మొదటి జీతం తెచ్చాడు సూర్యం. "నీకే మైనా కొందామనుకున్నానే , అక్కయ్యా! ఏం కొనాలో బొత్తిగా తోచలేదు. ఎంతటెంతట డబ్బు నీకిచ్చేద్దామా అని వచ్చేశాను"అంటూ నోట్లన్నీ పార్వతి చేతిలో పెట్టి బుద్దిగా నించున్నాడు.
పార్వతి నవ్వింది. "నాకేమైనా కావాలంటే నేనే నీతో చెప్తాలే. నీ ఖర్చుల కిది దగ్గర ఉంచుకో" అంటూ పది రూపాయల నోటు అందించింది.
"పది రూపాయలే! నాకే! అమ్మో!' మహా ప్రసాదం లా దోసిలి పట్టి అందుకున్నాడా నోటును. "అచ్చంగా ఇచ్చేశావు కదూ? మళ్ళా అడగవు కదూ?"
"చాల్లేరా! నీ అమాయకత్వం నువ్వూను."
"అయితే మూడు రోజులకో రూపాయి నాకిష్టం వచ్చినట్టూ చేడామడా ఖర్చు పెట్టేసుకో వచ్చన్నమాట!"
"చిన్న సవరణ, సిగరెట్ల కి, కిళ్ళీ లకీ....."
"నిషిద్దమా?"
"అన్నమాటే."
"పోనీ, సినిమాలకి?"
"ఓ రెండు సినిమాలకి నేనిస్తూ వుంటాను నెలకి."
"అన్యాయం! అమానుషం! దురంతం! రెండు రోజులకో పిక్చరు రిలీజౌతున్న ఈ రోజుల్లో రెండు వారాల కొకటి చూడమంటావా?"
"ఎంత అరిచి గీ పెట్టినా ప్రయోజనం లేదురా, తమ్ముడూ! ఇక మాట్లాడకు."
"దారుణం! నేను చెమటోడ్చి కష్టించి సంపాదించుకున్నానే!"
"అందుకే తగిన ఖర్చు చెయ్యాలంటున్నాను! కావాలంటే మరో సినిమాకి నీ ఖర్చులో పెట్టుకో."
"అంతేనా?"
"అంతేరా."
"ఆశ లేదా ?"
"లేనేలేదు."
"ఆ...క్క...య్యా!"
కుదురుగా కుర్చీ చూసుకుని కూలబడి పోయాడు సూర్యం.
రెండో నెల పది రూపాయల నోటు అందుకోలేదు. "నీకేం తెలుసక్కయ్యా? ఉద్యోగం కూడా చేస్తున్నావు; టీ నీళ్ళయినా ఇప్పించలేవట్రా? అంటూ నన్నెన్ని రాబందులు పీక్కు తింటున్నాయో నీకు తెలీదు. హోటళ్ళ కే ఏడెనిమిది రూపాయలు పోతోంటే ఇక నేనెలా బ్రతకనేమిటి?" అంటూ రాగం తీశాడు.
పార్వతి వాదం పెంచకుండా మరో ఐదు రూపాయల నోటు అందించింది. "సూర్యం! బాధ్యతలూ తెలుసుకొంటూ ప్రవర్తిస్తే ఎంత డబ్బు ఖర్చు చేసుకున్నా నా అభ్యంతరం లేదు. ఆఫీసులో పని చేస్తూ మగవాళ్ళ మధ్య మసులుతోన్న నాకు ఏం రీతి రివాజులు తెలీవనుకోకు. కొన్ని నెలలు పొతే రుక్కుని పురిటికి తీసుకురావాలి. మనకు కలిగిందేదో ఇచ్చి పంపించాలి. అందుకోసమే నేను మరీ జాగ్రత్త పడుతున్నాను. నువ్వు అర్ధం చేసుకుంటే చాలు."
"నాకసలేమీ ఇవ్వద్దు లే. ఎందుకూ పాఠాలన్నీ చెప్తావ్?' అంటూ చేతిలో నోట్లు బల్ల మీద పెట్టేసి బిగాదీసుకూర్చున్నాడు సూర్యం.
"అయితే నీకక్కర్లేదన్న మాట . సరే! ఏం చేస్తాను? నేనో చీరన్నా కొనుక్కుంటాను."
పార్వతి వాటిని తీసుకునే లోపునే అందుకుని జేబులో పడేసుకుని నవ్వేశాడు సూర్యం.
* * * *
"రఘూ!"
ఆప్రయట్నంగా పిలిచేందే గాని అవునో కాదో అన్నట్టు అనుమానంగా చూస్తూ నిలబడిపోయింది పార్వతి. వెళ్ళుతున్నవాడల్లా ఆగి వెనక్కు చూశాడు. రఘుపతే! తన కళ్ళను తనే నమ్మలేక పోయాడు . ఎవరూ? పార్వతి! పార్వతి కూడా అంతగానూ విస్తుబోయింది. చేతిలో కారియర్ చెట్టు కింద పెట్టి రఘుపతి కేసి రెండడుగులు వేసింది. రఘుపతి కూడా నాలుగడుగులు వెనక్కు వచ్చాడు.
"పిలిచానే గానీ.... మళ్ళా ఎవరో నని తటపటాయిస్తున్నాను" అంది పార్వతి రఘూ మొహం కేసి చూస్తూ.
రఘుపతి అప్పటికి కాస్త తేరుకోగలిగాడు. "బావున్నావా పార్వతి?" అనగలిగాడు ప్రయత్నం మీద.
"బాగానే ఉన్నాను. మా రుక్మిణి నాలుగు రోజుల క్రిందట ప్రసవించింది. అఫీసుకి సెలవు పెట్టి ఆస్పత్రికి కారియర్ తీసుకొచ్చాను."
"రుక్మిణి అప్పుడే తల్లి అయిందా?" ఏం పాప?"
"చెప్పనే లేదు కదూ? మగపిల్లాడు పుట్టాడు. తండ్రి లాగ తెల్లగా అందంగా ఉన్నాడులే. పోనీ, చూసి వేల్దువు , రాకూడదూ?"
"తర్వాత చూస్తాలే, పార్వతీ!"
"అన్నట్టు నువ్వేం పని మీద వచ్చావిక్కడికి?" పార్వతి రఘూ కళ్ళలోకి గుచ్చి చూసింది . అవి బొత్తిగా కాంతి హీనంగా కనిపించాయి.
"సుశీల ....ఇక్కడే ఉంది. చూసి వెళ్తున్నాను." పొడిపొడి గా అన్నాడు రఘు.
ముందు కాస్త తెల్లబోయింది పార్వతి. "ఎవరూ? సుశీలా? అంటే.....నీ భార్య కదూ?" ఆదుర్దాగా అడిగింది. "ఈ ఆస్పత్రి లోనే ఉందా? ఏం?" ఏం జబ్బు చేసింది?"
"నాకంత బాగా తెలీదు. ఏదో కొంచెం సుస్తీ చేసింది."
ఆశ్చర్యంగా చూసింది పార్వతి. భార్యకు వచ్చిన జబ్బేమిటో భర్తకు తెలీకపోవటం ఏమిటి? రఘూ మాటల్ని బట్టి చూస్తె అతను దేన్నీ పట్టించుకొనట్టు కనిపిస్తుంది. మనిషి బాగా మారినట్టున్నాడు. పచ్చని శరీరంతో, సిల్కు బట్టలతో ఆడపిల్లలాగా నాజూగ్గా ధనవంతుల బిద్దలాగే కనిపించే రఘుపతి అతి సామాన్యమైన గుడ్డలతో కాంతి లేని చూపులతో ఏదో అర్ధం కాని ఉదాసీనతతో విరాగి లాగ ఉన్నాడు.
"కాస్సేపలా చెట్టు కింద నిలబడదాం. వస్తావా?" అంది. మౌనంగా అనుసరించాడు రఘుపతి.
.jpg)
"అయితే మీ అత్తవారి ఊరు ఇదేనన్న మాట? నాకు తెలీనే తెలీదే! ఎప్పుడైనా సుశీలని చూడటానికి వెళ్ళేదాన్ని."
"నీకు బదిలీ అయిందని విన్నాను గాని, ఇక్కడ ఉంటున్నట్టు నాకూ తెలీలేదు. అప్పుడప్పుడూ ఈ వూరు వస్తూనే ఉన్నాను."
"పోనీ, ఇప్పటికిలా అనుకోకుండా కలిశాం." కాస్సేపు ఊరుకుని అడిగింది పార్వతి : "నీకేమైనా పిల్లలా, రఘూ?"
"ఊహూ!" రఘు తల అడ్డంగా తిప్పాడు.
"సూర్యం ఏం చేస్తున్నాడు?"
"బి.ఏ. పాసయ్యాడుగా? ఐదారు నెలల నుంచీ క్లర్కు గా పని చేస్తున్నాడు ఈ ఊళ్ళోనే."
"బావుంది. మీ యిద్దరికీ ఒక్క ఊళ్ళోనే...."
మళ్ళా ఇద్దరి మధ్యా మాటలు జరగలేదు కొంతసేపు. రఘుపతి తనకై తను కల్పించుకుని మాట్లాడటం లేదు. అడిగినదాని కేదో చెప్పేసి ముభావంగా ఊరుకుంటున్నాడు. ఉన్నట్టుండి అంది పార్వతి. "పద్మజ సంగతి నీకు తెలిసిందా? ఓ ఆంగ్లో ఇండియన్ డాక్టర్ని పెళ్ళి చేసుకుంది . వాళ్ళింట్లో ఎవరికీ ఇష్టం లేదు. అయినా ఇల్లు విడిచి వెళ్ళిపోయి...."
"చాలా మంచి పని చేసింది."
విస్మయంగా చూసింది పార్వతి . "అసలు నీకెప్పుడు తెలిసింది."
"పెళ్ళి జరిగినప్పుడే పేపరులో పద్మజ ఫోటో నేనూ చూశాను. సంతోషించాను."
"అదేమిటి, రఘూ! పద్మజ చేసిన పని నీకు నచ్చినట్టుందే!"
"ఎంతో నచ్చింది, పార్వతీ! జీవితం విలువ పద్మజ బాగా తెలుసుకుంది. మనిషికి కావలసినదేమిటో -- అక్కడే జాగ్రత్త పడింది. మొదటి నుంచీ పద్మజ తెలివైనదే!"
"రఘుబాబు పిరికివాడు, పారూ!" అనే పద్మజ మాటలు చటుక్కున గుర్తువచ్చాయి . రఘూ జరిగినదానికి బాధ పడుతున్నాడా? తనను తను విమర్శించుకొంటున్నాడా? మరి పద్మజ ను సమర్ధిస్తూన్నాడంటే అర్ధం?
రఘు మొహం కేసి చూసింది పార్వతి. తనకేసి చూస్తూన్న రఘు నెమ్మదిగా చూపులు తిప్పుకుని లేచాడు.
"వెళ్తాను, పార్వతీ! నాకు బస్సు వేళవుతుంది."
"ఇంటికి వెళ్ళిపోతావా? సుశీలకి సుస్తీ తగ్గేదాకా ఉండవూ?"
"నేనెందుకూ ? వాళ్ళ పుట్టింటి వాళ్ళు చాలామంది ఉన్నారు."
"అయితే మాత్రం? నువ్వు ఉంటె...."
"ఫర్వాలేదు. మళ్ళా వచ్చి చూస్తాను. వస్తూనే ఉంటానుగా?"
"సాయంత్రం నే వెళ్ళి చూస్తాను. ఏవార్డులో ఉంది?"
"స్పెషల్ వార్డు లో నాలుగవ నెంబరు గది. మరి నేను వెళ్తాను."
చూస్తుండగానే రఘుపతి దూరంగా వెళ్ళిపోయాడు. రఘు కనిపించి, మాట్లాడి వెళ్ళిపోవటం అప్పుడే అయి పోయిందా? అనుకోకుండా రఘూ కనిపిస్తే మాట్లాడటానికి మాటలే దొరకలేదు. తన గురించి చెప్పనూ లేదు. పార్వతి విషయాలేమీ అడగనూ లేదు. సర్వసామాన్యంగా ఎవరో దారే పోతూ పలకరించుకొన్నట్టు జరిగింది సంభాషణ. 'అయ్యో! ఒక్కసారి ఇంటికైనా రమ్మన్నాను కాదు. ఏదీ? తోచి చస్తేనా? అంతలో వెళ్ళనే వెళ్ళిపోయాడు!" కారియర్ అందుకుని గేటు దాటింది పార్వతి, ఆలోచిస్తూ. రఘూ ఎందుకంత దిగులుగా ఉన్నాడు?"
* * * *
తెల్లని దుప్పట్ల లో బల్లిలా అంటుకు పడుకున్న సుశీల అసలు మంచం మీద ఉన్నట్టే కనిపించలేదు పార్వతికి. బాగా దగ్గరికి వెళ్ళి ,మీదికి వంగి నెమ్మదిగా పలకరించింది. "సుశీలా!" రెండు మూడు పిలుపులకు కళ్ళు తెరిచి చూసింది సుశీల. అతి నీరసంగా ఆ కళ్ళలో కాంతి బొత్తిగా ఎలా హరించి పోయిందో అర్ధం కాలేదు. అసలే సన్నగా తమల పాకు ఈనేలా ఉండే సుశీల, పూర్తిగా శల్యమై పోయిందంటే అతిశయోక్తి కాదు. ఆ స్థితిలో ఒక్కసారిగా సుశీలను చూస్తె పార్వతి హృదయం ద్రవించి పోయినట్టయింది. నెమ్మదిగా చేయి పట్టుకుని మళ్ళా పిలిచింది; "సుశీలా? నేను...."
"మీరు.....మీరు...."
"అవును . నేనే , సుశీలా! పార్వతిని. పెళ్ళిలో నువ్వు అత్తవారింటికి కొచ్చినప్పుడు...."
"వెండి కుంకం భరిణె నా చేతిలో పెట్టారు..... పార్వతి కదూ?" సంతోషంగా చూసింది సుశీల.
పార్వతి జాలిగా నవ్వుతూ , "ఎంత జ్ఞాపకం నీకు! అక్కయ్యని మరిచిపోలేదు కదూ?" అంది.
"లేదక్కయ్యా! మరిచి పోలేదు." సుశీల మొహం నిండా విషాదం అలుముకుంది. "మళ్ళా ఇన్నాళ్ళ కి చూశాను. మీరు ఆ వూరు నుంచి వెళ్ళిపోయారు కదూ?"
"ఎక్కడికో పోలేదు, సుశీలా! ఇక్కడే పని చేస్తున్నాను. మీ పుట్టింటి వారిక్కడ ఉన్నారని నాకు తేలీనే లేదు . నిన్న రఘుపతి కనిపిస్తే.... అసలు నీకేమిటి జబ్బు?" ముందు ఆరోగ్యం సంగతి అడక్కుండా మిగతా విషయాలన్నీ మాట్లాడటం తనకే ఎబ్బెట్టుగా తోచి ప్రసక్తి మార్చింది పార్వతి.
