12
అరుంధతి హృదయంలో కొన్ని కోట్ల స్వరాలోక్కసారిగా , గొడవగా వినిపిస్తున్నాయి. తన కర్తవ్యవేమిటో, అర్ధం కాలేదామేకు! పులిలా గర్జించే ప్రకాశరావు ఒక పక్క! మరణానీకైనా తెగించి దీనంగా తన స్థానం కోసం ప్రాదేయపడుతున్న వెంకటలక్ష్మీ మరొక వంకా--
వెంటకలక్ష్మీ తనదైన - స్థానం కోసం అంతగా ఎందుకు ప్రాధేయపడాలి?
ఆమెకు హక్కు లేదు.
ఎందుకు లేదూ?
సంఘం ఆమోదించదు గనుక!
అరుంధతి క్షణకాలం ప్రకాశరావు వంక చూసింది. తరువాత లేచి, తన మెడలో మంగళసూత్రాలను తీసి వెంకటలక్ష్మీ మెడలో వేసేసింది.
"వెంకటలక్ష్మీ దీని ఖరీదు ఏడు వేలు! అంత కంటే పెద్ద విలువేమీ నాకు కనిపించలేదు. ఇందులో! ఇంక నువ్వు ధైర్యంగా లోపలకు వెళ్ళు. నా దారి నేను చూసుకుంటాను."
అటు వెంకటలక్ష్మీ , ఇటు ప్రకాశరావు దిగ్భ్రాంతి తో స్థంభించిపోయారు. ఇద్దరికీ నోట మాట రాలేదు. అరుంధతి ప్రకాశరావు వంక తిరిగింది.
"నేను కొన్ని రోజులు మీ అతిధిగా ఇక్కడ ఉంటాను. తరువాత వెళ్ళిపోతాను."
ప్రకాశరావు మతిపోయింది.
"ఆరూ! ఏమిటిదంతా! తెలిసీ తెలియక చిన్నతనంలో , ఏదో వ్యామోహంలో పడ్డానని ఇంత దారుణంగా శిక్షిస్తావా? నువ్వు లేకపోతె నేను బ్రతగ్గలనా?"
"మహారాజులా బ్రతగ్గలరు! వెంకటలక్ష్మీ లేకపోతేనే క్షణం కూడా గడవదు. ప్రతిరోజూ మీ అవసరాలన్నీ చూస్తున్నది ఎవరు? మీకు ఏ వేళకది అమర్చి పెడుతున్నది ఎవరు? మీరు అర్ధరాత్రి వచ్చినా, అపరాత్రి వచ్చినా కనిపెట్టుకొని ఉంటున్నది ఎవరు? నేనేం చేస్తున్నాను? సంఘంలో ఒక స్థానం కోసం ఈ ఇంట్లో ఉంటున్నాను. అంత బరువైన మంగల్యాలు మెళ్ళో ధరించి నందుకు కనీసం భార్యగా నటించాలని తాపత్రయపడ్డాను. నేనున్నా, లేకపోయినా మీ జీవితంలో పెద్ద మార్పేమీ ఉండదు. కానీ ఆవేశంలో వెంకటలక్ష్మీ ని దూరం చేసికోన్నారంటే మాత్రం ఈ జన్మలో అలాంటి రత్నాన్ని పొందలేరు!"
ప్రకాశరావు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు -- "నా జబ్బులో నువ్వు...."
"ఉహు! నేను కాదు! నేను హాయిగా నిద్ర పోయాను. ముందే చెప్పాను. నా భార్యత్వం నటన అని. నాకు నిద్ర రాకేమవుతుంది? మీ జబ్బులో నాది కేవలం సానుభూతి -- తోటి ప్రాణి బాధపడుతున్నాడని జాలి! కానీ, వెంకటలక్ష్మీది తపన! మీరు లేకపోతె, ఆమెకు లోకమే లేదు. మీరు కొంచెం బాధపడితే, ఆమె విలవిలలాడిపోతుంది. మీ బలహీనతలన్నీ తెలిసీ, మిమ్మల్ని గౌరవించింది. మీరవమానించినా పూజించింది. మీ మనసెంత క్షుద్రమో గ్రహించి, ఆరాధించింది. ఎందుకు? మీ డబ్బును చూసా? మీ అందాన్ని చూసా? ఆమె విరాగిణి. డబ్బు ఆమె కక్కర్లేదు. వెంకటలక్ష్మీ అందంలో పోలిస్తే మీరెక్కడ నిలుస్తారు? మీరామె భర్త అని నమ్మింది. మీరూ, లోకం , అంగీకరించినా అంగీకరించక పోయినా , ఆమె మీ భార్య. ఆమె మీ భార్య కావటానికి , ఆమెలో ఉన్నదీ ముఖ్యంగా కావలసింది ఒకే ఒక అర్హత-- ఆమె హృదయంలో మీపట్ల నిండి ఉన్న ప్రేమ! మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమించిన వ్యక్తిలో తప్ప ఇంతటి సహన శక్తి, ఇంతటి త్యాగశీలత, ఇంతటి ఆరాధనా మరే స్త్రీలోనూ ఉండవు. నాకు మిమ్మల్ని ప్రేమించే శక్తి లేకపోయింది. అందుకనే మీ జబ్బులో నిద్ర పోగలిగాను-- మీ బలహీనతలు చూసి లోలోపల అసహ్యించుకొన్నాను. మీ మనసు ఎంత సంకుచిత మైనదో అర్ధమైనప్పుడు , నాలో మీ పట్ల విరక్తి భావమే కలిగింది.
"వైద్యం చేయించుకొని శ్రీధర్ కు బిల్ ఇవ్వనన్నారు. నేను, నాగాజు అమ్మేసి ఆ బిల్ ఇచ్చాను. మీరందరూ వెంకటలక్ష్మీని అనుమానించారు. లోలోపల బాధ పడ్తూ కూడా ఏం చెయ్యలేక వూరుకున్నాను. అంతా మంచికే అయింది. ఈనాటి కయినా నిజం తెలిసికోగలిగాను...."
ప్రకాశరావు తల చేతులతో పట్టుకొని సోఫాలో కూలబడ్డాడు. వెంకటలక్ష్మీ నోట మాటరాక తల వంచుకొని నిలబడింది. అరుంధతి ఆమెను చెయ్యి పట్టుకొని తీసికొచ్చి సోఫాలో కూర్చో పెట్టబోయింది.
వెంకటలక్ష్మీ ఏడ్చేసింది.
"వద్దమ్మా! ఇంత సాహసం చేయకండి! నన్నిక్కడ పడి ఉండనిస్తే నా కదే పదివేలు! మీరు వెళ్ళకండమ్మ!"
వెంకటలక్ష్మీ తన మెళ్ళో అరుంధతి వేసిన మంగళ సూత్రాల వంక భయంగా చూసుకొంది. అవి తీసెయబోయింది. కానీ, అరుంధతి తీసినంత తేలికగా వెంకటలక్ష్మీ తీయలేకపోయింది.
అరుంధతి ఆమె ప్రయత్నాన్ని గమనించి, వారించింది.
"తియ్యకు వెంకతలక్ష్మీ! వేటి స్థానంలో అవి ఉన్నప్పుడే రాణిస్తాయి."
ప్రకాశరావు అరుంధతి వంక దీనంగా చూసాడు.
"ఆరూ! నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు కావాలి. నన్ను వదిలి వెళ్ళకు ఆరూ!" ప్రాధేయ పడుతున్నట్లు అన్నాడు ప్రకాశరావు. అరుంధతి నిరాశగా నవ్వింది.
"అదృష్టమో, దురదృష్టమో కానీ, మీకు ప్రేమ అనే మాటకు సరియిన అర్ధం తెలియదు. తెలిసి ఉంటె, వెంకటలక్ష్మీ నింత క్షోభకు గురి చేయగలిగేవారు కాదు. ఈ లోకంలో ఎంతో మందికంటే మీరెంతో అదృష్ట వంతులు! మీ అదృష్టాన్ని గుర్తించండి! నేను చాలా రోజులు నటించాను. విసిగిపోయాను. ఇంక నాకు శక్తి లేదు. మీ భార్యాభర్తలు పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకొంటున్నాను. నా మాట మీద, ఏ కొంచెం గౌరవమున్నా, వెంకటలక్ష్మీ ని నిరాదరించకండి! ఆమె వంటమనిషి కూతురన్న సంగతి మరిచిపోగలిగితే, ఆమెను ప్రేమించటం మీకు కష్టం కాదు."
"పోనీ, నువ్విక్కడే ఉండరాదా?!"
"క్షమించండి! నాకేదైనా నర్సరీ స్కూల్లో పనిచేస్తూ పసిపిల్లల మధ్య గడపాలనుంది. నాకు పసిపిల్లలంటే అంతులేని ప్రేమ. ఇన్నాళ్ళుగా నేను తల్లినయితే, బాగుండుననుకోనేదాన్ని. ఇప్పుడలాంటి బంధం లేనందుకు సంతోషిస్తున్నాను."
ప్రకాశరావు బాధగా నుదురు చేత్తో రాసుకొని అక్కడి నుండి లేచిపోయాడు.
వెంకటలక్ష్మీ వద్దు వద్దంటున్నా, ఆరోజే అరుంధతి తనకు వేరుగా గది ఏర్పాటు చేసుకొంది. వెంకటలక్ష్మీని తానే స్వయంగా అలంకరించి తమ గదిలోకి పంపింది. ఏం జరగనట్లు మాములుగా గదిలోకి వెళ్ళిపోతున్న ప్రకాశరావును చూసి లోలోపల విస్తుపోయింది అరుంధతి.
ఈ వ్యక్తిని గురించి ఏమనుకోవాలి?
తనను ప్రాణ ప్రదంగా ప్రేమించిన వ్యక్తిని తనకు వంటమనిషి గా చేసికోన్నప్పుడు ఇతనిలో చలనం లేదు. జీవితమంతా తనకు ధారపోసిన వ్యక్తిని దొంగగా నిరూపించినపుడితనిలో చలనం లేదు- తననూ, రవినీ కలిసి అవమానకరంగా మాట్లాడి , మరుక్షణం లో "ఆరూ డార్లింగ్"అంటూ సంభింధించిటానికి సిద్దపడినప్పుడు , ఇతనిలో చలనం లేదు. చివరకు, ఆ వెంకట లక్ష్మీ తోనే, మళ్ళీ సంసారం ప్రారంభించబోతున్నప్పుడూ , ఏ చలనమూలేదు.
మానవులై జన్మించిన వారు ఇంత భావోద్వేగరహితంగా ఎలా ఉండగలరు?
ఒక్కర్తే గదిలో మంచం మీద పడుకొన్న అరుంధతి కి ఎవరో గుండెల మించి పెద్ద బరువు దింపినట్లింది. మరుక్షణం లో ఏదో వెలితీ క్రమ్ముకోంది. తన కింకా పాతిక నిండలేదు.ఈ బ్రతుకిక ఎడారి బ్రతుకేనా?
ఆమెకు డాక్టర్ శ్రీధర్ గుర్తు వచ్చాడు. గజిబిజిగా అనేక ఆలోచనలు క్రమ్ముకోన్నాయి. వణికిపోయి, లేచి కూర్చుంది. ఎదురుగా గోడ మీద తన కెంతో ఇష్టమయిన బూరె బుగ్గల పసివాడు కేలెండరు లోంచి నవ్వుతున్నాడు. అరుంధతి లేచి కాలెండర్ తీసి గుండెల కదుముకొని పడుకొంది.
మరునాడు ఉదయం అరుంధతి లేచేసరికి చాలా పొద్దుబోయింది. ఆమె గదిలోంచి బయటకు రాగానే, వెంకటలక్ష్మీ ఆమె పాదాలకు నమస్కరించింది. అరుంధతి ఆమెను లేవనెత్తి నిండు హృదయం తో కౌగలించుకొంది.
"మీకు టెలిఫోన్ కాల్ వచ్చిందమ్మా! డాక్టర్ శ్రీధర్ గారు పిలిచారు. మీరింకా లేవలేదని చెప్పాను. లేవగానే తనకు ఫోన్ చెయ్యమని చెప్పారు. హాస్పిటల్ కి చెయ్యమన్నారు."
వెంకటలక్ష్మీ మాటలు వినగానే, అరుంధతి హృదయం ఆనందంతో నిండిపోయింది. త్వర త్వరగా శ్రీధర్ ఫోన్ నెంబర్ డయల్ చేసింది.
శ్రీధర్ అందుకొన్నాడు.
"ముందు మీకన్నని నిద్ర పాడు చేసినందుకు క్షమార్పణ కోరుకొంటున్నాను."
"మాట్లాడరేం? ఓహో! ఇప్పుడే లేచినట్లున్నారు కదూ! మీకొక మంచి శుభవార్త చెపుతాను."
"ఏమిటీ?" ఉత్సాహంతో అంది అరుంధతి.
"నా సుచరిత నాకు లభించింది.
అరుంధతి హృదయ స్పందన లిప్త మాత్రం ఆగిపోయినట్లనిపించింది.
"ఎవరు?"
"అప్పుడే మరిచి పోయారా? సుచరిత? ఎవరిని కలిసికోగలననే ఆశ నా బ్రతుకుకు బలాన్నిస్తుంది. ఆ, నా సుచరిత! ఎన్నాళ్ళో వెతికి వెతికి విసిగిపోయాను. ఇప్పుడు అప్రయత్నంగా దొరికింది. చాలా ప్రమాద పరిస్థితిలో ఉంది. కానీ, ప్రాణ భయం లేదు. మీకు వీలయితే, నా హాస్పిటల్ కు రండి! ఆమెను చూద్దురు గాని!

"తప్పక వస్తాను."
అరుంధతి ఫోన్ పెట్టేసింది.
* * * *
అన్నయ్యా!
నేను శాశ్వతంగా మిమ్మల్నందరినీ వదిలి వెళ్ళిపోతున్నాను. రవి పతనానికి కారకులెవరో నాకు తెలుసు! నీ ప్రేమకు సంతోషించాలో, లేక అసలు ప్రేమంటే నీకు తెలియనందుకు జాలి పడాలో అర్ధం కావటం లేదు. మనుష్యులలో ఈర్ష్యా ద్వేషము కార్పణ్యము, ఎలా చోటు చేసుకుంటాయాఅని ఆలోచించే దానిని. సమాధానం నాకే లభించింది. ఒకడు, మనుష్యునిగా బ్రతుకుతున్నా, చుట్టూ ప్రక్కల వాళ్ళు బ్రతకనియ్యరన్నయ్య! వూహ తెలిసిన నాటి నుండి ప్రేమ విలువ తెలిసి కొన్నాను. ఈర్ష్యా, ద్వేషాలు నాలో పెంచుకోకుండా , చుట్టు ప్రక్కల వాళ్ళని ప్రేమిస్తూ వచ్చాను. బ్రతికి నంతకాలమూ, అలాగే బ్రతకాలనీ, బ్రతకగలననీ అనుకొన్నాను. కానీ, సాధ్యం కావటం లేదు. నాలో ఇప్పుడు ద్వేషం నిండుకొంది. పగ నిండుకొంది. రవి నన్ను నిరాకరించినందుకు నేను ఆత్మహత్య చేసికోవటం లేదు, నాలో త్రాచుపాముల్లా బుసలు కొడ్తున్నా ఈ ద్వేషమూ, పగా అనుక్షణమూ నాతొ నింపుతున్న విష వాయువును భరించలేక , వాటి నుండి విముక్తిని పొందలేక , ఈ లోకం నుండే విముక్తి ని పొందుతున్నాను. బ్రతికినంత కాలము ఒకరిని అభిమానించటమే కాని, ద్వేషించటం ఎరుగని నేను చనిపోతూ, నా ఈ స్థితికి కారకులయిన వారు , దాని ఫలితా మనుభవించి తీరాలని శపిస్తూ పోతున్నాను. నా స్వభావం నాకే అసహ్యంగా ఉంది. ఈ ద్వేషాన్ని నేను జయించ గలిగితే! లాభం లేదన్నయ్యా! నాలో ఇంకా ఏదో భయంకరమైన వూహలు కలుగుతున్నాయి.తొందరగా పోతేనే మంచిది. నా ఈ దౌర్భాగ్య స్థితికి జాలి పడు.
నీ చెల్లెలు.
తార.
ఆ ఉత్తరాన్ని మరొక్కసారి చదువు కొన్నాడు సుందర్రావు. అతనికి కన్నీరు కాల్వలు గట్టింది. పదిమందిలో రవిని హంతకుడని నిందించాడు. నిజానికి హంతకుడు ఎవరు? తానె! తనే తన చెల్లెలి మరణానికి కారకుడు. రవి బీదవాడని, అతడిని చేసికొంటే తార సుఖపడలేదని, ఎవరైనా ధనికుడి కిచ్చి పెళ్ళి చెయ్యాలనీ అనుకొన్నాడు. చివరకు జరిగిందేమిటి? కొన్ని కోట్లు పోసినా , తార తనకు లభిస్తుందా? అమాయకమైన ఆ చిరునవ్వుకు తను వెల కట్టగలడా?
గొప్పవాడై తననుభవించిన సౌఖ్యమేమిటి?
"తారా! నీ శాపం ఫలించిందమ్మా! నీస్థితికి కారకులైన వాళ్ళు దాని ఫలితం అనుభవిస్తున్నారు."
