తల పగిలిపోయి, మనసు మరిగిపోతున్న ఈ క్షణం లో , ఒక్కసారి తన నాశ్వాసించే చల్లని హస్తాన్ని ఏదేవతలైనా , తనపై కరుణించిపంపిస్తే ఎంత బాగుండును?
"బావా!"
అప్పుడే ప్రవేశించిన అరుంధతిని చూసి దిగ్గున లేచాడు సుందర్రావు. అరుంధతి తనకు తానుగా సుందర్రావు ఇంటికి రావటం అదే మొదటిసారి.
"నేను విన్నదంతా , నిజమేనా బావా?"
"ఆరూ! సారీ, అరుంధతీ! నువ్వు...."
"నన్నెలా పిలిచినా, ఫరవాలేదు బావా! నేనిప్పుడు శ్రీమతి అరుంధతీ ప్రకాశరావును కాను."
"విన్నాను."
బాధగా నుదురు నొక్కుకుంటూ అన్నాడు .
"కూర్చో ఆరూ!"
"ఎంత పనిచేశావు బావా! తార ఈ లోకాన్ని వదిలి పెట్టేసింది. రవి ఈ లోకంతో నిమిత్తాన్ని వదులు కొన్నాడు. నువ్వు ఈ లోకంలో అవమానింపబడటానికి సిద్దంగా ఉన్నావు. నువ్వు ఆరాధించే ఐశ్వర్యం , నీకు సాధించి పెట్టినదిదేనా?"
"తెలుస్తూనే ఉందిగా ఆరూ! దేని వెంట పరుగులు పెట్టి పెట్టి ప్రాణానికి ప్రాణమైన నిన్ను జారవిడుచుకున్నానో, దాని గమ్యం చేరుకొన్నాను- నాకు చిత్రంగా ఉంది ఆరూ! ఇంతకు కొద్ది క్షణాల క్రిందటి వరకూ నరకయాతన ననుభవించాను. ఇప్పుడే కొన్ని క్షణాలలో ఏమిటో నా మనసు నిర్లిప్తంగా అయిపొయింది. ఈ శిక్షకు నేను అర్హుడినే!"
అరుంధతి కళ్ళ నిండా నీళ్ళు నిండుకొన్నాయి.
"నాకోసం ఇంకా, నీ కళ్ళలో నీళ్ళున్నాయా ఆరూ! నేను అనుకొంటు'న్నంత దురదృష్టవంతుడిని కానా?"
"బావా!.... నేను....."
"నాకు తెలుసు ఆరూ! ధనదాహంతో పరుగులు పెట్టేనేను, నువ్వు నాకోసం నిర్మించిన నీ ముగ్ధ మనోహర మందిరంలో నిలవలేకపోయాను. మనుష్యులకు శరీరాలే కాక, హృదయాలు కూడా ఉంటాయని ఆలోచించే శక్తి లేని ప్రకాశరావు కు అందులో ప్రవేశించే అవకాశమే లేకుండా పోయింది. ఏ ప్రదేశమైనా ఖాళీ గా ఉండడం, ప్రకృతి శాస్త్ర విరుద్దం కాదా! నీకు ప్రాణప్రదమైన సాహిత్యాభిరుచితో నీ జీవితంలోకి స్నేహితునిగా ప్రవేశించిన శ్రీధర్ అశూన్య మందిరంలో మందిరంలో అతి తేలికగా చోటు చేసికొన్నాడు. అంతేనా?"
"ఇంత సున్నితంగా ఆలోచించగలిగినవాడివి, అంత దారుణంగా ఎలా బ్రతకగలిగావు బావా?"
"డబ్బు అరూ!నాకు డబ్బు పిచ్చి! డబ్బు కావాలి. శ్రద్దగా చదవక్కర్లెకుండా, కష్టపడి ఉద్యోగం చెయ్యక్కర్లేకుండా , డబ్బొచ్చి పడుతుంటే మిగిలినవి ఏం లేకపోయినా పరవాలేదని పించింది. ఈ డబ్బు నిషా పానీయాలన్నింటి కంటే , నిషా అయినది-- ఉన్నకొద్దీ ఇంకా కావాలని పిస్తుంది. పోగు చేసిన కొద్దీ, పిసినారితన మెక్కువవుతుంది. దానిలో పూర్తిగా మునిగిపోయిన నేను, తారను కూడా ముంచాలనుకున్నాను. అదృష్టవంతురాలు కనుక, తప్పించుకొని పోయింది.
"అదృష్టవంతురాలా?"
"నాకంటే!"
"బావా! ఎంత మారిపోయావు?"
"పిచ్చి ఆరూ! నేను మారలేదు. మనుష్యులు ఇట్టే మారిపోతారా? నేను మొదటి నుంచీ ఇంతే! ఆనాడు మిరుమిట్లుగొలిపే ఐశ్వర్యంలో ఈ ఆలోచనలన్నీ, నీడను పడ్డాయి. ఈనాడు, బికారి నైన నేను, స్వేచ్చగా ఆలోచిస్తున్నాను."
"అయ్యో! నేను కూడా బీదదానినే బావా! నిన్ను విడిపించగలిగే శక్తి నాకుంటే ఎంత బాగుండును?"
"ఆరూ!"
అంత దుఃఖంలోనూ , సుందర్రావు కళ్ళు మెరిసాయి.
"పరిస్థితులిలా మారటం, నా అదృష్టం ఆరూ! లేకపోతె , ఈ జన్మలో నీనోటి ఇంత చల్లని మాటలు వినగలిగేవాడినా? ఈరోజు నా మనసున్నంత హాయిగా ఏనాడూ లేదు."
మనోరంజని దూకుడుగా వచ్చింది.
"అవును! ఒట్టి మాట లెవరైనా అనగలరు."
సుందర్రావు నామెవంక చూడలేదు. సమాధానం చెప్పలేదు.
"నావి ఒట్టి మాటలని ఒప్పుకొంటున్నాను. కానీ మనోరంజనీ! నువ్వు నీ భర్తకు సహాయం చెయ్యరాదా? నీ భర్త జైలులో మ్రగ్గి పోతుంటే నీ ఐశ్వర్యం , ఉంటేనేం? పోతేనేం?"
ప్రాధేయపడుతున్నట్లుగా అంది అరుంధతి. మనోరంజని ముఖం జేవురించింది.
"నీ యిష్టమోచ్చినట్లు వూరేగటానికి నీ భర్తను వంటమనిషి కప్పజెప్పి, నాకు నీతులు చెప్తున్నావా? సిగ్గు లేదూ?"
"మనో!" గర్జించాడు సుందర్రావు.
"ఎందుకలా గొడ్డులా అరుస్తావ్? నాకు భయమనుకున్నావా? ఇందాకటి నుండి మీ సంభాషణ అంతా వింటున్నాను. అంతా అర్ధమయింది. ఈ సౌభాగ్యం కోసమేనా , నేను నా సర్వస్వాన్ని వదులుకొని బికారిని కావలసింది?"
సుందర్రావు జాలిగా మనోరంజని వంక చూసాడు.
"నువ్వు పూర్తిగా రైట్ మనో! నువ్వు నాకా డబ్బంతా ఇచ్చినా కూడా నిన్ను ప్రేమించేవాడిని కాను. నువ్వు చాలా తెలివి గల పని చేసావు. కానీ, నేను అరుంధతి తో మాట్లాడిన మాటలు అర్ధం చేసికొన్నానన్నావు. అది తప్పు -- ఏ విషయాన్నైనా , రూపాయలలోకి మారుస్తే కానీ నీ కర్ధం కాదు. మేము మాట్లాడుకొన్న విషయాలు, రూపాయలలోకి మార్చటం పూర్తిగా అసంభవం! ఆమాటల నర్దం చేసికొనేటందుకు నువ్వింకో జన్మ ఎత్తవలసిందే!"
"ఒక జన్మ కాదు . పది జన్మలెత్తినా ఇట్లాంటి నీతిమాలిన మాటలు, నా నోట రావు"
"నూటికి నూరు పాళ్ళు నిజం!"
హాయిగా నవ్వాడు సుందర్రావు. ఎప్పుడూ మనో రంజనికి తాళం వెయ్యటమే. కాని ఆమెను ఉడికించటానికైనా సాహసించని సుందరరావు కీనాడామేతో ఇలా మాట్లాడగలగటం పరమానందంగా ఉంది.
అరుంధతి కి నవ్వు రాలేదు.
"మనోరంజని ! పోనీలే! నేను నీతి మాలినదాన్నే! విధాత నా అవినీతికి ఫలితంగా , విధించే నరకాలన్నీ నేనే అనుభవిస్తాను. కానీ, మనోరంజనీ! ఈ పరిస్థితి దారుణం కదా! సంఘం లో నీకు మాత్రం అవమానం కాదా? నీ భర్తకు నీమీద ప్రేమ లేక పోవచ్చు కానీ, ఈ వివాహ బంధాన్ని తెంచగలిగే శక్తి అతనికి లేదు- వెంకటలక్ష్మీ సౌభాగ్యాన్ని ఏడు వెలతో కొనుక్కోలేక గుండె రాయి చేసుకొని ఇవతలకు వచ్చాను కానీ , లేకపోతె ఈ బంధాన్ని ఏ పరిస్థితులలోనూ నేనూ తెంపుకో గలిగేదానిని కాను. మన వివాహ బంధంలోని విశిష్టతే అది. ఇక్కడ 'నీ' 'నా' లేదు. అంతా 'మన'. స్థిమితంగా ఆలోచించుకో మనోరంజనీ! తర్వాత పశ్చాత్తాపపడతావు."
అరుంధతి మెత్తని మాటలతో మనోరంజని కోపం కరిగించింది.
"అరుంధతీ! మూడు లక్షలు! తెలుసునా!?" మొత్తం మా సర్వస్వం ధారపోసి, కట్టు గుడ్డలతో నిలవాలి. నేను వట్టి మనిషిని కూడా కాను. నా బిడ్డ గతేమిటి? తండ్రి పాపానికి నా సంతానాన్ని శిక్షించనా? ఈయన వెలగబెట్టిన బి.ఏ. ఫెయిల్ కు ఉద్యోగమేం దొరుకుతుంది? ఇన్నాళ్ళూ ఈయన నా డబ్బును విచ్చలవిడిగా నన్ను మోసం చెయ్యడానికి, ఖర్చు చేస్తుంటే చూస్తూ సహించలేదా? దుర్బర దారిద్ర్యంలోకి ఏం చూసుకుని అడుగు పెట్టమంటావ్?"
అరుంధతి ఏదో అనబోతుంటే సుందర్రావు అడ్డు తగిలాడు.
"నువ్వు మాట్లాడిన ప్రతి అక్షరమూ యదార్ధమే మనో! ఇప్పుడు నువ్విస్తానన్నా నేను తీసికొను! ఆ అర్హత నాకు లేదు. డబ్బుతో, ప్రేమను కొనుక్కోగలనని నువ్వూ అమ్మగలనని నేనూ, భ్రమ పడ్డాం! పాపం! నీకు పూర్తిగా అన్యాయం చేసాను-- కనీసం మన సంతానాని కైనా , నా వల్ల అన్యాయం జరగనీయను. ఇక ఈ ఆలోచనను వదిలి పెట్టు ఆరూ!"
అరుంధతి మాట్లాడలేక పోయింది.
"రా ఆరూ! నిన్ను నా కారులో దింపి వస్తాను" అని రెండడుగులు వేసి, చటుక్కున ఆగిపోయి, "ఏం, మనో! కారులో వెళ్ళమంటావా?" అన్నాడు.
మనోరంజని రెండు చేతులతో ముఖం కప్పుకొని ఏడ్చి , అక్కడి నుండి వెళ్ళిపోయింది.
"వద్దు బావా! నేను రిక్షాలో వెళతాను. డాక్టర్ గారి ఆసుపత్రి కి బయలుదేరుదామనుకొంటుండగా , ఈ కబురు తెలిసింది. ఇక్కడకు వచ్చాను."
"ఆసుపత్రి కేందుకూ?"
"సుచరితను చూడటానికి! ఆమె ఇప్పుడు హాస్పిటల్లో ఉందిట!"
"సుచరిత దొరికిందా? డాక్టర్ ఆమెను స్వీకరించారా?"
"శ్రీధర్ గురించి నీకు తెలిసిన దింతేనా బావా?"
"అదృష్టవంతుడు!"
"చేతులారా దురదృష్టాన్ని కొని తెచ్చుకోకుండా ఉంటె అందరమూ అదృష్టవంతులమే ఎప్పుడైనా, చిరాకులో నీ మనసు కష్టపెట్టి ఉంటె క్షమించు బావా!"
"తిరిగి నన్ను క్షమార్పణ కోరమంటావా? అక్కర్లేదులే! నిన్ను కాదని నేను నీకు అన్యాయం చెయ్యలేదు. న్యాయమే చేశాను . కదు ఆరూ!"
నీళ్ళు నిండిన తన కళ్ళను చేతులతో కప్పుకోంది అరుంధతి. సుందర్రావు ఆ చేతులను తొలగించి తన కళ్ళ కద్దుకొన్నాడు. అరుంధతి తన చేతులను మృదువుగా విడిపించుకొని వెళ్ళిపోయింది.
సుందర్రావు తనను తాను రక్షించుకోడానికే ప్రయత్నమూ చెయ్యలేదు. లాయర్ ను పెడతా నన్న మనోరంజనిని కఠినంగా వారించి , న్యాయస్థానంలో తన నేరాన్ని అంగీకరించాడు.
సుందర్రావు జైలుకు వెడుతుంటే , మనోరంజని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె నెవరూ వోదార్చ లేకపోయారు. మనోరంజనిది చాలా సున్నిత హృదయం! ఆమె ఏ కాస్త కష్టానికీ వోర్చు కోలేదు. ఇదివరలో ఆమె ఏడ్చి నప్పుడల్లా సుందరరావు బుజ్జగించి వోదార్చేవాడు. ఇప్పుడు మాత్రం శూన్యంగా చూస్తూ ఉండిపోయాడు.
