స్టెల్లా ఆ మాటలు వినగానే అప్రయత్నంగా "యస్" అంది.
"థాంక్స్" అని క్రెడిల్ చేశాడతను.
తనూ క్రెడిల్ చేసి థాంక్స్ చెప్పింది హెడ్ క్లర్క్ కి.
"ఫోన్ ఎక్కడ నుంచి?" అడిగాడు హెచ్.సి.
వెళ్ళబోతున్న స్టెల్లా స్టయిల్ గా తిరిగి చూసి "పర్సనల్" అంది. ఆ క్షణంలో ఆమె ముఖంలో కొంటెతనం పరవళ్ళు తొక్కింది.
హెడ్ క్లర్క్ ముఖం మాడిపోయింది. అది చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది స్టెల్లా! విషయం విన్న నంద ఉత్సాహం చూపింది!
"అయితే అమ్మాయిగారు పెళ్ళిచూపులకి తయారవుతున్నారన్నమాట కంగ్రాట్స్!" అంది కులాసాగా నవ్వుతూ.
ఒక్కక్షణం స్టెల్లా ముఖంలో మబ్బులు తారట్లాడాయి.
"ఇది ఎన్నో ట్రయలో! కుదరాలిగా!" అంది నిర్వేదంగా.
"కుదురుతుందిలే!" వెళ్ళి ఫ్రెష్ గా తయారుగా!"
టాయ్ లెట్ రూంలో దూరింది స్టెల్లా!
మరో అయిదు నిముషాలకి నీట్ గా తయారై వచ్చింది.
నందకూడా టాయ్ లెట్ అయింది.
"పద"
"గడియారం ఒంటిగంట కొడుతూ వుండగా ఇద్దరూ లేచారు.
"కాంటీన్ కు వెళదామా?"
"వద్దు! ఆడమ్స్ కే వెళదాం!"
"ఎందుకు?"
"అక్కడ ఫామిలీరూంకి వెళ్ళవచ్చు! ఇక్కడంతా వెధవలు చేరతారు!"
"సరేలే! అన్నట్టు అబ్బాయి ఏం చేస్తున్నట్టు-"
"లెక్చరర్ అట! గవర్నమెంట్ కాలేజీలో-"
"ఇక్కడేనా?"
"అవును ఈ మధ్యే వచ్చాడట."
"లక్కీగర్ల్!"
ఇద్దరూ గేటు వద్దకి వచ్చారు.
సరిగ్గా ఆ సమయానికి వో వ్యక్తి వచ్చి గేటు ముందు నుంచున్నాడు. అతన్ని చూసి గుర్తించిన నంద ఆశ్చర్య పోయింది.
అతనే ముందుగా పలకరించాడు "యు ఆర్ స్టెల్లా!"
"యస్! అయామ్ స్టెల్లా! దిసీజ్ మై ఫ్రెండ్ నంద!"
తల తిప్పి ఎగాదిగా చూశాడు!
"మీరు..."
నవ్వింది నంద.
"కరెక్ట్" మీరు ఊహించింది- నేను నందని. ఆనంద లక్ష్మిని- నారాయణ కూతుర్ని-" నంద గొంతు ఖంగున మ్రోగింది.
ఆ మాటలు విని కొద్దిగా కంగారు పడ్డాడతను.
స్టెల్లా చిత్రంగా చూసింది ఇద్దరివైపూ.
"ఇప్పుడు చెప్పానే! నా తొలి చూపుల పెళ్ళికొడుకు ఇతనే!" నవ్వుతూ అంది నంద.
స్టెల్లా ముఖంలో ఏదో భావాలు తారట్లాడాయి.
"పదండీ! వెళదాం!" అన్నాడతను.
"నంద ఏ భావం ప్రకటించలేదు."
స్టెల్లా కదిలింది.
వెళ్ళి హోటల్ లో కూర్చున్నారు.
"మీరొక్కరే వస్తారనుకున్నాను!" అన్నాడు విష్ణు వర్ధన్.
"సారీ! మా ఆఫీసులో ఆడ పురుగులం మేమిద్దరమే! ఎవరికీ వాళ్ళం విడివిడిగా వుంటున్నా ప్రతిదానికి జంటగా వెళతాం! ఒకవేళ నేను నచ్చకపోతే ఈమె నయినా-" జాలీగా అంది స్టెల్లా.
"సారీ!" అంది నంద.
నంద ముఖం చూసి "అయాం సారీ!" అంది స్టెల్లా-
ఆ మాటలకి సిగ్గుపడ్డాడు విష్ణువర్ధన్. తన స్థితికి తనే కొరకుదన్నట్టుగా అయ్యాడు- "ఏం తీసుకుంటారు?" కొద్ది క్షణాలాగి అన్నాడతను.
"లైట్ గా ఏదయినా సరే!"
"సారీ నాకు టీ చాలు!" అంది నంద.
"ముఖమాట పడొద్దే- బిల్లు నేనే ఇవ్వాలిలే! అంది స్టెల్లా నవ్వుతూ.
"అదేమిటి? మీ రెందుకివ్వాలి బిల్లు?"
"మీరు పెళ్ళిచూపులకి వచ్చారు. బిల్లు నేనే ఇవ్వాలి.
"నో-టీకి నేను ఇన్ వైట్ చేశాను" అని అతను మూడు స్వీట్స్, మూడు సింగల్ పూరీ, మూడు టీ ఆర్డ్ రిచ్చాడు.
మూడు నిముషాలు నిశ్శబ్దంగా గడిచాయి.
"ఈ అమ్మాయి బాగానే వుంది!"
కానీ నందతో వచ్చింది.
తన గురించి ఏం చెబుతుందో?
ఈ అమ్మాయి మనసు పాడు చేయకుండా నందని హార్ట్ చేయాలి" ఇదీ విష్ణు ఆలోచన!
"ఇతను నంద పెళ్ళి చూపులకి వెళ్ళాడంటే ఇతను హిందూ అయివుండాలి. తను కన్వర్టెడ్ క్రిష్టియన్! తనని చూడటానికి ఎలా వచ్చాడో!
ఇతనికి సుమారు ముఫ్ఫై యేళ్ళున్నాయి.
ఈ సోడాబుడ్డీ కళ్ళద్దాలు గద్దముక్కు తీసేస్తే అందగాడి కిందే లెక్క ధనవంతుడిలానే ఉన్నాడు. ఇన్నేళ్ళు ఎందుకు పెళ్ళి చేసుకోలేదో!" ఇదే స్టెల్లా మదిలో మెదిలిన ఊహ.
"నన్ను గురించి ఏమనుకుంటున్నాడు. తనకి పెళ్ళికాలేదంటే దానికి ఎన్నో కారణాలు! ఇతనెందుకు పెళ్ళి చేసుకోలేదో! ఆ రోజు పాతికవేల కట్నం అడిగాడు. ఆరేళ్ళు గడిచాయి! రేటు పెంచాడో! అసలు స్టెల్లా డవురీ ఇవ్వదుగా!" ఇదీ నంద వూహా పరంపర.
ఎవరి ఊహల్లో వాళ్ళున్నారు.
అంతలో స్వీట్ వచ్చింది.
"తీసుకోండి!" ఇద్దరికీ ఆఫర్ చేశాడతను.
నంద ఎంబ్రాసింగ్ గా చూసింది.
"తీసుకో" అంది స్టెల్లా.
"మీరింకా పెళ్ళి చేసుకోలేదా?" నందని అడిగాడతను.
"మీలాటి కట్నాలని ఆశించే యువకులున్నన్నాళ్ళూ నాలాటి అమ్మాయిలకి పెళ్ళికలలో సంఘటననే!" నవ్వుతూ అంది నంద.
"మీకు డవురీ కావాలా?"
స్టెల్లా ప్రశ్నకి "అఫ్ కోర్స్! నే డిమాండ్ చేయను. ఇస్తే కాదన్ను!" అన్నాడు ఇబ్బందిగా ఫీలవుతూ.
నవ్వింది నంద.
ఆ నవ్వుకి వేయి అర్ధాలు స్ఫురించాయతనికి.
"మీ అత్తగారు ఎక్కడున్నారు?"
"ఇతను తనని ఇన్ సల్ట్ చేయాలని అనుకున్నట్టుంది." ఆ వూహకి నవ్వుకుని, అతని మాటల్ని తేలిగ్గా తీసుకుని ఆమె ఇప్పుడు విజయవాడ వద్ద వో పల్లెలో వుంది. అతను చనిపోయాడు! ఇక్కడికి వచ్చేస్తానని ఈ రోజే ఉత్తరం రాసింది. రమ్మని రాయాలనుకున్నాను!" అంది.
