13
సుచరిత సంగతులన్నీ డాక్టర్ గారి ద్వారా తెలిసాయి అరుంధతికి.
సుచరిత అన్న పేరు బాలకృష్ణ -- అందరూ అతనిని "బాలూ" అని పిలుస్తారు. సుచరిత నేరుగా తన అన్న దగ్గిరకే వెళ్ళిపోయింది.
ఎన్నిసార్లు తను ప్రాధేయపడినా , తన దగ్గిరకు రాని చెల్లెలు , ఇప్పుడు భర్త దగ్గిర నుండి వచ్చేసరికి మతి పోయినట్లయింది బాలూకు! తర్వాత అన్ని సంగతులూ తెలిసాయి బాలుకూ. మోహన్ మీద విరుచుకు పడ్డాడు.
పశ్చాత్తాపంతో మగ్గిపోతున్నాడు మోహన్.
"నేనింత దారుణాన్ని వూహించలేదు బాలూ! సుచితో ఒక్కసారి మాట్లాడాలని మనసు, అరాటపడింది. పగలంతా ఎంత ప్రయత్నించినా ఆమెతో ఏకాంతం సాధ్యపడలేదు. సాహసించి రాత్రి వేళ మేల్కొలిపాను. నేను చెప్పేది వినకుండానే ఆమె నన్ను నిందించనారంభించింది. ఇంతలో శ్రీధర్ లేచారు. జరిగినది. నువ్వు నాకే శిక్ష విధించినా సరే!"
చికాకుగా వచ్చేశాడు బాలూ!
తన చెల్లెలు గౌరవ కుటుంబం లో గృహిణిగా స్థిరపడినందు కెంతో సంతోషిస్తున్న బాలూకు సుచరిత , ఈ రాక హృదయ శల్యమయింది.
"సుచీ!నువ్వుడాక్టర్ గారి దగ్గిరకు వెళ్ళిపో! నేను మోహన్ చేత జరిగింది చెప్పిస్తాను. అయన నమ్ముతారు."
"అయన నన్ను నమ్మటానికి ఋజువులూ సాక్ష్యాలూ అవసరం లేదన్నయ్యా! కానీ, నేను వెళ్ళను."
"ఎందుకూ?"
"నేను పరమ నీచురాలిని. నాతోటి సాంగత్యంతో స్వచ్చమైన అయన జీవితాన్ని మలినం కానీయను."
"నువ్వు నీచురాలివా?"
"నీచులతో సంబంధ బంధావ్యాలున్న దాన్ని నీచురాల్ని కాకేమవుతాను?"
"సుచీ!"
"ఏం? హేయమైన దొంగతనాన్ని వృత్తిగా చేసుకున్న వాళ్ళు నీచులు కారా?" బాలూ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
సుచరిత ఎన్నిసార్లో ఆత్మహత్య గురించి ఆలోచించింది. కానీ, శ్రీధర్ తో ఆమె గడిపిన జీవిత మొక జ్యోతి లాగ ఆమె హృదయంలో వెలుగుతూనే ఉంది. శ్రీధర్ ఆమె హృదయంలో నింపిన అనురాగమృత మామె, ఆత్మహత్య ప్రయత్నాలను నశింపచేసింది. ఎప్పుడో, ఎక్కడో ఎలాగో, శ్రీధర్ ను మరొక్కసారి, చూడకుండా , తన ప్రాణాలు పోవు.
సుచరిత ఎవ్వరితో మాట్లాడేది కాదు. అసలే, విరాగిగా ఉండే ఆమె పూర్తిగా సన్యాసిని అయింది. కానీ ఈనాడామే ఆరాధిస్తున్నది ఏసు ప్రభువును కాదు. శ్రీధర్ ను. మరీ, నిలువలేనంత ఆకలి వేస్తేనే కాని, ఆకలి తెలిసేదే కాదామెకు. కొన్ని కొన్ని రాత్రులు సంపూర్తిగా కళ్ళు మూతపడేవికావు.
చెల్లెలి పట్ల అంతులేని ప్రేమ బాలూకు. కానీ, సుచరిత బాలూను చూస్తూనే చీదరించుకునేది. ఆమె చీదరింపు స్పష్టంగా వ్యక్తమౌతున్నాబాలూ పట్టించుకునేవాడు కాడు.
ఉపవాసాలతో జాగరణలతో ఆమె అరోగ్యం దెబ్బతింది. బాలూ కిది చాలా ఆందోళన కలిగించింది.
"ఇంకొకరి దోషానికి, నిన్ను నువ్విలా , ఎందుకు శిక్షించుకొంటున్నావు సుచీ! శ్రీధర్ దగ్గిరకు వెళ్ళిపో"
"ఇంకొకసారి ఆ పెరేత్తకు నువ్వు! ఆ నామాన్ని ఉచ్చరించే అర్హత కూడా నీకు లేదు" తీవ్రంగా అంది సుచరిత.
ఖిన్నుడై వెళ్ళిపోయాడు బాలూ!
ఒకనాడు బాలూతో పాటు ఒక పండు ముసలిది కూడా వచ్చింది. కళ్ళు సరిగా కనపడటం లేదు. కర్ర సహాయంతో కూడా సరిగా నిలవలేక పోతుంది.
"సుచీ! ఈమెను కొన్నాళ్ళు నీ దగ్గిర ఉంచుతున్నాను." అన్నాడు బాలూ!
"నా దగ్గిర ఎవ్వరూ వద్దు."
చటుక్కున అనేసింది సుచరిత.
బాలూ తెల్లబోయి చూసాడు.
"నిస్సహాయురాలైన ఒక ముసలిదానికి కొద్ది రోజులు సహాయం చెయ్యలేవా? త్వరలోనే ఈమె సంరక్షణకు ఏర్పాట్లు చేస్తాను"
"ఇదంతా ఏమిటీ? ఈవిడేవరు? నా కర్మాన్ని నన్ను ఒంటరిగా ఉండనివ్వవా? మీ దొంగలలో ఈ ముసలిది కూడా ఉందా?'
బాలూ కొంచెం తిరస్కారాన్ని వ్యక్త పరుస్తూ సుచరిత వంక చూసి వెళ్ళిపోయాడు. ముసలిది సుచరిత పక్కన కూలబడింది.
"తల్లీ! అన్నీ ఉదికిపోయిన దాన్ని. దేవుడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. గుక్కెడు గెంజి చాలు! ఎవ్వరికీ ఇబ్బంది కలిగించను. కూచొని చేసే పని ఏదైనా చేస్తాను. నామీద కనికరించమ్మా!" దీనంగా అంది.
ఆ దీనస్వరం సుచరిత హృదయాన్ని కలిచి వేసింది.
"ఎవరు నువ్వు?"
"ఒకప్పుడు ఘనంగా బ్రతికిన దాన్నేనమ్మా! బిడ్డల్ని గన్నాను పెంచాను. ఆడపిల్లలు ఆదరించినా అల్లుళ్ళు విసుక్కుని వెళ్ళగొట్టారు. ఒక్క కొడుకు. కోడలి మాటకు ఎదురు చెప్పలేక నా కన్నీళ్లు చూసి గ్రుక్కిళ్ళు మ్రింగి వూరుకున్నాడు. అన్ని ఖర్చులు పెట్టుకొనే వారికి నా గ్రుక్కెడు గంజి బరువయింది. అ కాస్త భాగ్యానికి ఎన్ని చీదరింపులో? ఎన్ని విదిలింపులో? ఉండలేక వచ్చేసాను తల్లీ! నలుగుర్ని నాలుగు ముద్దలు అడుక్కోందామనుకొన్నాను. కానీ కళ్ళు కనబడవు. మసకలు . ఇల్లుదాటి నాలుగడుగులు వేయకుండానే, నలుగుర్ని గుద్దుకోన్నాను. తిట్టి పోసారు. నా పుణ్యమా అని ఈ ధర్మరాజు కంట పడ్డాను. నువ్వెవరని కూడా అడగకుండా , చెయ్యి పట్టుకొని రిక్షా ఎక్కించి ఇక్కడకు తీసికోచ్చాడు. ధర్మ ప్రభువు. దేవుడు పదికాలాలపాటు చల్లగా చూడాలి!"
సుచరిత కదిలిపోయింది.
తన అన్న హృదయం ఇంత మెత్తనిదా? ఈమాత్రపు ఆర్ద్రత వుంటే తన అన్నను తానుసంస్కరించుకోగలదేమో?
బాలూ తన దగ్గిరకు వచ్చినా చీదరించుకొనే సుచరిత ఆనాడు తానె స్వయంగా బాలూ దగ్గిర కెళ్ళింది.
బాలూ ఏకాగ్రంగా ఏదో పుస్తకం చదువు తుండటం గమనించి ఆశ్చర్యంతో చూసింది. భగవద్గీత!
సుచరిత రాకను గమనించి నిర్లక్ష్యంగా చేతిలో పుస్తకం క్రింద పడేసాడు.
సుచరిత మనసు చివుక్కుమంది.
"అన్నయ్యా! అది హిందువు లందరూ గౌరవించి పూజించే పుస్తకం కదా! నువ్వెందుకలా క్రింద పారేస్తావు?"
"నేను దాన్ని గౌరవంతో కాని, భక్తీ తో కాని చదవటం లేదు. కేవలం , విజ్ఞాన పిపాసతో చదువుతున్నాను. నేనలా క్రిందపడేసింది, ఆ పుస్తకాన్ని అగౌరవ పరచటానికి కాదు. నాకు దేని మీదా లక్ష్యం లేదు"
"నువ్వు చదువు తావా అన్నయ్యా!"
"అవును! నాకేమాత్రం తీరికా దొరికినా చదువు తాను. నేను కొన్న పుస్తకాలన్నీ జాగ్రత్త పరచి ఉంచితే ఒక పెద్ద గ్రంధాలయమాయి ఉండేది. కానీ, నెప్పటి కప్పుడే పారేసాను."
"నీ చదువు నీకేమీ నేర్పలేదా?"
"ఆలోచించటం నేర్పింది."
"ఆ ఆలోచన నిన్ను మంచిమార్గంలో పెట్టలేదా?"
"బాలూ నవ్వాడు.
"సుచీ! కొంపదీసి నువ్వు నన్ను సంస్కరించటానికి రాలేదు కదా! నీ పుణ్యముంటుంది. ఇప్పుడుపన్యాసాలు మాత్రం దంచకు. నువ్వు బైబిల్ మాత్రమే చదివావు. నేను బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నీ చదివాను. నువ్వు క్లాస్ పుస్తకాలు మాత్రమే చదివి ఉంటావు. నేను కనిపించిన ప్రతిదీ చదివాను. నీకంటే అద్భుతంగా నేనే ఉపన్యాసాలివ్వగలను. దయచేసి నువ్వు శ్రమ పడకు."
సుచరిత కు నోట మాట రాలేదు. కొన్ని క్షణాలాగి,"తెలిసి, తెలిసి సమాజమంతా గర్హించే ఈ మార్గంతో ఎందుకు నడుస్తున్నావ్ అన్నయ్యా?' అంది.
"నాకిందులో సంతోషముంది గనుక?"
"ఇందులో సంతోషమా?"
బాలూ నిర్లక్ష్యంగా నవ్వాడు.
"అవును సుచీ ! ప్రతిక్షణం ముందేం జరుగు తుందో తెలియని ఉత్కంట, ఎప్పుడూ తీవ్రంగా ఆలోచించవలసి రావటం, ఏ క్షణానికాక్షణం మృత్యువుతో దోబూచులాట, నాకు చాలా తమాషాగా సరదాగా? ఉంటుంది."
"తమాషా? సరదా?"
"అంతంత ఆశ్చర్యపోతా వెందుకూ? నా మనసు అటువంటిది. అంత తీవ్రమైన చైతన్యం లో కాని, నేను జీవించలేను.
"కానీ, అన్నయ్యా! జీవితం కొన్ని విలువల మీద ఆధారపడి ఉంది. ఆ విలువలు నిర్లక్ష్యం చేసిన వాడు, జీవించటం కూడా వ్యర్ధమవుతుంది."
"సుచీ! నాకు జీవితమీదే లక్ష్యం లేదు. అది ఆధారపడిన విలువలను గౌరవించవలసిన అవసరమేముందీ? పిచ్చి సుచీ! నన్నేదో, మార్చేద్దమన్న ప్రయత్నం మానుకో! శారీరకంగానూ, మానసికంగానూ కూడా నా కంటే పసిదానివి. బైబిల్ వచనాలు ప్రవచించటం తప్ప, నీకేమీ తెలియదు."
సుచరిత మాట్లాడే లోగానే, ఫోన్ మోగింది. బాలూ అందుకొన్నాడు.

ఆఫోన్ కాల్ ఏమిటో సుచరితతో కూడా చేప్పకుండా బాలూ ఉన్నవాడున్నట్లు వెళ్ళిపోయాడు.
క్రిందపడిన భగవద్గీత మీద నిలిచాయి సుచరిత చూపులు. లేచి ఆ పుస్తకం అందుకొని బల్ల మీద పెట్టింది.
ఆమెకు శ్రీధర్ పుస్తకాల విషయం గుర్తు కొచ్చింది. శ్రీధర్ కు పుస్తకాలంటే ఎంత శ్రద్ధ? చదివిన తరువాత, భద్రంగా బీరువాలో పెట్టడమే కాక, సరిగా దానిస్థానం లోనే ఉంచుతాడు.
ప్రతి దానిలోనూ, ఒక క్రమమూ, ప్రతి పనిలోనూ, లక్ష్యమూ , కాంక్షించేవాడు శ్రీధర్!
ఇవి రెండే అన్నయ్యలో లోపించాయి. అన్నయ్య హృదయం దయార్ద్రమైనా, అతనిలో ఏదో ఉత్తమ సంస్కారం ఉన్నా, అతని జీవన విధానం సక్రమార్గం లో పడటానికి క్రమ రాహిత్యమూ, నిర్లక్ష్యమే కారణాలా?
జీవితం పట్ల నిర్లక్ష్యం! విలువల పట్ల నిర్లక్ష్యం! పౌరుడుగా తన బాధ్యత పట్ల నిర్లక్ష్యం!
సుచరిత ఆలోచనలు ఆనకట్ట వేసినట్లాగిపోయాయి.తనకు మాత్రం పౌరసత్వం లేదా? ఒక దొంగ ఉనికి తనకు తెలిసినప్పుడు దానిని ప్రభుత్వానికి కరిగించవలసిన బాధ్యత తనది కాదా?
ఆనాడు అకస్మాత్తుగా వెళ్ళిన బాలూ, రెండు రోజుల వరకూ రాలేదు. ఈ రెండు రోజులూ సుచరిత తన బాధ్యత ను గురించి తీవ్రంగా ఆలోచించింది. స్వల్పంగా ఉన్న టెంపరేచర్ , రెండు రోజుల్లోబాగా ఎక్కువయి పోయింది.
ఆనాడు బాలూ ఏదో సంచీలతో ఇంటికి వచ్చాడు. సుచరితకు కడుపులో చెయ్యి పెట్టి తిప్పినట్లయింది. వెంటనే పబ్లిక్ టెలిఫోన్ బూత్ కెళ్ళి, ఎడ్రసిస్తూ పోలీస్ స్టేషన్ కు టెలిఫోన్ చేసింది. కళ్ళు ఎర్రబడి, ఒళ్ళు పేలిపోతూ ఉండగా తూలుతూ ఇంటికి వచ్చింది.
* * * *
పక్కలో కూర్చుని పళ్ళరసం అందిస్తున్న అన్నను వెర్రిగా చూసింది సుచరిత.
"ఆ సంచిలోని పళ్ళా?"
"అవును! నీకోసం తెచ్చాను. ఏం? ఎందుకంత ఆశ్చర్యం?దొంగతనం చేసిన సొమ్ములు సంచీలో తీసికోచ్చాననుకొన్నావా? ఎంత పిచ్చిదానివి సుచీ! అలా ఎవరైనా తీసికోస్తారా?"
అలా అన్న మొఖంలోకి చూస్తూ ఉండిపోయింది. చేతిలో పళ్ళ రసం ఉన్న గ్లాసు, ప్రేమ నిండిన కళ్ళు స్వచ్చమైన చిరునవ్వు.
