Previous Page Next Page 
స్త్రీ పేజి 30

 

    ఓ గంట నుంచీ అలా వరండా మీదే కూర్చుని ఉంది పార్వతీ. నౌకరు కుర్రాడోకడు బయటికి వస్తే, "ఎవరో వచ్చారని ఒక్కసారి అయ్యగారికి చెప్తావూ?' అంటూ ప్రాధేయపూర్వకంగా అడిగింది. అలాగేనని తల తాటించి పోయినవాడు అరగంటైనా అయిపు లేడు. వరండా దగ్గరి నుంచి గేటు వరకూ పాకిన లాన్ దుబ్బుల్ని , క్రోటన్స్ మొక్కల్నీ మార్చి మార్చి చూస్తూ కూర్చుంది నిశ్శబ్దంగా.
    తను వచ్చిన పని అవుతుందో? లేదో?
    ఒకవేళ ఇలా అడగటానికి రావటం తప్పేమో? తీరా చెప్తే అయ్యగారేమంటారో? ఆందోళనతో అన్యమనస్కరంగా కూర్చున్న పార్వతి కెవ్వుమని కేకపెడుతూ వరండా కిందికి పరిగెత్తింది. ఒక్క ఉరుకులోనే మెట్లన్నీ దూకి అమాంతంగా మీదపడి చీర కొంగు పట్టి నిలేసిన సింహం లాంటి ఆ అల్శేషియన్ కుక్కను చూస్తూ భయంతో బిగుసుకుపోయింది. జానెడు పొడుగున నాలుక వ్రేల్లాడేసుకుని వగర్చుకుంటూ, కళ్ళు రెండు చింత నిప్పుల్లా మెరిపించుకుంటూ గుమ్మం లో సగం ఎత్తున నిలబడి తనకేసి అది గుర్రుగా చూసినప్పుడు పార్వతి కదలకుండా కూర్చుని వుంటే బావుండి పోయేది.
    పులి పంజా లో చిక్కుకున్న లేడి పిల్లలాగే భయంతో విలవిల్లాడి పోయింది పార్వతి.
    "రాజా!" కటువుగా పిలిపించిందో మగ కంఠం . "ఫో లోపలికి." అంత కటువుగాను శాసించింది. సగం నమిలిన చీర కొంగు వదిలి పెట్టి తోకాడించుకుంటూ వరండా ఎక్కింది రాజా!
    అయ్యగార్ని చూస్తూ సిగ్గుతో చితికి పోయింది పార్వతి. "ఎవరూ? పార్వతా? ఏమమ్మా ఇలా వచ్చావు?" ఆశ్చర్యంగా చూశాడు ఆఫీసరు.
    అంతవరకూ నమస్కారమైనా పెట్టకుండా నించున్న పార్వతి వినయంగా చేతులు జోడించింది.
    "రా, అమ్మా, లోపలికి . అయ్యో! ఎంత సేపైంది వచ్చి?' సాదరంగా ఆహ్వానిస్తున్న అయ్యగార్ని చూస్తూ తేరుకోగలిగిన పార్వతి గతం తవ్వుకోవటమెందుకన్నట్టు--
    "ఇప్పుడే నండీ!" అంది పొడిగా.
    దగ్గరికొచ్చి పాదాల దగ్గర పడుకోబోయిన రాజా -- "పో లోపలికి" అంటూ మరోసారి యజమాని హెచ్చరించటంతో తల వాల్చుకుని పిల్లి పిల్లలా గుమ్మం దాటి వెళ్ళిపోయింది.
    ధైర్యంగా కూర్చుంది పార్వతి. ఎలా ప్రారంభించాలో తెలీక. నేల చూపులు చూస్తూ కూర్చుంది.
    "సెలవేమైనా కావాలా, అమ్మాయ్?"
    "అబ్బే! లేదండీ! అదేం కాదు."
    'చెప్పమ్మా! ఏం ఫర్వాలేదు."
    ఒక్క క్షణం ఊరుకొంది. ధైర్యం తెచ్చుకోక తప్పలేదు. కాస్త జంకుగానే ప్రారంభించింది. "మా తమ్ముడోకడు బి.ఎ. పాసై ఖాళీగా ఉన్నాడండీ! కొంచెం వాడి సంగతి తమతో మాట్లాడుదామని...."
    "ఊ" ఊకొట్టి ఊరుకున్నాడాయన . చెప్పింది చాలుతుందో లేదో, ఇంకా పొడిగించి చెప్పాలో అర్ధం కాలేదు. అప్పటికి మాత్రం బాధ్యత తీరిపోయినట్టు మళ్ళా నేల చూపులు చూస్తూ కూర్చుంది.
    "ఎన్నేళ్ళు ఉంటాయమ్మా కుర్రాడికి?"
    "ఇరవై రెండో సంవత్సరమండి! పేరు సూర్య నారాయణ. మొన్న మార్చి లోనే బి.ఎ పాసయ్యాడు. క్లాసు కూడా వచ్చిందండీ!" ఆశగా చూసింది పార్వతి.
    "మరి చదివిస్తే బావుండేదిగా, అమ్మా?" తీరా అన్నాడే గానీ ఎందుకన్నానా అన్నట్టు కనిపించాడాయన. అక్కగారు ఉద్యోగం చేసుకుంటూ తమ్ముణ్ణి చదివించి ఏదో పనిలో వేయిద్దామని తన దగ్గరికి వచ్చిందంటే ఇంకా ఆ తమ్ముడికి చదువుకునే అవకాశం ఉందనుకోవటం లో తనే తొందర పడ్డాడు.
    మౌనంగానే ఊరుకుంది పార్వతి.
    మళ్ళా ఆయనే అన్నాడు: "మన ఆఫీసులో నీకు తెలీని ఖాళీ లెం ఉన్నాయమ్మా?"
    నసుగుతూనే అంది పార్వతి; "సుందరరావు గారి సీటేదో ఖాళీ అవుతుందని...."
    "ఓ! అదా? సరే, చూద్దాం. ఓసారి అబ్బాయిని నా దగ్గరికి పంపించమ్మా!"
    "అలాగేనండి! సాయంత్రం కలుసుకోటానికి తమరికి వీలుంటుందంటారా?' అంటూ లేచింది.
    "సాయంత్రం?సరే, ఎనిమిది దాటాక వస్తే చూస్తాను."
    "నమస్కారమండీ!" మళ్ళీ చేతులు జోడించి కుక్క చొంగతో తడిసి పిడస కట్టుకుపోయిన కొంగును భుజాల మీదుగా చేతిలోకి తీసుకుని గేటు కేసి నడించింది.
    "నేను వెళ్ళి వచ్చిన పని అవుతుందనే నమ్మకంగా ఉందిరా!" అంది సూర్యం తో ఇంటికి వస్తూనే సంతోషంగా.
    సాయంత్రం ఏడు గంటల వేళ తమ్ముణ్ణి ముస్తాబు చేసి పంపుతూ మరీ మరీ చెప్పింది. "జాగ్రత్త సుమా! వాళ్ళింట్లో కుక్క వుంది. కాస్త చూసుకుంటూ వెళ్ళు."
    "ఏడ్చింది , వెధవ కుక్క! పిచ్చి పిచ్చి వేషాలేసిందో మన తడాఖా రుచి చూపిస్తాం. ఒక్క గుడ్డుతో భూమట్టం!"
    "అఘోరించావ్ లే . దాన్ని చూస్తె పై ప్రాణాలు పైనే పోతాయి. బడాయి చెయ్యకు. జాగ్రత్తగా వెళ్లిరా!"
    తమ్ముడి కోసం ఎదురు చూస్తూ పది గంటల వరకూ వీధి గుమ్మంలోనే కూర్చుంది. వచ్చిన వాడి మొహం చూస్తె ఫర్వాలేదు సంతోషంగానే కనిపించాడు . "ఏం? ఇంత ఆలస్యమైంది? కుక్క నిన్నేం చెయ్యలేదు కదూ?"
    "అది కాస్తా నేను వస్తున్నానని తెలిసి బెదిరి ఏ మూలో నక్కి వుంటుంది. నా కసలు కనిపించనే లేదు."
    "మంచిదేలే. అసలు పనేమైంది?"
    "ఇంకేమౌతుంది? కాకపోవటానికి దాని కెన్ని గుండెలు?"
    'అబ్బా!చెప్పరా, చంపక! నీ ఫోజులు నువ్వూనూ. ఆఫీసరు గారు కనిపించారా?"
    "ఎవడి కోసం కనిపిస్తాడక్కా?"
    పార్వతి కోపంగా అంది: "ఒరేయ్! వెధవ ప్రగల్బాలు పలక్కు. దయతలచి ఆయనేదో సాయం చేస్తానంటే ఏవిటా పిచ్చి వాగుడు?"
    నవ్వేశాడు సూర్యం. "ఊరికే అన్నాను లేవే! నాకు మాత్రం తెలీదేమిటి? ఇదిగో, ఓ ఉత్తరం ఇచ్చారు. రేపు మరో ఆఫీసర్ కి చూపించమన్నారు. ఇందాక క్లబ్బు లో కనిపిస్తే స్వయంగా కూడా చెప్పారట. నన్ను వెళ్ళి కలుసుకోమన్నారు."
    "అదేం> సుందరరావు గారి సీటు విషయమేం చెప్పలేదూ?"
    "సుందర్రావూ వంకాయా పులుసునూ. అదేం నాకు తెలీదు. కుక్కను కట్టేసినట్టు తెలుసుకుని ధీమాగా లోపలికి వెళ్ళాను. నేను ఫలానా అని చెప్పగానే కూర్చోబెట్టి ఈ ఉత్తరం కాస్తా వ్రాసి ఇచ్చారు. కాస్సేపు ఏవేవో కబుర్లడిగారు. మహా బుద్దిగా జావాబులు చెప్పి ఓ నమస్కారం బాణం వదిలేసి లేచి చక్కా వచ్చాను.'
    "పోనీలే . అయన దయ. ఇద్దరం ఒకే ఆఫీసులో అయితే అన్నిటికీ వీలుగా ఉంటుందనుకున్నాను. మరేం చేస్తాం? ఇదైనా దొరికితే అంతే చాలు."
    మర్నాడు కూడా అలాగే సూర్యం కోసం తహతహలాడుతూ ఎదురు చూస్తూ కూర్చున్న పార్వతి సూర్యం నవ్వు మొహం చూసి తేలిగ్గా నిట్టూర్చింది.
    "నాకు ఉద్యోగం ఇస్తానన్నారక్కా!" అన్న కబురు వింటూ సంతోషంతో మాట్లాడనే లేకపోయింది. చాలాసేపు. "అదేమిటక్కా? నీకు సంతోషంగా లేదూ?"
    "చెప్పలేనంత సంతోషం గా ఉంది సూరీ! నాకేదైనా దిసేలంటూ ఉంటె అది కూడా ఈనాటితో తీరిపోయింది. నామీద నాకే గర్వం కలుగుతోందిరా!"
    "నిజం అక్కయ్యా! నీలా గర్వపడగలిగే అదృష్టం కూడా కొద్ది మందికే . నువ్వు ఆదుకు కష్టపడి చదివించక పొతే ఈసరికి నా జీవితంలో  ముఖ్యమైన ఘట్టాలన్నీ ముగిసి వుండేవి. నీ ఋణం ఏనాటికి తీర్చుకోలేనక్కా!"
    పార్వతి తొందరపడి మాట అనేశానేమో నని నొచ్చుకుంది. తను చేసినదాన్ని తనే మెచ్చుకోవటం, తనను చూసి తనే గర్వపడటం అవివేకం కాకపొతే ఏమిటి? ఆ మాట తన నోటి నుంచే వస్తే నిజానికి తమ్ముడు బాధ పడడూ?
    "లేదు, సూరీ! నేనేదో పిచ్చిగా అనేశాను. గానీ ఇందులో గర్వపదవలసిందేమీ లేదు. నువ్వు నాకు ఋణపడి వున్నావని ఎప్పుడూ అనుకోవద్దు. నీలో ఆ భావం వుంటే నేను సహించలేను."
    "నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నిజం నిజమే, అక్కయ్యా!"
    మరి మాటలు పెంచకుండా లోపలికి వెళ్ళి పోయింది పార్వతి.

                              *    *    *    *
    పై అధికారులకు కట్టుబడి ఒళ్ళు అమ్ముకోబోతున్న తమ్ముణ్ణి చూస్తుంటే పార్వతి కేమిటో బాధ కలిగింది. ఇంకా చదివిస్తే ఎంతైనా చదివేవాడు సూరి. కాని అదెలా సాధ్యం? అందరిలా గుమస్తాగా తన తమ్ముడు ఓ గానుగెద్దు జీవితం గడుపుతాడు. తన భావం వెల్లడి కానివ్వకుండా అత్తవారింటికి పంపే ఆడపిల్లకు నీతులు బోధించినట్టు తమ్ముణ్ణి అనునయంగానే హెచ్చరించింది. "జాగ్రత్త సుమా! కొత్తలో కాస్త కష్టంగానే ఉంటుంది. చిరాకు పడకు. తొందరపడి జవాబు లివ్వకు. రాగారాగా అన్నీ నీకే తెలుస్తాయి."
    సూర్యం మాత్రం చాలాహుషారుగా ఉన్నాడు. పెళ్ళి కొడుకులా సరికొత్త బట్టలు వేసుకుని ముస్తాబయ్యాడు. అక్కగారి మాటలేవీ విన్నట్టే తోచలేదు. మొహానికి పౌడరు పట్టిస్తూ, "మొట్టమొదటి జీతంతో నీకెంత మంచి బహుమతి తెస్తానో చూడవే అక్కా!" అన్నాడు.
    పార్వతి నవ్వింది. "అంత మాటన్నావు అదే చాలు."
    "అంటే? నీ ఉద్దేశ్యం?" కయ్యానికి కాలు దువ్వుతూ లేచాడు. "నేనో కృతఘ్నుడ్నిని అనుమానిస్తున్నావా?"
    "బావుంది దెబ్బలాట! బహుమతీ అంత విలువ జేసే మాటన్నావు. అదే చాలన్నాను. తప్పయితే మరెప్పుడూ అననులే."
    "తప్పా? తప్పున్నరా? ఈసారికి క్షమించాను, ఫో!"
    కొత్తగా ఆఫీసుకు బయల్దేరుతున్న తమ్ముణ్ణి చూస్తూ నించుంది. పార్వతి. ఏడెనిమిది సంవత్సరాల గతం మనస్సులో కొట్టుకుంది. శరీరం పులకరించింది. తన సంకల్పం లో ఇంత బలం ఉందనీ, తన ఆత్మవిశ్వాసం లో ఇంత శక్తి ఉందనీ ఇప్పటికి గానీ తెలీలేదు.
    సాయంత్రం ఇంటికి వస్తూనే కుర్చీలో చేరబడి పోయి అలసటగా నిట్టూర్పులు విడవటం మొదలెట్టాడు సూర్యం. "అక్కాయ్! ఓ గ్లాసు కాఫీ చుక్కలు తీసుకు రావే! జల్దీ!"
    'అబ్బో! చాలా అలసి పోయినట్టున్నావే! ఒక్క నిమిషం తాళు , నాయనా! ఇదిగో వచ్చే!" అంటూ కాఫీ చల్లార్చింది పార్వతి.
    పొడిపొడిగా వున్న నుదుట చెమట ఒత్తుకోబోయాడు సూర్యం. కాఫీ నీళ్ళు గొంతులో ఓంపుకుని మరోసారి సుదీర్ఘంగా నిట్టూర్చాడు.
    "ఎంత కష్టం వచ్చి పడిందిరా, తండ్రీ! ఏం పని చేశావేమిటి ఇవ్వాళ?"
    "ఖయ్యి మన్నాడు సూర్యం. "రోజంతా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే మాత్రం సుఖమనుకున్నా వేమిటి?"
    "అయితే ఇవ్వాళ ఊరికే కూర్చున్నావన్న మాట?"
    "ఇవ్వాల్టి కేం పనీ చెయ్యద్దన్నాడే హెడ్ క్లర్కు. మనలో మన మాట. చాలా మంచివాడిలా ఉన్నాడు. నెమ్మదిగా అతగాడ్ని మంచి చేసుకుంటే....."
    "హస్యాలకేం గానీ అలా ఎప్పుడూ చెయ్యకు. ఎవర్నీ ఏ విధంగానూ ప్రాధేయపడటం నేర్చుకోకు. భగవంతుడిచ్చిన అవయవాలున్నాయి . ఆరోగ్యం ఉంది. తెలివి తేటలున్నాయి. నీకేం లోటని ఒకరి దయాధర్మాలు అర్దిస్తావు?"
    "చ! ఊరికే అన్నానే, అక్కయ్యా!"
    "నాకు తెలుసులే. మా సూరి ఎప్పుడూ నిజాయితీ గానే బ్రతుకుతాడు. లే మరి. స్నానం చేసి కాస్త అలా బయటికి వెళ్ళిరా! నా వంట పనేదో చూసుకుంటాను."
    సూర్యం గొంతు తగ్గించి మరీ అడిగాడు.
    "మనలో మన మాట, కూరగాయలేవిటీ?"
    "మనలో మన మాట. కాకరకాయల పచ్చడి లే."
    మొహం చేదుచేదుగా చిట్లించుకుంటూ లేచాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS