లాడలేదు. పక్క సర్దుకుని తల క్రింద చెయ్యి పెట్టుకుని నిశ్శబ్దంగా పడుకుంది.
* * * *
